కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో కలసి సెప్టెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లో రూ.245.50 కోట్లతో ఏర్పాటుచేసిన పది క్రిటికల్ కేర్ బ్లాక్‌లను, పన్నెండు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రవ్యాప్తంగా 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ అధికారులు, వైద్యులు, ఆరోగ్య నిపుణులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు తరలివచ్చారు. కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒంగోలు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, కర్నూలు, హిందూపూర్, విజయవాడల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఈ పది క్రిటికల్ కేర్ బ్లాక్‌లు ఏర్పాటుచేయగా, సీతమ్మపేట, గుంతకల్లు, పలమనేరు, అగనంపూడి, నందిగామ, చీరాల, అరకు, నరసరావుపేట, బనగాన పల్లి, అనపర్తి, తుని, గూడూరు ప్రాంతాల ఏరియా ఆసుపత్రుల్లో ప్రజారోగ్య ప్రయోగ శాలలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.
వీటిలో పన్నెండు ప్రయోగశాలలను నడ్డా చేతుల మీదుగా తాజాగా ప్రారంభించగా, మిగతావి ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్, అంటే పీఎం-అభీమ్ కింద ఈ సౌకర్యాలు రూపుదిద్దుకున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా ప్రజారోగ్య సంసిద్ధతను, ఆరోగ్య భద్రతా నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు ఇవి ఒక ముఖ్యమైన ముందడుగని నడ్డా అభివర్ణించారు. ఒకే రోజు 22 ఆరోగ్య సదుపాయాలు ప్రారంభం కావడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల ప్రజలకు మెరుగైన అత్యవసర, రోగనిర్ధారణ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ ప్రారంభోత్సవం కేవలం మౌలిక సదు పాయాల విస్తరణ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్‌లో, దేశంలో మరింత పటిష్టమైన ఆరోగ్య భద్రతా వ్యవస్థను నిర్మించే దిశగా వేసిన కీలక అడుగని నడ్డా పేర్కొన్నారు. క్రిటికల్ కేర్‌బ్లాక్‌లు రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడే సామర్థ్యాన్ని అందిస్తే, వ్యాధుల ముప్పు పెద్ద ఎత్తున విస్తరించి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారక ముందే ప్రజారోగ్య ప్రయోగశాలలు వాటిని గుర్తించి, స్పందించే సత్తువను ఇస్తాయని ఆయన వివరించారు. జిల్లా ఆసుపత్రుల్లో సురక్షితమైన క్రిటికల్ కేర్ సదుపాయాలు కల్పించడం ద్వారా మరణాలను తగ్గించడం, ప్రజారోగ్య వ్యవస్థ మొత్తం స్థితిస్థాపక తను, సామర్థ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నేర్చుకున్న గుణపాఠాలను గుర్తుచేసుకుంటూ, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎంత వేగంగా ఆర్థిక, సామాజిక, జీవనాధార సంక్షోభంగా, చివరికి జాతీయ సమస్యగా మారగలదో ఆ కాలం నిరూపించిందని, ఆరోగ్య భద్రతే జాతీయ భద్రత అని కోవిడ్ నేర్పిందని చెప్పారు.
ఆ సమయంలో సాధారణ ఆసుపత్రి మౌలిక సదుపాయాలను ఐసోలేషన్, కోవిడ్-కేర్ కేంద్రాలుగా మార్చవలసి రావడంతో, కోవిడేతర అనేక అత్యవసర సేవలు దెబ్బతిన్నాయని గుర్తుచేశారు. సాధారణ చికిత్సలకు అంతరాయం కలగకుండానే భవిష్యత్ మహమ్మారులను, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సత్తా ఆరోగ్య వ్యవస్థకు ఉండాలన్న ఆలోచనతోనే పీఎం-అభీమ్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఇకపై ఆసుపత్రులను కేవలం పడకల సంఖ్య ఆధారంగా కాక, క్రిటికల్ కేర్ సామర్థ్యం, ఆక్సిజన్, మెడికల్ గ్యాస్ వ్యవస్థలు, ఐసోలేషన్ సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, ప్రయోగశాల సామర్థ్యాల సమాహారంగా చూడాలని అన్నారు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాల పరంగా ఇది భారతదేశ విధానంలో ఒక ప్రాథమిక మార్పును సూచిస్తుందని పేర్కొంటూ, దేశం ఆసుపత్రి-కేంద్రీకృత విధానం నుంచి సమగ్ర ఆరోగ్య-వ్యవస్థ విధానానికి మారుతోందని వ్యాఖ్యానించారు.
పీఎం-అభీమ్ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 631 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తద్వారా దేశవ్యాప్తంగా క్రిటికల్ కేర్ సామర్ధ్యం గల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేస్తోంది.
