భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– పద్మావతి రాంభ
స్కూల్ నుండి రాగానే బ్యాగ్ సోఫాలో పడేసి, కాళ్ల నుంచి బూట్లు అటొకటి ఇటొకటి విదిలించి గదిలోకి వెళ్లిపోయింది ఆశ్రిత. ‘మళ్లీ ఈ పిల్లకి ఏదో అయింది’ అనుకుంటూ వాటర్ బాటిల్ పట్టుకుని గదిలోకి వెళ్లింది సుస్మిత.
‘‘ఆశూ ఏమైంది? ఎందుకలా ఉన్నావు? కాసిని నీళ్లు తాగు ముందు’’అంది దగ్గరగా నిలబడి బాటిల్ అందిస్తూ.
అభావంగా తల దించుకోవడం చూసి కూతురు వీపు మీద చెయ్యేసి నిమురుతూ
‘‘ఏమిటో చెప్పమ్మా? నా బంగారుతల్లి కదూ’’ అంది సుస్మిత మృదువుగా,
‘‘ఏం లేదమ్మా, ఎందుకో చిరాకుగా ఉంది’’
‘‘స్కూల్‌లో ఏమైనా అయిందా? ఎవరైనా ఏమైనా అన్నారా?’’
‘‘నథింగ్. ఏం లేదు. ఐయామ్ ఓకే’’
‘‘సరే. నీకు స్నాక్స్ పాలు తీసుకొస్తానుండు’’
‘‘నాకేమీ వద్దు. తినాలని లేదు’’
‘‘ అలా అంటే ఎలా? చూడు ఎంత అలసటగా ఉన్నావో. ముఖం కడుక్కుని ఫ్రెష్ అయితే కాస్త హాయిగా ఉంటుంది.
మధ్యాహ్నం ఎప్పుడో స్కూల్‌లో తిన్నావు. పొట్ట చూడు ఎలా లోతుకు పోయిందో. ఏదో ఒకటి తినాలి’’ అంటూ వంటింట్లోకి వెళ్లి తనకు ఇష్టమైన జంతికలు, పండ్ల ముక్కలు, పాలు తీసుకుని ఆశ్రిత దగ్గరకు వెళ్లింది.
‘‘వద్దన్నాను కదమ్మా. ఆకలి వెయ్యట్లేదు’’ అంది.
‘‘పోనీ వేడివేడిగా పకోడీలు చెయ్యనా?’’
‘‘వద్దు’’
‘‘పిజ్జా ఆర్డర్ చెయ్యనా?’’ అడిగింది సుస్మిత అలాగైనా దారికి వస్తుందని.
‘‘నాకేం వద్దు’’అని కూతురు అంటున్నా,
‘‘నా బంగారుతల్లి కదూ. తిను, నా కోసం ప్లీజ్’’ అంటూ పండ్ల ముక్కలు నోట్లో పెడితే మొత్తానికి ప్లేట్ తీసుకుని తనే నెమ్మదిగా తినడం మొదలు పెట్టింది.
మునుపు చాలా ఉత్సాహంగా ఉండే పిల్ల ఈ మధ్య ఎందుకు ఇలా డల్ గా ఉంటోందో సుస్మితకు ఏ మాత్రం అంతుపట్టట్లేదు.
* * *
సెల్ ఫోన్ రింగైతే తీసింది సుస్మిత. ఎవరా అని చూస్తే ప్రణతి కాలింగ్ అని ఉంది.
‘‘ప్రణతీ ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు?’’ అంటూ పలకరించింది స్నేహితురాలిని.
‘‘బావున్నాను. నువ్వెలా ఉన్నావు? అన్నట్టు నా డార్లింగ్ ఆశ్రిత ఎలా ఉంది?’’ అడిగింది ప్రణతి.
‘‘ఆశ్రితతో పాటు అందరం బావున్నాము. చాలా రోజుల తరువాత గుర్తొచ్చా కదా’’ అంటూ నిష్టూరమాడింది.
