‘ఒక పౌరుడు -ఒక ఓటు’ అనే ప్రాథమిక సూత్రంపైనే ప్రజాస్వామ్యం నిలబడి ఉంటుంది. కేవలం ఎంతమంది ఓట్లు వేశారనే సంఖ్యపైనే కాకుండా, పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కును వినియోగించుకునే ఓటర్ల జాబితా స్వచ్ఛతపైనే మన ప్రజాస్వామ్య బలం ఆధారపడి ఉంటుంది. ప్రతి అసలైన ఓటరుకు రక్షణ కల్పించాలి. అర్హులైన ప్రతి పౌరుడి పేరును జాబితాలో చేర్చాలి. అదే సమయంలో బోగస్, నకిలీ, అనర్హుల పేర్లను తొలగించాలి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా సరిగ్గా ఇదే సూత్రాన్ని అమలు చేయాలని భారత ఎన్నికల సంఘం చూస్తోంది. ఎన్నికల పక్రియను మరింత బలోపేతం చేసే ఈ కార్యక్రమాన్ని స్వాగతించాల్సింది పోయి, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ తప్పుడు ప్రచారానికి దిగింది. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అంటే కాంగ్రెస్‌కు ఎందుకంత భయం? అని ఇప్పుడు ప్రతి భారతీయుడు సూటిగా ప్రశ్నించాలి.
‘ఎస్ఐఆర్’ కొత్తదేమీ కాదు.. కాంగ్రెస్ ద్వంద్వ నీతే కొత్తది
ఎస్ఐఆర్ పక్రియను భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఒక అపూర్వమైన దాడిగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రధానులు దేశాన్ని పాలించిన కాలంలోనూ ఓటర్ల జాబితాల సమగ్ర సవరణలు ఎన్నోసార్లు జరిగాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి ఈ అధికారం సంక్రమించింది. అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 21 ఓటర్ల జాబితా సవరణకు చట్టబద్ధమైన మార్గదర్శకాలను నిర్దేశిస్తోంది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఓటర్ల జాబితా సవరణ ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామ్య పక్రియ అయినప్పుడు, నేడు అదే పక్రియ ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఎలా మారుతుంది? దీనికి సమాధానం రాజ్యాంగ సూత్రాల్లో లేదు.. కేవలం రాజకీయ సౌలభ్యంలోనే ఉంది.
అందుబాటులో లేనివారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లను గుర్తించడం; తప్పుగా ఉన్న ఓటర్ల వివరాలను సరిదిద్దడం; అర్హులైన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం అనే ఎస్ఐఆర్ పక్రియ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యంపై దాడి కాదు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు అది అత్యవసరం.
13 కోట్ల కథనం వెనుక అసలు నిజం
లక్షలాది మంది అర్హులైన పౌరుల ప్రజాస్వామ్య హక్కులను అన్యాయంగా లాగేసుకుంటున్నారనే అభిప్రాయాన్ని కలిగించేందుకు రాహుల్ గాంధీ, ఆయన పార్టీ పదేపదే ‘13 కోట్ల ఓటర్లు’ అనే అంకెను ప్రస్తావిస్తున్నారు. కానీ, ‘ఎస్ఐఆర్’ పక్రియలో వెల్లడైన గణాంకాలు వేరే కథను చెబుతున్నాయి. దేశంలో నమోదైన సుమారు 95 కోట్ల మంది ఓటర్లలో, దాదాపు 82 కోట్ల మంది తమ వివరాల ధృవీకరణ ఫారాలను (ఎన్యుమరేషన్ ఫారమ్స్) సమర్పించారు. మిగిలిన సుమారు 13 కోట్ల ఎంట్రీలను.. అందుబాటులో లేనివారు, వలస వెళ్లినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లు అనే విభాగాల కింద పరిశీలన కోసం గుర్తించారు. వీటిలో సుమారు 2.89 కోట్ల మంది మరణించిన ఓటర్లు కాగా, 1.01 కోట్ల నకిలీ (డూప్లికేట్) ఎంట్రీలు ఉన్నాయి. ఆ క్రమంలో మరణించిన వ్యక్తుల పేర్లు, నకిలీ ఎంట్రీలు మన ఓటర్ల జాబితాలో శాశ్వతంగా అలాగే కొనసాగాలా? అనే మౌలికమైన ప్రశ్న తలెత్తుతోంది. పరిశీలన సమయంలో గుర్తించిన ఎంట్రీలకు, చట్టబద్ధమైన పక్రియ తర్వాత అధికారికంగా తొలగించిన ఓటర్లకు మధ్య ఉన్న కీలకమైన తేడాను ప్రతిపక్షం గుర్తించాలి. ఓటర్ల జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు తెలిపే చట్టబద్ధమైన పక్రియ అయిన ‘ఫారమ్ 7’ ద్వారా కేవలం సుమారు 29 లక్షల పేర్లు మాత్రమే తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దరఖాస్తులు కేవలం బీజేపీకి మాత్రమే పరిమితమైనవి కావు; పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సాధారణ ఓటర్లు కూడా ఈ పక్రియలో పాల్గొన్నారు. అదే సమయంలో, ‘ఫారమ్ 6’ ద్వారా 2 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. లక్షలాది మంది ఓటర్ల చేరిక గురించి మౌనంగా ఉంటూ, కేవలం తొలగింపుల గురించి మాత్రమే కాంగ్రెస్ ఎందుకు ఎడతెగకుండా మాట్లాడుతోంది? అర్హులైన పౌరుల ఓటు నమోదుకు కూడా తోడ్పడుతున్న ఒక పక్రియను, ‘ఓట్ల చోరీ’ అనే ఒక తేలికపాటి కథనంగా కుదించి చూపడం నిజాయతీ అనిపించుకోదు.
