ప్రస్తుతం ప్రపంచానికి రెండు యుద్ధాలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. మొదటిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కాగా రెండవది అమెరికా/ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం. ఇరాన్‌తో యుద్ధంలో యుఎస్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉండగా, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతు పలుకుతూ వచ్చింది. ఈ రెండు యుద్ధాలు అమెరికాలో ఇంధన సంక్షోభానికి దారితీయడంతో రష్యాతో చమురు ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్, మాటమార్చి రష్యాతో రాజీకి రావాలని ఉక్రెయిన్‌పై వత్తిడి తేవడం మొదలుపెట్టారు. యు.ఎస్.తోపాటు, ఉక్రెయిన్‌కు మద్దతుపలకడమే కాకుండా బిలియన్ల కొద్దీ విలువైన ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐరోపాదేశాలు ట్రంప్ వ్యవహారశైలితో పూర్తిగా ఇరుకున పడ్డాయి. ఇప్పుడు వాటి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది.
మరోవైపు ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌తో యుద్ధంలోకి దిగి, ఆ ఊబినుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతోంది. ఇదే సమయంలో యుఎస్ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల దారుణ పరాజయం, ఇజ్రాయెల్‌లో ఏ పార్టీకి అవసరమైన మెజారిటీ రాకపోవడం యుద్ధాలను మరింత అగమ్యగోచరంలోకి నెట్టేశాయి. అమెరికా, •••రప్ దేశాల మద్దతుతో రష్యా రిఫైనరీల మీద దాడులు చేస్తూ వస్తున్న జెలన్‌స్కీని తాజా పరిణామాలు నడి సముద్రంలోకి నెట్టేశాయి. చమురు అవసరాలు ఇప్పుడు యుఎస్‌ను పునరాలోచనలో పడేయడం తాజా సమస్యకు ప్రధాన కారణం.
శాంతియత్నాలకు అవసరాలే మూలం
విచిత్రమేమంటే ఈ మొత్తం రెండు యుద్ధాలతో భారత్‌కు ఎటువంటి సంబంధం లేకపోయినా చమురు పరంగా రష్యాపై ఆధారపడటం, హార్ముజ్ జలసంధి గుండా చమురు నౌకలను సురక్షితంగా మనదేశ తీరానికి చేర్చడమనే అవసరాలు, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తెరవెనుక శాంతియత్నాలకు ఉపక్రమించక తప్పని పరిస్థితికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే యుద్ధం వల్ల తలెత్తే తక్షణ నష్టాలను తగ్గించేందుకు గత అక్టోబర్‌లో భారత్ వ•డు ప్రధాన అంశాలతో కూడిన ఒక కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదిం చింది. ఇందులో ప్రధానమైంది నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల భద్రత, ఆహార ధాన్యాల సరఫరా, మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించడం. ఇంధన కేంద్రాలు , ఇతర కీలక మౌలిక సదుపాయాలపై పరస్పర దాడులను తక్షణమే ఆపాలని భారత్ సూచించింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులను నిలిపివేసి, సముద్ర రవాణాకు, నావికులకు భద్రత కల్పించాలని కోరింది. మనదేశంతో పాటు అమెరికా, తుర్కియే, ఈజిప్ట్‌లు కూడా శాంతి ప్రతిపాదనలు చేయగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా భారత్ ఇచ్చిన ప్రణాళిక అత్యంత సమగ్రమైనదిగా ఉందని ప్రశంసించడం గమనార్హం. మరోవైపు అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక శాంతి చర్చలు ప్రారంభమయ్యే ముందు దౌత్యపరంగా భారత్ కీలక పావులు కదిపింది. నవంబర్ 9న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి తాజా యుద్ధ పరిస్థితులను వివరించారు. భారత్ తటస్థంగా లేదని, ఎల్లప్పుడూ ‘శాంతి పక్షానే’ ఉందని ప్రధాని మోదీ మొదట్నుంచీ స్పష్టం చేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ఫోన్‌లో మాట్లాడి యుద్ధ విరమణ, శాంతి ప్రయత్నాలపై చర్చించారు. అంతకుముందు సెప్టెంబర్‌లో జైశంకర్ స్వయంగా కీవ్ పర్యటనకు వెళ్లి ఉక్రెయిన్ నాయకత్వంతో భేటీ అయ్యారు. రష్యాతో పాత స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే, ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలతో కూడా భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నల్ల సముద్రంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహార కొరత ఏర్పడుతోందని, అలాగే భారతీయ నావికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే సంపూర్ణ రాజకీయ ఒప్పందం కంటే ముందుగా మానవతా, వాణిజ్య అంశాలపై తాత్కాలిక కాల్పుల విరమణ సాధించేందుకు భారత్ తెరవెనుక కృషి చేస్తోంది.
భారత్ ప్రణాళిక ఎందుకు కీలకం?
