అధికారంలోకి వచ్చి రెండేళ్లున్నరేళ్లు దాటినా  రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీలో అంతర్గత కుమ్ము లాటలు ఏ మాత్రం తగ్గడం లేదు. సీనియర్‌ ‌నేతల మధ్య వర్గపోరు, పార్టీ అధిష్ఠానంపై బహిరంగ విమర్శలు, నాయ కుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకూ ముదురు తున్నాయి. గడిచిన కొద్ది నెలలుగా వరుసగా నెలకొంటున్న వివాదాలు, వాటిపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ జారీ చేస్తున్న షోకాజ్‌ ‌నోటీసులు పార్టీ శ్రేణుల్లో అయో మయం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన పార్టీ సీనియర్‌ ‌నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్‌ ‌నుంచి మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, రాష్ట్ర ప్లానింగ్‌ ‌కమిషన్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌చిన్నారెడ్డి, ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి వరకూ వరుసగా నోటీసులు అందుకుంటున్న నేతల జాబితా పెరుగుతూనే ఉంది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పదేపదే పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నా ఆయనపై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఎల్బీనగర్‌ ‌నియోజకవర్గ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇన్‌చార్జి, •••త్‌ ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం సస్పెండ్‌ ‌చేయడంతో అక్కడ పార్టీలో వర్గపోరు బహిరంగమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ ‌బోర్డు సభ్యురాలిగా సీనియర్‌ ‌బీసీ నేత ఈశ్వరమ్మ యాదవ్‌కు అవకాశం లభించడంతో.. ఆమెపై సోషల్‌ ‌మీడియాలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. ఈ వివాదానికి ఆ పరిణామాలే నేపథ్యంగా నిలిచాయి. బలమైన అనుచరవర్గం ఉన్న ప్రభాకర్‌రెడ్డిని సస్పెండ్‌ ‌చేయడంపై ఆయన మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌పై ఆరోపణలు గుప్పిస్తూ ‘సేవ్‌ ఎల్బీనగర్‌ ‌కాంగ్రెస్‌’ ‌పేరుతో గాంధీభవన్‌ ‌మెట్ల వద్ద నిరసనలు కూడా చేపట్టారు. మరోవైపు, ఈశ్వరమ్మపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీసీ సంఘాల నేతలు, ఆమె మద్దతుదారులు ప్రభాకర్‌రెడ్డి, శివచరణ్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేసి రోడ్డెక్కారు. తండ్రి సస్పెన్షన్‌ ‌వ్యవహారంతోపాటు, ఒక మహిళా నేత పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై శివచరణ్‌రెడ్డికి కూడా జాతీయ •••త్‌ ‌కాంగ్రెస్‌ ‌షోకాజ్‌ ‌నోటీసులు జారీ చేసింది.

సురేఖకు కూతురి వ్యాఖ్యల గండం

మంత్రి కొండా సురేఖ అంశం అత్యంత చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌ ‌జిల్లా గీసుకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కుమార్తె సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా, పార్టీపైనా చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్‌ ‌ఖరారు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ ‌చేసిన ప్రకటనపై అసంతృప్తితో సుస్మిత ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.తాను కేవలం రేవంత్‌రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నానని, పార్టీని కాదని సుస్మిత తర్వాత వివరణ ఇచ్చినా, వివాదం చల్లారలేదు. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ చైర్మన్‌, ఎం‌పీ మల్లు రవి మంత్రి సురేఖకు షోకాజ్‌ ‌నోటీసు జారీ చేశారు.

ఆ నోటీసుపై స్పందించిన సురేఖ, తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమైనవని, కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి మాటలకు మరొకరిని బాధ్యులను చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ కమిటీ చైర్మన్‌కు లేఖ పంపారు. పార్టీ నాయకత్వంపైనా, క్రమశిక్షణ నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొంటూనే, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కమిటీని కోరారు. అయితే వివాదం ఇక్కడితో ఆగలేదు. తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు నేతలు ఒక పద్ధతిగా దాడి చేస్తున్నారని, దీని వెనుక అదృశ్య హస్తం ఉందని ఆరోపిస్తూ ఆమె మరో లేఖ రాశారు. తనపై విమర్శలు చేస్తున్నవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. సీనియర్‌ ‌బీసీ మహిళా నేతగా తనపై నిత్యం మాటల దాడి జరుగుతున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారం కేవలం నోటీసులు, వివరణల తోనే ఆగలేదు. కొందరు నేతల వ్యవహార శైలితో మరింత ముదిరింది. ఉమ్మడి వరంగల్‌, ‌నల్లగొండ జిల్లాలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమై, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ ‌చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కొండా దంపతుల వైఖరి, అధికారులపై పెత్తనం, ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని వారు ఏఐసీసీకి నివేదించనున్నట్టు తెలుస్తోంది.

