అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేథ-ఏఐ ఆధారిత రోబోల వినియోగం నానాటికి పెరిగిపోతుండటం సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మనుష్యులు చేయాల్సిన పనుల్లో చాలావరకు రోబోలు చేస్తున్న కారణంగా ఉన్న ఉపాధిని కోల్పోవడమేకాకుండా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కనుమరుగైపోయే ముప్పు అయితే ముంచుకొస్తోంది. చర్యలో పాల్గొనకుండా చర్యను ప్రభావితం చేసే ఉత్ప్రేరకాలు లాంటి ఏఐ పరిణామ క్రమంలో వేగం, అందుబాటులోకి శక్తిమంతమైన చిప్‌లు, ధరల్లో తగ్గుదల, నైపుణ్యాలు, ఉత్పాదకత ఆవశ్యకతల మేలు కలయిక రోబోల వాడకాన్ని విస్తృతం చేసింది.

రోబోలు ప్రస్తుతం చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అవి విమానాశ్రయాలలోని కొన్ని ఎయిర్‌లైన్‌ ‌కౌంటర్ల వద్ద చెక్‌-ఇన్‌లను సులభతరం చేస్తున్నాయి. హోటల్‌ ‌రిసెప్షన్‌ ‌ప్రాంతాల్లో అతిథులకు వెల్‌కమ్‌ ‌డ్రింక్‌లు అందిస్తున్నాయి. రెస్టారెంట్లలో ఆర్డర్లకు తగ్గట్టుగా కస్టమర్లకు ఆహార, పానీయాలను స్వయంగా తెచ్చి పెడుతున్నాయి. గిడ్డంగులు, కర్మాగారాలు, లాజిస్టిక్‌ ‌హబ్‌ల వద్ద కాపాలా కాస్తున్నాయి. మధుశాలల్లోనూ మోహరిస్తున్నాయి. శస్త్ర చికిత్స చేయడంలో వైద్యులకు సాయపడుతున్నాయి. రోబోలు అన్ని చోట్ల కనిపించకపోయినప్పటికీ వాటి ఉనికిని గణనీయంగా చాటుకుంటున్నాయి. సాఫ్ట్ ‌బ్యాంక్‌ ‌సీఈవో మసయోషి సన్‌ ‌టీఎస్‌ఎం‌సీతో కలిసి 1.3 ట్రిలియన్‌ ‌డాలర్లతో రోబోలు, ఏఐ హబ్‌ల నిర్మాణం కోసమని ప్రాజెక్ట్ ‌క్రిస్టల్‌ ‌ల్యాండ్‌ ‌చేపట్టారు. టెస్లా కంపెనీ టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో రోబో ట్యాక్సీని ఆవిష్కరించ డానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. విడియా, ఫాక్స్‌కాన్‌ ‌హూస్టన్‌ ఏఐ ‌సర్వర్‌ ‌ప్లాంట్‌లో హ్యూమ నాయిడ్‌ ‌రోబోలను మోహరించడానికి చర్చలు జరుపుతున్నాయి. అమెజాన్‌ ‌తన గిడ్డంగుల్లో ఏఐ ఆధారిత వుల్కాన్‌ ‌రోబోలను నియమించింది. యావత్‌ ‌లాజిస్టిక్‌ ‌కార్యకలాపాలను యాంత్రీకరణ చేయడం కోసమని 200 బిలియన్‌ ‌డాలర్లను ఖర్చు చేయడానికి ప్రణాళిక చేస్తోంది. ప్రణాళిక సాకారమైన పక్షంలో రానున్న రోజుల్లో డెలివరీ బాయ్‌లకు బదులుగా డెలివరీ రోబోలు మన ఇంటికి వచ్చి కాలింగ్‌ ‌బెల్‌ ‌కొట్టి మరీ సరకులు అందిస్తాయి. అచ్చం మానవ చెయ్యి లాగా పనిచేసే మొట్టమొదటి రోబో చేతిని ఒకానొక చైనా కంపెనీ తయారు చేసింది. హెక్సగాన్‌ ‌కంపెనీ పరిశ్రమల్లో తూనికలు, కొలతలకు సంబంధించిన పనులను చేయడానికి అయోన్‌ అనే హ్యూమనాయిడ్‌ను ఆవిష్కరించింది.