‘‘వద్దు తిట్టద్దు. అన్నట్టు నీకొక సర్ప్రైజ్ న్యూస్ చెబుదామని చేసాను’’
‘‘అవునా అదేమిటో త్వరగా చెప్పు’’
‘‘ముందు నువ్వు గెస్ చెయ్యి’’
‘‘ఏమిటో తెలియట్లేదు. చెప్పెయ్యచ్చు కదా ప్లీజ్’’
‘‘ఎల్లుండి బయలుదేరి నీ దగ్గరకు వస్తున్నాను. ఒక నాలుగు రోజులు నీ ఇంట్లోనే ఉంటాను’’
‘‘అవునా, నిజంగా మంచి సర్పజై. ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’’
‘‘సరే అయితే, వచ్చాక హాయిగా ఎంజాయ్ చేద్దాం. బోలెడు కబుర్లు చెప్పుకుందాం’’
ఫోన్ టీపాయ్ పైన పెట్టి టీవీ ఆన్ చేసింది సుస్మిత. కళ్లు టీవీ చూస్తున్నాయి కానీ మనసంతా ఆశ్రిత చుట్టే తిరుగుతోంది.
మళ్లీ ఫోన్ రింగైన శబ్దానికి ఆలోచనలలోంచి ఉలికిపడి టీవీ వాల్యూమ్ తగ్గించి, ఫోన్ వైపు విసుగ్గా చూసింది.
‘అమ్మ కాలింగ్’ అని చూసాక బటన్ నొక్కి
‘‘అమ్మా చెప్పు? ఏంటి విషయం?’’ అంది.
‘‘ఏమీ లేదమ్మా. ఊరికే చేసాను. ఆశ్రిత స్కూల్‌కి వెళ్లిందా? ఏం చేస్తున్నావు?’’ అడిగింది తల్లి.
‘‘అవును వెళ్లిందమ్మా. ఏమీ చెయ్యట్లేదు.టీవీ చూస్తున్నాను. అన్నట్టు ప్రణతి వస్తున్నానని ఫోన్ చేసింది’’ అంది ఆనందంగా.
‘‘అవునా! పోనీలే బాల్య స్నేహితురాళ్లిద్దరూ సరదాగా గడపండి. ఇంతకీ ఎన్నాళ్లు ఉంటుంది?’’
‘‘నాలుగైదు రోజులు ఉంటానంది. అవునమ్మా తనొస్తుందని తెలియగానే నాకు ఆనందంగా ఉంది’’
‘‘ఆ నాలుగు రోజలు అమ్మతో మాట్లాడవన్న మాట’’
‘‘ఎందుకు మాట్లాడనూ. ప్రణతి చేత కూడా మాట్లాడిస్తా’’
‘‘సరే సుస్మీ ఉంటాను. ఎవరో బెల్ కొడుతున్నారు’’
* * *
ప్రణతి రాగానే ఆత్మీయంగా కౌగిలించుకుంది సుస్మిత.
‘‘ఏమిటిలా చిక్కిపోయావు?’’ అంది ప్రణతి సుస్మితను తేరిపారా చూస్తూ.
‘‘కళ్ల చుట్టూ నల్లని వలయాలు వచ్చాయి కూడా’’ అంది సుస్మిత చుబుకం ఎత్తి పరీక్షగా చూస్తూ.
‘‘అదంతా నీ ప్రేమ తల్లీ! ఉండు మంచి అల్లం టీ తాగుతూ కబుర్లు చెప్పు కుందాం’’ అంటూ టీ కోసం స్టౌ మీద నీళ్లు పెట్టింది. ఇద్దరూ వంటింట్లోనే టీ తాగుతూ కబుర్లు నంజకున్నారు.
బెల్ మోగడం విని వెళ్లి తలుపు తీసింది సుస్మిత.
ఆశ్రిత లోపలకి రాగానే
‘‘హలో డార్లింగ్. ఏమిటి సంగతి? ఇంకా ఇదివరకులా అల్లరి చేస్తున్నావా నాటీగర్ల్?’’ అని చిలిపిగా నవ్యుతూ భుజం మీద చెయ్యేసి పలకరించింది ప్రణతి.
‘‘హలో అంటే’’ అంటూ ముక్తసరిగా పలకరించి గదిలోకి వెళ్లి తలుపేసుకున్న ఆశ్రితను చూసి ‘‘ఏమిటి స్మితా, ఆశ్రిత అంత డల్ గా ఉంది. ఇదివరకు నన్ను చూడగానే అంటీ అంటూ ఊపిరాడనీయ కుండా కబుర్లు చెప్పేది?’’
