భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


ఒక రూపూ రేఖా లేని దెయ్యాల్లాంటి భయాలు పిచ్చికుక్కల్లా నా మీద పడి నిర్దాక్షిణ్యంగా కరిచేస్తున్నాయి!

కన్ను వ•యాలంటే భయం! మాగన్నుగా నిద్రపడితే చెప్పలేనంత భయాందోళన!

వ•సుకుపోతున్న కనురెప్పలకు దారం కట్టి బలవంతంగా నిద్ర ఆపుకుంటున్నాను. రెప్పవాలితే చాలు కళ్ల ముందు పిచ్చిగా నర్తించే భయంకర దృశ్యాలు!

‘‘అమ్మాయ్‌!’’

‌తీయని పిలుపు అమృతంలా వినిపించింది. సందేహం లేదు. అది అమ్మదే. తుళ్లిపడి చూశాను.

గది గుమ్మంలో వెన్నెల నవ్వులు చిందిస్తూ అమ్మ!

నెలలు నిండిన మనిషినన్న సంగతి మరచి గబుక్కున మంచం దిగి అమ్మ దగ్గరకు దూసుకెళ్లాను. ‘జాగ్రత్త జాగ్రత్త’ అని అమ్మ హెచ్చరిస్తున్నా పట్టించు కోకుండా వెళ్లి అమ్మని వాటేసుకున్నాను.

‘‘నీ ఆరోగ్యం ఎలా వుంది తల్లీ!’’

‘‘బాగుంటే నిన్నెందుకు రమ్మని పోరు పెడతానమ్మా !’’ నిష్టూరంగా అన్నాను.

‘‘ఏమైంది తల్లీ!’’ నా బుగ్గలు నిమిరి లాలనగా అడిగింది.

కళ్లల్లో కన్నీటి కుండలు భళ్లున పగిలాయి. అమ్మని కావలించుకుని బావురుమన్నాను.

‘‘ఏమైందే …!’’ కంగారు పడింది.

‘‘నాకేదో అయిపోతున్నట్టు పిచ్చి కలలు! బిడ్డ ఎలా ఉంటుందోనని ఒక్కటే ఆందోళన!’’

చెంపల మీంచి జల జల జారిపోతున్న కన్నీళ్లు తుడిచి నవ్వింది.

‘‘నా బాధలూ, భయాలూ ఏకరువు పెడుతోంటే అదేదో గొప్ప సంగతైనట్టు అపురూపంగా నవ్వుతావేంటమ్మా!’’ విసుక్కున్నాను.

‘‘తొలికాన్పు కదా! అలాగే ఉంటుందిలే. నేను వచ్చేశానుగా. అమ్మ రాక్షసిలా నిన్ను కాపలా కాస్తాను. నీకేం కాదు. కానివ్వను!’’ అరచేత్తో ముఖం నిమిరింది.

నన్ను మెల్లగా నడిపించి మంచం మీద కూర్చోబెట్టింది.

‘‘నీ కిష్టమైనవన్నీ చేసి తెచ్చాను. తెస్తానుండు…’’ అమ్మ వెళ్లబోతే ఆపి కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకున్నాను.

శేషతల్పం మీద పవళించిన అనుభూతి కలిగింది!

ఇంక నాకేం ఫరవాలేదు. నా పక్కన కొండంత అమ్మ ఉంది! నిశ్చింతగా నిట్టూర్చాను.

‘‘ఇంకొద్ది రోజుల్లో అమ్మ కాబోతున్న దానివి. మరీ ఇంత బేల అయితే ఎలాగే. సుఖప్రసవం జరగటానికీ, పాలు బాగా పడటానికీ నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తున్నావా?’’

అవేంటో కూడా గుర్తు లేవు.ఫోన్‌ ‌చేసిన ప్రతిసారీ ఏవో జాగ్రత్తలు చెబుతూనే ఉంది. ఆ మాట చెప్పలేక తలాడించాను.

