భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్‌గా వేణు శ్రీరామ్ పదవీ విరమణ చేసాడా రోజు. అంత పెద్ద హోదాలో రిటైరైన ఆయనను, పలు కార్పోరేట్ సంస్థలు తమ పాలక మండలిలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించమని అభ్యర్థించాయి. ‘చెస్ బోర్డుపై ఉన్నంతవరకే రాజు, మంత్రి, బంట్రోతు అన్న భేదాలు. ఆట ముగిసాక అన్నీ ఒకే డబ్బాలోకి వెళ్లిపోవలసిందే!’ అనే మాట శ్రీరాంకి వర్తించలేదు. పదవిలో ఉన్నప్పుడే కాదు, పదవీ విరమణ తర్వాత కూడా ఆయన విలువ తగ్గలేదు. కానీ వెతుక్కుంటూ వస్తున్న ఆ పదవులన్నిటినీ తృణప్రాయంగా వదిలేసాడు భార్య రుక్మిణికోసం!
శ్రీరామ్ పెళ్లిచూపుల్లో రుక్మిణిని తొలిసారి చూసినప్పుడు ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడై పోయాడు.ఆ క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమెతో వివాహమైన కొద్దిరోజులకే అతనికి అవగతమైపోయింది. ఆమె సౌందర్యానికే రూపాత్మక నిర్వచనం కాదు, సహానుభూతికీ నిలువెత్తు నిదర్శనం అని. సాటిమనిషి కష్టాన్నీ, దుఃఖాన్నీ తనవిగా భావించే మంచితనం రుక్మిణిది. మంచితనమంటే మనసు లోపల జాలిపడిపోవడం మాత్రమే కాదు. చేయందించి, చేతనైన సాయంచేసి ఆదుకుంటుంది. శ్రీరాం అలా కాదు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్‌లో ఉండా లనుకుంటాడు. పుట్టినరోజునాడో, పెళ్లిరోజునో అనాథ• శరణాలయానికి కొంత డబ్బు విరాళంగా ఇస్తే అదే మానవత్వం అనుకుంటాడు. రుక్మిణేమో ప్రతిదినం చిన్నదో పెద్దదో ఒక అలవాటులా ఏదో ఒక మంచి పని చెయ్యాలి అంటుంది. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ధ్యాస తప్ప ఇతరుల కష్టం గురించి ఆలోచించే సమయం లేదతనికి. తనలోని మానవత్వ పరిమళాలను భర్తలోనూ నింపాలని చాల ప్రయత్నించింది రుక్మిణి.
ఉద్యోగబాధ్యతలు అనే సాకుతో తప్పించుకునే వాడు శ్రీరామ్. ‘సాటి మనిషి’ అన్న మాటకు ఆమె అర్థం వేరు. తనతో సమాన స్థాయిలో ఉన్నవారి తోనో,తనకన్నా ఉన్నత స్థానంలో ఉన్నవారితోనో సహానుభూతితో మెలగడం కాదు.. తన కన్నా క్రింది స్థాయిలో ఉన్నవారితోనూ, అసలు ఏ స్థాయీ లేనివారితోనూ అంతే కరుణతో చేయందిస్తుంది రుక్మిణి. సహానుభూతి విషయంలో ఇద్దరి స్వభావాల్లో వ్యత్యాసమున్నా వాళ్లు అన్యోన్య దంపతులు. భార్యంటే ప్రాణం. అమెకూ భర్తంటే ఎనలేని అనురాగమే. దైనందిన జీవితంలో నిత్యం దయతో కూడిన ఏదో ఒక మంచిపని చెయడమనే విషయంలో తప్ప, భర్త గురించి ఏ చిన్ని అసంతృప్తీ లేదామెకు.
* * *
ఆ రాత్రి పది గంటలప్పుడు…పడకగదిలోకి ప్రవేశించి, పక్కన చేరిన భర్తతో ‘‘చాలా సంస్థలు రా-రమ్మని పిలుస్తున్నాయిగా మిమ్మల్ని. పదవిలో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా బిజీగా మారిపోతారు కాబోలు తమరు!’’ అంది రుక్మిణి ఆమె కళ్లల్లోకి చూసి చిరునవ్వు నవ్వాడు రామ్. ‘‘అవును. బిజీగానే ఉండబోతున్నాను’’…అని ఆగి, ‘‘..కానీ నువ్వనుకున్నట్టు కాదు. నువ్వు నా నుంచి ఆశిస్తున్నట్టు!’’ అన్నాడు.