‘‘అదే నాకూ అర్థం కావట్లేదు ప్రణతీ. మా ఆయనకు ట్రాన్స్‌ఫరై వచ్చి ఇక్కడ స్కూల్‌లో జాయిన్ చేసామా!ముందు బాగానే ఉండేది. ఆ తరువాత ఏమిటో నెమ్మది నెమ్మదిగా ఇలా డల్గా తయారైంది. ఏమిటంటే చెప్పదు’’
‘‘వివరంగా చెప్పు.ఎప్పటి నుండీ ఇలా? చదువు ప్రెజర్ ఎక్కువ ఉందేమో, మదర్‌గా ముందు నీకే తెలుస్తుంది కదా?’’
‘‘నీకు తెలియంది కాదు కదా! చదువు అంటూ నేను తనని అసలు ఒత్తిడి చెయ్యను. తనంతట తనే శ్రద్ధగా చదువుకుంటుంది. మార్కులు తక్కువ వస్తే ఈసారి బాగా చదివి బెటర్‌గా తెచ్చుకుంటానని తనే చెప్తుంది. కానీ ఈ మధ్య చదువు మీద కూడా అంత ధ్యాస లేదు తనకు. ఎప్పుడూ ఏదే ఆలోచనలో ఉంటోంది’’
‘‘మరి స్కూల్‌లో టీచర్స్‌ని కలవలేకపోయావా? వాళ్లు ఏమైనా ఈ విషయంలో సహాయం చేసేవారేమో’’
‘‘అదీ చేసాను.వాళ్లు కూడా క్లాస్‌లో డల్‌గా ఉంటోంది. మీకే కబురు పెడదాం అనుకుంటున్నాం. మీరే ఈలోగా వచ్చారు అన్నారు’’
‘‘హ. చూద్దాం ఏమిటో. ఇంకా చెప్పు ఈ మధ్య తన గురించి నువ్వు గుర్తించిన విషయాలు’’
‘‘ఈ స్కూల్‌లో జాయిన్ అయ్యాక ముందు చాలా హుషారుగా ఉండేది. కొత్త ఫ్రెండ్స్ చేసుకున్నానని, వాళ్లంతా చాలా మంచి వాళ్లని చెప్పింది’’
‘‘ఊ ..ఇంకా. నీతో ఏం మాట్లాడేది. చిన్నచిన్న విషయాలు కూడా వదలకుండా గుర్తు చేసుకుని చెప్పు’’
‘‘ఆ… స్కూల్‌లో చేరిన నెల తరువాత అనుకుంటా, సంగీతం నేర్చుకుంటాను అంటూ మొదలుపెట్టింది. అంతకు మునుపు నేనెప్పుడో సరదాగా జాయిన్ చేస్తానన్నా, ఇంట్రస్ట్ లేదని చెప్పింది. ఏదో మావ•లుగా టీవీలో పాటలు చూడడం తప్ప తను ఎప్పుడూ కూనిరాగాలు తీయడం కూడా నేను చూడలేదు. నేను విని ఊరుకుంటే వదలకుండా పట్టుబట్టి సంగీతం క్లాస్‌లో చేరింది’’
‘‘ఓహ్ గుడ్. మంచిదేగా సంగీతం నేర్చుకుంటే’’
‘‘మంచిదే కానీ ఒక నెల సంగీతం క్లాస్‌కు సరిగ్గా వెళ్లిందో లేదో నా వల్ల కాదు అని మానేసింది. దానికీ మేము ఏమీ అనలేదు’’
‘‘పోనీలే తనకి నచ్చలేదేమో. ఫ్రెండ్స్ ఎవరో సంగీతంలో జాయిన్ అయి ఉంటారు. వాళ్లని చూసి సరదాపడి ఉంటుంది’’
‘‘మేము కూడా అదే అనుకున్నాం. కానీ ఈసారి డాన్స్ క్లాస్‌లో చేరతానని పేచీ పెట్టింది’’
‘‘మరేం చేస్తారు’’
‘‘నీకు తెలుసు కదా తనకి ఆయాసం వస్తూ ఉంటుందని. అదే చెప్పాం కానీ మొండిపట్టు పట్టింది. ఇక తన మాట కాదనలేక జాయిన్ చేసాను కానీ డాన్స్ టీచర్‌కి తనని ఎక్కువ కష్టపెట్టకుండా సింపుల్ స్టెప్స్ నేర్పించమని తన ఎదురుగానే చెప్పాను. ఈసారి పది రోజులు వెళ్లి ఇక వెళ్లనని తెగేసి చెప్పింది. ఏమిటో ఈ పిల్ల సంగతి అర్థ్ధం కావట్లేదు’’.
