సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి – 01 జూన్ 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
అధీన రేఖలన్నీ అదుపులోనే ఉండాలి. పొలిమేరల పొడవునా..నిఘా నేత్రాలను మోహరించాలి. లేదంటే శతృ దేశాలు కంచెలుదాటి దేశంలోకి ప్రవేశించి, దుర్ఘటనలను పరిచయం చేస్తాయంటారు. ప్రతి సరిహద్దును సురక్షితంగా ఉంచుకున్నప్పుడే, వైరి దాడిని తట్టుకోగమంటాడు యుద్ధ నిపుణుడు క్లాస్ విట్జ్. కానీ దురదృష్టావశాత్తు మన దేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో తిష్ఠవేసిన పాలకులు…భౌగోళిక యుద్ధ ఉద్రిక్తల సమయంలో ప్రమాదాలను గుర్తించడం లేదు. గుర్తించినా… తమ ప్రాబల్యం, ప్రాపకం, అహంకారం దెబ్బతింటుందని వాస్తవ స్థితిని గుర్తించ నిరాకరిస్తున్నారు.
సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో దశాబ్దన్నర కాలంపాటు అధికారం చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సరిగ్గా ఇదే చేసింది. సిలిగురి కారిడార్‌లోని 122 కి.మీ జాతీయ రహదారులను అప్పగించడంలో మంకుపట్టి పట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్న రాజకీయ వైరం కోసం సిలిగురిలోని ఏడు జాతీయ రహదారులను అప్పగించ నిరాకరించింది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమత ఘోర ఓటమిని చవిచూసింది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే…ఆగమేఘాలమీద వ్యూహాత్మక ప్రాంతమైన చికెన్ నెక్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాలలో 120 ఎకరాలకు పైగా భూమి, జాతీయ రహదారి మార్గాలను బీఎసఎఫ్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. చికెన్‌నెక్‌ను బీఎసఎఫ్‌కు అప్పగించడంతో ఇక సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ లేని ప్రాంతాలలో బీఎసఎఫ్‌కు భూమి లభించడం వల్ల, వ్యూహాత్మక వాచ్ టవర్ల ఏర్పాటు, పెట్రోలింగ్ కోసం రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.
1947లో సిరిల్ రాడ్ క్లిఫ్ ఆధ్వర్యంలో జరిగిన సరిహద్దుల గుర్తింపులో కుట్ర పూరిత వ్యూహం ఉంది. 1947లో సిరిల్ రాడ్ క్లిఫ్ భారతదేశాన్ని సందర్శించకుండానే 45 రోజుల్లో విభజన రేఖలు గీశారు. అప్పట్లో మన పాలకులు వాయువ్య సరిహద్దులపై పెట్టిన దృష్టిని బెంగాల్ విభజనపై పెట్టలేదు. నిజానికి చిట్టగాంగ్ ప్రాంతంలో 90% హిందువులు ఉండేవారు. ఇది శతాబ్దాలుగా త్రిపుర రాజ్యంతో ముడిపడి ఉండేది. కానీ, చివరి నిమిషంలో బ్రిటీష్ పాలకులు చిట్టగాంగ్ ను తూర్పు పాకిస్థాన్ కు కట్టబెట్టారు. దీనివల్ల ఈశాన్య భారతం తన సహజసిద్ధమైన సముద్ర మార్గాన్ని కోల్పోయింది. అంతే కాదు, సిలిగురి కారిడార్‌ను మనకో సవాలుగా, ప్రత్యామ్నాయం లేనిదిగా మార్చడంలో రాడ్ క్లిఫ్ తన కుట్రను విజయవంతంగా అమలు చేశాడు. తూర్పు పాకిస్థాన్ ఆవిర్భావంతో ఈశాన్య ప్రాంతానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయి ‘చికెన్ నెక’ మాత్రమే ఏకైక ఆధారమైంది.
