బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాష్ట్రాన్ని కుదిపేస్తూనే, అదే సమయంలో ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న వరాన్ని కూడా మోసుకొచ్చింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను వణికించిన ఈ భారీ వర్షాలు నదులు, వాగులను ఉప్పొంగించి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇళ్లు, పంటలు నీట మునిగాయి, రాకపోకలు స్తంభించాయి. అయితే మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోయిన పైరులను ఆదుకున్నట్లు ఇదే వర్షం అన్నదాతలలో కొత్త ఆశలు నింపింది. నెలల తరబడి చినుకు కోసం ఎదురుచూసిన నేలతల్లికి, అడుగంటిన జలాశయాలకు ఈ వరద కొంత ఊరటనిచ్చిందని చెప్పక తప్పదు. నష్టం ఒక పార్శ్వమైతే, ఊరట మరో పార్శ్వం- ఈ రెండు కోణాల నుంచి రాష్ట్రాన్ని పలకరించిన ఈ ప్రకృతి పరిణామాన్ని ఒకసారి పరిశీలిస్తే….
వ•డు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. సెప్టెంబరు 24 రాత్రి నుంచి మర రెండు రోజులు ఒడిశాలో కురిసిన భారీ వర్షాల ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీ పురం మన్యం జిల్లాలపై స్పష్టంగా కనిపించింది. నాగావళి, వంశధార నదులు ఉగ్రరూపం దాల్చాయి. నాగావళికి 76 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. వంశధారకు 48,546 క్యూసెక్కులు, బహుదా నదికి 36,645 క్యూసెక్కుల మేర వరద కొనసాగింది. ఈ జిల్లాలో 12,770 హెక్టార్లలో వరి, పత్తి, ఉద్యాన పంటలు దెబ్బతినగా, 445 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 413 ఇళ్లు, 81 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. నాగావళి నదికి వరద పోటెత్తడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే మిగిలిపోయాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే 22 గ్రామాలు పూర్తిగా నీటిలో చిక్కుకుపోగా, 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుం డటంతో ఈ జిల్లాతో పాటు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కాలనీల్లోకి సైతం నీరు చేరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లు, కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొండలు, లోయలతో నిండిన ఈ ప్రాంతాల్లో ప్రతి వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు మావ•లేనని స్థానికులు చెబుతున్నా, ఈసారి వర్షాల తీవ్రత అంచనాలను మించిపోయింది.
విజయనగరం జిల్లాలో వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి మడ్డువలస జలాశయంలోకి వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. సువర్ణముఖి ఉద్ధృతికి కొండబార్రపల్లి-కొప్పర మధ్య గీతనాపల్లికి రాకపోకలు నిలిచిపోగా, మంగళ-రాజాం మార్గంలో అరిసాడ సమీపంలో చిన్నగెడ్డ ప్రవాహంతో పాటు పెచ్చెచెరువుకు గండి పడటంతో ప్రధాన రహదారి లోని కల్వర్టు కొట్టుకుపోయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో నాగావళి ఉధృతికి అన్నవరం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోగా, 1600 మందికి అధికారులు తాగునీరు, ఆహారం అందించారు. పాలకొండ నగర పంచాయతీ శివారు ప్రాంతాలు సైతం నీట మునిగాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం పంచాయతీ కళ్లాపాడోర్ సమీపంలో వ్యవసాయ పనుల నిమిత్తం గెడ్డ దాటి వెళ్లిన నలుగురు గిరిజనులు, తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా పెరిగిన వరదకు కొట్టుకుపోయి, కొంతదూరంలో ఒడ్డున గల చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని, ప్రాణా లతో బయటపడ్డారు. క్షణమాత్రంలో మృత్యువును ఢీకొట్టి బయటపడ్డ ఈ నలుగురి అనుభవం, వరద ఉధృతి ఎంతటి ప్రమాదకరంగా మారిందో కళ్లకు కడుతుంది. ఇదే జిల్లాలో జీకే వీధి మండలం ధారకొండ ఆలయ సమీపంలో కొండచరియలు, చెట్లు విరిగిపడి సీలేరు మార్గం వ•సుకుపోయింది. లంబసింగి-తాజంగి వంతెన ప్రమాదకరంగా మారడంతో రాకపోకలు నిలిపివేయగా, అనంతగిరి, అరకు మండలాల్లోనూ కొండచరియలు విరిగిపడటం, తాత్కాలిక కల్వర్టులు కొట్టుకుపోవడం వంటి ఘటనలు చోటుచేసు కున్నాయి. జి.మాడుగుల మండలంలో రహదారి దెబ్బతినగా, ముంచంగిపుట్టు మండలంలోనే మరో వ్యక్తి కొట్టుకుపోయి, తర్వాత క్షేమంగా బయటపడ్డారు.
