‘‘‌రమేష్‌! ‌మీకు గౌరీ, ధరణిలు తెలుసు కదా? తను తన భర్త సోమన్నని వెతుక్కుంటూ వెళ్లిపోవడంతో నేను ఆమె కూతురు వనజను తెచ్చుకొని ‘ప్రియ’గా పెంచుకున్నాను. ఆ పిల్లే ఈమె’’ అంటూ ప్రియని చూపించాడు.

‘‘ఆ విషయం నాకు తెలుసు మేస్టారు! మీరు వెళ్లిన తరువాత గౌరి నాకు అన్ని విషయాలూ చెప్పింది. ఔనూ…!ఇప్పుడు వి•రు ఎక్కడికి వెళుతునారు?‘‘ అడిగాడు రమేష్‌.

‘‘‌ప్రియని చూడాలని ఉందనీ ధరణి ఉత్తరం రాసింది. ప్రియ కూడా వాళ్లమ్మని చూస్తాను అంటోంది. అందుకే ఇక్కడికి వస్తే ధరణి ఉండే ప్రదేశం గురించి గౌరి చెప్పింది’’ అన్నాడు శ్రీధర్‌.

ఈ ‌మధ్యన ధరణికి ఒంట్లో బాగులేదని విన్నాను’’ చెప్పాడు రమేష్‌.

‘‘‌రమేష్‌! ‌సోమన్న ఆచూకీ ఏమైనా తెలిసిందా?’’

‘‘అతన్ని అన్నలు ఛత్తీస్‌ఘడ్‌లోని దండ కారణ్యం పంపించేశారని విన్నాను సార్‌. అతని కోసం పోలీసులు విపరీతంగా వెతుకుతుండటంతో వాళ్లు అక్కడికి పంపేశారని తెలిసింది. భర్త కోసమే ధరణి అన్నల వర్గంలో చేరింది. ఒకసారి వాళ్లతో కలిసిన తరువాత మరి బయటకు రాలేకపోయింది.రెండేళ్ల క్రితం అనారోగ్యం చేయడంతో ఉద్యమ కార్యకలాపాలకు దూరం పెట్టారనీ తెలిసింది.’’

‘‘అది సరే రమేష్‌! ఇం‌దాక దూరంగా కొన్ని పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఏమిటవి?’’ అంతకు ముందు రామన్నను అడిగినట్లే రమేష్‌ను అడిగాడు ఉత్కంఠతో శ్రీధర్‌.

‘‘‌సార్‌! ఈ ‌ప్రాంతంలో నక్సలైట్లు ప్లీనరీ నిర్వహిస్తున్నారని పోలీసులకు తెలిసింది.దాంతో రెండు వ్యాన్‌లతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.పోలీసులు వస్తే వాళ్ల వాహనాలను పేల్చివేయడానికి నక్సలైట్లు మందుపాతరలు పెట్టి ఉంటారు. ఇందాకటి శబ్దాలు మందుపాతర్ల పేలుడుకు సంబంధించినవే. కానీ పోలీసులు ఆ వాహనాల్లో లేరు. ఇప్పుడు రెండు వైపుల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఆ ఎన్‌కౌంటర్‌ ‌సమాచారాన్ని కవర్‌ ‌చేసేందుకే ఇక్కడికి వచ్చాను. ఈ సమస్య రావణ కాష్టంలా రగిలిపోతోంది.దీనికి అంతం ఎప్పుడో? ఎన్నాళ్లో ఈ నరమేధం!’’ అన్నాడు రమేష్‌ ఆవేదనగా.

‘‘మీరు చెప్పింది నిజం రమేష్‌! ‌సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు, నక్సలైట్లు ఆలోచించుకోవాలి. లేకపోతే ఈ రావణ కాష్టం ఆరదు.దీని వల్ల ఎంతో మంది అమాయకులతో పాటు తెలివైన యువతీయువకులు పిట్టల్లా రాలిపోతున్నారు’’ అన్నాడు శ్రీధర్‌ ‌బాధగా.

‘‘సార్‌! ‌జర్నలిస్టుగా పదిహేనేళ్లుగా ఈ గిరిజన ప్రాంతాలను ప్రత్యక్షంగా గమనిస్తూ వస్తున్నాను. ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగడం లేదు. ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నా వాటిని అమలు చేయడానికి సరియైన యంత్రాంగం లేదు. నక్సలైట్లకూ, పోలీసులకు మధ్య ఘర్షణతో ఈ ప్రాంతం అభివృద్ధి లోలకంలా ఊగిస లాడుతోంది.

