సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ అధిక జ్యేష్ఠ అమావాస్య – 15 జూన్ 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
సమస్త ప్రపంచానికి మన భారతదేశం అందించిన గొప్ప అమÖల్యమైన కానుక యోగ. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థ ఛిన్నాభిన్నమౌతున్న నేటి కాలంలో యోగ అత్యావశ్యకమైన సాధన. శరీరం, మనస్సు, బుద్ధి` వీటిని ఆత్మతో, వ్యక్తిని కుటుంబంతో, కుటుంబాన్ని సమాజంతో, సమాజాన్ని దేశంతో, దేశాన్ని సమస్త సృష్టితో ఏకీకృతం చేయడమే యోగాసారం. అన్ని దశల్లో ఈ అనుభవం కలగకపో వచ్చు. అయినా అప్పుడప్పుడు మన అంతరంగంలోకి తొంగిచూసే అవసరం, తనకు తానే కేంద్రంగా మారడం, చంచలంగా ఉన్న మనస్సును నిశ్చలపరిచే అవసరం మన అనుభవంలోనికి వస్తుంది. అందుకే యోగసాధన ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అమెరికా, ఐరోపా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో, ఆసుపత్రుల్లో యోగ విభాగం ఉంటుంది. యోగా పట్ల ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నది.
చిత్తం వివిధ రూపాలు పొందకుండా నిరోధించడమే యోగ. (యోగః చిత్త వృత్తి నిరోధః) మేఘాలన్ని అదృశ్యమైనప్పుడు ఆకాశం నిశ్చలంగా కనబడుతుంది. అదేవిధంగా మనసులో కలిగే ఆలోచనలను, మార్పులను నియంత్రించి నిశ్చలంగా ఉండేలా చేస్తే ప్రతి వ్యక్తి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు.
చిత్తవృత్తి నిరోధం ఎలా సాధ్యమవుతుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అభ్యాసం, వైరాగ్యం వలన మాత్రమే ఇది సాధ్యం. అభ్యాసం అంటే నిరంతర సాధన. వైరాగ్యం అంటే శరీరం ` మనస్సనే భావన నుండి విడివడడం. ఇంద్రియాల కోరికలకు లొంగకపోవడం. చిత్తం ఎల్లప్పుడు స్వచ్ఛమైన స్థితికి వెళ్లాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాని ఇంద్రియాలు దానిని బహిర్‌ముఖం చేస్తాయి. దానిని నియంత్రించి, దానికి కలిగిన బహిర్‌ముఖ భావాన్ని అదుపుచేసి తిరుగు ప్రయాణం చేయించడమే యోగలోని తొలి అడుగు.
హఠయోగ ప్రదీపిక, శివ సంహిత యోగ సూత్రాల ప్రధాన భాగాలు. కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు వీటిలో ముఖ్యాంశాలు. భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగ దర్శనమూ ఉంది. దీనికి పతంజలి యోగసూత్రాలే ప్రాతిపదిక. అభ్యాస, వైరాగ్యాలతో శారీరక, చిత్తవృత్తుల్ని అదుపులో ఉంచడం యోగసాధనలో ప్రధాన భూమిక.
మన దేశంలో ఎన్నో యోగరీతులు, యోగ విధానాలు ఉన్నాయి. మన దేవతలు సైతం తమదైన ముద్రలో ఉంటూ మనకు యోగ శక్తిని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటారు. పరమేశ్వరుడు తపోదీక్షతో పద్మాసనంలో ధ్యానయోగిగా, శ్రీమహాలక్ష్మి పద్మాసనిగా, శ్రీమహావిష్ణువు యోగనిద్రా ముద్రాంకితుడై గోచరమవు తారని పురాణాలు అభివర్ణించాయి. బౌద్ధ, జైన సంప్రదాయాల్లో యోగవిద్యకు ప్రముఖ పాత్ర ఉంది. సింధు నాగరికత నాటి కుడ్య చిత్రాల్లో యోగ విన్యాసాల్ని చరిత్రకారులు గుర్తించారు.
