ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు వందనాలు. ఉత్తమ గురువు సమాజానికి వెన్నెముక వంటివాడు. నవ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేవాడు. అందుకే మన సనాతన భారతంలో పిల్లలను విద్యనభ్యసించటానికి గురుకులాలకు పంపేవారు. అలా గురుకులాలలో మొదలైన మన విద్యా వ్యవస్థ తదనంతరం అనేక మార్పులు చెంది ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగంలో ఆధునిక విద్యా వ్యవస్థగా రూపాంతరం చెందింది. విద్యా వ్యవస్థలో, ఉపాధ్యాయులలో, విద్యార్థులలో, సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నప్పటికీ విద్యార్థులను భావి భారత బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల స్థానం, పాత్ర మారలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ సత్యాన్ని విద్యార్థులకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రతియేటా మనం ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాము.
ప్రస్తుత విద్యా వ్యవస్థ చాలా యాంత్రికంగా మారిపోయింది. అటు స్కూలు యాజమాన్యాలు, ఇటు ఉపాధ్యాయులు చాలామటుకు విద్యను వ్యాపార ధోరణితోనే చూస్తున్నారు. ఉపాధ్యాయులు విద్య నేర్పడాన్ని సామాజిక బాధ్యతగా కంటే, జీవనోపాధిగా ఎక్కువ భావిస్తున్నారనుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యను మంచి ఉద్యోగం సంపాదించే మాధ్యమంగానే చూడడం మొదలు పెట్టారనుకో వచ్చు. ఫలితంగా విలువలతో కూడిన విద్య ప్రస్తుతం విద్యార్థులకు అందడంలేదు. వ్యక్తిగత లాభం తప్ప సామాజిక ప్రయోజనాన్ని విద్యలో చూడలేక పోతున్నారు. విద్య సనాతన వైభవం నానాటికీ దిగజారుతోంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దిగజారుతున్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి, ప్రభుత్వం, సమాజం, విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకోవలసిన చర్యలను గుర్తించడం, వాటి గురించి విస్తారంగా చర్చించు కోవడం ఎంతైనా అవసరం.
మొదటగా, నాటి గురుకుల వ్యవస్థ ఎందుకు ఏర్పడింది అన్నది చూద్దాం. మోహమును తొలగించేది, వివేకమును కలిగించేదీ శాస్త్రము అన్నారు. శాస్త్రమును తెలుసుకోవాలంటే సద్గురువును ఆశ్రయించాలి. అలాంటి సద్గురువు సన్నిధిలో ఆనాడు అందుబాటులో ఉన్న శాస్త్రాలను భక్తి శ్రద్దలతో, ఇతర చింతనలు చేయకుండా అధ్యయనం చేసేవాడే ఉత్తమ శిష్యుడుగా వెలుగొందేవాడు. అసలు విద్యకు, జీవనోపాదికి ఆ రోజుల్లో విద్యార్థి దశలో సంబంధముండేది కాదు. అలా వ్యక్తిత్వ వికాసానికి ఏర్పడిన గురుకులాలలో అధ్యయనం జరిగేది. వాటినే ఇప్పుడు మనం పాఠశాలలు, కళాశాలలు అని అంటున్నాం. శిష్యులను విద్యార్థులు అని,గురువులను ఉపాధ్యాయులు అని అంటున్నాం. విద్య అంటే శాస్త్రాధ్యయనము . శాస్త్రమును రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కర్మమును బోధిం చేది. అంటే జీవితాన్ని సాఫీగా గడపడానికి కావలసిన విజ్ఞానము, మెళుకువలు నేర్పేది. ఇది లౌకికము. ఇక రెండవ శాస్త్రము బ్రహ్మమును బోధించేది. అంటే జీవితకాలంలో నీతిగా, నిజాయతీగా, గౌరవ ప్రదంగా, భగవంతుని పట్ల భక్తి, సమాజము, దేశము పట్ల సేవాభావము, గౌరవంతో బతకడానికి కావలసిన ఆత్మ జ్ఞానము సమకూర్చేది. ఈ రెండింటిని సమపాళ్లలో గురుకులాలు, ఆశ్రమాలు బోధించేవి. అందుకే అక్కడ చదువుకున్న విద్యార్థులు అఖండ భారతావనిలో మహా పురుషులుగా వెలుగొందారు. ఇది సనాతన, ప్రాచీన, మధ్య యుగ భారతంలోని అధ్యాయం అలా పవిత్ర ఉద్దేశ్యాలతో మొదలైన మన విద్యావిధానం కాలక్రమేణా అనేక మార్పులు చెంది ఈరోజు విద్య అనేది ఒక అంగడి సరుకుగా మారింది.
ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. విద్యావిధానం మీద ఎవరి పూర్తి నియంత్రణ లేదు. ప్రభుత్వంలో విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నా ఆ శాఖ కొన్ని విషయాల మీదే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందుకే ఉన్నత ఆశయాలతో గురుకుల విద్యగా మొదలైన విద్య విలువలు లేని విద్యగా కేవలం ఫీజుల బిల్లులతో, రంగురంగుల ప్రశంసాపత్రాలతో కూడిన విద్య అయింది. అటు పాఠశాలలో ఉపాధ్యాయులకు, ఇటు ఇంట్లో తల్లిదండ్రులకు చాలావరకు మార్క్ షీట్ మీద ఉన్న మార్కునే పట్టించుకుంటారు కానీ వాస్తవంగా విద్యార్థి ఎంత జ్ఞాన సమపార్జన చేసాడు, మున్ముందు ఎలా రాణిస్తాడు అన్న భీతి, పట్టింపు లేకుండా పోతోంది. కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా! అక్కడ చేరిస్తే వాళ్లే చూసుకుంటారు అన్న ధీమాతో వ్యవహారిస్తున్నారు.
విద్యార్థికి మార్గదర్శి గురువు
* ఉపాధ్యాయుడు విద్యాబోధనలో పరిపూర్ణుడై ఉండాలి.
* జ్ఞాన సముపార్జనకు ప్రతిబంధకాలైన అహం కారం, డంభం, అసూయ, ద్వేషం, చోర గుణం, బద్ధకం, అశౌచం, క్రమశిక్షణా రాహి త్యాలను విద్యార్థుల్లో లేకుండా చేసేవాడై ఉండాలి.
* విద్యార్థి ఉపాధ్యాయునితో ఏదైనా చెప్పడానికి సంశయిస్తుంటే ఆయన విద్యార్థితో ఒక తండ్రిలాగా వ్యవహరించి విషయం తెలుసుకోవాలి.
* విద్యార్థులకు అనుకూలమైన విధంగా బోధన చేయాలి.
* నిర్వేదంతో ఉన్న విద్యార్థికి మరల మరల బోధించి పరిపూర్ణుడిని చేయటం కంటే మించిన పని తనకు మరొకటి లేదని భావించాలి.
* విద్యార్థిని ప్రశ్నలడిగేముందు తాను సంతృప్తికరంగా పాఠం చెప్పానా, లేదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి.
* ఒక బంగారు నగను కరిగించి వేరొక బంగారు నగ చేసినప్పుడెలాగైతే పూర్వపు వస్తువు బంగారమంతా కొత్తవస్తువులోకి వచ్చి చేరుతుందో అదే తీరుగా విద్యార్థికి జ్ఞానాన్ని సంపూర్ణంగా అందించాలి.
* విద్యార్థులకు వారి కుటుంబ, సామాజిక అంశాలతో ముడిపడిన ఇబ్బందులు ఉంటాయి. అటువంటి విద్యార్థి ఎవరితో చెప్పుకోలేక, చదువు మీద శ్రద్ధ పెట్టలేడు. అలాంటి విద్యార్థిని గుర్తించి ఆ ఇబ్బందుల వెనుక కారణం తెలుసుకోగలగాలి. అంతే తప్ప అది నా పని కాదు. కేవలం చదువు చెప్పడమే నా పని. ఇలాంటి పనికి సమయంలేదు అని వదిలేయకూడదు.
* ప్రతి విద్యార్థిలోనూ తనను తాను స్వతంత్రుడను అనే భావన కలిగించాలి. అంతే తప్ప తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల నిర్బంధంతో చదువుతున్నానన్న భావన విద్యార్థికి ఉండకూడదు. చక్కగా చదవడం వల్ల తన వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని విద్యార్థికి తెలియ జెప్పాలి.
* ఇతర విద్యార్థులు బాగా చదువుతున్నారు, నువ్వు చదవట్లేదు అనేకంటే, వారిలాగా నువ్వు కూడా చదవగలవు అని ప్రోత్సాహించాలి. అలాకాక విద్యార్థిని ఆవమానిస్తే లేదా దండిస్తే రైలు పట్టాలలాగా ఆ ఉపాధ్యాయుడు, విద్యార్థి ఎప్పటికీ దూరంగానే ఉంటారు. దీనివల్ల విద్యార్థి నష్టపోతాడు.
* ఉపాధ్యాయుడు చేప్పే విషయాన్ని శ్రద్దగా ఆలకించని విద్యార్థిని అపరాధిగా చూడకూడదు. అతనిలో శ్రద్ధను ఉపాధ్యాయుడే పాదుగొల్పాలి.
* ఉపాధ్యాయుని బోధనా క్రమంలోకి రాలేని విద్యార్థి జడుడు కావచ్చు. కానీ అలాంటి విద్యార్థిలో చైతన్యాన్ని, స్ఫూర్తిని, జిజ్ఞాసను నింపే ప్రతిభ ఉపాధ్యాయునిలో తప్పక ఉండాలి.
భావి దీపధారి విద్యార్థి
* విద్యార్థి పాఠశాలలో ఒక సన్యాసిగా మెలగాలి. అంటే చదువు తప్ప ఇతర ఆలోచనలు అతడి మదిలో ఉండకూడదు.
* తనలోని అవిద్యను ఉపాధ్యాయుడెందుకు తొలగిస్తున్నాడో శిష్యుడు గ్రహించి విద్యాభ్యాసం చేయాలి. అప్పడతని మనసులో విద్య ఎందుకు నేర్చుకుంటున్నాను. విద్యను నిర్భంధముగా నేర్చుకుంటున్నాను అనే భావన ఉండదు. అప్పుడే అతడు విద్యలో ఉత్తమంగా రాణిస్తాడు.
* హారంలో పూసలు మారినట్లు ప్రతి తరగతికి విషయాలు మారుతుంటాయి. విద్యార్థి మాత్రం హారంలోని బంగారు గొలుసులాగ ప్రతి తరగతిలోనూ తానే ఉంటానని భావించి, కొత్త తరగతిలో కొత్త విషయాలు నేర్చుకోడానికి సిద్ధ పడాలి.
* తరగతి గదిలో చెప్పిన సుద్దులు శుద్ధముక్క, నల్ల బోర్డు వరకే అన్నట్లుగా బయటకు రాగానే వాటిని దులిపేసుకునే తీరుగా విద్యార్థి ఉండరాదు. తరగతి గదిలో నేర్చుకున్న విజ్ఞాన, సామాజికపరమైన ప్రతి అంశం బాహ్య ప్రపంచంలో చూసి, తాను నేర్చుకొన్న దానితో అనుసంధానం చేయగలగాలి. అప్పుడే తను నేర్చుకున్న విద్యను చక్కగా గుర్తుంచుకో గలుగుతాడు.
మొబైల్ ఫోన్లు, చెప్పులు ఖరీదైన దుకాణాల్లోనూ, విలువైన పుస్తకాలు సాధారణ దుకాణాల్లోనూ, కొన్ని చోట్ల విలువైన పాత పుస్తకాలు ఫుట్‌పాత్‌పై విక్రయిస్తున్న ఈ ఆధునిక యుగంలో ఇప్పటి విద్యార్థులున్నారు. వారికి పుస్తకాలకు ఇవ్వవలసిన సరైన ప్రాధాన్యత గురించిన అవగాహన, మార్గదర్శనం ఉపాధ్యాయులే చేయాలి. ఒక పపుస్తక రచయత ఇలాగంటాడు. ‘‘నేను పుస్తకము అనే ఒక రోగిని కప్‌బోర్డులో చూసాను. దానిని రోగిష్టిని చేసింది ఎవరిని ఆరా తీస్తే మొబైల్ ఫోన్ అని తెలిసింది’’ అని ఒక రచయిత వాపోయారు. ఇలాంటి మొబైల్ ఫోన్ అనే చెదలు చక్కటి జ్ఞానభాండాగారములైన పుస్తకాలను తినేస్తున్న యుగంలో మన విద్యార్థులున్నారు. మొబైల్ ఫోన్‌తో కూడా విషయాలు తెలుసుకోవచ్చు. కానీ దానిలో ఇతర అనవరసమైన విషయాలే ఎక్కువ కదా! అది విద్యార్థుల విలువైన సమయాన్ని హరిస్తుంది కదా!
పద్మవ్యూహంలో పాఠశాల
* ఇదివరకు పాఠశాల అంటే ఒకే అంతస్తు కలిగిన విశాలమైన భవనాలు, తరగతి గదుల్లోకి ధారాళంగా గాలి, వెలుతురు, విశాలమైన క్రీడా మైదానం, చెట్లతో అలరారుతూ ఉండేది. కాలక్రమేణా పాఠశాల తన పూర్వవైభవాన్ని కోల్పోయింది. సైనిక పాఠశాలలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని కొన్ని పాఠశాలలు ఇప్పటికీ అప్పటి బడి వాతావరణాన్ని పరిరక్షిం చడంలో కృషి చేస్తున్నాయి. ఇవి కాకుండా చాలా వరకు పాఠశాలలు చిన్న చిన్న భవనాల్లో, ఇరుకు గదుల్లో, ఒకే మెట్ల మార్గంతో, 3,4 అంతస్థులలో, 300 నుండి 400 గజాల స్థలంలో నివాసానికి కట్టిన భవనాల్లో విద్యా బోధన చేస్తున్నాయి. వీటిలో ఎన్నో అసౌకర్యాలు, భద్రతా లోపాలుండే అవకాశముంది. హీనపక్షంగా ఇలాంటి పాఠశాలలో 200 నుంచి 300 మంది విద్యార్థులు వివిధ తరగతులలో విద్యను అభ్యసిస్తుంటారు.
* చిన్న పాఠశాలల్లో కావలసినన్ని మరుగుదొడ్లు ఉండవు, ఉన్నా శుభ్రంగా ఉండవు. క్రీడా మైదానం కనిపించవు. చెట్ల ప్రసక్తి ఉండదు. పిల్లలకు విరామ సమయంలో ఆటవిడుపుకు ఖాళీ స్థలాలు ఉండవు. ఇది ఆలోచించాల్సిన విషయం.
* చాలావరకు పాఠశాల భవనాలు ఇళ్ల మధ్యలో ఉంటున్నాయి.అగ్నిమాపక పరికరాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే విద్యార్థులు త్వరగా బయటకు వెళ్లడానికి చిన్న మెట్ల దారులు, చిన్న చిన్న తలుపులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.
* కొన్ని పాఠశాలలు వాణిజ్య భవన సము దాయాల్లో విద్యాబోధన చేస్తుంటాయి. ఇలాంటి చోట పై అంతస్థులో పాఠశాల ఉంటే కింద అంతస్థుల్లో సూపర్ మార్కెట్, తదితర వ్యాపార సంస్థలు కార్యకలాపాలు సాగిస్తుంటాయి. పాఠశాలతో పాటుగా వీటన్నింటికీ ఒకటే మెట్ల దారి, రాకపోకలు ఒకే మార్గం ఉంటుంది.
* చిన్న చిన్న వీధుల్లో, ఇరుకు భవనాల్లో నడిచే పాఠశాలలు విద్యార్థులకు స్వచ్ఛమైన, ప్రశాంత వాతావరణాన్ని ఏవిధంగా కల్పిస్తాయనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం.
* కొన్ని పాఠశాలలకు అనుబంధంగా విద్యార్థి వసతి గృహాలు ఉంటున్నాయి. విద్యార్థులకు ఆహారాన్ని సమకూర్చడానికి వంటశాలలు ఉంటున్నాయి. అయితే ఆహారంలో నాణ్యతా లోపం విద్యార్థులకు ఇబ్బందిగా మారుతున్న వైనాన్ని మనం తరచుగా చూస్తుంటాము, వింటూ ఉంటాము.
పై విషయాలను పరిష్కరించడం ఏ ఒక్కరి వల్లా కాదు. వీటి పరిష్కారానికి అటు ప్రభుత్వము, ఇటు పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కలిసికట్టుగా నడుం బిగించాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. విద్యార్థులకు విద్యాబోధనతో పాటుగా, ఆధునిక విద్యావిధానంలో సనాతన విద్యా విధానాన్ని, విలువలను సమ్మిళిత పరచడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలి.
‘‘మాతృదేవో భవ! పితృ దేవోభవ! ఆచార్య దేవో భవ!’’
మహావాది రామకృష్ణ