తుపాకీ పట్టుకుంటేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నక్సల్స్, ‌తమ బలగంతో శాంతి భద్రతలను అదుపులో పెట్టగలమని పోలీసులు అనుకుం టున్నారు. ఇక్కడ శాంతి గగన కుసుమం అనిపి స్తోంది. మాస్టారూ! పదండి.ఇక్కడికి దగ్గర్లోని ఓ పోలీసు అవుట్‌ ‌పోస్ట్ ‌వరకూ మీతో వస్తాను. లేక పోతే వాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు’’అన్నాడు రమేష్‌.

ఆ ‌నలుగురూ నడక ప్రారంభించారు.రానురాను ఎండ తీవ్రమౌతోంది. ఎండ పెరుగుతున్న కొద్దీ శ్రీధర్‌కు ఆయాసం ఎక్కువవుతోంది. అడుగులు భారంగా పడుతున్నాయి. శ్రీధర్‌ ‌నిరాశగా ఆ కొండల వైపు చూస్తూ అడుగులేస్తున్నాడు. అతనిలో బయలుదేరినప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు.

వాళ్ల అడుగుల చప్పుడు తప్ప ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు పేలుళ్ల శబ్దం వినిపించటం లేదు.

కొండల్లో రోజూ మరణ మృదంగ ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. మారణహోమ విస్ఫోటనాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ‘‘ఏ వెలుగులకీ ప్రస్థానం? ఏం సాధిస్తున్నారు ఈ నక్సలైట్లు?ఏం సాధించారు ఈ పోలీసులు?పరిపరి విధాల ఆలోచనలతో నడుస్తున్న శ్రీధర్‌కి, తాను ఎప్పుడో రాసుకున్న కవిత…..

‘‘ఎవ్వరి కోసం..ఎవరు ఎవరితో

సాగుతున్న ఈ మారణ హోమం

అడవితల్లి నుదుట దిద్దిన రక్తపు సిందూరం

అన్యాయాన్ని సహించని శౌర్యం

దౌర్జన్యాన్ని దహించే ధైర్యం?

శాంతి కోసం పోరాడే సైన్యం

ప్రజలను కాపాడే కర్తవ్యం

తుపాకీలు పట్టుకొని

కవాతు చెయ్యాలా?

వీళ్ల సమరం చూస్తున్న

సంఘం శిలలా నిలుచుంటే

నెత్తుటి అడవి సిగలో తురిమిన

అరుణ మందారం

ఈ సంధ్యా సిందూరం’’ గుర్తుకొచ్చింది.

అరగంట తరువాత వాళ్లు పోలీసు అవుట్‌ ‌పోస్ట్ ‌ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ప్రాంతం చదునుగా విశాలంగా ఉంది. అక్కడ రేకులతో రెండు షెడ్డులున్నాయి. అందులో తుపాకులు చేతపట్టిన పోలీసులు పదిమంది వరకు ఉన్నారు.

ఆ నలుగురిని చూసిన పోలీసుల్లో ఇద్దరు వాళ్ల దగ్గరకు వచ్చారు.

రమేష్‌ ఆ ‌పోలీసులకు నమస్కారం పెట్టి ‘‘సార్‌! ‌నా పేరు రమేష్‌.‌పత్రికా విలేఖరిని. వీళ్లు మా ఊరు వాళ్లే. రెబ్బ గ్రామం వెళుతునారు’’ అంటూ తన ఐడింటిటీ కార్డు వాళ్లకు చూపించాడు.

ఇంతలో అక్కడికి ఇంకో పోలీసు వచ్చాడు. ఆయన్ని చూడగానే రమేష్‌ ‘‘‌సార్‌! ‌వి•రేంటి ఇక్కడ ఉన్నారు?’’ అడిగాడు.

అతని పేరు నామ్‌దేవ్‌.అక్కడ అవుట్‌ ‌పోస్టులో పనిచేస్తునాడు.

రమేష్‌ని పోల్చుకున్న ఆయన ‘‘రమేష్‌! ‌నువ్వేంటి ఇక్కడికి వచ్చావ్‌? ఏదైనా విశేషమా?’’ అడిగాడు.

‘‘అవును సార్‌! ‌వీరి పేరు శ్రీధర్‌. ‌పదేళ్ల క్రితం కెంగువ స్కూల్లో టీచరుగా పని చేశారు. అ అమ్మాయిని పెంచుకుంటున్నారు.ఈమె తల్లి రెబ్బ గ్రామంలో అనారోగ్యంతో ఉంది. ఆమెను చూడటానికి వెళుతున్నారు.’’ అని వివరించాడు రమేష్‌.

‘‘అయినా ఈ సమయంలో ఎందుకు వెళుతునారు? మావాళ్లు వారం రోజుల పాటు ఇక్కడే క్యాంపు చేస్తునారు.నక్సల్స్ ‌చింతపల్లి దళం ప్లీనరీ జరుపు కుంటున్నట్లు మాకు సమాచారం అందడంతో మేమంతా ఇక్కడికొచ్చాము.ఆ దళం వాళ్లు ఇప్పటికే రెండుసార్లు మా వాహనాలను పేల్చి పదిమంది మా పోలీసుల్ని చంపేశారు. ఈ సారి వాళ్లని వదలం’’ అన్నాడు నామ్‌దేవ్‌.

