కిర్గిస్థాన్ రాజధాని బిష్‌కేక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, డిజిటల్ సహకారం వంటి రంగాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో భారత్ చొరవతో మొత్తం 13 ముఖ్యమైన ఒప్పందాలతో పాటు 28 అధికారిక పత్రాలపై సభ్య దేశాలు సంతకాలు చేశాయి. సభ్య దేశాల భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను తిప్పికొట్టేందుకు ఒక యూనివర్సల్ సెంటర్’ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
ఉగ్రవాదం, వేర్పాటు వాదం, సరిహద్దు నేరాలను అరికట్టడానికి సభ్య దేశాల మధ్య నిఘా సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. సరిహద్దుల గుండా జరిగే మాదక ద్రవ్యాల అక్రమరవాణా, నార్కో-టెర్రరిజంను అడ్డుకోవడానికి ప్రత్యేక ‘యాంటీ నార్కోటిక్స్ సెంటర్’ కార్యనిర్వాహక కమిటీ నిబంధనలను ఆమోదించారు. సభ్య దేశాలలో మత్తుపదార్థాల వినియోగాన్ని తగ్గించడం, చికిత్స, పునరావాస రంగాల్లో ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి 2030 వరకు ఒక కార్యాచరణను రూపొందించారు. కృత్రిమ మేధ (ఏఐ) బాధ్యతాయుతమైన, సమగ్రమైన వినియో గంపై పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఇందులో భారత్ తన డిజిటల్, ఏఐ అనుభవాలను తోటి దేశాలతో పంచుకోనుంది. వాతావరణ అనుకూల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తూ ఎంఓయూ కుదుర్చుకున్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సభ్య దేశాలకు పరస్పర సహాయం అందించేలా ఒప్పందాలు జరిగాయి. ఎస్సీఓ చార్టర్‌లో అధికారిక భాషగా ఇంగ్లీష్‌ను చేర్చేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి. సభ్య దేశాల పురాతన సంస్కృతుల మధ్య మార్పిడిని ప్రోత్స హించడానికి ఈ ఏడాది చివరిలో భారత్ వేదికగా మొదటి ‘సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్’ నిర్వహించ నున్నారు.2025-26 కాలానికి కిర్గిస్థాన్ విజయ వంతంగా నిర్వహించిన ఎస్‌సీఓ అధ్యక్ష బాధ్యతలను, తదుపరి 2026-27 కాలానికి పాకిస్తాన్‌కు బదిలీ చేశారు.
భారత వాణిని వినిపించి నరేంద్ర మోదీ
ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ భారత వాణిని ప్రపంచ వేదికపై గట్టిగా వినిపించారు. భద్రత, అనుసంధానత, అవకాశం అనే వ•డు కీలక అంశాలపై భారత్ దృక్పథాన్ని స్పష్టంగా చాటిచెప్పారు. ఉగ్రవాద వ్యవస్థను సవ•లంగా అంతం చేయాలని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల ద్వంద్వ ప్రమాణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావుండకూడదని మోదీ ప్రపంచ దేశాలకు బలమైన సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలన్నీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాల నడుమ కూడా భారత్ 7.8 శాతం బలమైన జీడీపీ వృద్ధి రేటును సాధిస్తోందని వెల్లడించారు. ప్రాంతీయ ప్రయోజనాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలపడేలా కీలక చర్చలు జరిపారు.
‘స్విఫ్ట్’ కు ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్స్ పే’
బ్రిక్స్ కూటమి తరఫున సరికొత్త ఉమ్మడి కరెన్సీ రూపకల్పనపై ఎటువంటి అధికారిక నిర్ణయవ• తీసుకోలేదు. అయితే, అమెరికా డాలర్‌పై ఆధారపడ టాన్ని తగ్గించడానికి, సభ్య దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి బదులుగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై కీలక అడుగులు పడ్డాయి. బ్రిక్స్ కూటమికి ఒకే ప్రత్యేక కరెన్సీని తీసుకురావాలనే ప్రతిపాదనను భారతదేశం వ్యతిరేకించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ … భారత్ సొంత కరెన్సీ అయిన ‘రూపాయి’ని అంతర్జా తీయంగా బలోపేతం చేయడానికే ప్రాధాన్యత ఇస్తుందని, కొత్త బ్రిక్స్ కరెన్సీకి మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో బ్రిక్స్ దేశాల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను ఒకదానితో ఒకటి అనుసంధానించే ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. దీనివల్ల భారత్ ప్రవేశపెట్టిన ‘ఈ-రూపీ’ వంటి డిజిటల్ కరెన్సీలను ఉపయోగించి ఇతర బ్రిక్స్ దేశాలతో నేరుగా, సులభంగా వ్యాపార లావాదేవీలు జరుపుకోవచ్చు. పాశ్చాత్య దేశాల అధీనంలో ఉన్న స్విఫ్ట్ చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్స్ పే’, క్రాస్-బోర్డర్ పేమెంట్స్ ఇనిషియేటివ్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించారు. డాలర్ల అవసరం లేకుండా భారత్ (యూపీఐ), రష్యా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు తమ సొంత స్థానిక కరెన్సీలలోనే (ఉదాహరణకు రూపాయి-రూబెల్) తక్కువ ఖర్చుతో, క్షణాల వ్యవధిలో అంతర్జాతీయ చెల్లింపులు ముగించుకునేలా సాంకేతిక మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నారు. ఒక సాధారణ కరెన్సీ నోటుకు బదులుగా, కేవలం దేశాల మధ్య వాణిజ్య విలువను లెక్కించడానికి ‘యూనిట్’ అనే డిజిటల్ వ్యవస్థను నిపుణులు ప్రతిపాదించారు. దీని విలువలో 40% బంగారం మీద, మిగిలిన 60% బ్రిక్స్ దేశాల కరెన్సీల బాస్కెట్ మీద ఆధారపడి ఉండేలా ప్రణాళికలు సాగుతున్నాయి.
