భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
కారు డ్రైవ్ చేస్తున్నాడన్నమాటే గాని శ్రీధర్ మనసు మనసులో లేదు. నిండా నాలుగేళ్లయినా లేని తన చిన్నకొడుకు అన్న మాట, దానికి ఎనిమిదేళ్ల పెద్దవాడు నవ్విన నవ్వు, ఇచ్చిన జవాబు అతణ్ణి వెంటాడుతున్నాయి. పట్టుమని పదేళ్లయినా లేని,పరస్పరం ఎంతో స్నేహంగా ఉండవలసిన అన్నదమ్ములు…ఆఫ్ట్రాల్ టీవీ కోసం ఎలాంటి మాటలు విసురుకుంటున్నారు?! ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఒకరికొకరుగా బతుకు తారా? ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటారా..?!
శ్రీధర్‌కి తెలుసు, తన భయాలు విని నలుగురూ నవ్వుతారని.‘‘ఏ కాలంలో ఆలోచిస్తున్నావయ్యా…ఈ రోజుల్లో ఏ అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా కలసి మెలసి ఉంటున్నారో చూపించు!’’ అంటారు. కాని, తన ఆలోచనలు..కోరికలు వేరు. తన కడుపున పుట్టిన పిల్లలిద్దరూ ఎప్పటికీ ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండాలి. ఒకరికొకరు చేయూతనిచ్చుకోవాలి. ఒకరికి కష్టం కలిగితే మరొకరు ఆదుకోవాలన్నది తన ప్రగాఢవాంఛ. అందుకే భార్గవి ‘ఒక్కడు చాలంటున్నా’, ఇద్దరిని కన్నాడు! ఆ ఇద్దరూ ఏనాడూ స్నేహంగా కబుర్లు చెప్పుకోరు. బద్ధశత్రువుల్లా పోట్లాడుకుంటారు. ఇవాళైతే మరీనూ. చూడబోతే, ఇద్దరు మగపిల్లలు స్నేహంగా ఉండగలరు గాని అన్నదమ్ములుగా మాత్రం ఆ స్నేహాన్ని పంచుకోలేరు కాబోలనిపిస్తోంది.
‘‘పిల్లలు తెలిసీ తెలియకా ఏదో మాట్లాడుతూ ఉంటారు.అవన్నీ పట్టించుకుంటారెందుకు..?!’’ అని భార్గవి మందలించినా అతని మనసులో మాత్రం పిల్లల ప్రవర్తన, ఆ నేపథ్యంలో మరేవో జ్ఞాపకాలు గింగిరాలు తిరుగుతున్నాయి. అస్పష్టంగా ఒక పదిహేనేళ్ల కుర్రాడి రూపం కనిపిస్తోంది. ‘‘దొంగ వెధవా.. చావు’’ అంటూ తన మీదకి కత్తి విసురు తోంది. తను భయంతో పక్కకి గెంతుతున్నాడు.
ఎన్నాళ్లయింది తను ఆ పదిహేనేళ్ల కుర్రవాడిని… తన సొంత అన్నని మర్చిపోయి? కచ్చితంగా ఆరేళ్లు! అమ్మానాన్నా పోయాక, ఈ ఆరేళ్లలో తను ఒక్కసారి కూడా వాణ్ణి తలచుకున్న గుర్తు లేదు. బతికున్నంత కాలం కొడుకు కోసం వాళ్లు ఏడ్చారు గాని..తను అంత యాతన పడిన జ్ఞాపకవ• లేదు. ఎప్పుడైనా వాడు గుర్తొస్తే బాధగా అనిపించేదంతే. కాని, ఇవాళ తన కొడుకులిద్దరి మాటలూ విన్న తర్వాత… వాళ్లిద్దరూ పెద్దయ్యాక ఒకరితో ఒకరు ఆప్యాయంగా.. ప్రేమగా ఉండరనే భయం కలిగాక, ఒక్కసారిగా అన్నయ్య గుర్తొచ్చాడు. కనబడకుండా పోయిన అన్నదమ్ముణ్ణి వెతికేందుకు తను కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదన్న మాట బాణపు ములికు గుచ్చుకుని, ‘నువ్వు నీ అన్నదమ్ముడి కోసం ఏం చేశావు గనక’ అని ఎత్తిపొడుస్తోంది.