నెత్తిమీద చిన్నగా మొట్టింది. ‘‘నీ ముఖం. అవన్నీ పాటిస్తే ఇంత నీరసంగా ఎందుకుంటావు? ఇది చాలా ముఖ్యమైన దశ. నువ్వు బలంగా ఉండాలి. నీ బిడ్డా బరువు తూగాలి. వాడి చిన్ని బొజ్జకు సరిపడే పాలు పడాలి!’’

‘‘ఇంకా నాకు పురుడు రాలేదనీ, నేను గండం గడిచి గట్టెక్క లేదనీ మరచి నువ్వు చాలా దూరం వెళ్లిపోతున్నావు!’’

‘‘అది గండం కాదే పునర్జన్మ. స్త్రీత్వాన్ని సార్థకం చేసే పావన మాతృ అవతారం!’’

చిత్రంగా చూశాను. మనసులో ఆనందపు చిరుగంటలు గణగణమని మోగాయి !

‘‘అమ్మా! నాలాగానే కడుపులోని బిడ్డా భయాలతో అశాంతితో అలమటిస్తుంటుందా?’’

‘‘నీ పిచ్చి అనుమానాలకి నవ్వొస్తోంది. ఉండు అన్నం కలిపి తెస్తాను. ఇవాళ నా చేతులతో తినిపిస్తాను’’

‘‘అయితే అమాంతం చిన్నపిల్లని అయిపోతాను’’ అల్లరిగా నవ్వాను.

‘‘నా కళ్లకు నువ్వెప్పుడూ పసిపాపవే!’’

మంచం మీద కూర్చునే అన్నం తినిపిస్తూంటే మైమరచిపోతూ అమ్మ ముఖాన్నే తనివితీరా చూస్తూ తింటున్నాను.

‘‘ఇందాక అడిగిందానికి జవాబు చెబుతున్నా. దేవుడి గర్భగుడిలో నిలబడ్డ వారికెవరికైనా భయాలూ ఆందోళనలూ ఉంటాయా!’’

తల అడ్డంగా ఊపాను.

‘‘నీ బిడ్డ ఇప్పుడు ఈ మాతృదేవత గర్భగుడిలో నిశ్చింతగా ఉంది. చీకటి భయాలు గాని భవిష్యత్తు భయాలు గాని ఏమీ ఉండవు. నన్నడిగితే మనిషి మనిషిగా ఉండేది ఆ తొమ్మిది నెలలే. పిల్లలూ దేవుడూ చల్లనివారే అని ఓ సినిమా పాట. చిన్నప్పుడు పిల్లలంతా అత్యాశలూ, స్వార్థాలూ లేకుండా త్యాగ పరోపకార గుణాలతో ఉంటారు. పెద్దయ్యే కొద్దీ వికృతంగా తయారవుతారు!’’

‘‘చాలా చక్కగా విశ్లేషించావు. ఇవన్నీ నీకెలా తెలుసమ్మా?’’ అమాయకంగా అడిగాను.

నవ్వింది. ‘‘ఇక నుంచి నీకూ చాలా తెలుస్తాయిలే!’’ నుదుటి మీది జుట్టును సరిచేస్తూ అంది.

నా హబ్బీ అజయ్‌ ఆఫీసు నుంచి వచ్చారు. అత్తగార్ని చూసి ఆశ్చర్యానందాలతో అన్నారు

‘‘థాంక్‌ ‌గాడ్‌! ఎప్పట్నుంచో రిక్వెస్ట్ ‌చేస్తుంటే ఇప్పటికొచ్చారన్నమాట!’’

‘‘మీ మావగారికి సమయానికి అన్నీ అమర్చి పెట్టడానికి నా కజిన్ని ఇంట్లో పెట్టి వచ్చాను. బరువు బాధ్యతలు పెరిగేక ఎక్కడికి వెళ్లాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి గదయ్యా!’’

‘‘ఇదీ బాధ్యతే కదా…!’’

‘‘అందుకే వచ్చేశాను. అయినా మీ అమ్మగార్ని పిలుచుకోమని చెప్పానుగా’’

‘‘పిలిచాను. ఈటైంలో కన్నతల్లే పక్కనుండాలి అన్నారు’’

‘‘అదీ నిజమేలే. తల్లితోనే అన్నీ చెప్పుకోగలరు’’

టీ తాగుతూ, ‘‘మీకేమనిపిస్తోంది ఆంటీ. సుజిత కడుపులో ఉన్నది ఎవరనుకుంటున్నారు?’’ నా వంక చిలిపిగా చూసి ఆసక్తిగా అడిగారు అజయ్‌.

‘‘ఎవరైనా ఈ అమ్మ ప్రసాదమే’’ నవ్వి అంది.

‘‘మనం ఏదేదో ఊహించుకుని తృప్తి పొందుతాం గాని, కొడుకైనా కూతురైనా ఒకటేనయ్యా!’’

‘‘తేడా ఏం లేదంటారా?’’

‘‘ఒకేలా పుడతారు. ఒకే పాలు తాగుతారు. ఒకే తల్లి కన్నవాళ్లు గనుక ఒకేలా పెరుగుతారు. పెద్ద చదువులు చదువుతారు. ఆ తరువాత వారు ఎన్ని మెట్లు ఎక్కినా మీరు ఆగిపోయేది మొదటి మెట్టు దగ్గరే!’’

అమ్మ లేచి లోపలికెళ్లగా అన్నారు ‘‘ఆంటీ అలా మాట్లాడుతున్నారేంటి. మీ అన్నయ్య సరిగా పట్టించుకోవట్లేదా!’’

‘‘మీరే అడక్కపోయారా!’’

‘‘పరిహాసాలొద్దు. సీరియస్‌గా చెప్పు’’

‘‘మనిషి ఎదిగే కొద్దీ స్వార్థం పెరిగి మనస్సు కుంచించుకుపోతుందిట! అత్తయ్య మామయ్యలను మనం ఎలా చూస్తున్నామో మనకు తెలీంది కాదుగా! అది మనకు ఇంకా బాగా తెలియాలంటే మన పిల్లలకు పెళ్లిళ్లవ్వాలి!’’ గల గలా నవ్వేశాను.

‘‘బిడ్డకి బొడ్డు కోయకుండానే పెళ్లి పీటలు ఎక్కించేస్తున్నావన్నమాట. ఎంతైనా మీ అమ్మలు అమ్మలే. మీకు వందనం!’’ చేతులు జోడించి దణ్ణం పెడుతోంటే వారించాను.

అమ్మ వచ్చాక నా మనశ్శరీరాలు రెండూ తేలికపడ్డాయి. హాయిగా కంటి నిండా నిద్రపోతున్నాను.

పాలక్‌ ‌పన్నీరు, వెల్లుల్లి పాలకూర, పాలకూర వేసిన పప్పు, బంగాళదుంప మెంతికూర, కొబ్బరిపాలతో వండిన కూరలు, మునగాకు కూర ఎక్కువగా వండేస్తోంది అమ్మ.

తినలేక పోతున్నానన్నా వినటం లేదు. ‘‘రేపు పాలు బాగా పడాలంటే ఇవాళ్టి నుంచే ఇవి ఎక్కువగా తినాలి’’ అంటూ క్లాసు పీకుతోంది!

‘‘అయ్యిందా నీ పెళ్లి’’ అన్నట్టు చూస్తున్నారు అజయ్‌.

‘‘ఇడిడి దగ్గరపడింది. డాక్టర్‌ ‌వెంటనే జాయినవ్వమంటుందేమో’’ అనుకుంటూ ఆసుపత్రికి వెళ్లాం.

డాక్టర్‌ ‌స్టెత్తో నా కడుపు మీద చెక్‌ ‌చేసింది. మరే మనిపించిందో గాని మళ్లీ మళ్లీ చూసింది.

‘‘ఏమైంది డాక్టర్‌’’ ఆం‌దోళనపడ్డాను.

‘‘కంగారు పడాల్సిందేమీ లేదు గాని బిడ్డ కదలికలు ఎక్కువయ్యాయా లేదా!’’

‘‘ఈ మధ్య కొంచెం తగ్గాయి…’’ జవాబిచ్చాను. నా స్వరం ఎందుకో నాకే వింతగా అన్పించింది!

‘‘రేపే జాయిన్‌ ‌చెయ్యండి. సిజేరియన్‌ ‌చేయాల్సొచ్చేలా ఉంది’’

‘‘అదేవిటి డాక్టర్‌. ఇడిడికి ఇంకా పది రోజులుందిగా’’ వెంటనే అన్నారు అజయ్‌.

‘‘‌చూద్దాం… ముందైతే జాయినవ్వండి…’’

‘‘బిడ్డ ఎదుగుదల సక్రమంగానే ఉందిగా!’’ అమ్మ లోగొంతుతో అడిగింది.

‘‘ఇప్పుడే ఏం చెప్పలేను. రేపొస్తారుగా. మరిన్ని టెస్టులు చేద్దాం’’

మరో మాటకు అవకాశం ఇవ్వలేదు.

‘‘తొలికాన్పు. బిడ్డ బాగా భయపడుతోంది…’’ ఇంకేదో అనబోయి ఆగింది అమ్మ.

‘‘ఆ మాత్రం టెన్షన్‌ ఉం‌టుంది. అది సహజం….!’’

డాక్టర్‌ ఏదో దాస్తున్నట్టుగా అనిపించింది. బహుశా అమ్మకీ, ఆయనకీ అలాగే ఉందేమో కాని ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

ముగ్గుర్లోనూ ఆకలి, ఉత్సాహం అమాంతం చచ్చిపోయాయి.

నా చిన్ని బుజ్జికి ఏం కాదు కదా! ‘‘దేవుడా చల్లగా చూడు! బిడ్డతో నీ కొండకొస్తాం. మా తలనీలాలు సమర్పిస్తాం!’’ వ•గగా మొక్కుకున్నాను.

కళ్ల నుంచి ధారలు కట్టడం చూసి కలవరపడింది అమ్మ.

‘‘ఏదేదో ఊహించుకుని భయపడతావేంటి పిచ్చి పిల్లా. ఇప్పుడేమైందని!’’ కళ్లు తుడుస్తూ అంది.

‘‘ఏమీ కాదని నా మీద ఒట్టేసి చెప్పమ్మా’’ నా వంక కించిత్తు భయంగా చూసి కళ్లు వ•సుకుని నా తల మీద చెయ్యేసింది అమ్మ ‘‘నీకు ఏమీ అవ్వదు. నీ బిడ్డకూ ఏమీ కాదు. దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు!’’

కించిత్తు భరోసా చిక్కింది. కాని పాత భయాలన్నీ ఒక్కసారిగా నిద్రలేచి ఒళ్లు విరుచుకోసాగాయి!

మర్నాడే ఆసుపత్రిలో జాయినయ్యాను. ఏవో టెస్టులు చేశారు. అమ్మ, అజయ్‌లతో ఏవో మంతనాలాడారు.

‘‘ఇవాళే సిజేరియన్‌ ‌చేసేస్తారట….!’’

‘‘నొప్పులు రావట్లేదు కదా!’’

‘‘అందుకనే’’ నిర్లిప్తంగా అంది అమ్మ. అజయ్‌ ‌ముఖం చాటేశారు .

అమ్మ చెయ్యి పట్టుకుని లాగి, ‘‘నిజం చెప్పమ్మా. ఎలాంటి వార్త అయినా సరే తట్టుకోగలను. ధైర్యంగా వుంటాను. ప్రామిస్‌… ‌చెప్పమ్మా’’ అర్థించాను.

నా తల నిమురుతూ ఎటో చూస్తుండిపోయింది!

సిజేరియన్‌ ‌చేశారు. నాకింకా మగతగానే ఉంది. ‘‘పాపా బాబా…!’’ ఆత్రుత అణచుకోలేకుండా ఉన్నాను.

‘‘పాప…’’

‘‘ఏదీ ఎక్కడుంది నా చిన్నారి…!’’

చుట్టూ వెతుకుతోంటే, ‘‘చనిపోయింది…’’ బాధగా చెప్పింది నర్సు.

‘‘నో… అలా జరగదు. జరగడానికి వీల్లేదు…!’’ అరచి గోల చేస్తోంటే డాక్టరొచ్చి సెడటివ్‌ ఇచ్చింది. మత్తుగా పడుకుండి పోయాను.

నా బిడ్డను ఎవరో కత్తితో కసబిసా పొడుస్తున్నట్టు కల వచ్చింది. చటుక్కున లేచాను. చుట్టూ పిచ్చిగా చూశాను. ఏ పక్క నుంచైనా నా బిడ్డ ‘అమ్మా’ అంటూ వస్తుందేమోనన్న ఆశతో వెదికాను. పిమ్మట నోరు నొక్కుకున్నాను. ఆ పైన జీవశ్చవం అయ్యాను!

మాకెవరికీ ఆకళ్లు లేవు. మాటలసలే లేవు. అందరం తలో పక్కన కన్నీరు మింగుతూ కూర్చున్నాం.

తెల్లవారు జామున రొమ్ములు బరువెక్కాయి. కాస్సేపటికే ఎంతో నొప్పిగా ఏదో సలపరంగా అనిపించింది. అమ్మకు చెప్పి, ఏదైనా మందు ఇస్తారేమో కనుక్కోమన్నాను.

నా వంక జాలిగా చూసి బాత్రూంకి తీసుకెళ్లింది.

‘‘గోడ మీదకు పిండేసేయ్‌’’

‌కన్నీళ్లు కన్పించకుండా తల తిప్పుకుని గబగబా బయటికి నడిచింది.

దిగ్భ్రమగా నిలబడిపోయాను. నొప్పి ఎక్కువవుతోంది. రిలీజ్‌ ‌చేసుకోక తప్పదని, గుండె దిటవు చేసుకుని గోడవైపు తిరిగి పిండాను.

చివ్వున చిమ్మాయి చనుపాల ధారలు!

నా బిడ్డ కడుపు నింపాల్సినవి వృథాగా డ్రైనేజ్‌లోకి•…!

దుఃఖం ఆగలేదు. కాస్సేపటికి ఏదో అనుమానం రాగా పాల వంక చూశాను. పచ్చగా ఉన్నాయి.

కంగారుపడ్డాను. తెల్లగా లేవేం? ఇదేమీ రోగం కాదు కదా? ఇవే నా బిడ్డని పొట్టన పెట్టుకో లేదు కదా?

తిరిగొస్తూనే అమ్మని నిలదీశాను.

‘‘బాలింత పాలు అలాగే ఉంటాయి. వాటిలో రోగ నిరోధక యాంటీ బాడీలు ,మరెన్నో ఔషధాలు, పోషకాలు ఉంటాయి. అవి బిడ్డ సక్రమ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. అందుకే తల్లి పాలను మించింది లేదని చెప్పేది! చూశావా భగవంతుడి లీల. పిల్లలకు రెడీమేడ్‌ ఆహారాన్నే కాదు ప్రాథమిక ఔషధాలూ ఇస్తోంది తల్లి!’’

వెక్కి వెక్కి ఏడ్చాను. ‘‘ఇక్కడ ఉండలేను. మనింటికి వెళ్లిపోదాం…’’

‘‘కుట్లు విప్పాలి కదే. 4,5 రోజులు తప్పదు…’’

‘‘ఇది ఆసుపత్రి కాదు నా బిడ్డను చంపిన వధ్యశాల!’’ కసిగా అన్నాను.

‘‘అదిగో ఆ తొట్టెల్లోని చంటి పిల్లలంతా ఇక్కడ పుట్టినవారే. మన దురదృష్టానికి ఇంకొకర్ని నిందించడం మంచిది కాదు’’

ఆ తొట్టెల వంక అసూయగా చూశాను. నా బిడ్డ పోయాడు. కాని వారంతా చక్కగా బతికే ఉన్నారు! దేవుడా, నాకింత అన్యాయం చేశావేంటి! ఒకేసారి అందర్నీ మింగేసి నీ కక్ష తీర్చుకోలేక పోయావా!

నేను రోదిస్తోంటే నా వేదన చూడలేక అజయ్‌ ‌బయటికెళ్లిపోయారు .

నర్సు వచ్చింది. సందేహిస్తూ చూస్తోంటే, ‘‘టాబ్లెట్సా? నాకేం వద్దు. ఇంకేం మిగిలిందనీ!’’ ఏడుస్తూనే అరిచాను.

‘‘అది కాదు. రెండ్రోజుల క్రితం పుట్టిన ఈ బిడ్డ తల్లికి పాలు పడలేదు. బయటి పాలు పట్టిస్తే వెంటనే కక్కేసుకుంటున్నాడు. మీరేమైనా కాసిని పాలిస్తారేమోనని తీసుకొచ్చాను…!’’

కయ్మని మీద పడి కరిచేశాను. ‘‘నా బిడ్డపోయి నేనేడుస్తోంటే, నా బిడ్డ తాగాల్సిన పాలను ఇంకొకరికి పట్టనా? అలా అడగటానికి సిగ్గుగా లేదూ? ఫో ఫో అవతలికి…!’’

‘‘డొక్కలు ఎగరేస్తున్నాడు. పాలు పట్టించక పోతే…!’’

‘‘చస్తాడు. అంతేగా. చావనీ. నా బిడ్డ చావలేదూ! ఫో!’’

ఉరిమేసరికి భయపడి పారిపోయింది. అమ్మ వచ్చి నా పక్కలో కూర్చుని అనునయించింది. ‘‘నీ పాలు ఆ పిల్లాడికిచ్చి బతికించు. వృథాగా బాత్రూంలో పోయే కన్నా… ఆలోచించు. అమ్మపాల దానం మహా పుణ్యం. భగవంతుడు మెచ్చుకుంటాడు. నీకింతకింతా కలిసొస్తుంది…!’’

సాలోచనగా అమ్మ ముఖంలోకి చూశాను. తలాడించింది. సైగ అర్థమై నేనూ తలాడించాను.

అమ్మ వెళ్లి నర్సునీ బిడ్డనీ తీసుకొచ్చింది. గుక్క పెట్టి ఏడవడానికి కూడా శక్తి లేక డొక్కలు ఎగరేస్తూ వెక్కిళ్లు పెడుతున్నాడు!

వాడిని చేతుల్లోకి తీసుకున్నాను. నా బిడ్డా ఇలాగే ఉండి ఉంటుందా?!

పళ్ల బిగువున దుఃఖోధృతికి ఆనకట్ట వేసి వాడి నోటికి చన్ను అందించాను. ఒక నిమిషం కుమ్మి మెల్లగా తాగాడు.

ఆ చిన్నారి పెదాలు నా రొమ్ముని తాకేసరికి నాలో మాతృత్వం జలజల పారింది. పాలు మరింతగా పొంగి వచ్చాయి. వాడినే అపురూపంగా చూస్తూ తల నిమురుతూండిపోయాను. వాడి పొట్టనిండగానే నిద్రలోకి జారుకున్నాడు.

నర్సుకి అందించాను. ఆ బిడ్డ తల్లి పరుగున వచ్చి కాళ్లకు దణ్ణం పెట్టింది. ‘‘నువ్వు మా దేవతవి!’’ పొగిడేసింది.

చిత్రం! నా రెండో రొమ్ములో సలపరం మొదలైంది. బ్లౌజు పాలతో తడవసాగింది!

అమ్మకు చెప్పాను. అయిదు నిమిషాల్లో మరో బిడ్డను తీసుకొచ్చారు.

ఆడపిల్ల. క్యూట్‌గా ఉంది. నా బిడ్డ పాలు వీళ్లకు ప్రాప్తం!

ఆ సాయంత్రం నన్ను నియోనాటల్‌ ఇం‌టెన్సివ్‌ ‌కేర్‌ •••నిట్లోకి తీసుకెళ్లి అక్కడున్న శిశువుల్లో ముగ్గుర్ని చూపించారు. వారిలో ఇద్దరు తల్లిపాలు తాగే భాగ్యానికి నోచుకో లేదుట . వ•డో శిశువుకి కామెర్లు వచ్చాయిట. కడుపునిండా పాలు తాగితేనే వ•త్రం ద్వారా కామెర్లు తొలగిపోతాయట. ఆ తల్లిపాలు సరిపోవట్లేదని ఫొటోథెరఫీ ద్వారా తెలిసిందిట!