గోదావరిలోనూ నీటి మట్టం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మూడు రోజుల పాటు 9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. కోనసీమలోని పలు లంక ప్రాంతాల్లో పొలాలు, ఇళ్లు, రహదారులు ముంపునకు గురయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు, మునేరు పొంగిపొర్లగా, దీని ప్రభావంతో కృష్ణా నదికి వరద మరింత పెరిగింది. కృష్ణా డెల్టా, ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు 7,788 క్యూసెక్కులు విడుదల చేశారు.
నిండిన జలాశయాలు
రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం తీరం దాటిన వ•డు రోజుల్లో సగటున 20 నుండి 30 మి.మీ మేర విస్తారమైన వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో 200-300 మి.మీ వరకు కూడా వర్షపాతం నమోదైంది. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నంలోని వాల్తేరులో అత్యధికంగా 28 సెంటీమీటర్ల (280 మి.మీ) భారీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వాయుగుండం కురిపించిన వర్షాల వల్ల ఆంధప్రదేశ్‌లో అప్పటి వరకు ఉన్న నైరుతి రుతుపవనాల వర్షపాత లోటు గణనీయంగా తగ్గింది. సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రంలో 43% గా ఉన్న వర్షపాత లోటు, ఈ రెండు వ•డు రోజుల భారీ వర్షాల తర్వాత సెప్టెంబర్ 25 నాటికి 22%కి తగ్గింది.
నష్టం ఎంత జరిగినా, ఈ వర్షాలు రాష్ట్ర జలవనరులకు కొత్త ఊపిరి పోశాయనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఒక్క టీఎంసీ నీరు కూడా అవ•ల్యంగా మారిన తరుణంలో, తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలు వ•డు రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలకు 22 టీఎంసీల నీటిని అదనంగా తీసుకొచ్చాయి. జూన్ తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖకు ఇదే తొలి చల్లని కబురు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 95 సెంటీమీటర్ల మేర పెరగడం విశేషం.
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని 11 జలాశయాల్లో సెప్టెంబరు 23న 12.13 టీఎంసీలు ఉన్న నిల్వలు 18.10 టీఎంసీలకు చేరాయి. అంటే 5.964 టీఎంసీల నీరు అదనంగా వచ్చి చేరింది. ఇందులో హీరమండలంలో 1.505, తాండవలో 1.262, మడ్డువలసలో 1.285 టీఎంసీల మేర పెరుగుదల కనిపించింది. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లోని 18 జలాశయాల్లో 88.84 టీఎంసీల నుంచి 105.06 టీఎంసీలకు నిల్వలు చేరి, 16.217 టీఎంసీల మేర పెరిగాయి. విశాఖ తాగునీటి అవసరాలు తీర్చే ఏలేరు జలాశయంలో 3.430, డొంకరాయిలో 3.5, సోమశిలలో 2.029, గండికోటలో 1.106 టీఎంసీల మేర నిల్వలు పెరగడం విశేషం. వీటికి తోడు రాష్ట్రవ్యాప్తంగా చిన్న చెరువులు సైతం నిండుకుండల్లా మారాయి.
