మూడు దశాబ్దాలుగా ఎదురుచూసిన కల ఎట్టకేలకు సాకారమైంది. ఆగస్టు 31న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను, సెప్టెంబరు 2న పోలవరం ఎడమ ప్రధాన కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా జాతికి అంకితం చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వచ్చాక వరుసగా జరిగిన ఈ రెండు ప్రారంభోత్సవాలు రాష్ట్రంలోని కరవు పీడిత జిల్లాల చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోనున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి పలు ప్రభుత్వాలు ప్రతిపాదించి, పూర్తి చేయలేకపోయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశలు ఎట్టకేలకు వాస్తవ రూపం దాల్చాయి. కృష్ణా నదీ జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు చేర్చే ఏర్పాటు ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కరవు మండలాలకు ఊరటనివ్వగా, గోదావరి జలాలను తూర్పు కనుమలు దాటించి ఉత్తరాంధ్రకు తరలించే పోలవరం ఎడమ కాలువ తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాలకు కొత్త జీవం పోయనుంది. ఈ రెండు ప్రాజెక్టులు కలిసి రాయలసీమ అంచు ప్రాంతాలను, దక్షిణ కోస్తాను, ఉత్తర కోస్తాను కృష్ణా, గోదావరి జలాలతో అనుసంధా నించనున్నాయి. దశాబ్దాలుగా వర్షాధార బతుకులు గడిపిన ఈ ప్రాంతాల ప్రజలకు ఇకపై సాగు, తాగునీటి భరోసా లభించనుంది. గోదావరి-కృష్ణా, గోదావరి-వంశధార నదుల అనుసంధానంలో ఇవి కీలక ఘట్టాలుగా నిలుస్తాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పరిధిలో నెలకొన్న నీటి కష్టాలు వర్ణనాతీతం. మార్కాపురం, కనిగిరి, పొదిలి ప్రాంతాల్లోని చెరువులు వర్షాకాలంలో వరద నీటితో నిండినా, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అడుగంటి పోతాయి. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో తాగునీరు కలుషితమై, స్థానికులు ఏళ్ల తరబడి ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ‘వర్షం కురిస్తేనే పంట.. లేదంటే పస్తులే’ అన్నట్టుగా సాగింది ఇక్కడి రైతుల జీవనం. సాగునీరు లేక భూములు బీళ్లుగా మారడంతో పాటు, కరవు కాలాల్లో పశువులకు మేత దొరక్క, పోషణ భారమై, పలువురు రైతులు తమ పశు సంపదను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లే కుటుంబాలు సైతం ఈ ప్రాంతంలో తక్కువేమీ కాదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి గడువును 2020, 2022, 2023 సంవత్సరాల్లో పలుమార్లు ప్రకటించినా, అవి ఆచరణలోకి రాక ప్రజల ఎదురుచూపులు మరింత సాగాయి. ఫ్లోరైడ్ ప్రభావిత జలాలతో బాధపడుతున్న లక్షలాది మందికి సురక్షిత తాగునీరు, వేలాది ఎకరాలకు సాగునీటి భరోసా కల్పించడం వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా నిర్దేశితమైంది. మార్కాపురం గుండా ప్రవహించే గుండ్లకమ్మ నదిపై ఆధారపడిన చిన్న చెరువులు తప్ప, ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీటి వనరులు ఎన్నడూ లేకపోవడం ఒక చారిత్రక లోటుగా మిగిలింది.
అటు అల్లూరి సీతారామరాజు మన్యం, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో సాగునీరు కాదు కదా, తాగునీరు కూడా అందని ద్రాక్షగానే మిగిలింది. వర్షాభావంతో పొలాలు ఎండిపోవడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడం ఆనవాయితీగా మారాయి. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను తమ ప్రాంతానికి తరలించే పోలవరం ఎడమ కాలువ కోసం ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూశారు. “దశాబ్దాల కల నెరవేరింది” అని స్థానిక మీడియా అభివర్ణించి నంతగా ఈ ప్రాంత ప్రజలు దీని కోసం వేచి చూశారు. సాంకేతికంగా చూస్తే, ఈ కాలువ గోదావరి నీటిని నాలుగు నదులు దాటిస్తూ, తూర్పు కనుమల గుండా సాగుతూ ఉత్తరాంధ్రకు చేరుస్తుంది. పాయకరావుపేట వద్ద నిర్మించిన గేట్లను తెరిచి, ఏలేరు నదీగర్భానికి దిగువన సైఫన్ ఏర్పాటు ద్వారా ఈ జలాలను అనకాపల్లి వైపు మళ్లించారు. తాండవ, వరాహ, మామిడిగెడ్డ పరిధిలోని 46,620 ఎకరాలకు ఇది మేలు చేస్తుంది. గోదావరి, వంశధార నదులను అనుసంధానించి ఉత్తరాంధ్రకు శాశ్వత సాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది దీని అంతిమ లక్ష్యం. ఈ అనుసంధానం పూర్తయ్యాక అనకాపల్లితో పాటు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకూ గోదావరి జలాలు చేరనున్నాయి. అటు వెలిగొండ ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా వరద జలాలను నల్లమల సాగర్‌కు తరలించే గ్రావిటీ పద్ధతిలో రూపొందించిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. కరవు నుంచి విముక్తి పొందాలని దశాబ్దాలుగా ఎదురుచూసిన ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు ఈ ప్రాజెక్టు పూర్తి ఒక కీలక సమాధానంగా నిలుస్తుంది.