ఈ పరిణామం రాజకీయంగా మరో కోణాన్ని కూడా తెరపైకి తెచ్చింది. సుస్మితకు ఏ పార్టీ పదవి, హోదా లేకపోయినా ఆమె వ్యాఖ్యలకు తల్లి అయిన మంత్రికి నోటీసులు ఇవ్వడాన్ని కొందరు తప్పుపడు తున్నారు. సీనియర్‌ ‌బీసీ నేత సురేఖను అగ్రవర్ణాలకు చెందిన నేతలు ఉద్దేశపూర్వకంగా టార్గెట్‌ ‌చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు మద్దతుగా కొందరు ఓబీసీ నేతలు రంగంలోకి దిగి, అగ్రకుల నేతలపై విమర్శలు గుప్పించడం ఈ వివాదానికి కుల కోణాన్ని జోడించింది. దీంతో పార్టీలో అంతర్గత పోరు కాస్తా బీసీ వర్సెస్‌ అ‌గ్రవర్ణాల చర్చగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే కొండా సురేఖ బెంగళూరు వెళ్లి.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ప్రస్తుత పరిణామాలపై వివరణ ఇచ్చారు.

చిన్నారెడ్డికీ తప్పని అసంతృప్తి

ఇంకోవైపు.. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ‌జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు కారణంగానే తనకు టికెట్‌ ‌దక్కలేదని ఆరోపించడంతో పాటు పార్టీ అధిష్ఠానంపైనా, సీఎం రేవంత్‌రెడ్డిపైనా, స్థానిక ఎమ్మెల్యేపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్‌ ఇవ్వాలని అప్పటి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా రేవంత్‌రెడ్డికి సూచించినా, డబ్బు ఆశతో టికెట్‌ ఇవ్వలేదని ఆరోపించారు. తనను భరిస్తున్నందుకే ఇంకా పార్టీలో ఉన్నానని, లేదంటే మరో జీవన్‌రెడ్డి అయ్యేవాడినని హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. పార్టీలో ‘తప్పుడు గాళ్ల’ను తరిమి వేస్తామని కూడా వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు కూడా షోకాజ్‌ ‌నోటీసు జారీ చేసింది. దీనికి సమాంతరంగా, చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నారెడ్డి అంశంపైనా పార్టీలో సందిగ్ధం నెలకొంది.

ఇక, తనకు ఇచ్చిన నోటీసుపై స్పందించిన చిన్నారెడ్డి, 1978 నుంచి తాను కాంగ్రెస్‌ ‌పార్టీలోనే కొనసాగుతున్నానని, పార్టీకి ఎప్పుడూ బద్ధుడిగానే ఉన్నానని, ఏనాడూ పార్టీ గీత దాటలేదని లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తన వివరణను పరిగణనలోకి తీసుకొని నోటీసును ఉపసంహరించా లని కమిటీని కోరారు. మరోవైపు, ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డిని కూడా క్రమ శిక్షణ కమిటీ మళ్లీ పిలిచి వివరణ తీసుకోనున్నట్టు కమిటీ చైర్మన్‌ ‌మల్లు రవి వెల్లడించారు.

కోమటిరెడ్డి అంశంపై దుమారం

రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న సీనియర్‌ ‌నేతల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తనకు మంత్రి పదవి ఇస్తానన్న అధిష్ఠానం హామీ నెరవేరలేదని ఆయన పలుమార్లు బహిరంగంగా ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా అనేకసార్లు నేరుగానే విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం పెరిగిందని, పాత కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు, నిజమైన నేతలు అణచివేతకు గురవుతున్నారని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌చేసిన హెచ్చరికలకు అంతే ఘాటుగా బదులిస్తూ, తాను పార్టీ గీత దాటలేదని, తన మాటలను రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ‌దృష్టికి తీసుకెళ్లినా ఫర్వాలేదని సవాలు విసిరారు. చేరికల విషయంలో గతంలో బీఆర్‌ఎస్‌ ‌చేసిన తప్పిదాన్నే కాంగ్రెస్‌ ‌కూడా చేస్తోందని విమర్శించారు.

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వాటిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని టీపీసీసీ నేతలు హెచ్చరించినా, ఇప్పటివరకూ ఆయనకు ఎలాంటి షోకాజ్‌ ‌నోటీసూ జారీ కాలేదు. దీనిపై పార్టీ వర్గాల్లోనే విమర్శలు వినిపి స్తున్నాయి. ఒకవైపు కొండా సురేఖ కుమార్తెకు ఎలాంటి పదవి లేకున్నా ఆమె వ్యాఖ్యలకు తల్లికి నోటీసులు జారీ చేసిన పార్టీ, ఎమ్మెల్యేగా ఉంటూ పదేపదే పార్టీని, నాయకత్వాన్ని బహిరంగంగా విమ ర్శిస్తున్న రాజగోపాల్‌రెడ్డికి మాత్రం ఇంతవరకూ ఒక్క నోటీసు కూడా ఇవ్వకపోవడం, మంత్రి పదవిలో కొనసాగుతున్న ఆయన సోదరుడిని పార్టీ ప్రశ్నించక పోవడం ద్వంద్వ ప్రమాణాలుగా కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూడా పార్టీలో బీసీ వర్సెస్‌ అ‌గ్రవర్ణాల కోణంలో జరుగుతున్న చర్చకు మరింత ఆజ్యం పోస్తోంది.

కాగా, మరికొందరు నేతలు కూడా ఇటీవలి కాలంలో టీపీసీసీ క్రమశికణ కమిటీ నోటీసులు అందుకున్నారు. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదిలాబాద్‌ ‌నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ ‌కార్పొరేటర్‌ ఇజ్జగిరి సంజయ్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్రమ శిక్షణ ఉల్లంఘనగా పరిగణించారు. ఇక సీనియర్‌ ‌నేత షబ్బీర్‌అలీకి కూడా గతంలో ఇదే కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, తమ వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దొద్దని, ఎంతటి వారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోబోమని కమిటీ చైర్మన్‌ ‌మల్లు రవి పలుమార్లు హెచ్చరించారు.

ఇదీ పార్టీ ప్రతిష్ఠ

సొంత పార్టీ నేతల బహిరంగ విమర్శలు, పరస్పర దూషణలు కాంగ్రెస్‌ ‌ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నా యని ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. అందుకే వరుసగా నోటీసుల పరంపర కొనసాగు తోందని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. అయితే, ఏ నేతపై ఎప్పుడు, ఎంత కఠినంగా చర్యలు తీసు కుంటారన్న దానిపై స్పష్టత లేకపోవడం, కొందరి విషయంలో వేగంగా స్పందిస్తూ, మరికొందరిని పట్టించుకోకపోవడం పార్టీలో అసంతృప్తికి కారణ మవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మాత్రం, పార్టీలో క్రమశిక్షణే ప్రధాన మని, ఎంతటివారైనా హద్దులు దాటి మాట్లాడితే క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు ఉంటాయని సందర్భంవచ్చినప్పుడల్లా భదీ హెచ్చరిస్తున్నారు. మొత్తంగాచూస్తే, ఈ వివాదాల పరంపర బీసీ వర్సెస్‌ అ‌గ్రవర్ణాల చర్చగా మారింది. మరోవైపు.. రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్‌ ‌మహానగరపాలక సంస్థకు ఎన్నికలు దగ్గరపడు తున్నాయి. సొంత పార్టీ నేతల రాజకీయ సవాళ్లు, నోటీసుల నేపథ్యంలో ఈ అంతర్గత కుమ్ము లాటలను ఎలా చక్కదిద్దుకుంటుం దన్నది తెలంగాణ కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందున్న అతిపెద్ద సవాలుగా చెప్పుకో వచ్చు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.