యూపీఐను ఆమోదించే అవకాశాలు అధికం
భవిష్యత్తులో బ్రిక్స్ కూటమిలో భారతదేశపు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చెల్లింపుల వ్యవస్థను ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దీనిని నేరుగా ఒకే అప్లికేషన్‌గా కాకుండా, ప్రతి బ్రిక్స్ దేశపు స్థానిక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలతో అనుసంధానించేలా చర్చలు జరుగుతున్నాయి. భారత్ తన యూపీఐ సాంకేతికతను ఈ బ్రిక్స్ పే వేదికతో అనుసంధానం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రష్యాకు చెందిన ‘ఫాస్టర్ పేమెంట్స్ సిస్టమ్’తో భారత యూపీఐని అనుసంధానించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. భారత రూపే కార్డ్‌లను, రష్యాకు చెందిన ‘మీర్’ కార్డ్‌లను పరస్పరం ఆమోదించు కునేలా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే రష్యాలో యూపీఐ వాడకం అధికారికంగా ప్రారంభమవుతుంది. బ్రెజిల్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘పిక్స్’ చెల్లింపుల వ్యవస్థ కూడా మన యూపీఐ లాంటి సాంకేతికతతోనే పనిచేస్తుంది. అలాగే, భారత్-బ్రెజిల్ మధ్య డిజిటల్ లావాదేవీలకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉంది. భారత్ వేదికగా ఈ నెల్లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఈ ‘క్రాస్-బోర్డర్ పేమెంట్స్’ (సరిహద్దు చెల్లింపుల) అంశంపై భారత్ కీలక ప్రతిపాదనలు చేయనుంది. ఇందులో యూపీఐ వ్యవస్థను బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీలతో అనుసంధానించే తుదినిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
చైనా అలిపేతో లింక్‌కు అంగీకరించని భారత్
ఆసియావ్యాప్తంగా15 కోట్లమందికి పైగా వ్యాపారుల వద్ద భారతీయ పర్యాటకులు నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకునేలా ‘అలిపే’ సంస్థ, భారత ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను పంపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భద్రతా సంస్థలు జాతీయ భద్రత, సైబర్ మోసాలు, డేటా లీకేజ్ కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేసాయి. చైనాకు చెందిన జాతీయ భద్రతా చట్టాల ప్రకారం, ఆ దేశంలోని టెక్ కంపెనీలు తమ ప్రభుత్వానికి, నిఘా సంస్థలకు సహకరించడం తప్పనిసరి. టిక్‌టాక్, ఆలిపే, వీచాట్ వంటి యాప్‌ల ద్వారా భారతీయ పౌరుల లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ వంటి సున్నితమైన సమాచారాలు చైనా ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం సమాచార సాంకేతిక చట్టం (ఐటీ యాక్ట్, 2000)లోని సెక్షన్ 69ఏ ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి ఈ యాప్‌లను బ్లాక్ చేసింది.