యుద్ధానికి ముందు ప్రపంచ ధాన్యపు ఎగుమతుల్లో దాదాపు వ•డో వంతు నల్ల సముద్రం ద్వారానే జరుగుతుండేది. గత ఆగస్టు నాటికి రష్యా- ఉక్రెయిన్ పరస్పర దాడుల వల్ల అజోవ్, నల్ల సముద్ర ప్రాంతాల్లో 97 శాతానికి పైగా ధాన్యపు ఎగుమతి సామర్థ్యం స్తంభించి పోయింది. దీనివల్ల ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహార కొరత ఏర్పడటమే కాకుండా ఎరువుల ధరలు తీవ్రంగా పెరిగాయి.నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం లేదా గాయపడటం జరిగింది. నావికుల భద్రతతో పాటు, ఉక్రెయిన్ నుండి వంటనూనెలు/ధాన్యాలు, రష్యా నుండి ముడి చమురు దిగుమతులు సజావుగా సాగడం భారత్‌కు కీలకం. భారత్ ఇచ్చిన ఈ ప్రతిపాదనను అత్యంత సమగ్రమైనదిగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అభివర్ణించగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సానుకూలంగా స్పందించారు.నవంబర్ 9న ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్‌లో మాట్లాడిన అనంతరం, నల్ల సముద్రంలో ఆహార కారిడార్ల ఏర్పాటులో మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దీనిపై భారత్ అటు రష్యా, ఉక్రెయిన్‌లతో పాటు •••రోపియన్ •••నియన్, ఈ3 దేశాలతో (ఫ్రాన్స్, జర్మనీ, •••కే) కూడా సంప్రదింపులు జరుపుతోంది.
అబూదాబి చర్చలు
నవంబర్ 10, 11 తేదీల్లో అబుదాబిలో జరిగిన రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక శాంతి చర్చల్లో భారత్ ప్రతిపాదించిన నల్ల సముద్రపు ‘ఆహార కారిడార్’ ప్రణాళికపై ఎలాంటి తుది ఒప్పందం కుదర లేదు. ఆహార కారిడార్, కాల్పుల విరమణ అంశాలపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండటం ఇందుకు కారణం. అయితే ఈ చర్చల్లో యుద్ధ ఖైదీల మార్పిడిపై మాత్రమే ఒక స్పష్టమైన ఒప్పందం కుదిరింది. కేవలం తాత్కాలిక కాల్పుల విరమణకు లేదా పాక్షిక ఒప్పందాలకు తాము సిద్ధంగా లేమని, తమ షరతుల మేరకు సమగ్ర శాంతి ఒప్పందం కుదరాలని రష్యా ప్రధాన సంధానకర్త వ్లాదిమిర్ మెడిన్‌స్కీ స్పష్టం చేశారు. అబుదాబి చర్చలు ప్రారంభమైన రోజే (నవంబర్ 10న) భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఆహార కారిడార్లు , వాణిజ్య నౌకల భద్రతకు సంబంధించిన ప్రతిపాదనలను రష్యా, ఉక్రెయిన్ రెండింటితో పంచుకున్నామని, వాటిపై ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ఉమ్మడి ప్రణాళిక రూపొందలేదు. •••రప్, అమెరికాతో పాటు భారత్ కూడా తెరవెనుక తన దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రధాన రాజకీయ, భూభాగ వివాదాలు తేలడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున, కనీసం మానవతా కోణంలో ఆహార ధాన్యాల సరఫరా కోసం ‘ఆహార కారిడార్’ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
భారత్ కీలకపాత్ర
అంతర్జాతీయ దౌత్యంలో భారత్ ఒక కీలక మధ్యవర్తిగా, కేంద్ర బిందువుగా ఎదిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్లిష్ట అంతర్జాతీయ సంక్షోభాలలో ఇరు పక్షాలతో నేరుగా మాట్లాడగలిగే సామర్థ్యం భారత్‌కు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా, •••రప్ దేశాలు రష్యాతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకున్న తరుణంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇద్దరితోనూ నేరుగా సంప్రదింపులు జరపగలిగే ఏకైక పెద్ద దేశంగా భారత్ నిలిచింది. జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించిన నాటినుండి ఇప్పటివరకు వర్ధమాన దేశాల ఆహార, ఇంధన భద్రత కోసం భారత్ గళం విప్పుతోంది. నల్ల సముద్రపు ‘ఆహార కారిడార్’ ప్రతిపాదన ద్వారా ప్రపంచ ఆకలి తీర్చే బాధ్యతను భుజానికెత్తుకోవడం భారత్ దౌత్య ప్రతిష్టను మరింత పెంచింది.