ఐదేళ్ల ఈ పథకం కింద క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, ప్రజారోగ్య ప్రయోగశాలలు, పట్టణ, గ్రామీణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటవుతాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,271.80 కోట్లను కేంద్రం ఆమోదించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి సుమారు రూ.606 కోట్ల అంచనా వ్యయంతో 24 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరుకాగా, వీటిని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. వీటిలో ఇప్పుడు పది క్రిటికల్ కేర్ బ్లాకులు ప్రారంభమయ్యాయి. క్లిష్టమైన వైద్య సంరక్షణ సమాజానికి సమీపంలోనే అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నడ్డా తెలిపారు. అదేవిధంగా, రూ.32.50 కోట్లతో 26 ప్రజారోగ్య ప్రయోగశాలలు మంజూరుకాగా, వాటి నిర్మాణ పనులు పూర్త య్యాయని, పద్నాలుగు ఇప్పటికే సేవలందిస్తుండగా, మిగిలిన పన్నెండింటిని నడ్డా తాజాగా ప్రారంభించారు. మొత్తంగా ఈ రెండు విభాగాలకు కలిపి రూ.647.51 కోట్ల అంచనా వ్యయాన్ని కేంద్రం మంజూరు చేసినట్లు నడ్డా వెల్లడిం చారు.
వ్యాధి నిఘాను బలోపేతం చేస్తూ, అంటువ్యాధులకు, అంటువ్యాధులు కానటువంటి వాటికి జిల్లా స్థాయిలోనే సమగ్ర పరీక్షలు నిర్వహించడం ఐపీహెచఎల్‌ల ప్రధాన లక్ష్యమని, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు వెంటనే స్పందించేలా సీసీబీలు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచగా, వ్యాధులను గుర్తించడం, నియంత్రించడంలో ఐపీహెచఎల్‌లు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. ప్రజల ఇంటి వద్దకే ఆరోగ్య సేవలను చేరవేస్తూ నలభై ఒక్క ఆరోగ్య పరీక్షలను సులభతరం చేస్తున్న రాష్ట్ర సంజీవని కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ వినూత్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసే అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు. మిషన్ ఇంద్రధనుష్ కింద అధిక టీకా కవరేజీ సాధించ డంలో ఆంధ్రప్రదేశ్ కనబరిచిన నిబద్ధతను, పనితీరును కూడా ఆయన కొనియాడారు. పీఎం-అభీమ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వాన్ని, ఆరోగ్యశాఖ, అధికారుల కృషిని కూడా కేంద్రమంత్రి అభినందించారు.
జాతీయ స్థాయిలో ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, 2017 జాతీయ ఆరోగ్య విధానం నివారణ, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ సంరక్షణల మధ్య బలమైన అనుసంధానానికి పునాది వేసిందని నడ్డా తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సమగ్ర ప్రాథమిక సంరక్షణను ప్రజలకు చేరువ చేస్తుండగా, బలోపేతమైన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు రెఫరల్, సెకండరీ కేర్‌ను అందిస్తున్నాయని, జిల్లా స్థాయిలో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు అధునాతన ఇంటెన్సివ్ కేర్‌ను, ఐపీహెచఎల్‌లు వ్యాధి నిర్ధారణ పర్యవేక్షణను సమకూరుస్తాయని, ఇవన్నీ కలిసి నిరంతర సంరక్షణను, ప్రజారోగ్య సంసిద్ధతను అందిస్తాయని వివరించారు.
దేశవ్యాప్తంగా 1.75 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా 42 కోట్లకు పైగా ప్రజలకు మధుమేహం, అధిక రక్తపోటు పరీక్షలు, 36 కోట్లకు పైగా నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకుపైగా మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాను ప్రవేశపెట్టడం విశేషంగా పేర్కొన్న నడ్డా, పుట్టినప్పటి నుంచి పదహారేళ్ల వయసు వరకు పన్నెండు టీకాల రికార్డులను యూ-విన్ వేదిక ద్వారా డిజిటల్‌గా ట్రాక్ చేస్తున్నామని, పిల్లలు, గర్భిణీ స్త్రీలు టీకాలను సకాలంలో పొందేలా ఇది దోహదపడుతుందని తెలిపారు. సంస్థాగత ప్రసవాలు తొంభై శాతం దాటడం, ప్రపంచ సగటుతో పోలిస్తే మాతృ, శిశు, నవజాత మరణాల రేటు గణనీయంగా తగ్గడం, డబ్ల్యూహెచఓ 2025 నివేదిక ప్రకారం క్షయవ్యాధి తగ్గుదలలో భారత్ ప్రపంచ సగటు కంటే ముందంజలో ఉండటం, ఆరోగ్యంపై ప్రజల సొంత ఖర్చు 43.4 శాతానికి తగ్గుముఖం పట్టడం వంటి గణాంకాలను ఉదహరించారు. పన్నెండేళ్లలో పదహారు కొత్త ఎయిమ్స్‌లు ఏర్పాటు కావడంతో వాటి సంఖ్య ఇరవై మూడుకు చేరిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రయోగశాలలు సామర్థ్యాన్ని పెంచగలవు గానీ, అంతిమంగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేది ప్రజలేనని పేర్కొంటూ, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబొరేటరీ సాంకేతిక నిపుణులు, అత్యవసర సంరక్షణ బృందాలు, ఆశా కార్యకర్తలు, ఏఎనఎంలు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19 సమయంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తుచేసుకుంటూ, సామర్థ్యంతో పాటు కరుణ, గౌరవంతో సంరక్షణ అందించాలని ఆయన కోరారు. భారత ఆరోగ్య పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించ గలదని, రాష్ట్ర అనుభవం, ఉత్తమ పద్ధతులు జాతీయ ప్రయత్నానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్