సమాజంలో ప్రాథమిక యూనిట్ కుటుంబం. అది సవ్యంగా నడవకపోతే, సమాజం అల్లకల్లోలమైపోతుంది. విచ్ఛిన్నమైపోతుంది. కుటుంబపు నాలుగు గోడల మధ్య ఉండవలసిన విషయాలు మోడర్నిటీ పేరుతో సోషల్ మీడియా వరకూ చేరడం, కలహాలు పరాకాష్టకు చేరడం నిత్యం చూస్తున్నాం. సరైన కుటుంబ మార్గదర్శనం లేని యువత సోషల్ మీడియా వ్యామోహంలో పడి తమ వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టుకొని, సమాజ అవహేళనకు గురై మతిస్థిమితం కూడా తప్పే పరిస్థితికి చేరుకుంటున్న ఘటనలు ఉన్నాయి.
ముఖ్యంగా వివాహిత జంటల మధ్య విభేదాలు రావడానికి కారణం కేవలం మోసం, హింస, ప్రేమలేమి మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో వారి మధ్య విషయాలు బహిరంగమై ఇతరుల జోక్యం ఎక్కువ కావడమే. ఇటీవలే యూపీలో చోటు చేసుకున్న ఒక కేసులో అత్తగారు(గిరిబాల) తన కుమారుడి జీవితంలో అతిగా జోక్యం చేసుకోవడం, చివరికి కోడలి హత్య/ ఆత్మహత్యకు దారి తీసింది. కొందరు అత్తగారు కుటుంబంలో భాగమని వాదించ వచ్చు. కానీ, ఇక్కడ ప్రాథమికంగా పరిశీలించాల్సిన ప్రశ్నలు వివాహంలో హద్దులు అంటే ఏమిటి? ఒక బంధాన్ని గౌరవించడం అంటే ఏమిటి? అన్నవి.
నిజానికి ఆధునిక కుటుంబాలలో వస్తున్న సమస్యలు కేవలం కుటుంబ స్థాయిలోనే కాదు, సమాజ స్థాయిలో ఆందోళన కలిగించేలా మారుతున్నాయి. భారతీయ వైవాహిక వ్యవస్థలో వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన బంధమే కాదు, ఇరు కుటుంబాల మధ్యది. ఈ క్రమంలో, ఆడపిల్ల ప్రతి విషయాన్నీ తన తల్లితో పంచుకుంటే, అబ్బాయి తన తల్లితో పంచుకుంటున్నాడు. ఇందులో ఎవరి తప్పూ లేదు. ఇరువైపు తల్లిదండ్రులూ తమ పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలనుకుంటారు. పిల్లలు కూడా వారు తమను పెంచినవారికి అన్నీ చెప్తుంటారు. దీనికారణంగా, భార్యా,భర్తల మధ్య గోప్యంగా ఉండవలసిన విషయాలు బయటకు వెడతాయి.
ఇటు పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఇంటి విషయాలు బయటకు వెళ్లకూడదనే సంగతి విస్మరించారు. ఏదో ఒక భావోద్వేగంతో అక్కసుగా పంచుకున్న మాటలు వివాహబంధాన్నే విచ్ఛిన్నం చేయవచ్చు. ఇక సోషల్‌మీడియా వచ్చాక హద్దులనేవి చెరిగిపోయాయి. అందులో తమ భాగస్వామిని అవమానిస్తూ పరోక్ష పోస్టులు పెట్టడం, వాట్సాప్ సందేశాలను ఇతరులకు చూపడం వంటివన్నీ కూడా దుష్ఫలి తాలనే ఇస్తున్నాయి. ముఖ్యంగా, తమ పిల్లల వివాహ జీవితాన్ని పూర్తిగా నియంత్రించాలని ప్రయత్నించే తల్లిదండ్రులతో పెద్ద సమస్య ఎదురవుతోంది. ఈ అతి జోక్యం చిన్న చిన్న విషయా లను కూడా రెండు కుటుంబాల మధ్య యుద్ధంలా మారుస్తోంది. ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు ఈ విషయాన్నే రుజువు చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సర్దుబాటు గురించి చెప్పకుండా, వారి అసంపూర్ణ భావాలను ప్రోత్స హించడంతో, అది పలుసార్లు విడాకులు, మానసిక హింస, ఆత్మహత్యలు, హత్యలకు కూడా దారి తీస్తున్న సంగతి మనం చూస్తున్నాం.