‘‘అంటే?’’
‘‘అంటే.. నేనూ నీలా దయతో కూడిన చిన్నిచిన్నిపనులు చేద్దామనుకుంటున్నాను రేపటి నుంచి. ఇన్నేళ్లుగా ఉద్యోగంలో ఎదగాలనే ఆరాటంలో, పరుల కష్టాల్ని చూసి స్పందించలేదు. ఇక నుంచి ‘సాయం’ అందిస్తాను. ‘బాధ’ను అర్థం చేసుకోగలుగుతున్నామంటే మనం జీవించి ఉన్నామని అర్థంట. అదే ‘ఇతరుల బాధ’ను అర్థం చేసుకోగలిగితే మనం మనిషిగా జీవిస్తున్నట్టట! ఇక నుంచి మనిషిగా ‘జీవించడం’లో బిజీగా ఉంటాను రుక్కూ!’’ భర్త మాట వినగానే, రుక్మిణి కళ్లల్లోకి చటుక్కున చెమ్మ ఊరింది.!
* * *
మర్నాడు ఉదయపు నడక కోసం సముద్ర తీరానికి (బీచ్) వెళ్లాడు శ్రీరామ్. తూర్పున లేత ఎండ అరుణకాంతితో సముద్రం పైపడి మెరుస్తోంది. తన పక్కనే నడుస్తున్న వ్యక్తిని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు రామ్. అతనెవరో రామ్‌కి తెలియదు. పూర్తిగా అపరిచితుడు. ఆ వ్యక్తికి ఆశ్చర్యంగా ఉన్నా, ఊహించని ఆ చిరునవ్వుకి తెలీకుండానే సంతోషం అనిపించింది. బదులుగా అతనూ రామ్‌ని చూసి నవ్వాడు. అలా ముక్కూ ముఖం తెలీని వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వడంలో కూడా ఒక ఆనందం ఉంటుందని మొదటిసారి తెలిసింది రామ్‌కి.
నడక పూర్తైన తర్వాత, బీచ్‌లో అస్తవ్యస్తంగా పడిఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి చెత్త వేసేందుకేర్పాటు చేసిన డబ్బాలో వేసాడు రామ్. తిరిగి ఇంటికి బయలుదేరాడు. అతను నివాసముండే గేటెడ్ ఫ్లాట్లకు పక్కనే ఒక చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది. దానిపేరు అవ•ల్య రెసిడెన్సీ. దాని గేటుదగ్గర పదేళ్ల వయసున్న పాప ఏడుస్తూఉండటం కనిపించింది. ఆ రెసిడెన్సీకి వాచ్‌మన్‌గా పనిచేస్తున్న అంజయ్య కూతురు ఆ పాప.
‘‘ఎందుకేడుస్తున్నావు పాపా?’’ దగ్గరకెళ్లి అడిగాడు శ్రీరామ్. బదులేమీ చెప్పకుండా ఇంకా ఏడుస్తూనే ఉంది. అప్పుడు అంజయ్య ‘‘తనాడుకునే బొమ్మకారు పాడైపోయింది. కొత్తది కొనివ్వమని ఏడు స్తోంది. డబ్బుల్లేవమ్మా అంటే అర్థం చేసుకోడం లేదు సార్’’ చెప్పాడు.
‘‘నీ పేరేంటి తల్లీ’’అంటూ వెనుక చక్రం ఒకటి విరిగిపోయిన ఆ టాయ్ కారుని చేతిలోకి తీసుకున్నాడు రామ్.
‘‘శ్రీదేవి’’ బుగ్గల మీది కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పిందా పిల్ల.
చదివిన చదువుతో సంబంధంలేని బ్యాంకింగ్ ఉద్యోగంలో అత్యున్నత స్థానానికెదిగిన శ్రీరామ్, మొదటిసారి తన బీటెక్ పట్టాకి పని కల్పించాడు. ‘‘స్కూడ్రైవరుందా?’’ అని అంజయ్యని అడిగి, తీసుకుని, ఒక సీసా వ•తని, విరిగిపోయిన చక్రం స్థానంలో అమర్చాడు. చిన్నగా నవ్వుతూ ‘‘నీ కారుని రిపేర్ చేశాను. ఇప్పుడు ఆడుకో’’ అన్నాడు శ్రీదేవితో.
