అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ (జన్మహక్కు పౌరసత్వం) నియంత్రణ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కొట్టివేసింది. జూన్ 30, 2026 నాటి ఈ తీర్పు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలకు చట్టపరమైన ఎదురుదెబ్బగా నిలిచింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి బిడ్డకు యాంత్రికంగా పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్నప్పటికీ, వారి పిల్లలు అమెరికా భూభాగంలో పుడితే వారు పౌరసత్వానికి పూర్తిగా అర్హులని ప్రధాన న్యాయవ•ర్తి జాన్ రాబర్టస్ స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఈ పౌరసత్వ హక్కును కేవలం ఒక అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా రద్దుచేయడం లేదా సవరించడం సాధ్యంకాదని కోర్టు తేల్చిచెప్పింది.
విదేశీ దౌత్య అధికారులు, శత్రు దేశాల సైనికుల పిల్లలకు మాత్రమే ఈ జన్మహక్కు పౌరసత్వం వర్తించదు. రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అమెరికా వలస చట్టాలను కఠినతరం చేయాలని చూశారు. ఆయన ప్రధాన ఎన్నికల హామీలలో ఒకటైన ‘అక్రమ వలసల నిరోధానికి’ ఈ తీర్పు పెద్ద బ్రేక్ వేసింది. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఈ 14వ సవరణను ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన ఇమ్మిగ్రేషన్ విధానంగా గతంలో విమర్శించారు. తాజా తీర్పుతో వారి రాజకీయ, పరిపాలనా వ్యూహాలకు కోర్టు చెక్ పెట్టినట్టయింది. ఈ తీర్పు అమెరికాలో తాత్కాలిక వీసాలపై (హెచ్-1బి వంటివి) నివసిస్తున్న లేదా స్థిరపడిన లక్షలాది మంది భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల కుటుంబాలకు ఒక పెద్ద ఊరట నిచ్చిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. వారి పిల్లల భవిష్యత్తు పౌరసత్వ భద్రతపై ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి.
నవంబర్ ఎన్నికలపై ప్రభావం
సుప్రీంకోర్టు తీర్పు రానున్న నవంబర్ ఎన్నికల కోసం డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అనుసరించే వ్యూహాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కోర్టులో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ట్రంప్ సరికొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే, కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ద్వారా కొత్త చట్టాన్ని తీసుకువచ్చి జన్మహక్కు పౌరసత్వాన్ని నియంత్రిస్తామని ఆయన ఓటర్లకు హామీ ఇస్తున్నారు. నవంబర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇస్తేనే ఇది సాధ్యమవు తుందంటున్నారు. ఈ తీర్పును ట్రంప్ ఒక వైఫల్యంగా కాకుండా, తమ మద్దతుదారులను రెచ్చగొట్టే ఆయుధంగా వాడుకుంటున్నారు! ‘‘న్యాయ స్థానాలు సరిహద్దులను, దేశ భద్రతను కాపాడలేక పోతున్నాయి’’ అని ప్రచారంతో, వలస వ్యతిరేక ఓటర్లను భారీగా పోలింగ్ బూత్‌లకు రప్పించడానికి రిపబ్లికన్ పార్టీ దీనిని ఉపయోగించుకోనుంది. అమెరికా ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే ‘స్వింగ్‌స్టేట్స్’లో స్వతంత్ర ఓటర్లతో పాటు విద్యావంతులైన రిపబ్లికన్ ఓటర్లు ఉన్నారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ట్రంప్ చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు ఈ తటస్థ ఓటర్లను దూరం చేయవచ్చు. రాజ్యాంగ నిబంధనలను ట్రంప్ గౌరవించడం లేదనే డెమొక్రాట్ల ప్రచారానికి ఇది బలం చేకూరుస్తుంది. ఈ తీర్పు చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయ-అమెరికన్లు, హిస్పానిక్‌లు, ఇతర ఆసియా దేశాల వలసదారులకు పెద్ద ఊరటనిచ్చింది. డెమొక్రాటిక్ పార్టీ నాయకులు సహజంగానే ఈ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ట్రంప్ విధానాలు రాజ్యాంగ విరుద్ధమని నిరూపించడానికి వారు ఈ తీర్పును ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వాడుకుంటున్నారు. మొత్తంగా చూస్తే, ఈ తీర్పు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఎజెండాకు చట్టపరమైన అడ్డంకిగా మారినప్పటికీ, నవంబర్ ఎన్నికల ప్రచారంలో దీనిని ‘‘వలసల నియంత్రణ వర్సెస్ రాజ్యాంగ రక్షణ’’ అనే అతిపెద్ద రాజకీయ యుద్ధంగా మార్చడానికి ఇరుపక్షాలు సిద్ధమవుతున్నాయి.