‘‘‌సార్‌! ఆవిడకి ఒంట్లో బాగుండ లేదు.అందుకే చూడటానికి వెళుతున్నారు.వాళ్లని వెళ్లనివ్వండి. నేనిక్కడే ఉంటాను. అన్నట్లు… ఇందాక ఏదో ఎన్‌కౌంటర్‌ ‌జరిగినట్లుంది. వివరాలు ఏమిటి సార్‌?’’ అడిగాడు అంతకు ముందే తనకు సమాచారం తెలియనట్టు రమేష్‌.

‘‘ఔను రమేష్‌! ‌మా వ్యాన్‌ను పేల్చాలనుకున్నారు కానీ మా వాళ్లు తప్పించుకొని ఎదురు కాల్పులకు దిగారు. నలుగురు నక్సల్స్ ‌చనిపోయారు. మిగతా వాళ్లు తప్పించుకున్నారు. అందులో వాళ్ల నాయకుడు గణపతి ఉన్నాడు’’ చెప్పాడు నామ్‌దేవ్‌.

‘‘‌సార్‌! ఇలా రెండు పక్షాలు పరస్సరం ఘర్షణలకు దిగుతూ, చంపుకుంటుంటే ఈ గొడవకు ముగింపు ఎప్పుడు? దీని వల్ల సాధించేది ఏముంది?’’ అన్నాడు రమేష్‌.

‘‘‌దీనికి ముగింపు ఎన్నడో చెప్పలేం. ఈ పోరాటంలో మా కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది. నాలాగే ఎందరో గిరిజన అమాయక బిడ్డలు హింసకు బలయ్యారు’’ చెప్పాడు నామ్‌దేవ్‌.

‘‘‌సార్‌! ‌మాది కూడా కెంగువ గ్రామమే. విశాఖపట్నంలో డిగ్రీ చదివాను సార్‌! ‌నాకు ధరణి చెల్లెలు వరస అవుతుంది. అప్పట్లో మా నాన్న నక్సలైట్లకు సాయం చేశాడని పోలీసులు అరెస్ట్ ‌చేసి జైల్లో పెట్టారు. రెండు సంవత్సరాల తరువాత విడుదలయ్యాడు. పోలీసులకు తమ గురించి సమాచారం చెప్పాడన్న కోపంతో నక్సలైట్లు మా నాన్నని చంపేశారు. ఆ తరువాత నాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. వృత్తిలో భాగంగా నక్సలైట్ల వ్యతిరేక పోరాటంలో భాగస్వామి నయ్యాను. ఈ ఉద్యోగంలో చేరి ఆరేళ్లవుతున్నది. ఈ ఆరేళ్లలో జరిగిన దాడులు, ఎదురుకాల్పుల సంఘటనల్లో కనీసం పాతిక మంది పోలీసులు,యాభయ్‌ ‌మంది వరకూ నక్సలైట్లూ చనిపోయారు. అయినా ఈ సమస్యకు పరిష్కారం దరిదాపులో కనిపించటం లేదు.

ఒక పోలీసుగా నాకే ఈ పోరాటం నచ్చలేదు. వాళ్లేమో తుపాకీని వదలి కిందకు రారు. మా వాళ్లు అరెస్టులు ఆపరు. రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం ఈ గొడవలకి మరింత ఆజ్యం పోస్తున్నారు’’ ఆవేదనగా చెప్పాడు నామ్‌దేవ్‌.

‘‘‌నామ్‌దేవ్‌ ‌గారూ! పోలీసులు,నక్సలైట్ల మధ్య గొడవల్లో అమాయక నం తీవ్రంగా నష్టపోతు న్నారు. ఒక్కొక్కసారి రెండు వైపుల జరిగే సంఘటన లకు అమాయక జనం నష్టపోతున్నారు. గౌరి, ధరణి కుటుంబమే అందుకు ఉదాహరణ. సోమన్నకు నక్సలైట్లతో సంబంధం ఉందని అరెస్ట్ ‌చేసి ఎన్నో హింసలు పెట్టారు. దాంతో అతను భయపడి ఎక్కడికో వెళ్లిపోయాడు.తను నక్సలైట్లలో చేరిపోయా డని చెప్పుకుంటున్నారు. అతన్ని వెతుక్కుంటూ ధరణి కూడా అన్నల్లో కలిసిపోయింది. ఆమె కూతురే ఈ అమ్మాయి’’ వివరంగా చెప్పాడు శ్రీధర్‌.