‘‘నేను కనుక్కుంటానులే. నువ్వు ఎక్కువ ఆలోచించి బాధపడకు’’
‘‘ఏమో నాకేం తోచడం లేదు. సరే నువ్వు మాట్లాడి చూడు. వాళ్ల డాడీ ఎంత అడిగినా కూడా నోరు విప్పట్లేదు తను’’
* * *
మర్నాడు ప్రణతి సుస్మితను తీసుకుని ఆశ్రిత స్కూలుకు వెళ్లింది. అక్కడ ప్రిన్సిపల్‌ను, టీచర్లను కలసి లంచ్ అవర్‌లో ఆశ్రిత ఫ్రెండ్స్‌ను కూడా కలిసి చాక్లెట్స్ ఇచ్చి కాసేపు సరదాగా కబుర్లు చెప్పింది
‘‘ఎందుకు అంటీని తీసుకుని స్కూల్‌కి వచ్చావమ్మా?’’ అడిగింది ఆశ్రిత తల్లిని.
‘‘ఊరికే వచ్చాం. మా ఫ్రెండ్ వాళ్లు ఈ ఊరికి వ•వ్ అవుతున్నారు. తను నాకు తెలిసిన మంచి స్కూల్స్ ఏమైనా ఉన్నాయేమో అని కనుక్కోమంది. నువ్వు చదువుతున్న ఈ స్కూల్ మంచి స్కూల్ కదా…ఒకసారి చూసి తన పిల్లలను జాయిన్ చెయ్యడానికి సజెస్ట్ చేద్దామని నేనే మీ అమ్మని వెడదాం అని అడిగాను’’ చెప్పింది ప్రణతి దానికి జవాబుగా.
ఇంటికి వచ్చాక
‘‘ఈ మధ్య ఆశ్రిత సెల్ ఫోన్ వాడుతోందా?’’ అనడిగింది ప్రణతి.
‘‘అవును. ఈ స్కూల్‌లో హోంవర్క్, పాఠాలలో అంశాలు ఫోన్‌లో పంపుతారు. అలాగే ఏ ముఖ్యమైన విషయమున్నా, అనుకోకుండా స్కూల్‌కు సెలవు ప్రకటించినా, వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు. అందుకే తనకి సెల్ ఫోన్ కొనిచ్చాం’’
‘‘తను ఏం చూస్తోందీ ఫోన్‌లో గమనించావా?’’
‘‘తను మా ఎదురుగానే సెల్ ఫోన్ వాడుతుంది. అప్పుడప్పుడు సరదాగా రీల్స్ అవీ చూస్తుంది. తనకి ఇన్ స్టా ఎకౌంట్, ఫేస్ బుక్ అకౌంట్ ఉంది. కానీ ఫోన్ లాక్ చేసుకోదు, అకౌంట్స్ అన్నీ ఓపెన్ అకౌంట్స్ కాబట్టి….’’
‘‘ఛ ఛ. తనేదో తప్పు చేస్తోంది. చూస్తోంది అని కాదు. హఠాత్తుగా తన ప్రవర్తనలో మార్పుకిఇ కారణం ఏమై ఉంటుందా అని’’
‘‘పరవాలేదు నాకు అర్థమైంది నువ్వు చెపుతున్నది. నా శ్రేయోభిలాషివి, ప్రాణస్నేహితు రాలివి కనుకే మా అమ్మకు కూడా చెప్పని విషయాలు నీతో పంచుకుంటాను’’
‘‘అంత ఉత్సాహంగా ఉండే పిల్ల ఇప్పుడు ఎందు కిలా ఉందో అని ఆలోచిస్తూ, తనకి సంబంధించిన విషయాలన్నీ వివరంగా తెలుసుకుంటున్నాను. రాత్రి అందరూ నిద్రపోయాక తన ఫోన్ తీసుకుని నా దగ్గరకు రా చెప్తాను’’ అంది ప్రణతి సాలోచనగా.
