మత ఛాందసంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌.. ‌భారత్‌ ‌చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బతిన్నా వైఖరిలో మార్పు రావడం లేదు. భారత్‌తో జరిగిన పలు యుద్ధాల్లో పరాజయం పాలైన పాకిస్తాన్‌ ‌ముఖాముఖి తలపడలేనని నిశ్చయించుకుని ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది. అయితే గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు దెబ్బకు దెబ్బ అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో పాలుపోని ఆ దేశం ఇప్పుడు కొత్త కొత్త సంస్థలను భారత్‌పై ఉసిగొల్పుతోంది.
పాకిస్తాన్‌ ఇం‌టెలిజెన్స్ ‌సంస్థ ఐఎస్‌ఐ ‌మద్దతుతో షహజాద్‌ ‌భట్టి నెట్‌వర్క్ (ఎస్‌బీఎన్‌) ‌సంస్థ ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో రక్తపాతం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించగా, భారత భద్రతా దళాలు ముందుగానే గుర్తించి భగ్నంచేయడంతో దేశం పెనుముప్పు నుంచి బయటపడింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో భారీ ఆపరేషన్‌ ‌నిర్వహించి 250 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో మరోసారి పాకిస్తాన్‌ ‌కుట్రలు బయటపడటమే కాకుండా దేశానికి పెను ప్రమాదం తప్పింది.

దేశ విభజనానంతరం జవ్మకశ్మీర్‌ ‌భూభాగంపై కన్నేసిన పాకిస్తాన్‌ ‌సుదీర్ఘకాలంగా భారత్‌పై ప్రత్యక్షంగా యుద్ధాలు, పరోక్షంగా ఉగ్రదాడులు చేస్తోంది. వీటిలో ప్రత్యక్ష యుద్ధాలు పరిమిత స్థాయిలో ఉండగా పరోక్షంగా ఉగ్రవాద చర్యలు తరచూ జరుగుతున్నాయి. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాల పాలనలో ఉగ్రవాదులదాడులు జరిగినప్పుడు ఖండించడం, చర్యలు తీసుకుంటామని హడావిడి ప్రకటనలు చేయడం తప్ప పెద్దగా చర్యలు కనిపించేవి కావు. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేయడంతో పాటు.. ప్రపంచానికి పాకిస్తాన్‌ ‌నైజాన్ని, అది పోషిస్తున్న ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను బహిర్గతం చేస్తూ చర్యలు తీసుకుంటోంది.

ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉగ్రవాద దాడులకు భారత్‌ ‌తీవ్రంగా స్పందించింది. అంతకుముందు 1993, 2008లో ముంబైలో ఉగ్ర ముష్కరులు చేసిన దాడుల్లో వందలాదిమంది బలైనా బదులు తీసుకోవడంలో మీన మేషాలు లెక్కపెట్టారు. 2016లో ఉరీ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19మంది భారత సైనికులు మృతిచెందారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌ ఆ‌క్రమిత ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ ‌స్ట్రైక్స్ ‌నిర్వహించింది. 2019లో పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 40మంది సీఆర్‌పీఎఫ్‌ ‌జవాన్లు మృతి చెందగా ప్రతీకారంగా భారత్‌ ‌బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణశిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. 2025లో పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26మంది పౌరులను పొట్టనపెట్టుకున్న ఘటనకు ప్రతిస్పందనగా భారత్‌ ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చేపట్టి పాకిస్తాన్‌, ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంది. మోదీ ప్రభుత్వం ఒకవైపు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్‌ ఉ‌గ్రవాదులకు అందిస్తున్న అండదండలను, వారి ద్వంద్వనీతిని ప్రపంచం ముందు బహిర్గతం చేయడంలో విజయవంతమవడంతో అంతర్జాతీ యంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరిగింది.