కాంగ్రెస్ ఎవరిని కాపాడాలని చూస్తోంది?
అక్రమ చొరబాట్ల విషయంలో గానీ, విదేశీయులు మన ఓటర్ల జాబితాలోకి ప్రవేశించే విషయంలో గానీ భారతదేశం ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించలేదు. భారత ఎన్నికల్లో ఓటు వేసే హక్కు భారతీయ పౌరులకు మాత్రమే చెందుతుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన లేదా అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు కట్టబెట్టే హక్కు కాదది. అయితే, ఎన్నికల స్వచ్ఛతను ఎలా కాపాడాలో వివరించడం కంటే, అసలు ఈ తనిఖీ పక్రియనే ప్రశ్నించడంలో కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. కాంగ్రెస్‌కు నిజంగానే అర్హులైన ఓటర్ల పట్ల ఆందోళన ఉందా? లేక కఠినమైన తనిఖీలు జరిగితే, ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తున్నాయని భావిస్తున్న అనర్హుల ఎంట్రీలు బయటపడతాయని భయపడుతోందా? అనే ప్రశ్నలను ఈ పక్రియ పట్ల కాంగ్రెస్ వ్యతిరేకత లేవనెత్తుతోంది. వీటికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఎన్ని ఒత్తిళ్లయినా తీసుకురావచ్చు. భారత ఎన్నికల స్వచ్ఛతను కాపాడటంలోనూ, అక్రమ చొరబాట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలోనూ బీజేపీ తన నిబద్ధతను వీడదు. ఏ ఒక్క అసలైన భారతీయ ఓటరుకు అన్యాయం జరగకూడదు. ఏ ఒక్క అనర్హుడికి మన ప్రజాస్వామ్య తీర్పును తారుమారు చేసే అవకాశం ఇవ్వకూడదు. అదే మన మార్గదర్శక సూత్రం కావాలి.
లక్షలాది మంది భాగస్వామ్యంతో పారదర్శక పక్రియ
కాంగ్రెస్ కథనంలో ఉన్న మరో స్పష్టమైన వైరుధ్యం.. ఎస్ఐఆర్లో పాల్గొన్న వారి భారీ సంఖ్య. దేశవ్యాప్తంగా 9 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లలో జరిగిన ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, ఇతర పరిపాలనా సిబ్బంది సహా 11 లక్షల మందికి పైగా ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 9 లక్షల మందికి పైగా బీజేపీ బూత్ లెవల్ ఏజెంట్లు సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 35 లక్షల మందికి పైగా అధీకృత ప్రతినిధులు ఇందులో పాలుపంచుకున్నారు. అంటే, ఈ పక్రియను నిర్వహించడంలో, పర్యవేక్షించడంలో దాదాపు 46 లక్షల మంది అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములయ్యారు. ఇందులో ఉన్నది కేవలం బీజేపీ ప్రతినిధులు మాత్రమే కాదు. అన్ని రాజకీయ పార్టీలకు ఈ తనిఖీ పక్రియలో పాల్గొనేందుకు, ఓటర్ల రికార్డులను పరిశీలించేందుకు, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశాలు కల్పించబడ్డాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, తమ సొంత పార్టీ ప్రతినిధులు, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు అందరూ కలిసి ఏదో ఒక పెద్ద కుట్రలో భాగస్వాములయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారా? ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సాక్ష్యాలకు ప్రత్యామ్నాయం కాలేవు. పైగా, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం, అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, అవసరమైన చోట విచారణ జరపడం, ఆ తర్వాతే తుది ఓటర్ల జాబితాను ప్రచురించడం వంటి దశలు ఈ పక్రియలో ఉన్నాయి. అర్హులైన ఓటర్లు పొరపాటున కూడా జాబితా నుంచి తొలగింపునకు గురికాకుండా కాపాడేందుకే ఈ రక్షణ కవచాలన్నీ ఏర్పాటు చేశారు. నిర్దిష్టంగా ఎక్కడైనా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ వద్ద ఆధారాలు ఉంటే, వాటిని సంబంధిత ఎన్నికల అధికారుల ముందు ఉంచి, అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను అనుసరించాలి. అంతేకానీ, ఎలాంటి ఆధారాలు లేకుండా సాధారణ ఆరోపణలు చేస్తూ మొత్తం ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడం వల్ల ప్రజాస్వామ్యానికి ఒరిగేదేమీ లేదు.