భావజాల యుద్ధం
ఎన్నికల్లో ఈ అంశం కేవలం చట్టపరమైన వివాదంగా మిగిలిపోకుండా, అమెరికా భవిష్యత్తును నిర్ణయించే ఒక భావజాల యుద్ధంగా మారి పోయింది. డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ ఈ తీర్పును చూపించి, ‘‘ఓపెన్ బోర్డర్’’ (రక్షణ లేని సరిహద్దులు) విధానాల వల్ల అమెరికాకు ముప్పు పొంచి ఉందనే భయాన్ని ఓటర్లలో పెంచుతున్నారు. అక్రమంగా దేశంలోకి వచ్చేవారు ఈ జన్మహక్కు పౌరసత్వాన్ని (యాంకర్ బేబీస్) ఒక లొసుగులా వాడుకుంటున్నారని, దీనిని అడ్డుకోవడానికి తమకు ఓటు వేయాలని ట్రంప్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. డెమొక్రాట్లు ఈ తీర్పును ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణిస్తున్నారు. 14వ సవరణ అనేది అమెరికా పునాది అని, అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆదరించే దేశమని, ట్రంప్ ధోరణి ఉపాధి కోసం వచ్చే కష్టజీవుల హక్కులను కాలరాస్తోందని వారి వాదన. ఈ రాజకీయ యుద్ధం కేవలం అధ్యక్ష ఎన్నికలనే కాకుండా, అదే సమయంలో జరిగే అమెరికా కాంగ్రెస్ ఎన్నికలను కూడా తీవ్రంగా ప్రభావితం చేయనుంది. చట్టాలు చేసే అధికారం ఏ పార్టీకి దక్కుతుందనేది ఈ ప్రచారంపైనే ఆధారపడి ఉంటుంది.
ట్రంప్ ‘ప్లాన్-బి’ చట్టం అసాధ్యం
డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘ప్లాన్-బి’ చట్టం (సాధారణ పార్లమెంట్ చట్టం ద్వారా జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడం) ప్రస్తుతం అసాధ్యమనే చెప్పాలి. సుప్రీంకోర్టు తాజా చారిత్రిక తీర్పు తర్వాత ఈ వ్యూహం దాదాపు మూసుకుపోయినట్టేనని మెజారిటీ రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. సుప్రీం కోర్టులోని 6గురు న్యాయమూర్తులలో 5 గురు ఈ జన్మహక్కు పౌరసత్వం అనేది 14వ రాజ్యాంగ సవరణ పరిధిలోకి వస్తుందని స్పష్టంగా తీర్పునిచ్చారు. అమెరికా చట్టాల ప్రకారం రాజ్యాంగంలో ఉన్న ఒక హక్కును కేవలం పార్లమెంట్‌లో ఒక సాధారణ చట్టం ఆమోదించి మార్చడం కుదరదు. దానికి కేవలం రాజ్యాంగ సవరణ మాత్రమే ఏకైక మార్గం. ఒకవేళ ట్రంప్ నిజంగానే రాజ్యాంగాన్ని సవరించాలి అనుకుంటే, అందుకు అమెరికా పార్లమెంట్‌లోని ఇరు సభలలో మూడింట రెండువంతుల మెజారిటీ కావాలి. ఆ తర్వాత అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో కనీసం వ•డువంతుల రాష్ట్రాలు (38 రాష్ట్రాలు) దీనిని ఆమోదించాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రిపబ్లికన్లకు అంత మెజారిటీ రాకపోవచ్చు. ట్రంప్ ప్లాన్-బికి జస్టిస్ బ్రెట్ కావానాఫ్ ఇచ్చిన ప్రత్యేక నోట్ ఆధారం. ఆయన తన తీర్పులో ‘‘ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, కేవలం ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ ఫెడరల్ చట్టాల ఉల్లంఘన మాత్రమే, కాబట్టి కాంగ్రెస్ చట్టాన్ని మార్చవచ్చు’’ అనిపేర్కొన్నారు. మిగిలిన అయిదుగురు న్యాయవ•ర్తులు ఇది నేరుగా రాజ్యాంగ ఉల్లంఘనే అని తేల్చారు. కాబట్టి రేపు కాంగ్రెస్ చట్టం తెచ్చినా, కోర్టు మళ్లీ 5-4 మెజారిటీతో దానిని కొట్టేస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలిచినా వారికి స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అమెరికా సెనేట్‌లో ఏదైనా వివాదాస్పద చట్టం పాస్ అవ్వాలంటే 60 ఓట్ల మెజారిటీ అవసరం. డెమొక్రాట్లు దీనిని అడ్డుకుంటారు కనుక చట్టం కాకపోవచ్చు. అందువల్ల ట్రంప్ చెప్తున్న ‘ప్లాన్-బి’ అనేది రాజకీయంగా ఓటర్లను ఆకర్షించడానికి, నవంబర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఓట్లు వేయించుకోవడానికి ఒక ప్రచార అస్త్రం మాత్రమే.