పాకిస్తాన్‌ ఉ‌గ్రవాద చర్యలకు గట్టి బుద్ధి చెబుతున్నా ఆ దేశ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పురావడం లేదు. ఐఎస్‌ఐ అం‌డతో లష్కరే తోయిబా, జమాత్‌ ఉద్‌ ‌దవా, జైషే మహ్మద్‌, ‌హిజ్బుల్‌ ‌ముజాహిద్దీన్‌, ‌ది రెసిస్టెన్స్ ‌ఫ్రంట్‌, ‌హర్కత్‌ ఉల్‌ ‌ముజాహిద్దీన్‌, ‌హర్కత్‌ ఉల్‌ ‌జిహాద్‌ అల్‌ ఇస్లామి, అల్‌ ‌బదర్‌ ‌తదితర సంస్థలు భారత్‌కు వ్యతిరేకంగా గతంలో క్రియాశీల పాత్ర పోషించాయి. ఇప్పుడూ అదే పంథాను కొనసాగిస్తున్నాయి. ప్రముఖ ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆర్థికంగా ఆంక్షలు విధిస్తామని అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి రావడంతో పాకిస్తాన్‌ ‌కొత్త మార్గాల్లో ఉగ్రవాదులను తయారు చేస్తోంది. వేర్వేరు పేర్లతో చిన్న సంస్థలను ఏర్పాటు చేయించి వాటికి ఆర్థిక, మౌలిక సహకారం అందిస్తున్నట్టు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇందులో భాగంగానే షహజాద్‌ ‌భట్టి నెట్‌వర్క్‌ను భారత్‌కు వ్యతిరేక అస్త్రంగా మార్చుకున్నట్టు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌లో అరాచకం సృష్టించాలని భారీ కుట్రలు పన్నిన ఎస్‌బీఎన్‌ ఉ‌గ్రవాద సంస్థ ఐఎస్‌ఐకి అస్త్రంగా మారింది. సోషల్‌ ‌మీడియా ఆపరేటర్‌ ‌ముసుగులో షహజాద్‌ ‌భట్టి ఒక నెట్‌వర్క్‌ను ప్రారంభించి భారత్‌లోని యువతను దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నించినట్టు భద్రతాసంస్థల దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ‌ప్రావిన్స్‌కు చెందిన షహజాద్‌ ‌సోషల్‌ ‌మీడియా వ్యాపారవేత్తగా, సేవాకార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిగా, ఇస్లాం మత ప్రచారకుడిగా ఆ దేశంలో పరిచితుడయ్యాడు. అయితే అతనిపై గతంలో నేరారోపణలు కూడా నమోదైనట్టు పాకిస్తాన్‌ ‌రికార్డులను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. దుబాయ్‌లో ఉన్న సమయంలో ‘333’ పేరుతో భారత్‌-‌పాక్‌ ‌సంబంధాలు, ఇస్లాం మత విషయాలు, వివాదాస్పద అంశాలపై ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, •••ట్యూబ్‌లలో వీడియోలు చేస్తూ యువతను ప్రభావితం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో అతనికి ఐఎస్‌ఐ ‌నుంచి సహకారం అందినట్టు భారత భద్రతా సంస్థలు అనుమా నిస్తున్నాయి.

ఎస్‌బీఎన్‌ ‌సంస్థ ప్రధానంగా ఢిల్లీ, పంజాబ్‌, ‌హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సోషల్‌ ‌మీడియా నెట్‌వర్క్‌ను విస్తరించినట్టు దర్యాప్తులో తేలింది. వీరి ఏజెంట్లు దేశవ్యాప్తంగా వందలాది మొబైల్‌ ‌నంబర్లు, సోషల్‌మీడియా ఖాతాలను ట్రాక్‌చేస్తూ వివాదాస్పద వీడియోలను ప్రసారం చేసినట్టు అధికారులు గుర్తించారు. తహ్రీక్‌ ‌తాలిబన్‌ ‌హిందుస్తాన్‌ ‌వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలు పెట్టుకుని భారత్‌లోని పోలీసు అధికారులపై దాడులు చేయాలనే లక్ష్యంతో పనిచేసినట్టు భద్రతా సంస్థల విచారణలో వెల్లడైంది.

