మదనపల్లెలో రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్, రియలన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబేద్కర్లతో కలసి అక్టోబరు 2న శంకుస్థాపన చేశారు. ఈ ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ’ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులలో దాదాపు రూ.40,352 కోట్లను కేంద్ర ప్రభుత్వం ‘పూర్వోదయ’ పథకం కింద వివిధ ప్రాజెక్టుల రూపంలో సమకూర్చనుండగా, మిగిలిన రూ.60 వేల కోట్లను ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడిగా పెట్టనున్నాయి.
రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు ప్రాంతాలకూ ఉద్యాన పంటల విస్తరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల రూపంలో ఈ హబ్ ఫలాలు అందనున్నాయి. ఒకప్పుడు ‘రతనాల సీమ’గా కీర్తి గడించిన రాయలసీమ, గత కొన్ని దశాబ్దాలుగా ‘కరవు సీమ’గా మారిపోయింది. వర్షం కోసం ఆకాశం వైపు, నీటి కోసం వందల అడుగుల లోతు బోర్ల వైపు చూడటమే ఇక్కడి రైతు జీవితమైంది.ఈ నేపథ్యంలో ఏర్పాటుకానున్న ఉద్యానహబ్ రైతాంగానికి గొప్ప ఊతం ఇవ్వనుంది. సీమ రైతాంగంలో కొత్త ఆశలు రేపుతోంది. తీవ్ర వర్షాభావంతో ఏడారీకరణకు దగ్గరవుతున్న ఈ ప్రాంతం పండ్ల తోటలు, దాని అనుబంధ పరిశ్రమలతో పంట పొలాలు కళకళలాడే మంచికాలం రానుంది. ప్రభుత్వ సలహాలు, సాంకేతిక సహాయంతో ప్రకృతి, సేంద్రియ ఉత్పత్తులు నాణ్యతతో గరిష్ఠ ఉత్పత్తి సాధించే అవకాశం ఏర్పడనుంది. రైతులకే కాదు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దనుంది.
రాయలసీమ కరవుకు ప్రధాన కారణం దాని భౌగోళిక స్థితి. ఈ ప్రాంతం రెయిన్ షాడో పరిధిలో ఉంది. నైరుతి రుతుపవనాలను పశ్చిమ కనుమలు అడ్డుకోవడంతో మేఘాలు ఇక్కడికి చేరేసరికి బలహీనపడతాయి. ఈశాన్య రుతుపవనాలు కోస్తా జిల్లాల మాదిరిగా సీమను తడపవు. ఫలితంగా ఏటా సగటున 500 నుంచి 700 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లాల్లో అనంతపురం ఒకటిగా నిలవడమే ఇందుకు నిదర్శనం. కురిసే ఆ కొద్దిపాటి వర్షమూ సకాలంలో, సమానంగా ఉండదు. నేల స్వభావమూ రైతుకు ప్రతికూలమే. ఇక్కడి ఎర్రనేలలు, రాతి నేలలు లోతు తక్కువగా ఉండి నీటిని నిలుపుకోలేవు. గట్టి శిలలతో కూడిన భూగర్భం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకే అవకాశం తక్కువ. దీంతో భూగర్భ జలాలు వేల అడుగుల లోతుకు పడిపోయాయి. ఒక్క బోరులో నీరు పడాలంటే పది బోర్లు వేయాల్సి వచ్చి, అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతులు ఎందరో. కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులు సమీపంలోనే ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తి కాకపోవడంతో భూములు క్రమంగా బీడులుగా మారుతున్నాయి. పచ్చదనం తగ్గి, మట్టి కోతకు గురై, సారం కోల్పోయిన భూములు ఎడారీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. వేరుశనగ వంటి వర్షాధార పంటలపైనే ఆధారపడిన రైతు, వరుస పంట నష్టాలతో పొలం వదిలి వలస బాట పట్టాల్సి వస్తోంది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల విషాదగాథలు సీమ పల్లెల్లో ఎన్నో. పిల్లలను, వృద్ధులను ఊళ్లో వదిలి కూలి పనుల కోసం పట్టణాలకు తరలిపోయిన కుటుంబాలతో అనేక గ్రామాలు బోసిపోతున్నాయి.
పశుగ్రాసం కరవు-కబేళాలకు పాడి పశువులు
కరవు ప్రభావం పంటలకే పరిమితం కాలేదు. పంటలు పండకపోవడంతో పశుగ్రాసమూ దొరకడం లేదు. గడ్డి ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో పశువులను పోషించడం రైతుకు తలకు మించిన భారమైంది. ఇంటి సభ్యుల్లా పెంచుకున్న పాడి పశువులను,ఎద్దులను తక్కువ ధరకే కబేళాలకు అమ్మేసు కోవాల్సిన దయనీయ పరిస్థితి ఎన్నో గ్రామాల్లో కనిపిస్తోంది. వేసవి వచ్చిందంటే పశువుల సంతలు కిటకిటలాడటం సీమ కరవు తీవ్రతకు అద్దం పడుతోంది. పాడి ద్వారా వచ్చే స్థిర ఆదాయాన్నీ కోల్పోయి రైతు కుటుంబాలు మరింత కుంగి పోతున్నాయి.