తల్లిదండ్రులతో అన్నీ చెప్పుకోవడం మంచిదే. కానీ వారు సరైన దిశలో ఆ జంటకు మార్గదర్శనం చేయకపోతే, అది చివరికి ఇరువురి మధ్య అనుమానాలకు దారితీస్తుంది. తాను తన జీవిత భాగస్వామితో చెప్పిన మాటలు అవతలివారి తల్లిదండ్రులకు తెలుస్తుందేమోనన్న భావనతో తనలోనే దాచుకోవడంతో, ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతుంది. నిజానికి తల్లిదండ్రులు కూడా పూర్తి పరిణితితో ప్రవర్తించడం లేదనిపిస్తుంది. తమ పిల్లల మీద ప్రేమతో విషయాలను తెలుసుకుని, పరిష్కరించే యత్నం చేస్తున్నామనుకుంటారే తప్ప వారి వ్యక్తిగత జీవితాల్ని తెలియకుండానే దూరం తీసుకువస్తున్నామని గ్రహించరు.
భార్యాభర్తల మధ్య వ్యక్తిగత జీవితం ప్రారంభ మయ్యేందుకు తోడ్పడే పాత్రను తల్లిదండ్రులు పోషించాలే తప్ప, వారి జీవితం బట్టబయలు చేసేది కాదు. ఇక స్నేహితుల విషయం చెప్పనవసరం లేదు. అడిగే వారికి ఎంత పరిణితి ఉంటుందో, చెప్పేవారికీ అంతే ఉంటోంది. కానీ, నేటితరానికి ప్రతి విషయాన్నీ స్నేహితులతో పంచుకోవడం పరిపాటిగా మారింది. అయితే, ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం సవ్యంగా ఉన్నంతకాలం బానే ఉంటోంది, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరు బయట పెట్టుకోవడంతో, అది కుటుంబం లోకి జొరపడి బంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. మోసాలు, బ్లాక్‌మెయిళ్లు, ఆర్ధిక దోపిడీ, వివాహేతర సంబంధాలు వంటి విషయాలన్నీ దాని పర్యవ సానమే.
ఒకప్పుడు దాంపత్యజీవితంలో విషయాలు ఆ దంపతుల మధ్యే ఉండేవి. కానీ, ఇప్పుడవి గ్రూప్ డిస్కషన్లుగా మారుతున్నాయి. ఇక సోషల్ మీడియా, ఒకవైపు మనుషులను దగ్గర చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవ జీవితంలో వారిని దూరం చేస్తోంది. ఇది కుటుంబంలో పరాయీ కరణకు దారితీస్తోంది. భార్య లేదా భర్త ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా కుటుంబం కూడా సోషల్‌మీడియా ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తోంది. విషయం ఏమిటంటే, ఒకసారి బయటకు వెళ్లిన వ్యక్తిగత సమాచారం చిలువలుపలువలై, చర్చలై, సంబంధం లేనివారు కూడా వ్యాఖ్యానించే స్థాయికి వెళ్లి జీవితాంతం వెంటాడతాయి.
దంపతుల మధ్య ప్రేమ తగ్గితే తిరిగి పెరగవచ్చు, డబ్బుపోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ విశ్వాసం లోపిస్తే మళ్లీ దాన్ని నిర్మించుకోవడం కష్టం. ఈ విశ్వాసహీనతకు పైన పేర్కొన్న కారణాలలో ఏదో ఒకటి ఉంటుంది. విశ్వాసంతో చెప్పిన ఒక మాట మూడవ వ్యక్తికి చేరడం చెప్పిన వారి మనసును విరిచేయవచ్చు. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి, అంతిమంగా విడిపోయేందుకు దారి తీయవచ్చు. ఈ క్రమంలోనే స్వేచ్ఛకు కూడా హద్దులు ఉంటాయనే విషయాన్ని తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. నిజమైన కష్టకాలంలో పిల్లలకు అండగా నిలబడడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ, అవసరం లేని సమయంలో కూడా వారి విషయాలలో జోక్యం చేసుకుంటే, ఆ బంధం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
ఇద్దరి మధ్య ఏర్పడే సమస్యలను కాస్త ఓపికతో వ్యవహరించి వారు పరిష్కరించుకోవచ్చు. అందుకు తల్లిదండ్రుల జోక్యం అవసరంలేదు. ఇరువైపుల తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని, తమ పిల్లలకు చెప్పాలి. తమ బంధాన్ని కాపాడుకు నేందుకు భార్యాభర్తలు కొన్ని విషయాలను తెలుసుకొని, పాటించాలి. క్షణికావేశంలో బయటివారి ముందు జీవితభాగస్వామిని పల్చన చేయడం, చెడుగా మాట్లాడడం మానుకోవడం, ప్రతి సమస్యనూ తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లక పోవడం, స్నేహితుల సలహా తీసుకునేముందు, అవతలి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాన్ని ప్రదర్శించకపోవడం, ఆవేశం తగ్గిన తర్వాతే తమ మధ్య ఏర్పడిన సమస్యల గురించి మాట్లాడుకోవడం, నీకన్నా నేనే గొప్ప అన్న అహాన్ని పక్కనబెట్టడం, ఇవన్నీ కుదరనప్పుడు కుటుంబ కౌన్సిలింగ్‌కు వెళ్లడం ఉత్తమం.
వివాహం అనేది ఇద్దరు మనుషుల కలయికే కాదు, రెండు హృదయాల మధ్య నిర్మించుకునే విశ్వాసం. దీనికి ఆధారం ప్రేమ అయితే, ద్వారం గోప్యత. దానిని ఎప్పుడు తెరవాలో తెలుసుకోవాలి. నేటి దంపతులకు అవసరమైంది పరస్పర ప్రేమ మాత్రమే కాదు, ఏది బయటకు చెప్పాలి? ఏది తమ మధ్యే ఉంచుకోవాలి? అనే పరిపక్వత. ఎందుకంటే, బయటకు వెళ్లిన విషయాల వల్ల వివాహాలే కాదు జీవితాలు కూడా ధ్వంసం అవుతాయి.
మానవ సంబంధాల సంక్షోభం
ఇది సరిహద్దులు దాటిన సామాన్యుడి సమస్య. ఒకవైపు సాంకేతిక పురోగతి, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక అవకాశాలు పెరుగుతుంటే, మరోవైపు కుటుంబాలు విచ్ఛిన్నమై, మానవ సంబంధాలు బలహీనపడి, విలువలు ప్రశ్నార్థకంగా మారు తున్నాయి. ఈ పరిణామాలన్నీ చాపకింద నీరులా ప్రవేశించాయి. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఈ మార్పుల కారణంగా మానవ జీవితం, కుటుంబం, సామాజిక వ్యవస్థల్లో అనేక మార్పులు వచ్చాయి. టీవీ రాకతో కుటుంబ నాలుగు గోడల మధ్య సమాజం ప్రవేశించగా, విద్య, ఉద్యోగాల కోసం పట్టణాలు, నగరాలు, విదేశాలలో స్థిరపడడంవంటి కారణాలు కుటుంబవ్యవస్థలో అనేక మార్పులు తెచ్చాయి.
ఒకనాడు వివాహం జీవితానికి పునాది, కుటుంబం ఒక ఆశ్రయం, పిల్లలే భవిష్యత్తు. కానీ నేడు వివాహం అవసరమా? పిల్లలను ఎందుకు కనాలి? కుటుంబ జీవితం బోరింగ్ కాదా? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవి వ్యక్తిగత ఎంపికలే అయినా, వాటి వెనుక ఉన్న సామాజిక, మానసిక కారణాలను విస్మరించ లేం. నేడు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో వివాహేతర సంబంధాలు కూడా చెలామణి అవుతున్నాయి. భావోద్వేగ అసంతృప్తి, ఆకర్షణ లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమే ఇందుకు కారణమంటున్నారు కానీ ఇదే నిజమా? దీనిపై లోతైన పరిశీలన అవసరమా?