‘‘‌నక్సలైట్లు తలదాచుకోవడానికి మా ఊళ్లలోకి వస్తుంటారు. కాదంటే వాళ్లకు కోపం. ఆశ్రయం ఇస్తే పోలీసులకు కోపం. దీంతో గిరిజనుల పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్కలా మారింది. ఈ విషయంలో తప్పొప్పుల సంగతి పక్కన పెడితే… మావాళ్లు చట్టప్రకారం నడవక తప్పదు. పోలీసులకు నక్సలైట్లు శత్రువులు కారు. మేము కేవలం ఉద్యోగులం. శాంతి భధ్రతలను కాపాడటం మా బాధ్యత. కానీ వాళ్లు మమ్మల్ని శత్రువులుగా పరిగణిస్తున్నారు. అందుకే వాళ్లు మందుపాతర లాంటివి పేలుస్తూ, మమ్మల్ని లక్ష్యంగా చేసుకోవడం, ప్రతిచర్యగా మేము వాళ్లని ఎన్‌కౌంటర్‌ ‌చెయ్యడం కొనసాగుతోంది. ఇందులో ఇద్దరిదీ తప్పు ఉంది’’అన్నాడు నామ్‌దేవ్‌.

‘‘‌సరే! సోమన్న విషయం ఏమిటి? అతన్ని ఎన్‌కౌంటర్‌ ‌చేశారనీ ప్రచారంలో ఉంది.నిజమేనా?’’ అని అడిగాడు శ్రీధర్‌.

‘‘అతడిని మా వాళ్లు ఎన్‌కౌంటర్‌ ‌చెయ్యలేదు. అతని గురించి వాళ్లే చెప్పగలరు. ధరణి రెబ్బ గ్రామంలో ఉందని తెలుసు. అయినా ఆ విషయాన్ని వెల్లడించలేదు. మీరు వెంటనే ఆ ఊరుకి బయలు దేరండి. ఆలస్యం కావడం మంచిది కాదు. పోలీసుగా నేను ఇలా చెప్పకూడదు కానీ దాని అన్నగా ఒక గిరిజన బిడ్డగా చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

‘‘పోలీసుల్లో కూడా ఇంత మంచి వాళ్లు ఉంటారా?’’ అనుకున్నాడు శ్రీధర్‌

‌తిరిగి ఆ నలుగురూ రెబ్బ వైపు బయలుదేరారు.

ఊరు దగ్గర పడుతుండటంతో శ్రీధర్‌లో ఉత్సాహం కలగసాగింది. మనిషికి గమ్యం కనిపించనంత కాలం విసుగ్గా ఉంటుంది. ఒకసారి గమ్యం కనిపిస్తే పయనం జోరందుకుంటుంది

* * *

శ్రీధర్‌ ‌మనస్సులో ఎన్నో ఆలోచనలు. తానేమిటి ఈ కొండల్లోకి రావడమేమిటి? ఎక్కడో స్కూలు టీచరుగా పనిచేస్తున్న తను ఇలా కొండల్లోకి ఎందుకు రావలసి వచ్చింది? అతనికి జరిగినదంతా కలలా అనిపించసాగింది. కొంత కాలం తరువాత మనిషికి గతం ఆశ్చర్యం కలిగిస్తుందనడానికి తన గతమే ఉదాహరణ అని అనిపించింది శ్రీధర్‌కి.

అన్నీ సవ్యంగా ఉండి, కౌసల్య తల్లి అయితే ఈ రోజు ఇలా రావలసిన అవసరం ఉండేది కాదు. అయితే తనకి పిల్లలు పుట్టి ఉంటే అన్న ఆలోచననే అతను భరించలేకపోయాడు. ఒకవేళ పుట్టి ఉంటే ప్రియని తాము పెంచుకునే వారు కాదు. ప్రియకి తల్లితండ్రులమయ్యే అదృష్టం దక్కేది కాదు. ప్రియ తమ కూతురు కావడం అదృష్టం. ఆమెతో ప్రతీక్షణం తమ దంపతులు ఆనందం అనుభవించాడు

ఎండ తీక్షణంగా తగులుతోంది. రమేష్‌ ఆలోచనల నుంచి బయటపడ్డాడు. దారి రాను రాను సమతలంగా మారుతోంది. ఇప్పుడు నడుస్తుంటే అలసట కలగటం లేదు. ఒక అరగంట ఓపిగ్గా నడిస్తే గమ్యం చేరుకోవచ్చు. ప్రియకి రామన్న రెబ్బ గ్రామాన్ని చూపించడంతో ఆమె అమ్మని చూడాలన్న ఉత్సాహంతో నడుస్తోంది.గ్రామ పొలిమేరలో గుబురు చెట్లు కనిపించాయి. అది ఒక కొండవాలు ప్రాంతం. అక్కడ నుంచి గ్రామం స్పష్టంగా కనిపిస్తోంది.

– ‌గన్నవరపు నరసింహ మూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.