తండ్రికి తనూ, కేశవా..ఇద్దరే. వాడు సరిగ్గా చదివేవాడు కాదు. స్కూలు ఎగ్గొట్టి మరీ ఆటలాడుతూ ఉండేవాడు. తండ్రికి చదువంటే ప్రాణం. బాగా చదువుకోమని కేశవని సున్నితంగానే మందలించే వాడు. కేశవ కించిత్తూ పట్టించుకునేవాడు కాదు. మరోవైపు తనకి అన్నీ ఫస్టుమార్కులే. స్కూల్లో అందరూ తనని పొగుడుతూ ‘‘మీ తమ్ముణ్ణి చూసి నేర్చుకోరా’’ అని కేశవని తిట్టేవారు.వాడు అందుకు బాధపడేవాడు కాదు సరికదా, నాకు మంచి మార్కు లొస్తున్నందుకు సంతోషించేవాడు. ‘‘నువ్విలాగే బాగా చదువుకోరా! నాన్న సంతోషిస్తారు’’ అనేవాడు.
తనకి మాత్రం వాడిని నలుగురూ తిడుతూంటే సిగ్గనిపించేది. తను కూడా మంచి మార్కులు తెచ్చుకుంటే బావుణ్ణు కదా అనిపించేది. నెమ్మదిగా తను కూడా వాడికి చదవమని చెప్పడం ప్రారంభిం చాడు. అంతమంది చెప్పినా పట్టించుకోనివాడు, తను చెప్పేసరికి మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయి పోయాడు. ‘‘గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని, నువ్వు నాకు సుద్దులు చెప్పక్కర్లేదొరేయ్. నీ చదువేదో నువ్వు చూసుకో చాలు!’’ అన్నాడు. అలా కొన్నాళ్లయ్యాక, వాడి టెన్త్ క్లాసు రిజల్టస్ వచ్చాయి. పేపర్లో వాడి నంబరు లేదు. పరీక్ష పోయింది. ఎప్పుడూ అత్తెసరు మార్కుల్తోనైనా పాసయ్యేవాడు.అలాంటిది ఏకంగా బోర్డు పరీక్ష పోయేసరికి వాడికే కళ్లంట నీళ్లొచ్చేశాయి.
అప్పుడే తను గబుక్కున, ‘‘కనీసం పరీక్షల ముందు బాగా చదివినా బావుండేది!’’ అన్నాడు.
ఆ మాటకి వాడు పరశురాముడే అయి పోయాడు. ఆపుకోలేని క్రోథావేశంతో, ‘‘నా జోలికి రావద్దన్నానా…దొంగవెధవా..చావు!’’ అంటూ పక్కనే ఉన్న చాకు తీసి తన మీదికి విసిరేశాడు. తను చప్పున పక్కకి గెంతాడు. దాంతో గుండెలకి తగలాల్సిన కత్తి వచ్చి జబ్బకి గుచ్చుకుని బొటబొటా రక్తం కారడం ప్రారంభించింది. అంతే, తను పెద్ద పొలికేక పెట్టడం, కేశవ బాణంలా బైటికి పరిగెత్తడం ఒక్కసారి జరిగాయి. అలా వెళ్లినవాడు మరింక ఇంటికి తిరిగి రాలేదు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చినా, నాలుగు సార్లు పేపర్లో వేయించినా ఫలితం లేకపోయింది. పెద్దకొడుకు కనబడకుండా పోయాడన్న బాధతోనే అమ్మా నాన్నా చనిపోయారు. వాళ్లు పోయాక తను కేశవని ఇంచుమించు పూర్తిగా మర్చిపోయాడు. తోడబుట్టినవాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అన్న ఆలోచన కూడా తనకి లేకపోయింది.
ఈ రోజు పొద్దున్న తను ఆలస్యంగా లేచి, హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. పిల్లలకి సెలవు. ఇద్దరూ టీవీ ముందు కూచుని రిమోట్ కోసం పోట్లాడుకుంటున్నారు. వాళ్ల గోల తను పట్టించుకో లేదు.