కింగ్ మేకర్స్‌గా భారతీయ-అమెరికన్ ఓటర్లు!
రాబోయే నవంబర్ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు అత్యంత కీలకమైన ‘కింగ్ మేకర్స్’గా మారబోతున్నారు. అమెరికా జనాభాలో వీరు దాదాపు 52 లక్షల మంది ఉండగా, అందులో 26 లక్షల మందికి పైగా ఓటు హక్కు ఉంది. భారతీయ-అమెరికన్ ఓటర్లలో దాదాపు మూడోవంతు (1/3) మంది ఎన్నికల ఫలితాలను మార్చే పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, మిచిగాన్ వంటి ‘స్వింగ్ స్టేట్స్’ లోనే నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న లక్షలాది భారతీయ ఓట్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీయే విజయం సాధిస్తుంది. తాజా సర్వేల ప్రకారం (రాబోయే ఎన్నికల వ•డ్ ఆధారంగా), ఇప్పటికీ 46%-50% మంది భారతీయ ఓటర్లు డెమొక్రాటిక్ పార్టీ వైపు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తమ పిల్లల జన్మహక్కు పౌరసత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడాన్ని వారు స్వాగతించారు.
రిపబ్లికన్ పార్టీకి పెరిగిన భారతీయుల మద్దతు
గతంతో పోలిస్తే రిపబ్లికన్ పార్టీ (డొనాల్డ్ ట్రంప్) వైపు మొగ్గు చూపే భారతీయుల సంఖ్య 16% నుండి దాదాపు 28%-31%కి పెరిగింది. పౌరసత్వం పొంది, అమెరికాలో స్థిరపడిన ధనిక భారతీయ వ్యాపారవేత్తలు, ఐటీ నిపుణులు, ట్రంప్ ప్రతిపాదిస్తున్న పన్ను తగ్గింపులు, ఆర్థిక విధానాలు, కఠినమైన శాంతిభద్రతల వైపు ఆకర్షితులవుతున్నారు. భారతీయ సంతతి నేతలు ట్రంప్ పక్షాన నిలవడం కూడా రిపబ్లికన్లకు కలిసి వస్తోంది.
అమెరికాలో ప్రస్తుతం 12 లక్షలమందికి పైగా భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్నారు. లీగల్ ఇమ్మిగ్రేషన్ (హెచ్-1బి వీసా) ద్వారా వచ్చి దేశానికి సేవలందిస్తున్న తమను కాకుండా, అక్రమ వలసదారులకు డెమొక్రాట్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి కొంతమంది భారతీయ వలసదారులలో ఉంది. ఈవర్గం ట్రంప్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అమెరికాలో అత్యధిక సగటు వార్షిక ఆదాయం ఉన్న సంపన్న సమాజం భారతీయులదే. ఇరు పార్టీల ఎన్నికల ప్రచారాలకు మిలియన్ల డాలర్ల ఫండ్స్ ఇవ్వడంలో భారతీయ-అమెరికన్లు ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, తమ కుటుంబాల భద్రతను కోరుకునే సాధారణ భారతీయ ఓటర్లు డెమొక్రాట్ల వైపు నిలిచేలా కనిపిస్తున్నప్పటికీ, ధనిక వర్గం ట్రంప్ వైపు మొగ్గు చూపుతోంది. ఏదేమైనా, నవంబర్ ఎన్నికల తుది ఫలితాలను నిర్ణయించడంలో భారతీయ ఓట్లు అత్యంత కీలకం కాబోతున్నాయి.
‘‘యాంకర్ బేబీస్’’ వివాదం
అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై వచ్చే వలసదారుల పిల్లలను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ‘2015 నుండి ఉపయోగిస్తున్న ‘‘యాంకర్ బేబీస్’’ అనే పదం వివాదాస్పదమైంది. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత (జూలై 2026) నార్త్ డకోటాలోని మెడోరాలో మాట్లాడిన ట్రంప్ ‘‘14వ రాజ్యాంగ సవరణ అనేది కేవలం అంతర్యుద్ధం తర్వాత విముక్తి పొందిన ఆఫ్రికన్ బానిసల పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం కోసం మాత్రమే ఉద్దేశించింది. కానీ దీనిని దుర్వినియోగం చేస్తున్నారు’’ అని వాదించారు. ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పు తర్వాత సరికొత్త ఆంక్షలను ప్రతిపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో తాను ‘‘యాంకర్ బేబీస్’’అనే పదాన్ని కచ్చితంగా వాడుతానని, తన దృష్టిలో ఇది సరైన పదం అని తేల్చిచెప్పారు. అమెరికాలో స్థిరపడటానికి తల్లిదండ్రులు వేసే ఒక ‘‘యాంకర్’’ (ఆసరా) లాగా పసిపిల్లలను చిత్రీకరించడం, ఆ పిల్లలను మనుషు లుగా కాకుండా ఒక వస్తువులా చూడటమేమిటని హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్