ఇప్పటికే ఉద్యాన సీమ
ఇన్ని ప్రతికూలతల మధ్యే రాయలసీమ రైతు పట్టుదలతో ఉద్యాన పంటల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యానపంటలే సీమకు సంజీవనిగా మారాయి. యాపిల్ నుంచి స్ట్రాబెరీ వరకు, అరటి నుంచి అవకాడో వరకు, కివి నుంచి ఖర్జూరం వరకు 20 రకాల పంటలు సాగుచేస్తున్నారు. ఇలా ఒకే ప్రాంతంలో పండ్లు, పూలు, కూరగాయలు ఉత్పత్తి చేసే ప్రాంతం రాయలసీమ మాత్రమే. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు మామిడికి పేరుగాంచగా, మదనపల్లె టమోటా మార్కెట్ దేశంలోనే అతి పెద్ద వాటిల్లో ఒకటిగా నిలిచింది. అనంతపురం, శ్రీసత్య సాయి జిల్లాలు దానిమ్మ, బత్తాయి, అరటికి కేంద్రా లుగా మారాయి. కడప జిల్లా అరటి, బొప్పాయికి, కర్నూలు ఉల్లికి ప్రసిద్ధి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 8.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన సాగు జరుగుతోంది. అయితే సరైన నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు లేక పంట పండినా ధర దక్కక, టమోటాను రోడ్లపై పారబోసే దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి.
హబ్ ప్రణాళిక-నిధులు, దశలు
ఈ లోటును పూడ్చేందుకే ఉద్యాన హబ్ రూపుది ద్దుకుంటోంది. ప్రభుత్వ నిధుల్లో సింహభాగం రూ.20,884 కోట్లను సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించారు. వీటి ద్వారా కొత్తగా 3 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టించడంతో పాటు 4.3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. ఉద్యాన అభివృద్ధికి రూ.15,000 కోట్లు, 5,721 కి.మీ. గ్రామీణ రహదారులు సహా రవాణా వసతులకు రూ.4,562 కోట్లు వెచ్చిస్తారు. 303 మండలాలు, 5,869 గ్రామాల్లో 201 క్లస్టర్లుగా ఆగస్టు 2026 నుంచి జులై 2029 వరకు మూడు దశల్లో ఈ ప్రాజెక్టు అమలవుతుంది.
ఈ హబ్ ప్రయోజనాలు రాయలసీమకే పరిమితం కావు. సీమను ఆనుకుని ఉన్న ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలూ తరచూ కరవు కోరల్లో చిక్కుకునేవే. ముఖ్యంగా మార్కాపురం ప్రాంతం నీటి కొరతతో పాటు ఫ్లోరైడ్ సమస్యతోనూ సతమత మవుతోంది. నెల్లూరు ప్రాంత రైతులకూ ఉద్యాన పంటల విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్లు కొత్త మార్కెట్ అవకాశాలను అందించనున్నాయి.
రైతాంగానికి కలిగే ప్రయోజనాలు
కొత్త ఆయకట్టు, సూక్ష్మ సేద్యం (డ్రిప్, స్ప్రింక్లర్) విస్తరణతో ప్రతి నీటి చుక్కా సద్వినియోగమవుతుంది. బోర్లపై ఆధారపడటం తగ్గి, భూగర్భ జలాలు కూడా క్రమంగా పుంజుకుంటాయి.ఉద్యాన సాగును అదనంగా 6 లక్షల హెక్టార్లు పెంచి 14.41 లక్షల హెక్టార్లకు చేర్చడం,ఉత్పత్తిని 222 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 435 లక్షల మెట్రిక్ టన్నులకు రెట్టింపు చేయడం లక్ష్యం. సంప్రదాయ మామిడి, అరటి, దానిమ్మలతో పాటు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బెర్రీలు, ఖర్జూరం వంటి అధిక ధర పలికే పంటలు సీమ పొలాల్లో పండనున్నాయి. సుమారు 9.6 లక్షల మంది ఉద్యాన రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుండగా, మూడేళ్లలో వ్యవసాయ రంగం నుంచి రూ.81,000 కోట్ల అదనపు స్థూల విలువ జోడింపు సాధ్యమవుతుందని అంచనా. ప్రైవేట్ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, గ్రేడింగ్, ప్యాకింగ్ కేంద్రాలు ఏర్పాట వుతాయి. టమోటా సాస్గా, మామిడి గుజ్జుగా, పండ్లు జ్యూస్లుగా మారి విలువ పెరుగుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా పంటను నేరుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. ధర పతనమైనప్పుడు పంటను పారబోయాల్సిన దుస్థితి తప్పుతుంది. 5,721 కి.మీ. మేర గ్రామీణ రహదారుల విస్తరణతో మారుమూల పల్లెల నుంచి కూడా పంటను త్వరగా మార్కెట్లకు, ప్రాసెసింగ్ కేంద్రాలకు చేర్చవచ్చు. రవాణా ఖర్చు తగ్గడమే కాక, త్వరగా పాడయ్యే పండ్లు, కూరగాయల నష్టమూ గణనీయంగా తగ్గుతుంది.
‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర’ ఊతం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో మదనపల్లెలో రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర’ సంస్థ ద్వారా కృత్రిమ మేధ, ప్రిసిషన్ ఫార్మింగ్, స్మార్ట్ ఇరిగేషన్ వంటి సాంకేతికతలు నేరుగా రైతు పొలానికి చేరతాయి. ఏ నేలలో ఏ పంట వేయాలి? ఎప్పుడు ఎంత నీరు పెట్టాలి? వంటి శాస్త్రీయ సలహాలు క్షేత్రస్థాయిలోనే రైతుకు అందుతాయి. వ్యవసాయ పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ఈ సంస్థ, సీమ యువతను నైపుణ్యం గల వ్యవసాయ నిపుణులుగా, అగ్రి-స్టార్టప్ వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దే వేదికగానూ మారనుంది. ప్రాసెసింగ్, నిల్వ, గ్రేడింగ్, రవాణా రంగాల్లో 19.7 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించనుంది. పనుల కోసం బెంగళూరు, చెన్నై, గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న సీమ యువతకు సొంత ఊళ్లోనే పని దొరుకుతుంది. ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లలో పొదుపు సంఘాల మహిళలకూ ఉపాధి లభించి, గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరుగు తుంది. సాగునీరు పెరిగితే పశుగ్రాసం సాగూ పెరుగుతుంది. ఉద్యాన పంటల ద్వారా వచ్చే స్థిర ఆదాయంతో రైతు పశువులను పోషించుకోగలుగుతాడు. పాడి పశువులను కబేళాలకు తరలించే దుస్థితికి తెరపడి, పాడి పరిశ్రమ కూడా పుంజుకుంటుంది.
మారనున్న సీమ ముఖచిత్రం
ఈ ప్రణాళిక సక్రమంగా అమలైతే రాయలసీమ ముఖచిత్రమే మారిపోతుంది. బీడు భూములు పండ్ల తోటలుగా, ఎండిన చెరువులు జలకళతో, ఖాళీ అవుతున్న గ్రామాలు జనసందడితో కళకళలాడ తాయి. పచ్చదనం పెరగడంతో ఎడారీకరణ ముప్పూ తగ్గుతుంది. ఏళ్ల తరబడి నిలిచే పండ్ల తోటలు నేల కోతను అడ్డుకుని, మట్టిలో తేమను కాపాడతాయి. ఏటా వర్షంపై జూదం ఆడే వేరుశనగ సాగు స్థానంలో ఏళ్ల పాటు స్థిర ఆదాయం ఇచ్చే తోటలు రావడంతో రైతు భవిష్యత్తుపై భరోసా పెరుగుతుంది. వ్యవసాయాన్ని వదిలేస్తున్న యువత ఆధునిక సాంకేతికతతో మళ్లీ సాగు వైపు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వైపు అడుగులు వేస్తారు. రాయలసీమ ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మాత్రమే కాక, ప్రపంచ ఉద్యాన పటంలోనూ ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది.
అయితే ఈ ఫలాలు చివరి రైతు వరకూ చేరాలంటే కొన్ని చర్యలు అవసరం. సాగునీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తి కావాలి. ప్రైవేట్ పెట్టుబడుల లాభాల్లో చిన్న, సన్నకారు రైతులకూ న్యాయమైన వాటా దక్కాలి. పండిన పంటకు గిట్టుబాటు ధర భరోసా ఉండాలి. ప్రభుత్వాలు, అధికారులు, రైతులు కలిసి పనిచేస్తేనే ఈ కల సాకారమవుతుంది. నీటి చుక్క విలువ తెలిసిన రాయలసీమ రైతు, అవకాశం దొరికితే అద్భుతాలు సృష్టించగలడని ఇప్పటికే నిరూపించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, కార్పొరేట్ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత ఒకే వేదికపైకి రావడం సీమ చరిత్రలో ఒక మలుపు. కరవుసీమను ప్రపంచ ఉద్యానవనంగా మార్చే ఈ లక్ష కోట్ల ప్రణాళిక, రాయలసీమకు మళ్లీ ‘రతనాల సీమ’ వైభవాన్ని తెచ్చి పెడుతుందని ఆశిద్దాం.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్