* * *
ఆశ్రిత ఫోన్ చెక్ చేసాక ప్రణతికి కాస్త విషయం అర్థమైంది. సుస్మితతో కొన్ని విషయాలు మాట్లాడి, చర్చించాక ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు.
ఆ రోజు ఆదివారం కావడం, సుస్మిత భర్త ఫ్రెండ్‌ను కలవడానికి బయటకు వెళ్లడంతో ఇంట్లో ముగ్గురే ఉన్నారు. ఆశ్రిత హోమ్ వర్క్ చేసు కుంటుంటే తన ఎదురుగా స్నేహితురాళ్లు ఇద్దరూ కబుర్లు మొదలుపెట్టారు.
‘‘స్మితా, భారతి తన భర్తతో ఈ మధ్య ఇన్‌స్టా వీడియోలు చేసి తెగ పాప్యులర్ అయింది తెలుసా’’ అంది ప్రణతి.
‘‘అవునా నేను అంతగా ఏవీ ఫాలో అవను ప్రణతీ’’
‘‘అలాకాదే. నువ్వు చిన్నప్పుడు చక్కగా పాడేదానివి కదా. ఎప్పుడైనా సరదాగా పాటలు పాడి వీడియోలు మీడియాలో పెట్టచ్చు కదా’’
‘‘చెయ్యచ్చేమో కానీ నాకు ఆశూతో టైమ్ స్పెండ్ చెయ్యడం ఇష్టం. వాటిలో పడితే ఇక అందులోకి వెళ్లిపోతానేమో అని అనిపిస్తుంది. ఇది వరకు అప్పుడప్పుడు రీల్స్ అవీ చూసేదాన్ని. కానీ చూస్తుంటే టైమ్ అసలు తెలిసేది కాదు. ఒకేసారి గంటసేపు ఫోన్ పట్టుకుని కూర్చున్నానా! అని ఆశ్చర్యంగా అనిపించేది. అందుకే నెమ్మదిగా అలవాటు తప్పించు కున్నాను. ఇప్పుడు తను స్కూల్‌కి వెళ్లాక ఏ మాత్రం టైమ్ ఉన్నా మంచి మంచి పుస్తకాలు చదువుతాను’’
‘‘అదీ నిజమేలే. రీల్స్ చూస్తున్నప్పుడు డోపమైన్ విడుదలైనా ఆ కాసేపు మాత్రమే. అది ఒక సుడిగుండం లాంటిది. తెలియకుండానే లోపలకు లాగేస్తుంది, నెమ్మదిగా అడిక్ట్ అయిపోతాం’’
‘‘కానీ మంచి మంచి విషయాలు కూడా తెలుస్తాయిగా సోషల్ ప్లాట్ ఫాంల వల్ల’’
‘‘అదీ నిజమే అనుకో కానీ దాని వల్ల వృథా అయ్యే సమయం కన్నా, అవే విషయాలను చదివి కూడా తెలుసుకోవచ్చు కదా. ఎక్కువ సోషల్ మీడియాలో గడిపే వాళ్లు డిప్రెషన్‌కు లోనవుతారుట తెలుసా. దేనికైనా కంట్రోల్ ఉండాలి. మన మనసు మన నియంత్రణలో ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రపంచం అటు వైపే పరుగులు తీస్తోంది’’
ఉన్నట్టుండి ఆశ్రిత ‘‘మా స్కూల్లో వినీల, సుజాత డాన్స్ వీడియోలు ఇన్ స్టాలో పోస్ట్ చేస్తారాంటీ. మా ఫ్రెండ్స్ అందరూ చూసి తెగ మెచ్చుకుంటారు. చాలా మంది చూసి వాళ్లలా పాప్యులర్ అవుదామని ట్రై చేస్తారు. వినీలా వాళ్లకి వేలల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు’’ అంది.
‘‘అవునా ఆశూ. కానీ అందరూ ఏది చేస్తే అది చెయ్యక్కరలేదు. డిఫరెంట్గా ఉండాలి. ‘డు నాట్ ఫాలో ద క్వ్రౌడ్’ అన్నది తెలుసు కదా’’
‘‘నిజమే ఆంటీ’’ అంది ఆశ్రిత సాలోచనగా.