రబీకి సన్నద్ధం
జలాశయాల్లో, భూగర్భంలో ఇలా జలకళ సంతరించుకోవడం రైతాంగానికి మేలు చేసే పరిణామం. ఖరీఫ్ సీజన్ మధ్యలో వర్షాభావంతో ఎండుముఖం పట్టిన పంటలకు కాలువల ద్వారా నీరు అందే అవకాశం మెరుగుపడటంతో పాటు, రానున్న రబీ సీజన్‌కు సైతం ఈ నిల్వలు ఉపయోగపడనున్నాయి. బోరుబావులపై ఆధారపడిన రైతులకు భూగర్భ జలమట్టం పెరగడం ప్రత్యక్షంగా కలిసొచ్చే అంశం. వర్షాభావ పరిస్థితుల వల్ల మే నెలాఖరులో సగటున 10.10 మీటర్ల లోతున ఉన్న భూగర్భజలాలు, సెప్టెంబరు 23 నాటికి 11.04 మీటర్లకు అడుగంటాయి. తాజా వర్షాలతో ఈ పరిస్థితి తారుమారై, సగటు భూగర్భ జలమట్టం 10.09 మీటర్లకు మెరుగుపడింది. దీనివల్ల భూగర్భంలో సుమారు 90 టీఎంసీల నీటి నిల్వలు అదనంగా చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
నిండుకుండలా సుంకేశుల
ఈ మార్పునకు నిదర్శనంగా నిలిచింది కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల జలాశయం. కొద్ది రోజుల క్రితం వరకు ఇసుక దిబ్బలతో వెలవెలబోయిన ఈ జలాశయం, వ•డు రోజుల వ్యవధిలోనే నిండుకుండలా మారింది. 1.20 టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయంలో 1.026 టీఎంసీల నిల్వ చేరింది. ఈ సీజన్లో ఇది రెండోసారి పూర్తిస్థాయిలో నిండటం విశేషం. 11 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, కేసీ కెనాల్‌కు ఈ సీజన్లో తొలిసారిగా 2,500 క్యూసెక్కులను విడుదల చేశారు. జూన్‌లో కురిసిన వర్షాలకు ఒకసారి పూర్తిగా నిండిన సుంకేసుల, ఆ తర్వాత ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక, తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. 6.50 లక్షల జనాభా గల కర్నూలు నగరానికి తాగునీటి సరఫరా ఇబ్బందుల్లో పడి, ఫోర్‌షోర్ ప్రాంతంలో ఇసుక మేటలు తేలగా, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తుంగభద్ర, హగరి నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలు కర్నూలువాసుల దాహార్తిని తీర్చాయి. ఆర్డీఎస్ ఆనకట్ట ఉప్పొంగి, మంత్రాలయం మీదుగా వచ్చిన వరద సాయంత్రానికి సుంకేసులను చేరడంతో నగరానికి తాగునీటి గండం తప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. జలాశయం నిండటంతో పర్యాటకుల తాకిడి కూడా మొదలైంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని శ్రీధరఘట్ట చెరువు నిండింది. దీంతో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఏడాది రెండు పం టలకు సరిపడా నీరు చేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద 450 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. వరి నాట్లు జోరందుకున్నాయి.
ఈ తుపాను ఒకవైపు ప్రాణనష్టం, ఆస్తినష్టం మిగిల్చినా, మరోవైపు ఎల్‌నినో దెబ్బకు వాడిపోయిన రాష్ట్ర జలవనరులకు కొత్త జీవం పోసింది. దెబ్బతిన్న రహదారులు, ముంపునకు గురైన పంటలు, నిరాశ్రయులైన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, జలాశయాలు నిండటం, భూగర్భ జలమట్టం మెరుగుపడటం రైతాంగానికి, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కొండంత భరోసానిచ్చాయి. ప్రకృతి ఒకవైపు కష్టాన్ని ఇచ్చినా, మరోవైపు తనకు తానే పరిష్కారాన్ని చూపిన తీరు ఇక్కడ కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా కొనసాగుతాయో చూస్తూ, నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగవంతం చేస్తూనే, ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ముందున్న కర్తవ్యం.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్