భోగం, త్యాగం, యోగం – ఈ మూడింటిలో ఏది గొప్పదని భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ని ప్రశ్నించాడు. లోకంలో అందరికంటే యోగి శ్రేష్ఠుడని, యోగమార్గమే అన్నింటికీ సమాధానమని, అదే శ్రేయస్కరమని, యోగాన్ని మాత్రమే ఆశ్రయించి యోగివి కావాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఇంత గొప్ప భారతీయ యోగ ఔన్నత్యానికి ఎందరో మహనీయులు దేశ, విదేశాల్లో విస్తృత ప్రాచుర్యం కల్పించారు.
కృష్ణమాచార్య, పట్టాభిజోయిస్, ఇంద్రాదేవి, బీకేఎస్ అయ్యంగార్ వంటి వారు పాశ్చాత్య దేశాల్లో యోగ వ్యాప్తికై కృషి చేశారు. వీరి తర్వాత రవిశంకర్ గురూజీ, నిరంజన్ స్వామి, రాందేవ్ బాబా, జగ్గీ వాసుదేవ్ కూడా యోగాను ప్రపంచానికి మరింత దగ్గర చేశారు. బెంగళూరులోని వివేకానంద యోగా కేంద్ర పరిశోధన సంస్థ వేలాది మంది యోగ శిక్షకులను తయారు చేసింది. యోగా ద్వారా దీర్ఘకాలిక రోగాలను నయం చేసే యోగా థెరపీలో ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ యోగాను ఆరోగ్య రక్షణకు తప్పనిసరని ప్రకటించింది. యోగాలోని ఆరోగ్య రహస్యాలను సేకరించి సమీకరిస్తోంది. ప్రత్యేక యోగా శిక్షణకు నిధులను సైతం అందించి ప్రోత్సహిస్తోంది.
పాశ్చాత్య ప్రపంచం భారతీయ యోగకు మంత్రముగ్ధులు అవుతోంది. యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులను పని ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు యోగానే ఆశ్రయిస్తున్నాయి. మొత్తానికి రాందేవ్ బాబా సంకల్పం, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాను ఐక్యరాజ్య సమితి కూడా ప్రతి సంవత్సరం జూన్ 21ని ‘ప్రపంచ యోగా దినోత్సవం’గా జరుపుకోవాలని 2014లో ప్రకటించింది. అంతేకాదు, ప్రపంచ యోగ దినోత్సవం 192 దేశాల్లో విజయవంతంగా నిర్వహించబడుతుంది. వీటిలో ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయి. యోగా డే ఈవెంట్లు ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డులను సైతం తిరగరాస్తున్నాయి.
ఇవాళ మానవుడి జీవితం ఉరుకులు, పరుగులమయం! పని ఒత్తిడితో దిగులు, వీటికి తోడు కుటుంబ సమస్యలతో కృంగిపోతూ తనను తాను నియంత్రించుకోలేక అనేక దురలవాట్లకు బానిస అవుతున్నాడు. అనేక ఆధునిక మందులను, మత్తు పదార్థాలను ఆశ్రయిస్తున్నాడు. చివరకు ఈ సమస్యల వలయం నుంచి బయటపడేందుకు ‘యోగ శరణం గచ్ఛామి’ అంటున్నాడు.
ఇప్పుడు ఆధునిక మానవ జీవితానికి యోగా పరమౌషధం అయ్యింది. వైద్యశాస్త్రం నుంచి మొదలుపెడితే విజ్ఞానశాస్త్రం వరకు, ఒక్కరేమిటి మొత్తం ప్రపంచమే ముక్తకంఠంతో యోగా జపం చేస్తోంది. హడావిడి జీవితానికి నిండు ఊపిరిని ఇచ్చేదే భారతీయ యోగ శాస్త్రం.