బ్రిక్స్ సదస్సుపై ప్రభావం
బిష్‌కెక్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు విజయాలు, అక్కడ కుదిరిన ప్రాంతీయ అవగాహనలు న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా జరగబోయే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుపై అత్యంత కీలకమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఎస్‌సీఓ సదస్సులో ప్రపంచనేతల మధ్య జరిగిన చర్చలు, వ్యూహాత్మక అడుగులు రాబోయే బ్రిక్స్ అజెండాను నిర్దేశించేలా ఉన్నాయి. ఎస్‌సీఓ ప్రధానంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిర్మూలనపై దృష్టి పెట్టగా.. భారత్ తన అధ్యక్షతన జరిగే బ్రిక్స్ చర్చలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లనుంది. రాబోయే బ్రిక్స్ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం’. ఎస్‌సీఓ లో సాధించిన పర్యావరణ, విపత్తునిర్వహణ, ఏఐ ఒప్పందాలను ఇక్కడ మరింత విస్తృతం చేయనున్నారు. ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఆత్మీయ సంభా షణలు తీవ్ర ఉత్సుకతను రేకెత్తించాయి. ఎస్సీఓ సదస్సు ఈ ముగ్గురు నేతల మధ్య ఉన్న సరిహద్దు, వ్యూహాత్మక విభేదాలను తగ్గించడానికి వేదికగా పనిచేసింది. దీనితో రాబోయే బ్రిక్స్ సదస్సులో భారత్ ఇటు రష్యా, చైనాలతో కూడిన కూటమిని నడిపిస్తూనే, అటు పాశ్చాత్య దేశాలతో తన సత్సంబంధాలను సమతుల్యం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఎస్‌సీఓలో పశ్చిమ ఆసియా సంక్షోభం, అంతర్జాతీయ రవాణామార్గాల రక్షణపై జరిగిన చర్చలు బ్రిక్స్ సదస్సులో నూతన ఆర్థిక, ఇంధన ఒప్పందాలు రూపుదిద్దుకోవడానికి మార్గం సుగమం చేస్తాయి.
ప్రత్యేక ఆకర్షణగా మోదీ
కిర్గిస్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల అధినేతల మధ్య ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ప్రవర్తన, చాతుర్యం తీవ్ర ఉత్సుకతను రేకెత్తించాయి. అధికారిక గ్రూప్ ఫోటో తీయడానికి ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ వెంటనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వారితో చేరారు. ప్రపంచం లోనే అత్యంత శక్తిమంతమైన ముగ్గురు నేతలు (రష్యా, చైనా, భారత్) ఒకచోట చేరి నవ్వుతూ, సాధారణ విషయాలు మాట్లాడుకోవడం చూసి అంతర్జాతీయ దౌత్య నిపుణులు ఆశ్చర్యపోయారు. తీవ్ర అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ ఈ ముగ్గురి కలయిక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సదస్సు వేదికపై పుతిన్, ప్రధాని మోదీని ఆత్మీయంగా హత్తుకుని స్వాగతించారు. పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో మోదీ స్పష్టమైన హితవు పలికారు. ‘యుద్ధంలో గడిచే ప్రతి రోజూ మానవాళిని వెనక్కి నెడుతుంది. మనం అంతం లేని యుద్ధం నుండి యుద్ధాల అంతం వైపు సాగాలి’ అని ముఖా ముఖిగా మోదీ అనడం గ్లోబల్ మీడియాలో హెడ్‌లైన్స్‌గా నిలిచింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నడుమ రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, యుద్ధాన్ని వ్యతిరేకించే భారత్ స్వతంత్ర విదేశాంగ విధానం ఆసక్తిని రేపింది.
పాకిస్తాన్ ఫోటో రాజకీయం
సదస్సు ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందులో వారు ప్రధాని మోదీని, ఇరాన్ అధ్యక్షుడిని ఫోటో నుండి ‘క్రాప్’ చేసి కేవలం షెహబాజ్ షరీఫ్ సెంటర్‌లో ఉండేలా ఎడిట్ చేశారు. కానీ ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో అందరితో కలిసి ఉన్న పూర్తి ఒరిజినల్ గ్రూప్ ఫోటోను పోస్ట్ చేశారు. దీనితో పాకిస్తాన్ చేసిన చిన్నపిల్లల చేష్టలు ప్రపంచం ముందు బయటపడి నవ్వులపాలయ్యాయి. సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గంభీరంగా ముందడుగు వేస్తూ నడిచి వెళ్తుండగా.. వెనుక ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అందుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్లిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒకవైపు భారత్ గ్లోబల్ లీడర్‌గా హుందాగా వ్యవహరిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఎలా ఆరాట పడుతుందో ఈ ఒక్క దృశ్యం స్పష్టం చేసిందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. సదస్సు జరుగుతున్న సమయంలోనే మోదీ ఇటు రష్యా, చైనాలతోపాటు అటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్, కిర్గిస్థాన్ అధ్యక్షుడు సాదిర్ జాపరోవ్‌లతో వరుసగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తీవ్రమైన భౌగోళిక రాజకీయ విభేదాలు ఉన్న దేశాల నేతలతో కూడా మోదీ ఏకకాలంలో సత్సంబంధాలు నడపడం అందరి లోనూ ఉత్సుకతను పెంచింది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్