ఇక ఎప్పటికీ పనిచేయదేమో అనుకున్న తన కార్, బ్యాటరీతో మునుపటిలాగానే నేల మీద పరిగెడుతుంటే ఆ పసిపాప కళ్లు ఆనందంతో మెరిసాయి. ‘‘నా పేరు వేణు శ్రీరామ్. మీ పక్కనే ఉంటాం’’ అంటూ ఆ చిన్నిపిల్ల చేతిని ఆప్యాయంగా అందుకుని కరచాలనం చేశాడు. దాంతో అ పిల్ల ఉబ్బి తబ్బిబ్బైపోతూ ‘‘థాంక్ ••• సార్’’ అంది సంతోషంతో.
* * *
ఇల్లు చేరాక, స్నానం ముగించి భార్య వడ్డించిన అల్పాహారం తింటూ,‘‘ఆహా! ఎంత కమ్మగా ఉందో రుక్కూ’’అని భార్య చేతివంటని మెచ్చుకున్నాడు రామ్. ‘‘ఇన్నేళ్ల కాపురంలో ఏనాడైనా నా వంటకి వంక పెట్టారా మీరసలు! ఎప్పుడూ పొగడ్డమేగానీ’’ అంది రుక్మిణి మురిసిపోతూ.
‘‘ప్రపంచంలో అందరికన్నా దీ బెస్టు, స్వీటెస్టు భార్యవి నువ్వు’’ చెప్పాడు గర్వంగా. అప్పుడామే భర్తకు చేరువగా వచ్చి, ‘‘ఈరోజు ఉదయపు నడక సమయంలో మీరు చేసిన మంచి పనులకు నా కానుక’’ భర్త బుగ్గ మీద ‘ప్చ్’ అని ముద్దు పెట్టి వంటింట్లోకి పరుగెట్టింది రుక్మిణి.
* * *
అదేరోజు మధ్యాహ్నం. పొద్దున్న చేసిన ఆ చిన్ని పనుల వల్ల లభించిన సంతృప్తి రామ్ గుండెని ఇంతకు ముందెరగని ఒక అనుభూతితో నింపేస్తోంది. ఇంకా ఏదో చేయాలనిపిస్తుంటే, అతనికి ఆరో అంతస్తులో ఉండే మధుసూదనరావు గారు గుర్తొచ్చారు.అయన విశ్రాంత శాస్త్రవేత్త. కేంద్ర పరిశోధన సంస్థలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేసి పదవీ విరమణ చేసారు.ఆరునెలల క్రితం ఆయన భార్య మరణించింది.వారికి సంతానం లేదు. కింద పార్కుల్లో తరచూ కనిపిస్తుండే ఆయన,భార్య మరణం తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. ఒంటరితనపు నరకం కుంగదీస్తోంది ఆయన్ను. ఆయన్ను ఒకసారి పలకరించి రావాలనుకున్నాడు రామ్. అలాంటి వారికి, ఒక పలకరింపు కూడా ఎంతో సాంత్వననిస్తుంది. లిఫ్ట్‌లో ఆరో అంతస్తుకి వెళ్లి, మధుసూదనరావు ఫ్లాట్ తలుపు గంట మోగించాడు. తలుపు తెరుచుకోలేదు. ఎందుకో భయంవేసింది రామ్‌కి. చాలాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా రావుగారిని చూడగానే, వేణు మనసు కుదుటపడింది. ఆయన శ్రీరాంవేణుని గుర్తుపట్టారు. ఆయన భార్య మరణించినప్పుడు, రుక్మిణి ప్రోద్బలంతో కర్మకాండల సమయంలో దగ్గర ఉన్నాడు రామ్.
‘‘మీరా, ర..రండి’’ అని ఆయన చెప్పగానే, లోపలికి వెళ్లాడు రామ్.ఆ క్షణం మధుసూదనరావు ‘మావ•లు’గా లేరు.. ఏదో తేడాగా ఉన్నారని పించింది రామ్‌కి. కొద్ది క్షణాల్లోనే ఆ తేడా ఏమిటో తెలిసిపోయింది. అంతే. టక్కున ఆయన చేతిలోని చరవాణిని లాగేసుకున్నాడు రామ్!