ఉన్నట్టుండి నాలుగేళ్లయినా లేని చిన్నవాడు ఒక్క కేక పెట్టాడు. ఏమిటా అని చూస్తే, వాడు అన్న మీద అరుస్తు న్నాడు..‘‘నన్ను టీవీ చూడనివ్వవా? టీవీ నీకేనా…నేను చచ్చిపోవాలా? నేను చచ్చిపోతే నీకు హేపీయా..?! టీవీ నువ్వొక్కడివే చూస్తావా’’ ఆ మాటకి ఎనిమిదేళ్ల పెద్దవాడు పకపకా నవ్వుతూ, ‘‘చచ్చిపోతావా.. చచ్చిపోరా చూద్దాం!’’ అన్నాడు. వాళ్లిద్దరి మాటలూ విని తను కొయ్యబారిపోయాడు. అప్పటినుంచీ తన మనసు మనసులో లేదు. పాతికేళ్ల కిందట మాయమైపోయిన అన్నదమ్ముడే కళ్లలో మెదులుతున్నాడు.
తన పిల్లల గురించీ, మాయమై పోయిన తన అన్న గురించీ చెదురు మదురుగా ఆలోచిస్తూ ఎలాగో స్నానం చేసి టిఫిన్ తిన్నాడు శ్రీధర్. ఆఫీసులో ఇంటర్వ్యూలున్నాయి. డ్రైవర్ రాజు ఆఫీసు కారు తీసుకురాగానే బయల్దేరాడు. రాజుకి శ్రీధర్ దగ్గర బాగా చనువు. తన కుటుంబం గురించి కూడా శ్రీధర్‌కి చెబుతూ ఉంటాడు. కార్లో రాజుని చూడగానే శ్రీధర్‌కి అతనితో మాట్లాడాలనిపించింది.
‘‘రాజూ, నువ్వూ మీ తమ్ముడూ కలిసే ఉంటున్నారు కదూ!’’ అంటూ ప్రారంభించాడు.
‘‘అవున్సార్, వాడి దారిన వాణ్ణి వదిలేస్తే, డబ్బంతా తాగుడుకే తగలేత్తాడు. కుటుంబంలో అందరూ పస్తులుండాల! అందుకే తెచ్చి నా దగ్గర పెట్టుకున్నా. నేనంటే కాస్త బయం ఎదవకి!’’
‘‘నీకు డబ్బులిస్తూ ఉంటాడా?’’
‘‘ఆ..ఇత్తాడు సార్. దాచిపెడతా ఉంటాను. తాగుడు కూడా తగ్గింది. మా తమ్ముడు మంచోడే సార్. ఆడు తాగకండా ఉన్నప్పుడు నెమ్మదిగా సుద్దులు చెబతా ఉంటా. ఆడి కూతురు పెద్దదవతాంది. పెళ్లి చెయ్యాల.. డబ్బు ఎనకెయ్యాల అని చెబ్తూంటా. ఇంటాడు’’
శ్రీధర్‌కి మనసు కాస్త చల్లబడిరది. అవునంతే. అన్నదమ్ములు ఒకరికొకరుగా బతకాలి. లక్ష్మణుడేం చేశాడు? కైకమ్మ రాముణ్ణొక్కణ్ణే అడవికి పొమ్మన్నా తను కూడా అన్నతో బాటు వెళ్లిపోయాడు. సుమిత్ర కూడా రాముణ్ణి తండ్రిగా భావించి సేవించుకోమని కొడుక్కి హితబోధ చేసింది గాని ‘నీకెందుకు నువ్వు హాయిగా ఇక్కడుండి రాజభోగాలు అనుభవించు’ అనలేదు. రామాయణం భారతీయులకి కుల భూషణం. మార్గదర్శక గ్రంథం. అన్నదమ్ములంతా రామలక్ష్మణుల్లా ఉండాల్సిందే! ఇవాళే నాలుగు దినపత్రికలకి ఫోన్ చేసి కేశవ గురించి ప్రకటన ఇవ్వాలి. గట్టిగా పట్టుబడితే కేశవ దొరక్కపోడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అన్నయ్య!
శ్రీధర్ తన ఛాంబర్‌కి వెళ్లేసరికి అప్పటికే వచ్చి ఉన్న గిరి పలకరించాడు. ఇంటర్వ్యూ పానల్‌లో శ్రీధర్, గిరి, రజిత ఉన్నారు.
‘‘మేడమ్ ఇంకా రాలేదా..’’ శ్రీధర్ అడిగాడు
‘‘ఇంట్లో అందరికీ సేవలు చేసి రావొద్దూ’’ గిరి వెటకరించాడు
శ్రీధర్ నవ్వి, సీట్లో వెనక్కి వాలుతూ, ‘‘ధాంక్ గాడ్. ఇప్పుడు కాస్త రిలాక్సయాను. పొద్దున్నయితే అసలు ఆఫీసుకి రావాలనిపించలేదు!’’ అన్నాడు
‘‘ఏం..ఏమైంది?!’’
శ్రీధర్ పిల్లలిద్దరి మాటలూ చెప్పాడు.
గిరి పకపకా నవ్వుతూ, ‘‘పిల్లల మాటలు భలే క్యూట్‌గా ఉంటాయి!’’ అన్నాడు
శ్రీధర్‌కి కంపరమెత్తింది. ‘‘చావు మాటలు క్యూట్‌గా ఉన్నాయా నీకు? రామలక్ష్మణుల్లా కలిసి మెలిసి ఉండాల్సిన అన్నదమ్ములు నేను ఛస్తే నీకు సంతోషమే కదా అని అడగడమా?!’’ అన్నాడు
గిరి చెయ్యి విదిలించి, ‘‘చాల్లే భాయ్, ఎక్కడో రామాయణం నాటి కబుర్లు చెబుతావు. మా అన్నయ్యనే చూడు, నాకు యాక్సిడెంటయి ఆస్పత్రిలో ఉంటే మొక్కుబడిగా ఓసారి వచ్చి చూసి వెళ్లిపోయాడు. ఎక్కడ వాణ్ణి డబ్బుల డుగుతానో అని భయం. మా ఆవిడ ఒక గ్రాము బంగారం కొందంటే చాలు, మా వదిన రెండు గ్రాములు కొనేదాకా నిద్రపోదు. ఆవిడకి వాడు వత్తాసు. అందుకే మొన్న వాడి కొడుక్కి ఆపరేషనయినప్పుడు లక్ష రూపాయలు అడిగితే లేవని కచ్చితంగా చెప్పేశాం నేనూ మా ఆవిడ. అప్పటినుంచి ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటిమీద వాలడం లేదు. పోతే పోనీ అని హేపీగా ఉన్నాం మేం!’’
శ్రీధర్‌కి తల తిరిగింది. ఏమిటీ మనుషులు.. ఆర్థికంగా ఎదుగుతూ, నైతికంగా దిగజారి పోతున్నారు. రక్తసంబంధాలకి కూడా దిక్కులేకుండా ఉంది. రేపు తన పిల్లలిద్దరూ కూడా ఇలాగే ఉంటారేమో! అంతవరకూ ఎందుకు! తన అన్న కనబడకుండా పోయాడు గాని, వాడే గనుక ఉంటే తను కూడా ఇలాగే ఉండేవాడేమో..!! ఆ లెక్కన భరతుడు ఎలా ఉండి ఉండాలి…అయాచితంగా వచ్చిపడ్డ రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ కన్నూమిన్నూ గానకుండా ఉండాలి. కాని అన్నగారి కాలి చెప్పులకే ఆ వైభవాన్ని కట్టబెట్టి చరిత్రలో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు తన పిల్లలు రామలక్ష్మణుల్లా ఉండాలంటే తనేం చెయ్యాలి..? అంతులేని ఆలోచనలతో రజిత ఎప్పుడు వచ్చిందీ కూడా గమనించలేదు శ్రీధర్.
ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. అన్యమనస్కం గానే అభ్యర్థుల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇంతా చేస్తే ఇది ఆఫీస్ అసిస్టెంటు పోస్టుకి ఇంటర్వ్యూ. కాని పర్మనెంటు పోస్టు కాబట్టి రూలు ప్రకారం అన్నీ జరగాలి. అభ్యర్థుల్ని అడుగుతున్నది జనరల్ నాలెడ్జి ప్రశ్నలు కాదు..వాళ్ల ఆర్థిక స్థితిగతులూ, తాగుడు అలవాట్లూ అవీ. ఆ ప్రశ్నలకి జవాబుల్ని బట్టి వాడు ఎంత నిజాయతీగా పనిచేస్తాడన్నది నిర్ణయించు కోవచ్చునన్నాడు శ్రీధర్. ఆ ప్రకారమే కానిస్తున్నారు.
తొమ్మిదిమంది అయ్యాక, పదో కుర్రవాడు లోపలికి వచ్చాడు. అందరికంటే చిన్నవాడిలా కనిపిస్తున్నాడు. ఆ కుర్రవాణ్ణి చూస్తూనే ఉలిక్కిపడ్డాడు శ్రీధర్. ఎవరీ కుర్రాడు…ఎక్కడో చూసినట్టుంది. బాగా పరిచయం ఉన్నవాడిలా ఉన్నాడు.
‘‘శ్రీధర్ కూచిభొట్ల..’’ రజిత ఫైల్లోంచి పేరు చదువుతూ, ఆశ్చర్యంగా శ్రీధర్ వైపు చూసింది.
అప్పటికే శ్రీధర్‌కి బుర్ర పనిచెయ్యడం మానేసింది. భగవంతుడు తనకి ఇంత త్వరగా జవాబిస్తున్నాడా…తన మనసులో కలుగుతున్న భావం ఆనందమో కాదో నిర్ణయించుకోలేకపోతున్నాడు శ్రీధర్.
‘‘యస్ మేడమ్..’’ ఆ కుర్రాడు, శ్రీధర్ వినయంగా అన్నాడు.
‘‘నీ పేరు శ్రీధరా…’’ శ్రీధర్ అప్రయత్నంగా ప్రశ్నించాడు.
‘‘అవును సార్.’’
‘‘ఇంటిపేరు కూచిభొట్లా..’’
కుర్రాడు తలాడించాడు.
‘‘మీ నాన్నగారి పేరు..?’’
‘‘కేశవ సార్’’
శ్రీధర్‌కి కళ్లలో తిరుగుతున్న నీళ్లు ఆపుకోవడం కష్టమైంది.
‘‘జస్ట్..పద్దెనిమిదేళ్లు నిండాయి నీకు.ఇంటర్లో చాలా మంచిమార్కులు వచ్చాయి కూడా. చదువుకోకుండా ఉద్యోగానికెందుకు వచ్చావు?!’’ రజిత ప్రశ్నించింది
కుర్రాడి మొహంలో ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది.
‘‘నాన్న సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేసేవారు మేడమ్. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి బాగా నీరసపడి పోయారు. కంపెనీ వాళ్లు ఉద్యోగంలోంచి తీసేశారు. అందుకని…’’ ఏడుపు దిగమింగుకుంటున్నట్టు కుర్రాడి స్వరం చెప్పింది.
శ్రీధర్‌కి మరోసారి కళ్లు చెమ్మగిల్లాయి. కేశవకి లంగ్ ఇన్ఫెక్షనా! నీరసపడిపోయాడా!తిండి కూడా తినకుండా రోజంతా హాయిగా ఆటలాడిన కేశవ!
‘‘నీకు శ్రీధర్ అని ఎందుకు పెట్టారు పేరు..?!’’ శ్రీధర్ ప్రశ్నకి రజిత వింతగా చూసింది
కుర్రాడు ఒక్కక్షణం తటపటాయించాడు. తర్వాత,‘‘మా చిన్నాన్న పేరు శ్రీధర్ సార్. తను చాలా బాగా చదివేవాడట. నేను కూడా అంత బాగా చదువుకోవాలని మా నాన్న నాకీ పేరు పెట్టారు! మా తమ్ముడిలా చదువుకో అని చెబుతూ ఉంటారు’’ అన్నాడు
గిరీ, రజితా మళ్లీ శ్రీధర్ వైపు చూశారు.
శ్రీధర్‌కి ఉన్న కాస్త అనుమానం కూడా తీరిపోయింది. కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుంటూ, ‘‘నువ్వెళ్లి హాల్లో కూర్చో. నేనొచ్చేదాకా ఎక్కడికీ వెళ్లకు!’’ అన్నాడు
కుర్రాడు ఆశ్చర్యంగా చూసి తలూపి వెళ్లిపోయాడు.
గిరీ, రజితా ఏదో అడగబోయారు.