ఖర్చులు, జల లభ్యత విషయానికొస్తే, రూ.10,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసి, 18.8 కిలోమీటర్ల జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువలతో మొదటి దశను పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన లైనింగ్ పనులను,అందులో చిక్కుకున్న సొరంగం తవ్వే యంత్రం తొలగింపును హైకోర్టు అనుమతితో జూలై 2026 నాటికి పూర్తి చేశారు. ప్రస్తుతానికి 10.70 టీఎంసీల జలాలను నల్లమల సాగర్‌కు మళ్లించనుండగా, మిగిలిన పనులకు మరో రూ.1,900 కోట్లు అవసరమని, రెండో దశను 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 30 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మరోవైపు, కేంద్ర జల్ శక్తి శాఖ రూ.30,436.95 కోట్లకు సవరించిన అంచనాకు ఆమోదం తెలిపిన పోలవరం ప్రాజెక్టులో, తొలి దశను 41.15 మీటర్ల మట్టం వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఎడమ కాలువ నిర్మాణం కోసమే ఇప్పటి వరకు రూ.4,192 కోట్లు వెచ్చించారు. ఈ కాలువ ద్వారా 23.44 టీఎంసీల గోదావరి జలాలను సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు విని యోగించుకునే వీలుండగా, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది.నిర్వాసిత కుటుంబాలకు పరిహారం కింద పోలవరంలో రూ.1,373.01 కోట్లు, పునరావాస పనులకు అదనంగా రూ.1,581.08 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు కలిపి మొత్తం ఏడు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, ఇరవై లక్షలకుపైగా మందికి తాగునీటి భరోసా ఇవ్వనున్నాయి.
ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ, గోదావరి నుంచి దాదాపు 900 టీఎంసీల వరద జలాలు సముద్రం పాలయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి ఇప్పటి వరకు మొత్తంగా 160 టీఎంసీలకుపైగా జలాలు మళ్లగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసీలు మళ్లించారు. మొత్తంగా ఈ ఏడాది 32 టీఎంసీలు మాత్రమే వినియోగించగలిగినా, ఆ నీరు కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల డెల్టా పంటలకు కొంతమేర ఆసరాగా నిలిచింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే, వృథాగా పోయిన ఆ 900 టీఎంసీల్లో కనీసం 300 నుంచి 350 టీఎంసీలను కృష్ణా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు మళ్లించే వీలుండేదని మంత్రి పేర్కొన్నారు.
నిజానికి 2019 నాటికే పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయి. ఆ ఏడాది గెలిచిన వైసీపీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పనులు నిలిపివేసి, రివర్స్ టెండరింగ్ పేరుతో జూన్ నుంచి నవంబరు వరకు నిర్మాణ సంస్థ లేకుండానే వదిలేసింది. కాఫర్ డ్యామ్‌లలో ఖాళీలు పూడ్చకపోవడంతో 2020 సెప్టెంబరు వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని నీతి ఆయోగ్ నియమించిన ఐఐటీ హైదరాబాద్ నిపుణుల కమిటీ నివేదిక సైతం స్పష్టం చేసింది. ఫలితంగా ప్రాజెక్టు వ్యయం రెట్టింపునకు పైగా పెరిగింది. ఆ ఐదేళ్లూ వృథా కాకుండా ఉండి ఉంటే, కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు ఉత్తరాంధ్ర రైతులకు ఏళ్ల క్రితమే జలయోగం లభించేది. పదేళ్లుగా కృష్ణా డెల్టా రైతులు గోదావరి మిగులు జలాలపైనే ఆధారపడటం ఇక్కడ గమనార్హం.
వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ ఇదే తరహా జాప్యం స్పష్టంగా కనిపిస్తుంది. 2024 ఎన్నికలకు నెల ముందు, మార్చిలో సొరంగాల తవ్వకం పూర్తయిందంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం హడావిడిగా ప్రారంభోత్సవం నిర్వహించింది. కానీ టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, రెండో సొరంగంలో లైనింగ్ పనులు, ఫీడర్ కాలువల లైనింగ్, రిటైనింగ్ వాల్స్, వంతెనల నిర్మాణం వంటివి ఇంకా మిగిలే ఉన్నాయి. నీటి చుక్క విడుదల చేయకుండానే జరిగిన ఆ ప్రారంభోత్సవాన్ని “ఫేక” అంటూ రాజకీయ పార్టీలు విమర్శించాయి. 2024 జూన్‌లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం వెలిగొండను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, తొలి అసెంబ్లీ సమావేశం లోనే 2026 ఖరీఫ్ నాటికి మొదటి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాస పనులు వేగవంతం చేసి, ఇప్పటికే రూ.768 కోట్లను 6,206 మంది నిర్వాసితులకు అందించడంతో పాటు, ఈ ఏడాది బడ్జెట్‌లో మరో రూ.906 కోట్లు కేటాయించారు. ఫలితంగా, చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన సరిగ్గా 30 ఏళ్లకు, ఆగస్టు 31న ఆయన చేతుల మీదుగానే కృష్ణా జలాలు నల్లమల సాగర్‌లోకి ప్రవహించాయి. మాటలు కాదు, చేతల్లో నిరూపించిన ఈ రెండు ప్రాజెక్టుల పూర్తి, కరవు నేలలపై ఆధారపడ్డ లక్షలాది జీవితాల్లో వెలుగులు నింపనుంది. కరవు ప్రాంతాల ప్రజలకు ఇది కేవలం నీటి వనరు కాదు, వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేసే మలుపు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్