* * *
ప్రణతి ఊరు బయలుదేరేటప్పుడు ‘‘హాలీడేస్‌లో చదువు’’ అంటూ రెండు మంచి పుస్తకాలు అశ్రితకు బహూకరించింది.
కొన్నాళ్ల తరువాత ప్రణతి సుస్మితకు ఫోన్ చేసింది.
‘‘ఎలా ఉన్నావు స్మితా? ఆశ్రిత ఎలా ఉంది?’’ అని అడిగింది.
‘‘నీ దయ వల్ల బాగానే ఉన్నాను తల్లీ. ఆశ్రిత ఇప్పుడు ఉత్సాహంగానే ఉంటోంది. అయినా ఏం మంత్రం వేసావే’’
‘‘ఏ మంత్రం తంత్రం లేదు. తను అడాలసెంట్ ఏజ్‌లో ఉంది. ఎదిగే వయసులోని హార్మాన్ల ప్రభావం వల్ల విసుగు చిరాకు ఒక వైపు, కొత్త స్కూల్‌లో అడ్జస్ట్‌మెంట్ మరొకవైపు తనని ఇబ్బంది పెడు తున్నాయి. దీనికితోడు పాత స్కూల్‌లో తనని అందరూ బాగా చదువుతుందని మెచ్చుకునేవారు. ఇక్కడకి వచ్చాక అది కొంచెం తగ్గింది. దాంతో ఆశూ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల బాధ పడుతోంది. వినీలా వాళ్లలా గుర్తింపుపొందాలనే ఆరాటంతో డాన్స్ నేర్చు కుంటాననీ మరేదో నేర్చుకుంటాననీ నీ దగ్గర మారాం చేసింది’’
‘‘అవునా. ఇవన్నీ నీకెలా తెలుసు?’’ అంది సుస్మిత ఆశ్చర్యంగా.
‘‘ఆ రోజు తన ఫోన్ చూసేను కదా ! సాధారణంగా మనం ఏ వీడియోలు చూస్తే అవే వీడియోలు ఫోన్ పంపిస్తూ ఉంటుంది. మన ఫోన్ మనలను గమనిస్తూ ఉంటుంది. అంతా ఇంటర్నెట్ మాయాజాలం. తను ఎక్కువగా వాళ్ల ఫ్రెండ్స్ వీడియోలు చూస్తోందని తెలుసుకున్నాను. తన ఫ్రెండ్స్‌ను ఆ రోజు స్కూల్లో కలిసాను కదా. వాళ్ల అకౌంట్స్ కూడా చూసాను. అన్నీ చూసాక నాకు కాస్త కాస్తగా విషయం అర్థమైంది. అదీకాక తన ఎదురుగా మనం మాట్లాడుకున్నవి వింటుందని తెలుసు. ఏదేమైనా ఆశ్రిత తెలివైన పిల్ల. ముడుచు కుంటున్న తన రంగురెక్కలను తెరిచి తనే ఎగరడం నేర్చుకుంటుంది’’
‘‘తల్లీ! నీకు శతకోటి నమస్కారాలు. అయినా తమరు సైకాలజీలో పీ•హెచ్‌డీ• కదా’’
‘‘అదేం కాదు కానీ ఈ సోషల్ మీడియాలోకి మనం ఎప్పుడు తొంగి చూసినా, ప్రపంచమంతా ఎంతో సంతోషంగా ఉన్నట్టు, మన జీవితాలలోని లోటుపాట్లు పెద్దవిగా అనిపిస్తాయి. ఎవరూ దీనికి మినహాయింపు కాదు’’
‘‘అదీ నిజమేలే. ఆ రీల్స్ అవీ ఇన్ స్టాలో, ఫేస్ బుక్‌లో చూడడం అలవాటు అయిపోతే అడిక్షన్ నుండి బయటపడడం కూడా కష్టమే. అన్నట్టు అశూ ఇప్పుడు చిన్న చిన్న కవితలు కథలు రాస్తోంది’’
‘‘మంచిదేగా. కానీ తనని గమనించడం మాత్రం మానకు’’