* * *
‘‘మీ ఆధార్‌ని, సుదాఖత్ ఖాన్ అనే నేరగాడు దుర్వినియోగం చేసాడు. కంబోడియా,మయన్మార్ దేశాలకు మానవ అక్రమరవాణా చేస్తున్న కేసులో మీ పేరు అనుమానితుల జాబితాలో ఉంది’’ అంటూ సీబీఐ అధికారి మధుసూదన రావుని వ•డు రోజులుగా డిజిటల్ అరెస్టులో ఉంచాడు.
‘‘మీ మేలు జన్మలో మర్చిపోలేను శ్రీరామ్ గారూ!మీరు రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా నేను నా రిటైర్మెంట్ డబ్బు మొత్తాన్ని ఆ సైబర్ నేరగాళ్ల అకౌంట్లకి బదిలీ చేసేసిఉండేవాడ్ని’’ రామ్ చేతులు పట్టుకుని చెప్పారు మధుసూదన రావు.
‘‘ఈ సమయానికి నేను రావడం కేవలం కాకతాళీయం సర్. ఈ తరహా సైబర్ నేరాల గురించి నాకు కొంత అవగాహన ఉంది. మీరు ఏదో లైవ్ వీడియో కాల్ లో ఉన్నట్లు నాకనుమానం వచ్చింది. అందుకే ముందు ఆ కాల్ కట్ చేసి, సైబర్ నేర పోలీసుకి సమాచారమిచ్చాను’’ చెప్పాడు రామ్. తన కంటే వయసులో పెద్ద ఐన ఆయన తనకు చేతులు జోడించి నమస్కరిస్తుంటే వారిస్తూ!
* * *
పదిహేనేళ్లు కాలగర్భంలో కరిగిపోయాయి.
రుచికరమైన చిరుతిళ్లను ఫ్రిజ్‌లో దాచుకుని, అవి అయిపోయే వరకూ మాటిమాటికీ ఫ్రిజ్ తలుపు తెరిచి వాటిని ఆరగిస్తూ ఉంటారు మనుషులు. కానీ, ఉడుతలు అలా కాదు. ఆహారం దొరకని సమయంలో తిందామని, కొన్ని గింజల్నీ, విత్తనాల్నీ భూమిలో పెట్టి దాచుకుంటాయి. కానీ తర్వాత వాటిని ఎక్కడ దాచిందీ గుర్తుపెట్టుకోలేవు. అలా మర్చిపోయిన ఆ ‘చిరుతిండే’, క్రమంగా మొలకెత్తి వృక్షాలుగా మారి పోతాయి. లక్షల చెట్లు అలా ఎదిగినవే. ఉడుతల మతిమరుపు కూడా మానవాళికి ఒక వరంగా మారుతుంది ‘పచ్చదనాల’ రూపంలో.
ఈ పదిహేనేళ్ల కాలం, శ్రీరామ్‌కీ ఒకింత మతిమరపుని తెచ్చిపెట్టింది. అల్జీమర్స్ ప్రారంభ దశ. పొరుగు వాడి బాధనూ, దుఃఖాన్నీ తనవిగా భావించి సాయం అందించే పనులకు ఆ వ్యాధి అతనికేమీ ఆటంకం కాలేదు! కానీ అతని ఆరోప్రాణం రుక్మిణి మాత్రం గత రెండు నెలలుగా అచేతనావస్థలో ఉంటోంది. వైద్య పరికరాలే ఆవిడను ప్రాణాలతో నిలబెడుతున్నాయి. కోమాలాంటి స్థితి.
ఆ రోజు, తీవ్రంగా గాయపడ్డ ఒక వీధి శునకానికి ప్రథమచికిత్స చేసి బ్లూక్రాస్ వాళ్ల సంరక్షణలో వదిలి వస్తూ అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది రుక్మిణి. ఆవిడ ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు ఎక్స్‌రేలో కనపడింది డాక్టర్ గణేష్‌కి. సాధారణ ఇన్ఫెక్షన్ అనుకున్నది కాస్తా తీవ్రంగా మారిపోయింది. ఎన్ని మందులు వాడుతున్నా పరిస్థితి మెరుగుపడటం లేదు. ఆసుపత్రి బెడ్ మీద చైతన్య రహితంగా పడిఉన్న భార్య ముఖాన్నే చుస్తూ ఉన్నాడు రామ్. ఆరోజు అంబులెన్స్‌లో ఆసుపత్రికి వస్తుంటే, ‘‘వేణు! ఒకవేళ నాకేదైనా ఐతే, నా శరీరాన్ని ప్రయో గాల కోసం వైద్యకళాశాలకు దానం చేసెయ్యాలి. గుర్తుంది కదా! ప్లీజ్..’’ అంటూ భర్తని వేడుకుంది రుక్మిణి స్పృహ కోల్పోయే ముందు. అది జ్ఞాపకాని కొచ్చి కన్నీళ్లుబికి వచ్చాయి. అప్పుడే అతని ఫోన్ కంపించింది. చూస్తే ఒక సందేశం కనిపించింది తెలియని సంఖ్య నుండి.