తన సొంత ఎన్నికల చరిత్రకు కాంగ్రెస్ బదులివ్వాలి
ప్రజాస్వామ్య భాషపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నైతిక గుత్తాధిపత్యం లేదు.1975 నాటి ఎమర్జెన్సీని భారతదేశం ఇంకా గుర్తుంచుకుంది. నాడు రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛను రద్దు చేసి, ప్రజాస్వామ్య సంస్థలను అసాధారణమైన రాజకీయ ఒత్తిడికి గురిచేశారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ నాటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కూడా దేశం మర్చిపోలేదు. 1987 జవ్మ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చుట్టూ అలుముకున్న ఆరోపణలు భారత ఎన్నికల చరిత్రలో మరో తీవ్రమైన కలవరపరిచే అధ్యాయంగా మిగిలిపోయాయి. నేడు ప్రజాస్వామ్య విలువలకు తామే ఏకైక రక్షకులమని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నంత మాత్రాన, ఆ చారిత్రక ఘట్టాలను వారు చెరిపివేయలేరు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు. స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు జవాబుదారీతనంతో ఉండాల్సిందే. కానీ, ఆ జవాబుదారీతనం అనేది సాక్ష్యాలు, నిలకడ, రాజ్యాంగ పక్రియల పట్ల గౌరవంపై ఆధారపడి ఉండాలి. రాజకీయ ఫలితాలు తమకు అనుకూలంగా లేనప్పుడల్లా ఎన్నికల విశ్వసనీయతపై దాడి చేసేందుకు దానిని ఒక సాకుగా వాడుకోకూడదు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
నెరవేరని హామీలతో కూడిన కాంగ్రెస్ రాజకీయాల పర్యవసానాలను తెలంగాణ ప్రజలు ఇప్పటికే ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆరు గ్యారంటీల నుంచి హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ వరకు.. సాయం కోసం ఎదురుచూస్తున్న రైతుల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల వరకు.. తాము కల్పించిన అంచనాలను అందుకోవడంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే విఫలమైంది. ఈ హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాల్సింది పోయి, కాంగ్రెస్ నేతలు రాజకీయ డ్రామాలకు, ప్రజాస్వామ్య సంస్థలపై దాడులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడానికి సమయం కేటాయిస్తున్న రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రజలు లేవనెత్తుతున్న న్యాయమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఎందుకు తడబడుతున్నారో వివరించాలి. కేవలం ఉపన్యాసాలతోనే ప్రజాస్వామ్యం బలపడదు. జవాబుదారీతనంతో కూడిన పాలన, విశ్వసనీయమైన సంస్థలు, పౌరుల హక్కులను గౌరవించడం ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
ప్రతి అసలైన ఓటు పవిత్రమైనది
భారతీయ జనతా పార్టీకి ఎన్నికల స్వచ్ఛత అనేది రాజకీయ సౌలభ్యం కాదు.. అదొక జాతీయ బాధ్యత. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అర్హులైన ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఎన్నికల పక్రియను దెబ్బతీసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము. అర్హులైన ఏ ఒక్క ఓటరుకు అన్యాయం జరగని, మరణించిన వ్యక్తుల పేర్లు దుర్వినియోగం కాని, నకిలీ ఎంట్రీలు జాబితాను వక్రీకరించని, భారతీయ పౌరులకు మాత్రమే చెందే హక్కును ఏ విదేశీయుడూ అక్రమంగా వినియోగించుకోలేని ఎన్నికల వ్యవస్థను మేము కోరుకుంటున్నాము. ఈ పక్రియకు నిర్మాణాత్మకంగా సహకరించాలో లేక అనుమానాలు, అడ్డంకుల రాజకీయాలనే కొనసా గించాలో కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి. రాహుల్ గాంధీ వంద ఆరోపణలు చేయవచ్చు, వెయ్యి నిరసనలు తెలపవచ్చు, తనకు తోచినంత రాజకీయ ఒత్తిడి తీసుకురావచ్చు. కానీ, భారత ఓటర్ల జాబితా పవిత్రత విషయంలో బీజేపీ ఎన్నటికీ రాజీపడదు. ప్రతి అసలైన ఓటరుకు రక్షణ కల్పించడం, చట్టబద్ధ మైన పక్రియ ద్వారా అనర్హుల పేర్లను తొలగిం చడం, ప్రజాస్వామ్య తీర్పు కేవలం భారత పౌరులకు మాత్రమే చెందేలా చూడటంలో మా సంకల్పం చెక్కుచెదరనిది. ఎందుకంటే.. ప్రతి భారతీయుడి ఓటును కాపాడటం ఒక రాజకీయ ఎజెండా కాదు. అది మా రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం.

ఎన్.రాంచందర్ రావు
అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ
