భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ స్టేషన్లో నిశ్శబ్దంగా నిలబడి ఉంది. సమయం సాయంత్రం ఆరు గంటలవుతోంది. స్టేషన్ ప్లాట్ ఫారం దీపాల వెలుతురులో మెరిసిపోతుంది. నెమ్మదిగా వీచే గాలి మోసుకొచ్చే మిరపకాయ బజ్జీలు, అక్కడే అమ్ముతున్న ఇంకొన్ని తినుబండారాల వాసనతో పాటు రైలు కూత మిశ్రమంగా వినిపిస్తోంది.
సుబ్బలక్ష్మికి అరవై ఏళ్ల పైనే ఉంటాయి. ఫ్లాట్ఫారంమీద, రైల్లో సామర్లకోట నుండి రాజమండ్రి తిరుగుతూ పండ్లు అమ్ముకుని జీవనం సాగించే ఒంటరి తను. రోజూ మాదిరిగానే అరటి, జామపళ్లు, ఉడకబెట్టిన వేరుశనక్కాయలు ఓ గంపలో పెట్టుకొని ఫ్లాట్ఫారంమీద తిరుగుతుంది. రైలు కదిలేముందు అందులోకి వెళదామని అందాకా ఆగి అక్కడే అమ్ముతుంది. ఈ రోజుకి ఇలా అదే ఆఖరు.రాజమండ్రి వెళ్లేలోపు అయిపోతే నాలుగు రూపాయలు ఉంటాయన్న ఆశ.
ఇప్పటికే అలసిపోయిన తను ఒక్కసారిగా చివరి స్లీపర్ కోచ్ దగ్గర ఆగింది. అక్కడ రాధిక మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని కిందకి చూస్తూ ఏవో మెసేజ్‌లు టైప్ చేస్తోంది. సుమారు ముప్పై, ముప్పై ఐదు మధ్య ఉంటుంది వయసు. ఆమె ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్. చక్కగా స్ట్రెయిట్ హెయిర్‌తో డిజైనర్ డ్రస్, ఖరీదైన చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్‌తో హుందాగా నిల్చుని ఉంది.
‘‘జాంపళ్లు తీసుకుంటావా అమ్మా? ముక్కలుకోసి ఉప్పుకారం కలిపిస్తాను. కమ్మగా ఉంటుంది నోటికి’’ అడిగింది సుబ్బలక్ష్మి.
రాధిక ఆమె ముఖంలోకి చూసి ఒకసారి అటు ఇటు చూసి… ‘‘అవే పళ్లు రోజూ చూస్తున్నాం. నీ చేతులెంత అసహ్యంగా ఉన్నాయో చూసుకున్నావా? అలానే నువ్విస్తే వాటి రుచి తెలియడం సంగతి దేవుడెరుగు..తిన్నవాళ్లకి ఏ అనారోగ్యమో చుట్టుకుంటుంది.’’ కసురుకున్నట్టు అనేసి ముఖం తిప్పుకుంది.
అప్పుడే వెనుక నిలబడ్డ ప్రయాణికులు సుబ్బలక్ష్మివైపు జాలిగా చూసారు. ఆమెకిది కాస్త అవమానంగా తోచింది. ఆమె చేతులు మరీ అంత అసహ్యంగా ఏం లేవు. గంప ఎత్తుతూ, దింపుతూ మధ్యలో అడిగిన వాళ్లకి కాయలు కోసిస్తూ, శనక్కాయలు చేతిలో వేసుకుని పొట్లంలో వేయడంవల్ల కాస్త మాసినట్టు కనిపిస్తున్నాయి. ప్రతీసారి కడుక్కోవడం కొంచెం ఇబ్బందే. ఐనా ఏమీ అనకుండా మౌనంగా కాసేపు నిలబడి, తలవంచి నెమ్మదిగా ముందుకు నడిచింది. సిగ్నల్ పడి అందాక గాలికోసం కిందికి దిగిన ప్రయాణికులు ఎక్కడంచూసిన సుబ్బలక్ష్మి తానూ ఎక్కేసింది.
రైలు నెమ్మదిగా కదిలింది. రాధిక తన బెర్త్ దగ్గర కూర్చొని ఫోన్లో బిజీగా ఉంది. పది నిమిషాల తరువాత ఫోన్ పక్కన పడేసి బయటకి చూడటం మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చి రెండేళ్లయ్యింది. తండ్రి చనిపోయాక కుటుంబానికి తానే ఆధారమైంది. అమ్మా, నాయనమ్మా ఇద్దరే ఊర్లో ఉంటుంటే నాయనమ్మను బాబాయికి అప్పగించి, తల్లిని తనతో తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుని, తనతో రావడానికి సిద్ధంగా ఉండమని చెప్పడానికే వచ్చింది. నాయనమ్మ ససేమిరా అన్నా తను ఒప్పుకోలేదు. అక్కడి తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో తనకి తెలుసు. తనకి ఊహ తెలిసినప్పటి నుండి చూస్తూనే ఉంది. ఒక్కసారికూడా మనిషిగా చూడలేదు. అన్నింటికీ విసుక్కోవడమే. ఎప్పుడూ ఏదోకటి అనడమే పనిగా ఉండేది. ఇంటెడు చాకిరీ అమ్మే చేసేది. అలసిపోయి కాసేపు కూర్చొబోతే నే•ల మీద కూర్చోమనేది నాయనమ్మ. దుమ్ము పట్టిన చీర, ఒంటిమీద చెమట వాసన మంచానికో, కుర్చీలకో అంటిస్తుందని విసుక్కునేది. స్నానం చేసినా చెమటకంపు పోలేదని తిట్టేది. అన్నీ మౌనంగా భరించింది అమ్మ. తండ్రి అమ్మచాటు కొడుకు. తనేదో, తన ప్రపంచం వేరే. ఇప్పటికైనా తల్లిని సంతోషంగా ఉంచాలని నిర్ణయించుకుంది. నాన్న తరువాత ఇంటికి పెద్ద మగదిక్కంటూ ఉంటే అది బాబాయ్ ఒక్కడే. ఫోన్లో చెబితే ఎలా తీసుకుంటారో అని నేరుగా చెప్పిపోవడానికి వచ్చింది. ఇల్లదీ చూసి పదిరోజుల్లో వస్తానని వెనక్కి బయలుదేరింది. ఏదో స్టేషన్ దగ్గర రైలు నెమ్మదిగా పోతుంటే ఆమె ఆలోచనల్లోకి ఇందాకటి పళ్లు అమ్ముకునే సుబ్బలక్ష్మి చేరింది.
‘తల్లి విషయంలో నాన్నమ్మని తప్పు బడుతున్నాను కానీ, ఇంతకుముందు నేను మాత్రం చేసిందేంటి?అమ్ముకునే వ్యక్తి కాబట్టి కొనుక్కోమని అడిగింది. కొంటే కొనుండాల్సింది. లేదా వద్దని చెబితే సరిపోయేది. మళ్లీ అడిగినా వద్దంటే తనదారిన తాను వెళ్లిపోయేది. నేను తొందరపడ్డానేమో. శ్రమవల్ల చిందిన చెమటలో, బరువులు మోసిన ఆమె చేతులు మాసిపోయాయి. పైకి కనిపించని తన మనసు ఎప్పుడు, ఎలా మాసిపోయిందో కదా!’ అనుకుంది రాధిక.
ఎంత ప్రయత్నించినా మనసు నుండి పోవట్లేదు. ఒకలాంటి అభద్రతా భావం భావం అల్లుకుపోయింది.
‘కలసి క్షమించమని అడిగే అవకాశం కూడా లేకుండా అయిపోయిందే.’ అనుకుంది తనలో తనే.
* * *
అందాకా ఉరుకులు పరుగులు తీసిన రైలు కాసేపట్లో రాజమండ్రి స్టేషన్‌కి చేరుకుంటుందనగా నెమ్మదించింది. స్టేషన్ చేరగానే అక్కడ వాటర్ బాటిల్ కొనడంకోసం కిందకి వెళ్లడానికని లేచి తలుపు దగ్గరకి వెళ్లబోతుంటే ఓ పక్కగా కనిపించింది సుబ్బలక్ష్మి. మరోవైపు గుమ్మందగ్గర గంపను ముందు పెట్టుకుని కూర్చుని ఉంది.
రాధిక ఆమె ముందుకెళ్లి నిలబడి,‘‘అమ్మా! ఇందాక ఏదో చిరాకులో మాట్లాడేసాను. మన్నించు. నీ కష్టాన్ని గుర్తించకుండా చేతులు శుభ్రం గురించి అనవసరంగా మాట్లాడాను. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. తరువాత ఆలోచిస్తే ఇంట్లో నా తల్లి పడుతున్న కష్టమే గుర్తొచ్చింది. ఏమనుకోకండి.’’ అని చెప్పింది.
సుబ్బలక్ష్మి కళ్లలో చిన్న చిరునవ్వు మెరిసింది.
‘‘అమ్మా… మేము పేదవాళ్లం, కానీ మా పనిపట్ల మాకు మక్కువ ఉంది. నా చేతులు క్రమంగా పనిచేస్తేనే, నాలుగువేళ్లు నోటికి చేరతాయి. ఇందాక నువ్వు వాటిలో కంటికి కనిపించే మురికిని చూసావు. తరువాత మనసుతో చూసినట్టున్నావ్! నీకు నా కష్టం కనిపించింది. పరవాలేదమ్మా! ఇప్పటికైనా శ్రమని గుర్తించావ్! బిడ్డలాంటి దానివి నిన్నేమనుకుంటాను. ఐనా ఇవన్నీ నాకు అలవాటేలే’’ గంపలో ఉన్న కాస్త సరుకు సర్దుకుంటూ అంది. రాధికకి ఆమాట చురుక్కున తగిలింది. ‘ఆఫీసులో కానీ, ఎక్కడైనా కానీ తనని ఎవరైనా ఏమైనా అంటే చురుగ్గా సమాధానం చెబుతుంది. కొన్నిసార్లు తప్పు ఉన్నా కూడా ఎదుటి• వ్యక్తి అనే మాటలను తీసుకోలేకపోయేది. అలాంటిది తను అంతమాట అంటే ఎంత తేలిగ్గా వదిలేసిందో కదా!’ అనుకుంది.
కాసేపలా మౌనంగా చూస్తూ ఉండిపోయింది.
‘‘ఇందాక ఒక మనిషిగా మాత్రమే చూసాను. ఇప్పుడే మీరన్నట్టు మనసుపెట్టి చూస్తున్నానమ్మా! ఈ వయసులో కూడా ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావ్! నీవాళ్లు…’’
‘‘ఇద్దరు మగపిల్లలు. ఎవరి జీవితాలు వాళ్లవే. నేనెప్పుడైనా వాళ్ల ఇంటికి వెళ్లినా, ‘చెమట వాసన వస్తోందే అమ్మా!’ అంటూ కూర్చోనివ్వరు. దగ్గరగా చేరనివ్వరు. వాళ్లకోసం పడిన శ్రమ తాలూకా చెమట వాసనే అదని వాళ్లకి అర్థ్ధంకాలేదు. ఎప్పటికీ కాదుకూడా. వాళ్లు నన్నొదిలేసుకున్నంత తేలిగ్గా నేను వాళ్లని విడిచి ఉండలేకపోతున్నాను. తల్లిని కదా! మనవలున్నారు. వాళ్లని చూడాలనిపించినప్పుడల్లా వెళ్తుంటాను. వాళ్లేమన్నా, ఏమనుకున్నా పట్టిం చుకోను. అలవాటైపోయిందిలే. వాళ్ల నుండి ఆశించడం మానేసి, ఆశించినా ఛీత్కారమే తప్ప ఆదరణ ఉండదని అర్థమై వాళ్లకి దూరంగా ఈ ప్లాట్ఫారం మీదనే ఇలా తిరుగుతూ బ్రతుకు బండి నడుపుకొస్తున్నా. అందుకే ఇందాకా నువ్వన్న మాటలు చివుక్కుమన్నా కూడా పట్టించుకోలేదు.’’
వింటున్న రాధిక కళ్లు చెమర్చాయి.
‘‘నీకు ఇల్లేం లేదామ్మ…?’’