‘‘సర్, నమస్కారం!
చాలా ఏళ్ల క్రితం, విరిగిపోయిన ఒక బొమ్మ కారుకు మరమతు చేసి, ‘విరిగిన’ వాటి విలువ గురించి నేర్పారు. ఇప్పుడు నేను ‘క్వాంటమ్-కృత్రిమ మేధ’ చదువు పూర్తి చేశాను. నా విద్యను, సాటి మనుషుల జీవితాలను ‘మెరుగు’ పరచడానికి ఉపయోగించాలని ఆశిస్తున్నాను.
-శ్రీదేవి
పీ యస్: ఆ కారు ఇంకా పనిచేస్తోంది!
* * *
యథాలాపంగా నాటిన ఒక విత్తనం మొలకెత్తి, చెట్టుగా ఎదిగి నలుగురుకి నీడనివ్వబోతున్నంత ఆనందం కలిగింది రామ్‌కి. రుక్మిణి తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతూ ఉందని తెలియగానే హుటాహుటిన వచ్చేసింది శ్రీదేవి!
* * *
క్యూటీ! అంటే…క్వాంటమ్ టెక్నాలజీ! సాంకేతికతలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్న ఒక అధునాతన వ్యవస్థ ఇది. అత్యంత క్లిష్టమైన సమస్యల్ని, ఊహకు అందనంత వేగంతో పరిష్కరించగల సామర్ధ్యమున్న సరికొత్త పరిజ్ఞానం. శ్రీదేవి వచ్చి డాక్టర్ గణేష్‌తో మాట్లాడి రుక్మిణికి అందిస్తోన్న చికిత్సకి ‘క్వాంటమ్ సాంకేతికత’ జతకలిపింది! ఈసారి ‘క్వాంటం సెన్సర్లు’ సాయంతో రుక్మిణికి ఎంఆర్‌ఐ చేసింది శ్రీదేవి. ఇమ్యునోహిస్టో కెమిస్ట్రీతో పాటు జన్యు పరీక్షలూ మరల జరిగాయి. ‘క్యూటీ’తో కృత్రిమమేధను అనుసంధానించేందుకు వసంత్ అనే మరొక శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు గణేష్‌ని కలిసాడు. శ్రీదేవి, గణేష్, వసంత్… ముగ్గురూ బృందంగా మారి క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధల సాయంతో రుక్మిణి అనారోగ్యం తాలూకు అసలు కారణం కనిపెట్టారు! వ్యాధి నిర్ధారణలో మాత్రమే కాదు మందుల సిఫారసులో కచ్చితత్వాన్ని కూడా ‘క్యూటీ’తో సాధించడం ఎలాగో శ్రీదేవికి తెలుసు. అంతేకాదు, నూతన ఔషధాల రూపకల్పనకూ ఈ సాంకేతికత ఎలా ఉపయోగించ వచ్చో కుడా తెలుసు!! సరిగ్గా రుక్మిణి జన్యు పదార్థానికి తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని, ఫార్మసిస్టుల ద్వారా తయారు చేశారు. రెండు నెలలుగా వెంటిలేటెడ్ రోగిగా పడి ఉన్న రుక్మిణిలో మొదటిసారి ఒక సానుకూల మార్పు కనిపించింది. రెండురోజుల్లోనే ఆవిడకు అందిస్తున్న ప్రాణవాయువు ఆవశ్యకత శాతం తగ్గింది! ఆ ముగ్గురి ముఖాలూ మెరిశాయి. నూతన సాంకేతికతతో ఒక ప్రయోగం చేశారు వాళ్లు. క్రమంగా కోమాలోకి వెళ్లి, ఆపై బహుళ అవయవ వైఫల్యంతో మరణిస్తుందని అనుకున్నాడు డాక్టర్ గణేష్. అలాటి రోగి కోలుకోవడం ఒక అద్భుతమేనెమో. నాలుగో రోజు వెంటిలేటర్ తొలిగించేసారు!!
