‘‘ఆత్మకథ రాయడం అంటే కేవలం గతాన్ని నెమరువేసుకోవడం కాదు, అది ఒక ఆత్మపరిశీలన. మన తప్పులను నిర్భయంగా అంగీకరించినప్పుడే ఆ రచనకు పవిత్రత లభిస్తుంది’’ అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలకు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇటీవల విడుదల చేసిన ఆమె ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం విడుదలైన సందర్భంగా మహాత్మాగాంధీ వ్యాఖ్యలను స్మరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గాంధీ వారసులమని చెప్పుకునే సోనియా గాంధీ ఈ పుస్తకంలో ఒకవైపు అసలు విషయాలను వక్రీకరిస్తూ మరోవైపు ఉద్దేశ్యపూర్వకంగా తమకు అనుకూలమైన విషయాలనే ఉటంకిస్తూ కీలక అంశాలను దాటవేశారు. ఈ ఆత్మకథ రాజీవ్‌గాంధీ ప్రేమతో మొదలై కుటుంబ విషయాలు, సంతోషాలు, భయాందోళనలు, విషాద గాథలు, అంతర్గత అంశాలు, కన్నీటి పర్వాలు ఇలా పలు ఘట్టాలతో కొససాగింది. సమగ్రంగా పరిశీలిస్తే తమ పూర్వీకులు చేసిన తప్పులను తక్కువ చేసి చూపించడం, సమర్థించడం లేదా ఇతరులపై నెట్టివేయడంతో పాటు తమ భవిష్యత్తు తరాలకు రాజకీయ బాటలు వేసేలా సోనియాగాంధీ ఆత్మకథ సాగింది. ఈ పుస్తకం ఇప్పుడు పలు అంశాలపై వివాదాస్పదమవుతోంది.
సోనియా గాంధీ తన పుస్తకంలో ఎమర్జెన్సీ తప్పిదమని ఒకవైపు అంగీకరిస్తూనే ఇందిరాగాంధీని సమర్థించడానికి ప్రయత్నించారు. అయితే ఎమర్జెన్సీ వల్ల జరిగిన నష్టంలో ఎక్కువ భాగానికి సంజయ్ గాంధీని బాధ్యుడిగా చూపించేందుకు యత్నించారు. నాడు ఇందిరాగాంధీని కాదని నిర్ణయం తీసుకునే ధైర్యం ఆ పార్టీలో ఇతర నేతలెవరికీ లేదనేది వాస్తవం. ఎమర్జెన్సీ విధించింది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలోని నాటి ప్రభుత్వమే కదా! దేశ ప్రజాస్వామ్యాన్ని నిలిపివేసిన నిర్ణయానికి ప్రధాన బాధ్యత ఎవరిది? సంజయ్‌గాంధీ పాత్రను ప్రస్తావించడం ద్వారా అప్పటి ప్రభుత్వ బాధ్యత తగ్గిపోతుందా? అనే పలు ప్రశ్నలకు ఈ పుస్తకంలో స్పష్టత కరువైంది. తప్పును అంగీకరించడం ఒకటైతే, ఆ తప్పుకు బాధ్యత వహించడం మరొకటి. ఈ విషయాన్ని సోనియా ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారు.
1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన సిక్కు వ్యతిరేక హింస భారతదేశం ఎన్నటికీ మరచిపోలేని విషాదం. దీనిని విషాదకరమైన, సిగ్గుచేటైన అధ్యాయంగా అభివర్ణిస్తూనే రాజీవ్‌గాంధీ హృదయంలో సిక్కులపై ద్వేషం లేదని చెప్పడం ద్వారా పరోక్షంగా ఆయనను, నాటి ప్రభుత్వాన్ని సోనియాగాంధీ సమర్థించారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న సైన్యాన్ని వెంటనే ఉపయోగించకుండా, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఏఎస్ వైద్య నిర్ణయం వల్ల ఆలస్యమైందన్న విధంగా సోనియా చెప్పడం హాస్యాస్పదం. సైన్యాన్ని మోహ రించే బాధ్యత అప్పటి ప్రభుత్వానిదే. నాటి ఆలస్యానికి కారణమైన అధికారులపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో స్పష్టత లేదు. బాధితులకు న్యాయం అందించడంలో దశాబ్దాల జాప్యం ఎందుకు జరిగిందన్నది కూడా సమాధానం కావాల్సిన ప్రశ్నే. ఇదే సందర్భంలో రాజీవ్‌గాంధీ చేసిన ‘పెద్ద చెట్టు కూలినప్పుడు భూమి కొద్దిగా కంపిస్తుంది’ అన్న వ్యాఖ్యను కూడా గుర్తుచేసుకోవాలి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సమయంలో ఇలాంటి వ్యాఖ్య దేశ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చింది? ఆ తర్వాత రాజీవ్‌గాంధీ శాంతి కోసం చేసిన విజ్ఞప్తులను ప్రస్తావించడం మాత్రమే సరిపోతుందా? రాజకీయ నాయకత్వం బాధ్యతను కూడా సమీక్షించాలి కదా! సోనియాగాంధీ పుస్తకంలో వీటిపై స్పష్టత లేకపోవడం రాజకీయంలో భాగమే.