నాకు ఆ ముగ్గురిలో త్రివ•ర్తులు కనిపించారు.

మరుక్షణం అనసూయగా మారాను!

రోజూ ఆ అయిదుగురికీ పాలుపడుతున్నాను. నాకెంతో తృప్తిగా ఉంది. వారి గొంతులో పాలు కాదు అమృతం పోస్తున్న అనుభూతి కలుగుతోంది . పరమానందపడ్డాను. చిత్రంగా నా బిడ్డ పోయిన వేదన చేత్తో తీసేసినట్టు పోయింది!

నా బిడ్డకు అమ్మని కాలేకపోతేనేం, ఎందరో పిల్లలకు ప్రాణం నిలబెట్టి వారికి పెద్దమ్మనయ్యాను!

అమ్మ, అజిత్‌ ‌వేనోళ్ల అభినందించారు. డాక్టర్లూ నర్సులూ కొత్త అమ్మలూ సరే సరి!

డిశ్చార్జ్ ‌చేశారు. వెళ్లే ముందు డాక్టర్‌ ‌రూంలోకి వెళ్లాను.

‘‘డాక్టర్‌! ‌నాకు పాలు ఎక్కువగా పడ్డాయి. క్రిటి•ల్‌గా ఉన్న పిల్లలకు అవసరమంటే నా పాలు పిండి పంపిస్తాను…’’

గబుక్కున లేచొచ్చి హత్తుకుంది.

‘‘అవ•ల్యమైనవి తల్లిపాలు. వాటి ఆవశ్యకత నవజాత శిశువులకు ఎంతో ఉంది. అవి దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు. తల్లిపాలతో పిల్లలు ఎంతో త్వరగా కోలుకోగలుగుతారు. అందుకనే తల్లిపాలు దొరకక ఇబ్బంది పడుతున్న పిల్లల కోసం మదర్‌ ‌మిల్క్ ‌బ్యాంక్‌ ‌ప్రారంభిస్తున్నాం. దానికి నీతోనే శ్రీకారం చుడతాం. నువ్విక్కడికి రానవసరం లేదు. మేమిచ్చే పాకెట్స్ ‌లేక బాటిల్స్‌ల్లో పట్టి వాటిని డీప్‌ ‌ప్రిడ్జ్‌లో భద్రపరిస్తే చాలు.మా ప్రతినిధులొచ్చి కలెక్ట్ ‌చేసుకుంటారు. నీలాగే తల్లిపాల విలువ తెలిసిన బాలింతలంతా ముందుకొచ్చి తమ బిడ్డకు సరిపోగా మిగిలిన చనుపాలను మా బ్యాంకుకి దానం చేస్తే ఎందరో నవజాత శిశువులకు ప్రాణదానం చేసిన వారవుతారు! ’’

కారు ఎక్కుతోంటే అంది అమ్మ. ‘‘అసలైన అమ్మవి అనిపించుకున్నావు. ఇవి బాలింతలు తప్ప ఇంకెవరూ చెయ్యలేని భగవత్సేవ. ఈ పుణ్యం నీకు శ్రీరామరక్ష అవుతుంది. వ•డు నెలలు తిరక్కుండానే నీళ్లోసుకుంటావు. ఏడాది తిరక్కుండానే ఇదే ఆసుపత్రిలో పండంటి బిడ్డని కంటావు చూడు!’’

సాక్షాత్తు అలివేలు మంగమ్మే కొండదిగి వచ్చి ఆశీర్వదించినట్టనిపించింది!

అమ్మ చేతిని నా చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను.

‘‘నేను పొగడకూడదు గాని, నువ్వు జగన్మాత వయ్యావు తల్లీ!’’

– ‌సింహ ప్రసాద్‌

About Author

By editor