‘‘ఉందిలే… అక్కడే ఉంటాను. నా పని అయిపోగానే వెళ్లిపోతాను. మళ్లీ ఉదయాన్నే వచ్చేస్తాను. ఇక్కడే ప్రతిరోజూ అనేకమంది రెక్కలు కష్టం చూస్తాను. ఎవరో ఒకరు నవ్వుతారు. కొందరు చూసి పలకరింపు లేకుండా పోతారు. వాళ్లంతా నా వాళ్లే, నా బోటివాళ్లే. ‘ఈ వయసులో బరువులేం మోస్తావు?చేయి చాపితే వచ్చే పదో పరకో చాలదా?’ అనేవాళ్లు ఉన్నారు. ఓపికైపోలేదుగా. నిజాయతీగా నాకు చేతనైన వ్యాపారం చేసుకుని ఉన్నంతలో గౌరవంగా పోతున్నా. చేయి చాపాల్సిన రోజంటూ వస్తే నా ప్రాణాలు తీసుకుపోమ్మని ఆ గోదారమ్మ గట్టునే నిలబడి చేతులు చాపుతా! చల్లని తల్లి దయచూడకపోతుందా!’’
రాధికకి తల్లి గుర్తొచ్చింది. ‘దేనికమ్మా మాటలు పడుతూ ఇలా భరిస్తావ్’ అనంటే ‘నన్ననేది నా అత్తగారే కదే!’ అనేది. పెద్ద వయసుతో వచ్చిన అభద్రతా భావమేమో. తను ఎన్నన్నా అలానే భరించేది. అంత ఓపిక నాకు లేదాయే’ అనుకుంది మనసులో.
చేతికున్న చిన్నసంచిలో నుండి ఒక ఐదువందల కాగితం తీసి ఆమె చేతికి ఇవ్వబోయింది.
‘‘వద్దు తల్లీ, ఊరకనే ఆశించేదాన్ని అయితే ఈ బరువు మోయకుండానే నా చేతిని నింపుకునేదాన్ని. అప్పుడీ చేతులకి దుమ్ము, ధూళి కూడా అంటేవి కాదు.’’ పక్కనే ఉన్న గంపనే చూస్తూ అదోలా అంది.
మనసు చివుక్కుమంది రాధికకి. ‘ఇప్పటివరకూ అదే చెప్పిందిగా! అంతా విని మళ్లీ అదే పొరబాటు ఎలా చేయబోయానో కదా!’ అనుకుంటూ, ‘‘అమ్మా! ఆ మిగిలినవాటికి లెక్కకట్టి తీసుకో. అవన్నీ సంచిలో వేసివ్వు’’ అనగానే గంపలోనుండి చిన్నసంచి అందుకుని అందులో వేసేసి లెక్కకట్టి తక్కిన చిల్లర రాధిక చేతికి ఇచ్చేసింది. మనసులోనే ఆమె నిజాయతీని, గౌరవంగా బతకాలన్న ఆమె ఆశయాన్ని మెచ్చుకుంది.
అప్పుడే రైలు ఫ్లాట్‌ఫారం మీదకి చేరుకుంది. ముందు తను దిగి వెనక దిగుతున్న సుబ్బలక్ష్మికి సాయంచేసింది. తలుపు పక్కనున్న ఖాళీ ఐన గంపను అందుకుని ఆమె చేతికిచ్చింది చిరునవ్వుతో. ‘‘ఇక నేను వెళ్లొస్తా’’ అంటూ సుబ్బలక్ష్మి కుడిచేతిని పైకెత్తి ఊపుతుంటే ఆమెకి చేతికి బదులుగా బురదలో వికసించిన కమలమే కనిపించింది.
తల్లికోసం తానుంది. వీళ్లకోసం ఎవరున్నారో కదా అనుకుంది. అప్పుడే చంటిపిల్లను భుజాన వేసుకుని యాచిస్తున్న ఓ తల్లికి, తనవద్దనున్న జాంపళ్లలో ఓ రెండు మాత్రం ఉంచుకుని మిగిలిన పళ్లున్న సంచిని ఇచ్చింది. చేతిలోని పండ్లవైపు, దూరంగా చీకటిలో కలిసిపోతున్న సుబ్బలక్ష్మి వైపు ఆరాధనా భావంతో చూస్తూ కొద్ది క్షణాలు అలానే నిలబడిపోయింది.
– ప్రశాంత్‌వర్మ ఉప్పలపాటి