ఉత్పాదకతను పెంచుకోవడంలో పరస్పరం పోటీపడుతున్న భారతీయ కంపెనీలు సైతం తమ వ్యాపారాల్లో రోబోటిక్స్‌ను వినియోగించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. రిలయన్స్ అం‌డదండలు ఉన్న ఏడ్‌వెర్బ్ ‌కంపెనీ ‘3డీ ఉద్యోగాలు’ లేకుండా చేయడానికి హ్యూమనాయిడ్‌ ‌రోబోలను రంగంలోకి దించుతోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్వెంటో కంపెనీ రిటైల్‌, ఆతిథ్య రంగాల్లో సేవలందించడానికి తోడు వయోవృద్ధుల సంరక్షణ కోసమని మిత్రా రోబోలను అభివృద్ధి చేస్తోంది. కోచికి చెందిన అసిమోవ్‌ ‌రోబోటిక్స్ అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో పనులు చేసే రోబోలను తయారు చేస్తోంది. హైదరాబాద్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న స్వయ రోబోటిక్స్ ‌తయారీ, లాజిస్టిక్స్ ‌రంగాల్లో పనుల్లో సాయపడటానికి పారిశ్రామిక రోబోలను అభివృద్ధి చేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న జెనోబోటిక్స్ అనే స్టార్టప్‌ ‌కంపెనీ మురికి కాలువలను శుభ్రం చేయడానికి బాండికూట్‌ ‌రోబోను అభివృద్ధి చేస్తోది. అహ్మదాబాద్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న కోది అనే కంపెనీ నిఘా, కార్యాలయసేవలు, పారిశ్రామిక అవసరాల కోసమని రోబోలను తయారు చేస్తోంది.

రోబో అనే మాట జెక్‌ ‌భాషలో రోబోటా అనే పదం నుంచి వచ్చింది. ఆశ పదానికి వెట్టి చాకిరి అనే అర్థం వస్తుంది. 1921లో జెక్‌ ‌రచయిత కరెల్‌ ‌కాపెక్‌ ఇదే పదంతో రొస్సుమ్స్ ‌యూనివర్శల్‌ ‌రోబోస్‌ అనే సైన్స్ ‌ఫిక్షన్‌ ‌నాటకాన్ని రచించారు. సినిమాల విషయానికి వస్తే 1927లో విడుదలైన మెట్రోపోలిస్‌ ‌సినిమాతో రోబోలు తెరంగేట్రం చేశాయి. భవిష్యత్తులో రెండుగా చీలిపోయిన నగరంలో రకరకాలుగా చెదిరిపోయిన సమాజం గురించి ఈ సినిమా చెబుతుంది. 2007లో బొమ్మలు తయారుచేసే హాస్‌‌బ్రో గ్రహాంతర రోబోలు ఇతివృత్తంగా నిర్మించి, విడుదల చేసిన ట్రాన్స్‌ఫార్మర్స్, అం‌తకుముందు వచ్చిన టెర్మినేటర్‌ ‌సినిమాలు రోబోలకు ఎక్కడ లేని పేరు, ప్రతిష్టలను తీసుకొచ్చాయి.

ఎప్పుడో శతాబ్దం క్రితం నాటక రచయిత కాపెక్‌ ‌పుట్టించిన రోబో అనే పదం నేడు అనితర సాధ్యంకాని విధంగా సాగుతున్న రోబో పరిణామ క్రమానికి బీజం వేసింది. ఈ విషయంలో సాంకేతికత, జ్ఞానం ఏకమై పెట్టుబడులను పట్టుకొస్తున్నాయి.

కేవలం 10 రోజుల వ్యవధిలోనే రోబోలను అభివృద్ధి చేస్తున్న అనేక స్టార్టప్‌ ‌కంపెనీలకు కోట్లాది డాలర్లు పెట్టుబడుల రూపేణా వెల్లువెత్తాయి. రోబో శునకాలు, హ్యూమనాయిడ్‌ ‌రోబోలకు పర్యాయ పదంగా మారిన చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ ‌కంపెనీ 140 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులను దక్కించుకుంది. పీట్స్‌బర్గ్ ‌కేంద్రంగా పనిచేస్తున్న గెకో రోబోటిక్స్ ‌స్టార్టప్‌ ‌కంపెనీ పెట్టుబడుల రూపేణా 125 కోట్ల డాలర్లను రాబట్టింది. పారిశ్రామిక రోబోలను తయారుచేసే స్లోవెనియాకు చెందిన సన్‌రైజ్‌ ‌రోబోటిక్స్‌కు 85 లక్షల డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. విహంగ రోబోలకు పేరొందిన జ్యూరిష్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న వోలిరా కంపెనీ 2 కోట్ల 30 లక్షల డాలర్ల మేరకు పెట్టుబడులను పొందింది. రోబోల ద్వారా మొబైల్‌ ‌ఫోన్లను ప్యాకింగ్‌ ‌చేయడంపైన దృష్టి పెట్టిన ఐరోపాకు చెందిన సోజో ఇండస్ట్రీస్‌ ‌నాలుగు కోట్ల డాలర్లను పొందింది. న్యూయార్క్‌లో డెలివరీ స్టార్టప్‌గా పేరొందిన కోకో రోబోస్‌ ‌డెలివరీ రోబోలను రంగంలోకి దించడానికి పెట్టుబడుల రూపేణా 8 కోట్ల డాలర్లను సమీకరించ గలిగింది. చర్యలో పాల్గొనకుండా చర్యను ప్రభావితం చేసే ఉత్ప్రేరకాలు లాంటి ఏఐ పరిణామ క్రమంలో వేగం, అందుబాటులోకి శక్తిమంతమైన చిప్‌లు, ధరల్లో తగ్గుదల, నైపుణ్యాలు, ఉత్పాదకత ఆవశ్యకతల మేలు కలయిక రోబోలో వాడకాన్ని విస్తృతం చేసింది. ఏఐ అల్గోరిథమ్‌లు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటీకీ అప్పటికప్పుడు అందివచ్చిన డేటాను విశ్లేషించడంలోనూ, సత్వరం స్పందించడంలోనూ, క్లిష్టమైన పనులను సైతం సులువుగా చక్కబెట్టడం లోనూ రోబోలకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. మెషిన్‌ ‌లెర్నింగ్‌ ‌రోబోలకు సమర్థవంతంగా పనిచేయడంలో తోడ్పడుతోంది.