‘‘ప్లీజ్, తర్వాత చెప్తాను. ఇంటర్వ్యూలు కానివ్వండి. ఇప్పుడొచ్చిన కుర్రాణ్ణి వదిలేసి వేరే ఎవరినైనా సెలెక్ట్ చెయ్యండి!’’ అన్నాడు శ్రీధర్
ఇంటర్వ్యూలు ముగిశాయి. శ్రీధర్ బైటికొచ్చి, కుర్రాణ్ణి తనతో రమ్మని సైగ చేసి వెళ్లి కారెక్కాడు. కుర్రాడు మరింత ఆశ్చర్యపోతూ కారెక్కి కూర్చున్నాడు.
‘‘మీ ఇంటికి దారి చెప్పు..’’ క్లుప్తంగా అన్నాడు శ్రీధర్
పావుగంటలో కారు ఒక సందులోకి వెళ్లి, చిన్న పెంకుటింటి ముందు ఆగింది.
కుర్రాడి వెనకాలే లోపలికి నడిచాడు శ్రీధర్. అప్పుడే భోజనం చేసి విశ్రాంతిగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు కుర్రాడి తండ్రి. కొడుకు వెనకాలే వచ్చిన మనిషిని చూసి ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు.
శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు. అవతలివాడి మొహంలోకే చూస్తూ నించున్నాడు.
అవతలి మనిషి కలవరపడుతూ శ్రీధర్ని పరకాయింపుగా చూసి, ఒక్కసారిగా ఉద్వేగపడుతూ, ‘‘తమ్ముడూ…’’ అన్నాడు
అంతే…ఒక్క ఉదుటున అన్నని హత్తుకుపోయి ఏడ్చేశాడు శ్రీధర్.
‘‘ఎలా వెళ్లిపోయావురా మమ్మల్ని వదిలేసి..మేమెవరం అక్కర్లేదను కున్నావా..?’’
‘‘ఛీ…కాదురా. నీ మీద కత్తి విసిరేశాక, ఇక మీకెవరికీ మొహం చూపించ కూడదనుకున్నాను. నా పాట్లేవో నేను పడదామనుకున్నాను!’’ కేశవకి కూడా కన్నీళ్లు ఆగలేదు.
‘‘చాల్లే…భగవంతుడి దయ వల్ల మళ్లీ దొరికావు నాకు!’’ కళ్లు తుడుచుకుంటూ పక్కకి తిరిగి, సంభ్రమంగా చూస్తున్న ఇల్లాల్ని ‘‘వదినా..’’ అంటూ పాదాలకి ప్రణమిల్లాడు శ్రీధర్
అరగంట తర్వాత, వదినగారి చేతి భోజనం చేసి, విశ్రాంతిగా కూర్చుని, భార్యకి మెసేజి పంపించాడు శ్రీధర్…‘‘భార్గవీ!మన పిల్లలిద్దరూ రామలక్ష్మణుల్లా ఒకరికొకరు తోడూ నీడగా ఉండాలంటే ఏం చెయ్యాలో నాకు ఆ భగవంతుడే తెలియజెప్పాడు. ముందు నేను లక్ష్మణుణ్ణి కావాలి. నా పిల్లలకి ఆదర్శంగా నిలవాలి. భగవంతుడి దయ వల్ల మా రాముడు..అంటే కేశవ కనిపించాడు. వాడి కుటుంబాన్ని తీసుకువస్తున్నాను. ఇకనుంచి అందరం కలిసే ఉందాం. మనకి మొత్తం ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురి బాధ్యతా మన నలుగురిదీ! మన పెద్దకొడుకు పేరు నా పేరే, శ్రీధర్. వాడికి డాక్ట రవ్వాలని కోరిక. ఇంటర్లో టాప్ ర్యాంకర్. వాణ్ణి ఎంసెట్‌కి ప్రిపేర్ చెయ్యాలి! ఆ ఏర్పాట్లు చూడు!’’
మానవత్వం మూర్తీభవించిన సంఘసేవికా, కాలేజీ లెక్చరరూ అయిన భార్గవి తనకి పూర్తి చేదోడువాదోడుగా ఉంటుందని శ్రీధర్‌కి తెలుసు. ఆ నమ్మికతోనే అతను అన్న కుటుంబాన్ని తీసుకుని ఆనందంగా కారెక్కాడు!!
– లక్ష్మీగాయతి