ఆగస్టు 12న 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 253మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై 80కిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. భద్రతా సంస్థల దాడుల్లో గ్రెనేడ్లు, పిస్టళ్లు, లైవ్‌ ‌కార్ట్రిడ్జ్‌లు, ఐఈడీలకు సంబంధించిన సామగ్రి, సీసీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలు లభించాయి. కొన్ని గ్రెనేడ్లపై పాకిస్తాన్‌ ఆర్డినెన్స్ ‌ఫ్యాక్టరీ గుర్తులున్నట్లు అధికారులు గుర్తించారు.

దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు, వార్తలు బయటపడినా వాటి మూలాలు హైదరాబాద్‌లో ఉండడం కూడా తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికే. ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ ఉ‌గ్రవాద నెట్‌వర్క్‌లకు అతీతం కాదని గత కొన్నేళ్ల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు కూడా ఉగ్రవాదులకు అనుకూలంగా మారుతున్నాయి. 2025లో హైదరాబాద్‌లో ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మాడ్యూల్‌ ‌పేలుడు కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. 2016లో పాతబస్తీలో నిర్వహించిన దాడుల్లో ఐఎస్‌ఐతో సంబంధాలున్న మాడ్యూల్‌కు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన సామగ్రి, డిజిటల్‌ ‌పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. యువతను ఆన్‌లైన్‌ ‌ద్వారా ప్రభావితం చేసి ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించే ప్రయత్నాలు అప్పట్లోనే వెలుగులోకి వచ్చాయి. 2025 నవంబర్‌లో హైదరాబాద్‌లో ఒక వైద్యుడు రైసిన్‌ అనే విషపూరిత సెనైడ్‌ను తయారు దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లోని ప్రసాదాల్లో కలపాలనే ప్రణాళికలు రూపొందించగా పోలీసులు భగ్నం చేయడంతో పెద్ద ముప్పు తప్పింది.

అలాగే హైదరాబాద్‌ ‌కేంద్రంగా హిజ్బుత్‌ ‌తహ్రీర్‌ (‌హెచ్‌•••టీ) నెట్‌వర్క్‌పైనా జాతీయ దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. యువతను రహస్యంగా రిక్రూట్‌ ‌చేసి తీవ్రవాద భావజాలం వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు దర్యాప్తులో తేలింది. ఇటీవల హైదరాబాద్‌లో భట్టి నెట్‌వర్క్‌తో సంబంధాలపై అనుమానాలతో ఒక యువకుడి అరెస్టు ఘటన కూడా ఈ కొత్త తరహా ఉగ్ర నెట్‌వర్క్‌లపై ఆందోళనను పెంచింది. సోషల్‌మీడియా ద్వారా పాక్‌కు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకున్నట్టు, ఆయుధాల సమీకరణకు ప్రయత్నించినట్టు పోలీసులు ఆరోపించారు.

ఉగ్రవాదుల దాడులప్పుడు స్పందించడం మాత్రమే కాకుండా దేశంలో భద్రతావ్యవస్థ చేపట్టిన చర్యల ఫలితంగా ఉగ్రవాద ఘటనల్లో గణనీయమైన తగ్గుదల నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి.