1985లో సుప్రీంకోర్టు షాబానో కేసులో విడాకులు పొందిన ముస్లిం మహిళకు భరణం పొందే హక్కును గుర్తించింది. అయితే ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ నిర్ణయం మహిళల హక్కులు, రాజ్యాంగ సమానత్వం, మైనారిటీ రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాజీవ్ గాంధీ ముస్లిం మత పెద్దల ఒత్తిడికి తలొగ్గడంతో ముస్లిం మహిళల హక్కు లపై తాను కూడా రాజీవ్ గాంధీని ప్రశ్నించానని సోనియా పుస్తకంలో తెలిపారు. ఇక్కడే మరో కీలక ప్రశ్న ఉదయిస్తుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు సమన్యాయం చేస్తూ త్రిబుల్ తలాక్‌ను నిషేధిస్తూ బిల్లు తీసుకొస్తే సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు వ్యతిరేకించింది? నాడు రాజీవ్‌ను ప్రశ్నించానని చెప్పిన సోనియా త్రిబుల్ తలాక్ విషయంలో ఎందుకు కప్పదాటు వైఖరి ప్రదర్శించారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
బోఫోర్స్ స్కామ్ విషయంలోనూ సోనియా మౌనం దాల్చడం విడ్డూరం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో స్వీడన్‌కు చెందిన బోఫోర్స్ సంస్థతో కుదిరిన తుపాకుల కొనుగోలు ఒప్పందంలో ముడుపుల ఆరోపణలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. నాటి ఆరోపణలు, దర్యాప్తు, న్యాయపరమైన పరిణామాలపై సోనియా గాంధీ తన పుస్తకంలో వివరించలేదు. రాజీవ్ గాంధీ మరణానంతరం సంక్షోభంలోఉన్న కాంగ్రెస్‌ను పి.వి.నరసింహారావు ఎంతో చాకచక్యంగా అధికారంలోకి తేస్తే సోనియాగాంధీ బృందం ఆయనను వేదనకు గురిచేసింది. తన ఆత్మకథలో ఆమె పి.వి.నరసింహారావును గొప్ప నేతగా వర్ణించినా ఆచరణలో మాత్రం అవమానించారు. పి.వి.నరసింహారావు మరణానంతరం ఆయన అంత్యక్రియలను కూడా వివాదాస్పదం చేశారు. ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయానికి భిన్నంగా పి.వి. మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాద్ పంపించారు. పి.వి.నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు ఆద్యులు. అయితే సోనియాగాంధీ తన పుస్తకంలో ఎక్కడా ఆ ప్రస్తావన తేలేదు.
సోనియాగాంధీ రాజకీయ ప్రస్థానంలో సీతారాం కేసరి ఉదంతం కూడా కీలకమైన అధ్యాయం. బడుగు వర్గానికి చెందిన సీతారాం కేసరిని పార్టీ అధ్యక్షుడిని చేశానని చెప్పిన సోనియా ఆయన స్థానంలో ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయనను తొలగించిన తీరును ప్రస్తావించలేదు. కేసరి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నట్టు తెలిపిన సోనియా ఆ తర్వాత అదే కేసరి అధ్యక్ష పదవి నుంచి ఎలా తప్పుకున్నారు? పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనను ఒక గదిలో నిర్బంధించారన్న ఆరోపణల వెనుక వాస్తవాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.
2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన తన నిర్ణయాన్ని సోనియాగాంధీ తన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా వివరించారు. దీన్ని యావత్ కాంగ్రెస్ శ్రేణులు గొప్ప త్యాగంగా వర్ణిస్తున్నాయి. అయితే ఈ పరిణామాల వెనుక ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా ప్రశ్నలున్నాయి. ప్రధానంగా ఆమె భారత పౌరసత్వంపై అనేక వివాదాలున్నాయి. ఆమె పుట్టిన దేశం ఇటలీ, భారత్ దేశాల నిబంధనల మధ్య అనేక భేదాలున్నాయి. ఆమె తన పుస్తకంలో వీటి గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. గతంలో అధికారం ఇందిరాగాంధీ చుట్టూ ఎలా కేంద్రీకృతమయ్యిందో, సోనియాగాంధీ అంతకంటే ఎక్కువగా అధికారం లేకపోయినా సూపర్పవర్తో అధికారులను తన చుట్టూ తిప్పుకున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, కూటమి పార్టీల వైఖరి, తెరవెనుక జరిగిన చర్చలను చరిత్ర ముందు ఉంచకుండా, కేవలం పదవిని త్యాగం చేశారనే కోణంలోనే వివరాలిచ్చారు. మాజీ విదేశాంగ మంత్రి దివంగత కె. నట్వర్ సింగ్ తన ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ ఆత్మకథలో 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. అలాగే అప్పటి కూటమి రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ వైఖరి, సోనియా ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై నెలకొన్న చర్చలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వీటిపై సోనియా గాంధీ పుస్తకంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. యూపీఏ ప్రభుత్వాల కాలంలో మరో వివాదం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం మధ్య విభేదాలకు సంబంధించినది. ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంపై నిఘా పెట్టారన్న ఆరోపణలు అప్పట్లో రాజకీయంగా చర్చకు వచ్చాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అప్పటి కాంగ్రెస్ నాయకత్వానికి ఏం తెలుసు? దీనిపై ఎలాంటి విచారణ జరిగింది? పార్టీలో అత్యున్నత నాయకత్వ స్థానంలో ఉన్న సోనియాగాంధీకి ఈ వివాదంపై ఉన్న సమాచారం ఏమిటి? ఈ ప్రశ్నలకు పుస్తకంలో తగిన వివరణ లేదు. ప్రణబ్‌ముఖర్జీ ప్రధానమంత్రి పదవి ఆశించారని, ఆ అంశాన్ని తాను పొడిగించలేదని సోనియాగాంధీ ఈ పుస్తకంలో తెలిపారు. అందుకే ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ స్పందిస్తూ మా నాన్నకి ప్రధాని మంత్రి అయ్యే అర్హత లేదా అని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. పి.వి. నరసింహారావు, సీతారాం కేసరి, ప్రణబ్ ముఖర్జీ వంటి కీలక నేతలను పార్టీలో ఎదగకుండా సోనియా గాంధీ సూపర్ పవర్‌గా వ్యవహరించారు. ఇలాంటి ఆధిపత్య వైఖరితో విసిగిపోయిన శరద్ పవార్ లాంటి సీనియర్ నేతలు పార్టీని వీడారు. వీరి గురించి తన పుస్తకంలో సోనియాగాంధీ పెద్దగా ప్రస్తావించకుండా రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రాలను కాంగ్రెస్ భవిష్యత్తులో కీలక వ్యక్తులుగా చిత్రీక రించడం, రాబర్ట్ వాద్రా విషయంలోనూ అనుకూలమైన వర్ణన ఉండటం గమనార్హం. కుటుంబ సభ్యుల గురించి సానుకూలంగా రాసుకునే హక్కు సోనియాగాంధీకి ఉంది. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానికి, వారి భజనపరులకు తప్ప ఇతరులకు అవకాశాలు ఉండవని ఈ పుస్తకం ద్వారా మరోసారి నిరూపితమైంది. అయోధ్యలో వివాదాస్పద కట్టడం విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై ఈ పుస్తకంలో పలు వివాదాలున్నాయి. కట్టడం కూల్చివేతను టెలివిజన్‌లో చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పడం కంటే, ఆ ఘటనకు దారితీసిన పరిస్థితులను సోనియా గాంధీ విశ్లేషించి ఉంటే చరిత్రకు ఉపయోగపడేది. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించింది. స్వాతంత్య్ర ఉద్యమ వారసత్వాన్ని తనదిగా చెప్పుకుంటుంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికవాదం, భావప్రకటన స్వేచ్ఛ గురించి తరచూ మాట్లాడుతుంది. అలాంటప్పుడు తన పాలనలో జరిగిన వివాదాస్పద పరిణామాలపై కూడా అదే నిబద్ధతతో సమాధానం చెప్పాలి. ఒక ఆత్మకథలో రచయిత తన అనుభవాలను తన దృక్కోణంలో రాసుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛ చారిత్రక ప్రశ్నల నుంచి తప్పించుకునే కవచం కాకూడదు. సోనియాగాంధీ ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని అంశాలను విస్మరించారు. ‘బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్’పుస్తకం చదివితే అది వాస్తవాలను విస్మరించి పూర్తిగా రాజకీయకోణంలో రాసినట్టు ఉంది. ఒకవైపు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చేసిన తప్పులను సమర్థిస్తూనే మరోవైపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసే ప్రయత్నంగా ఈ పుస్తకం పూర్తిగా రాజకీయాం శాలతోనే కూడుకొని ఉంది. విదేశీయురాలైన సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టాలని అనుకున్నప్పటికీ, పౌరసత్వంతో పాటు పలు సాంకేతిక కారణాలతో ఆమె వెనకడుగు వేశారు. అంతేకాక ఈ విషయంలో యూపీఏలోని ఇతర పక్షాలు కూడా ఆమెకు సంపూర్ణంగా సహకరించ లేదు. దీన్ని కప్పిపుచ్చుతూ, తనను తాను ఒక త్యాగశీలిగా చెప్పుకుంటూ ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు సోనియాగాంధీ తీసుకొనివచ్చారు. మొత్తం మీద దీన్ని ‘బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్’కంటే ‘బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ పాలిటిక్స్’అనడమే సరైనది. ‘‘జీవిత చరిత్ర రాయడం అంటే ఒక అద్దం ముందు నిలబడటం లాంటిది. అందులో మన మంచితో పాటు, మనలోని లోపాలు కూడా స్పష్టంగా కనిపించాలి’’ అని కందుకూరి వీరేశలింగం చెప్పినమాట ఇక్కడ ప్రస్తావనకు అర్హమైనది.
-శ్రీపాద