నాడు అధికారంలో ఉన్న నెహ్రూ ప్రభుత్వానికి చైనా తెగబడేదాకా వ్యూహాత్మక ప్రాంతమైన ‘చికెన్ నెక’ ప్రాధాన్యత అర్థం కాలేదు. మన ప్రత్యర్థి అతిచిన్న మార్గాన్ని స్వాధీనంలో ఉంచుకుంటే మొత్తం ఈశాన్య రాష్ట్రాలే చైనా వశమవుతాయని 1962లో తెల్లారింది. బీజింగ్ మీదపడిపోయాక అప్పుడు కళ్లు తెరిచారు నెహ్రూ. అంటే అప్పటిదాకా మన సరిహద్దులు, వ్యూహాత్మక భూభాగాల గురించి నాటి ప్రధానికి ఏమాత్రం పట్టింపు, అవగాహన లేదు.
1962 యుద్ధం తర్వాత సిలిగురి కారిడార్‌లోని ఏడు ముఖ్యమైన జాతీయ రహదారులను కేంద్ర సంస్థలైన ఎన్.హెచ్.ఏ.ఐ, ఎన్.హెచ్.ఐ.డి.ఎల్ సంస్థల పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది యాంత్రికమైన, తూతూ మంత్రపు నిర్ణయం. ఎందుకంటే… ఆ తర్వాత వ్యూహాత్మక ప్రాంతంలో రక్షణ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ జరగలేదు. 2000 సంవత్సరం తర్వాత చికెన్‌నెక్ ప్రాంతం నుంచి అస్సాం, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోకి అక్రమ వలసదారులు చొరబడ్డారు. సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 22 కిలోమీటర్ల ప్రాంతానికి అంతర్జాతీయ సరిహద్దు ఉంది. చికెన్‌నెక్‌కు పశ్చిమాన నేపాల్, ఉత్తరాన భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్, తూర్పున ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి.
హోం శాఖ 2019 నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్ నుండి సుమారు 1.5 కోట్ల మంది అక్రమ వలసదారులు భారతదేశంలోకి ప్రవేశించారని అంచనా. బీఎసఎఫ్ లెక్క ప్రకారం 2017-2019 మధ్య 4,000 మంది రోహింగ్యాలు ఈ మార్గం గుండా భారత్‌లోకి వచ్చారు. సిక్కిం సరిహద్దుకు సమీపంలోని చుంబీ లోయలో చైనా సైనిక స్థావరాలను విస్తరించింది. బీజింగ్ ఈ ప్రాంతంలో రోడ్లు, హెలిప్యాడ్‌లు, ఆయుధ గిడ్డంగులు నిర్మిస్తోందని 2021లో బయటపడిన శాటిలైట్ చిత్రాలు ఖరారు చేశాయి.
సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ లేని ప్రాంతాలలో బీఎసఎఫ్‌కు భూమి లభించడం వల్ల అత్యాధునిక నిఘా కెమెరాలు, రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. కేంద్రం రాబోయే రోజుల్లో ఈ 122 ఎకరాల భూమి పరిధిలో అండర్ గ్రౌండ్ రైల్వే ప్రాజెక్టులు…సరిహద్దు బలగాలకు అవసరమైన లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయనుందనే అంచనాలున్నాయి. చైనా దాడిని తట్టుకునేలా పటిష్ఠమైన భద్రతా వలయాన్ని నిర్మించే అవకాశం ఉంది. వ్యూహాత్మక అవసరాలను ముందే అంచనా వేసిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో కలదాన్ మల్టీ-మోడల్ ప్రాజెక్ట్, మైత్రీ సేతు ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయిచింది. ఈ రెండు ప్రాజెక్టులు అత్యంత వ్యూహాత్మకమైనవి. మన దేశానికి ఉన్న తొమ్మిది భూ, సముద్ర సరిహద్దులను పటిష్టం చేసే పకడ్బందీ పథక రచన చేస్తోంది. ఈ ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.