నేటి యువతలో ఎటువంటి కట్టుబాటు లేకుండా తక్షణ సంతృప్తిని అందించే కోరిక పెరుగుతోంది. నిజానికి, భార్యాభర్తల మధ్య ఆకర్షణ హఠాత్తుగా అదృశ్యం కాదు. కమ్యూనికేషన్ తగ్గినప్పుడు, చిన్న విషయాలను కూడా విస్మరించినప్పుడు ఆ సంబంధంలో ఒక శూన్యం ఏర్పడుతుంది. దీనిని భర్తీ చేసుకునేందుకు బయట వెదుకులాట మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గిందనే నమ్మకం కూడా ఈ మనస్తత్వంలో భాగమే. ఆకర్షణ కేవలం భౌతికం కాదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. పరస్పర గౌరవం, స్నేహం, నమ్మకం, ఓపిక ఉన్నప్పుడు అది కొనసాగుతుంది. సోషల్ మీడియాలో కనిపించే జీవితమే నిజమని వ్యక్తులు నమ్మడంవల్ల విచక్షణను కోల్పోతున్నారు.
ఇతరులతో పోలికపెట్టి మాట్లాడడం అసంతృప్తికి దారితీసి, తప్పుడు నిర్ణయాలకు బీజాలుగా మారుతుంటాయి. చిన్న వాదనలు పెద్ద నిర్ణయాలకు దారి తీస్తున్నాయి. కాస్త ప్రశాంతతో పరిష్కరించు కోవలసిన చిన్న విషయాలు కూడా అహం కారణంగా విడాకులకు దారితీస్తోంది. నేడు మతం విభజనకు కారణమవుతోంది. ముఖ్యంగా మతాంతర వివాహాలలో చిన్న బేధాలు కూడా భార్యభర్తల మధ్య పెద్ద చీలికలకు దారితీస్తోంది.
నేడు సమాజంలో ప్రతివారికీ సులవైన జీవితం కావాలి. పని పట్ల ఆసక్తి తగ్గుతోంది. ఏం చేసి అయినా డబ్బు సంపాదించాలనే వ్యామోహం పెరుగు తోంది. ఇది యువత పక్కదారి పట్టేలా చేస్తోంది. తమ సుఖం కోసం, బాధ్యతలను తప్పించుకోవడం కోసం నేటి యువతలో అనేకమంది పిల్లలను వద్దనుకుని, కుక్కల్ని,పిల్లుల్ని పెంచు కుంటూ తృప్తి పడటం కూడా సులువైన జీవితం కోసమే.
ఈ క్రమంలో విలువలు, సంస్కృతి పాతపడు తున్నాయా? ఇవి అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, ఇవే సామాజిక జీవితానికి పునాదులని వారికి తల్లిదండ్రులు చెప్పడం లేదు. ఆధునికత పేరుతో పిల్లలు వాటిని వదిలి పెట్టడాన్ని తల్లిదండ్రులు మౌనప్రేక్షకుల్లా చూస్తూ, వారిని సరిచేయకపోవడంతోనే సమస్య వస్తోంది. సంబంధాలు భారంగా అనిపించినప్పుడు వాటిని వదిలించు కోవడం సులువు, వాటిని సరిచేసు కునేందుకు సాహసం కావాలి. నేటి కాలంలో ఆ ధైర్యం అత్యంత అవసరం. మనస్తత్వ శాస్త్ర నిపుణులు, కుటుంబ సలహాదారులు, విద్యావేత్తలు, వివిధ రంగాలలో బాధ్యతాయుతమైన వ్యక్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సామాజిక కార్యకర్తలు ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేయాలి. ఇది ఒక సామాజిక సమస్య. సరిహద్దులు దాటిన సామాన్యుడి సమస్య.
డా।। జె.పి. భారతి కాజా
ఫ్యామిలీ- స్టూడెంట్ కౌన్సిలర్