అయితే గణాంకాలు తగ్గుతున్నాయన్న కారణంతో ఉగ్రవాదం ముప్పు పూర్తిగా తొలగి పోయిందని భావించడం ప్రమాదకరం. ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు సరిహద్దు దాటి ఆయుధాలతో వచ్చే ఉగ్రవాదుల స్థానంలో ఇప్పుడు స్థానిక యువతను ఆకర్షించడం, ఆన్‌లైన్‌ ‌ర్యాడికలైజేషన్‌, ‌డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా, క్రిమినల్‌ ‌నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవడం, సోషల్‌ ‌మీడియా ద్వారా రిక్రూట్‌మెంట్‌, ‌స్లీపర్‌ ‌సెల్స్ ఏర్పాటు వంటి పద్ధతులు పెరుగుతున్నాయి. ఉగ్రవాదానికి సరిహద్దు అవతల నుంచి మద్దతు ఉంటే కేవలం సరిహద్దు భద్రతను పెంచడం సరిపోదు. నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం, ఆయుధాల సరఫరాను నిలిపివేయడం, సోషల్‌ ‌మీడియా నెట్‌వర్క్‌లను పర్యవేక్షించడం, నకిలీ పత్రాలు, హవాలా మార్గాలను ఛేదించడం, సైబర్‌ ‌నిఘాను బలోపేతంచేయడం, రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య సమాచారాన్ని వేగంగా పంచుకోవడం వంటి చర్యలు సమాంతరంగా సాగాలి. ఇందుకు తాజాగా బయటపడిన షహజాద్‌ ‌భట్టి నెట్‌వర్క్ ఒక ముఖ్యమైన ఉదాహరణ. 14రాష్ట్రాల్లో వారి నెట్‌వర్క్ ‌విస్తరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ముంబై 26/11 నుంచి పుల్వామా, పహల్గామ్‌ ‌వరకు జరిగిన దాడులు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఒక విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఉగ్రదాడి జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం కంటే దాడికి ముందే కుట్రను గుర్తించి, దాని వెనుక ఉన్న హ్యాండ్లర్‌ను, నిధుల మార్గాన్ని, ఆయుధాల సరఫరాను, సోషల్‌ ‌మీడియా నెట్‌వర్క్‌ను, స్లీపర్‌ ‌సెల్స్‌ను ఛేదించడమే అసలైన విజయం. ఆ దిశగా దేశ భద్రతా వ్యవస్థలు సాధిస్తున్న విజయాలు ప్రజలకు కనిపించకపోయినా వాటి ఫలితంగానే ఎన్నో కుటుంబాలు విషాదాన్ని చూడకుండా నివారిస్తున్నాయి.

ఉరీ, బాలాకోట్‌, ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌వంటి పరిణామాలు భారత్‌ ఇక ఉగ్రవాదాన్ని కేవలం ఖండనలతో ఎదుర్కొనే దేశం కాదనే సందేశాన్ని ఇచ్చాయి. అదే సమయంలో హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న చిన్నచిన్న మాడ్యూళ్లు మరో హెచ్చరికను ఇస్తున్నాయి. సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాదంతో పాటు సైబర్‌ ‌ప్రపంచం ద్వారా దేశంలోకి చొరబడే ఉగ్రవాద భావజాలాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.

దేశ భద్రత అనేది కేవలం సైనికుల బాధ్యత కాదు. కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల సమన్వయం, సైబర్‌ ‌నిఘా, ఉగ్రవాద నిధుల నియంత్రణ, డ్రోన్లు, హవాలా నెట్‌వర్క్‌లపై నిఘా, సోషల్‌ ‌మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజల అప్రమత్తత.. ఇవన్నీ కలిసినప్పుడే ఉగ్రవాదాన్ని వ•లాలు సహా నిర్మూలించడం సాధ్యమవుతుంది.

ఉగ్రవాదం రూపం మారవచ్చు.. దాని లక్ష్యం మాత్రం ఒక్కటే. దేశంలో భయాన్ని సృష్టించడం, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం. అందుకే ఉగ్రవాదంపై పోరాటం కూడా కాలానుగుణంగా మరింత ఆధునికంగా, మరింత సమన్వయంతో, మరింత కఠినంగా సాగాలి. స్వాతంత్య్రం సాధించడం ఎంత గొప్ప విజయమో.. దాన్ని కాపాడుకోవడం అంతకంటే గొప్ప బాధ్యత.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.