* * *
రుక్మిణి ఆసుపత్రి నుంచి విడుదలై ఇంటికి వెళుతున్న రోజు..
‘‘శ్రీదేవీ!నేను ఒట్టి దేహాన్నే. నా ప్రాణం మాత్రం నా భార్యే. ఆ ప్రాణం ఈ దేహాన్ని విడిచిపోకుండా చేశావమ్మా! నీకెలా కృతజ్ఞత తెలపాలో తెలీడంలేదు తల్లీ’’ అన్నాడు రామ్ ‘చెట్టంత’ ఎదిగిపోయిన శ్రీదేవి ని చూస్తూ.
‘‘మన చుట్టూ ఉన్న వారి పట్ల సహానుభూతి చూపే మీలోని మానవత్వం తాలూకు ‘అలల ప్రభామం’ సర్ ఇదంతా.మానవీయ స్పర్శ అనే గులకరాయిని సమాజం అనే సరస్సులో వేశారు మీరు. ఆ చిన్ని స్పర్శ ఎందరినో ప్రభావితం చేసేసింది. నీటి పైన ‘అలల శ్రేణి’లా చాలా దూరం వ్యాప్తి చెందిందది. ఆరోజు మీరు మధుసూదనరావు గారికి చేసిన సాయం ఆయనలోనూ మానవతను తట్టిలేపింది. సైబర్ నేరగాళ్ల పాలుకాబోతున్న ఆయన డబ్బుని మీరు కాపాడారు. మీ మంచితనపు ‘అలల ప్రభావం’(రిపుల్ ఎఫ్ఫెక్ట్) ఆయన పైనా పడింది.మీ ప్రేరణతో, ఆ డబ్బుకి ఒక సార్ధకత తేవాలను కున్నారు. నేను చదువుకో గాలిగానంటే, దానికి కారణం, ఆయన ఆర్థిక సాయం అందుకున్న ఐదుగురు పేద విద్యార్థుల్లో నేనొకర్ని కావడం!’’ శ్రీదేవి చెబుతున్నది సంభ్రమంతో వింటున్నాడు రామ్.
ఆర్ద్రతతో రుక్మిణి గుండె బరువెక్కింది. సరిగ్గా అప్పుడే డాక్టర్ వసంత్ ఆ గదిలోకి వచ్చారు. ‘‘సర్! మీకు నేను గుర్తుండకపోవచ్చు. కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు.చాలా ఏళ్ల క్రితం బీచ్ దగ్గర నడుస్తున్న ప్పుడు, నేనెవరో తెలీకపోయినా పలకరిస్తున్నట్టు చిరునవ్వు నవ్వారు నన్ను చూసి. తర్వాత సముద్రతీరంలోని చెత్తనూ, ప్లాస్టిక్ వ్యర్థాలను తీసి శుభ్రం చేసారు. నేను దాన్ని గమనించానా రోజు! మీ నవ్వు ఆరోజంతా నాలో ఉత్తేజాన్నినింపింది’’
శ్రీదేవీ, వసంత్ ఇద్దరూ రామ్‌కి రెండువైపులా చేరి ఆత్మీయంగా కౌగిలించు కున్నారు. వెదురులా ఉన్న తన్ను ‘వేణువు’ని చేసిన భార్య వంక ఆర్తితో చూస్తున్నాడు ‘వేణు’శ్రీరాం! కన్నీటి తెరలు అడ్డుపడ్డ కళ్లతో భర్తను చూస్తోంది రుక్మిణి.
వసంత్ చెప్పింది రామ్‌కి గుర్తురాలేదు. అదేకాదు, ఈ పదిహేనేళ్లుగా చేస్తున్న దయతో కూడిన మంచిపనులేవీ కుడా గుర్తులేవు. కానీ అవన్నీ, ఉడుతలు మర్చిపోయిన విత్తనాల్లా ఎక్కడెక్కడో మొలకెత్తి, మహావృక్షాలుగా ఎదిగి పదిమందికీ నీడనిస్తాయని తెలుస్తోంది!
– గుమ్మడి రవీంద్రనాథ్