అమెరికాకు అసాధ్యం
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రధాన అధికారిక చర్చలకు అమెరికా సారథ్యం వహిస్తున్నప్పటికీ, భారత్ వంటి తటస్థ దేశాల సహకారం లేకుండా ఒంటరిగా పూర్తిస్థాయి శాంతి స్థాపన సాధ్యం కాదు. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సహాయం అందించే అతిపెద్ద దేశం అమెరికా కావడంతో కీవ్‌ను చర్చల బల్లపైకి తీసుకురావడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు ఆంక్షల సడలింపు వంటి అంశాలతో రష్యాతో బేరసారాలు జరపగల సత్తా అమెరికాకు ఉంది. కానీ యుద్ధంలో అమెరికా నేరుగా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవడం వల్ల, రష్యా అమెరికాను ఒక తటస్థ మధ్యవర్తిగా కాకుండా ప్రత్యర్థిగానే చూస్తోంది. దీనివల్ల అమెరికా ప్రతిపాదించే భద్రతా హామీలను మాస్కో పూర్తిగా విశ్వసించలేకపోతోంది. అదే భారత్ ఇటు జెలన్‌స్కీతోను, అటు పుతిన్‌తోనూ చర్చింగలదు. ఏ శాంతి ఒప్పందానికైనా అంతర్జాతీయ ఆమోదం, నైతిక బలం లభించాలంటే భారత్ మద్దతు అమెరికాకు అవసరం.
పశ్చిమాసియాలో తెర వెనుక దౌత్యం
ఇరాన్ ప్రభుత్వం నవంబర్‌లో భారత నౌకలకు హార్ముజ్ జలసంధిలో ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇరాన్‌కు అవసరమైన ఔషధాల దిగుమతి, ద్వైపాక్షిక ప్రయోజనాల దృష్ట్యా టెహ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇది ఇరాన్‌తో భారత్‌కు ఉన్న నమ్మకమైన సంభాషణల మార్గాన్ని స్పష్టం చేస్తోంది. ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఇరు దేశాల సంబంధాలు ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్‌కు అతిపెద్ద రక్షణ భాగస్వామిగా భారత్ ఉండటం వల్ల, టెల్ అవీవ్‌లో ఏ ప్రభుత్వం ఏర్పడినా భారత్ మాటలకు ప్రాధాన్యత ఉంటుంది. అటు అమెరికా, ఇజ్రాయెల్‌లతో పాటు ఇటు ఇరాన్, గల్ఫ్ దేశాలతో సత్సంబంధాలు కలిగిన ఏకైక పెద్ద దేశం కావడంతో, అమెరికా కొత్త కాంగ్రెస్ కోరుకునే శాంతి చర్చలకు భారత్ వారధిగా నిలవగలదు. భారత్ బహిరంగంగా శాంతి ఒప్పందాలకు నాయకత్వం వహించకపోయినా, ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక, అమెరికాలో డెమోక్రట్లు బాధ్యతలు చేపట్టాక మొదలయ్యే శాంతి పక్రియలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సందేశాలను చేరవేసే అత్యంత విశ్వసనీయ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించే సత్తా భారత్‌కు ఉంది.
చైనా ఎందుకు విఫలమవుతోంది?
గ్లోబల్ సౌత్ నాయకత్వం కోసం భారత్‌తో పోటీపడుతున్న చైనా కూడా పశ్చిమాసియాలో శాంతికోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత్ తరహాలో కీలక మధ్యవర్తిగా నిలవలేకపోవడానికి ప్రధాన కారణం ఈ సంక్షోభంలో అమెరికా, ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా భాగస్వాములుగా ఉండటం! అమెరికాతో చైనాకు ఉన్న తీవ్రమైన వ్యూహాత్మక, వాణిజ్య వైరం కారణంగా, అమెరికా మిత్రదేశాలైన యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు చైనా మధ్యవర్తిత్వాన్ని పూర్తిస్థాయి లో విశ్వసించలేకపోతున్నాయి. చైనా, ఇరాన్‌కు అతిపెద్ద చమురు కొనుగోలు దారుగా, ఆర్థిక భాగస్వామిగా ఉంది. అలాగే భద్రతా మండలిలో ఇరాన్‌కు మద్దతుగా నిలవడం వల్ల, చైనాను ఒక తటస్థ మధ్యవర్తిగా కాకుండా ఇరాన్ పక్షపాతిగా గల్ఫ్ దేశాలు చూసే అవకాశం ఉంది. యుఏఈకి భద్రత, రక్షణ, కృత్రిమ మేధ అవసరాల కోసం అమెరికాతో బలమైన ఒప్పందాలున్నాయి. అందు వల్ల చైనాకు యుఏఈపై ఉన్న దౌత్యపరమైన పట్టు పరిమితం. చైనా దౌత్యం ప్రధానంగా హార్ముజ్ జలసంధి ద్వారా తన చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా చూసుకోవడం, గల్ఫ్ దేశాలు పూర్తిగా అమెరికా కూటమిలోకి వెళ్లకుండా నిరోధించడం చుట్టూనే తిరుగుతోంది. ఇది పూర్తిస్థాయి శాంతి స్థాపన కంటే తన ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంకేతాలిస్తోంది.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్