అయితే పెద్ద ఎత్తున రోబోలను అభివృద్ధి చేసి వాటిని విస్తృతంగా వాడటానికి అడ్డుపడే పెద్ద అవాంతరంగా నైపుణ్యంతో కూడుకున్న మానవ వనరుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కోమ్‌ ‌ఫెర్రీ నివేదిక ప్రకారం రోబోల ఉత్పాదకతకు సంబంధించి 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యంతో కూడుకున్న 8.5కోట్ల ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగా పడి ఉంటాయి. వయోవృద్ధుల జనాభా అంతకంతకు పెరిగిపోతున్న దేశాల్లో ప్రతీ 10 వేల ఉద్యోగుల్లో రోబోల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతోంది. ఆ లెక్కన దక్షిణ కొరియాలో ప్రతీ 10 వేల ఉద్యోగుల్లో రోబోల సంఖ్య 1,102 ఉండగా, అదే నిష్పత్తిలో సింగపూర్‌లో 770, చైనాలో 470, జర్మనీలో 429, జపాన్‌లో 419 రోబోలుగా ఉంది. గడిచిన ఏడేళ్లలో అంతర్జాతీయంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న రోబోల సంఖ్య రెండింతలు అయ్యింది. రోబోల ప్రస్తుత మార్కెట్‌ ‌విలువ 64.8 బిలియన్‌ ‌డాలర్లు కాగా 2035నాటికి అది 375.82 బిలియన్‌ ‌డాలర్లకు చేరుకుంటుందని ఓ అంచనా.

అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేథ-ఏఐ ఆధారిత రోబోల వినియోగం నానాటికి పెరిగిపోతుండటం సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మనుష్యులు చేయాల్సిన పనుల్లో చాలావరకు రోబోలు చేస్తున్న కారణంగా ఉన్న ఉపాధిని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కనుమరుగైపోయే ముప్పు అయితే ముంచుకొస్తోంది. టెస్లా, ఫాక్స్‌కాన్‌ ‌కంపెనీలు ఇటీవలి సంవత్సరాల్లో సిబ్బందిని తగ్గించుకున్నాయి. క్లార్నా, యూపీఎస్‌, ‌డూలింగో, ఇన్‌ట్యూట్‌, ‌సిస్కో లాంటి కార్పొరేట్‌ ‌కంపెనీలు ఉద్యోగుల స్థానాన్ని ఏఐ యాంత్రీకరణతో భర్తీ చేస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్యపై కోత విధిస్తామని అమెజాన్‌ ‌సీయీవో ఆండీ జస్సీ ఈమధ్యనే సెలవిచ్చారు. ఏఐ ఆధారిత రోబోలను కేవలం వయోవృద్ధుల జనాభా అధికంగా ఉన్న దేశాలు మాత్రమే విస్తారంగా వినియోగించుకుంటున్నాయని అంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే యువతతో పాటుగా 30 ఏళ్ల లోపు వయస్సున్న వారి జనాభా అత్యధికంగా ఉన్న భారత్‌, ‌మెక్సికో లాంటి దేశాలు రోబోలను విరివిగా వాడుకోవడంలో ఏ మాత్రం తగ్గడంలేదు కాబట్టి. ప్రపంచ బ్యాంకు చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం ఏఐ ఆధారిత సాంకేతికత ఆర్థికంగా పురోగమించిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలను, ఆర్థికంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నఎ దేశాల్లో 40 శాతం ఉద్యోగాలపై పెను ప్రభావం చూపిస్తాయి. సాకేతికత ఉద్యోగాలను సైతం సృష్టిస్తుంది అన్న మాటే నిజమే కానీ అదే సమయంలో అందుకోసమని అది సంప్రదాయ ఉద్యోగాలను పణంగా పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE