సెస్టెంబర్‌ 4, శ్రీ‌కృష్ణాష్టమి


శ్రీ‌కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు (కృష్ణస్తు భగవాన్‌ ‌స్వయమ్‌), అన్నిటిని చేసేవాడు కనుక కృష్ణుడు (సర్వం కరోతీతి కృష్ణః) అని మహర్షులు కీర్తించారు. ఆయన నరులలో ఉత్తముడు. కార్యకుశలుడు, శూరుడు, రాజనీతి నిపుణుడు, జ్ఞాని, సర్వగుణాలు మూర్తీభవించిన షోడశ కళామూర్తి. తన జీవితంలోని వివిధ దశలలోని చేష్టలు, చర్యలు, ధర్మరక్షణ యత్నాలు ఇలా… ప్రతి అంశమూ మానవాళికి దిశా నిర్దేశం చేసేదే.

భారత, భాగవత కృష్ణతత్వాలలో సున్నిత భేదం గోచరిస్తుంది. భాగవతంలోని కృష్ణయ్య అమాయక బాలుడు, సున్నిత స్వభావుడు. మహా భారత కృష్ణుడు దార్శనికుడు, రాజకీయ చతురుడు, వ్యూహకర్త. ఈ రెండు కావ్యాల్లోని మరుపురాని మధురఘట్టాలకు శ్రీకృష్ణడు మూలకారకుడు మాత్రమే కాదు. అవతరించినది మొదలు మహా నిర్యాణం వరకు మానవమానాలను ఎదుర్కొన్నాడు. వెన్నా మన్ను సమముగ తిన్న’ ఆయన వా•న్నిటిని తేలిగ్గా తీసుకున్నాడు. కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, ఎగుడు దిగుడులు జీవితంలో భాగమంటూ, వాటిని ఎలా అధిగమిస్తూ, జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో మానవజాతికి పాఠాలు నేర్పిన చైతన్యమూర్తి. పాలకుల నుంచి పాలితుల దాకా వ్యవహరించ వలసిన తీరును బోధించాడు. సవాళ్ల, సమస్యల నుంచి పలాయనం చిత్తగించడం నాయకత్వ లక్షణం కాదని, సమయమెరిగి వ్యవహ రించాలని నేర్పాడు. ‘నెగ్గడం, తగ్గడం’ ఎరిగిన వాడు. ఆ వ్యూహంతోనే శత్రువులను తుద ముట్టించాడు. సర్వవేదాంతసారం గీతాశాస్త్రాన్ని మానవాళికి అందించి మార్గదర్శనం చేశాడు.

అధికారం కంటే ప్రజాసంక్షేమమే ప్రధానమని చాటాడు. మేనమామ కంస వధ తరువాత మగధ రాజ్యాధిపత్యం చేపట్టాలన్న మాతామహుడి (ఉగ్రసేనుడు)కోరికను మృదువుగా తిరస్కరించాడు. ‘నా కుమారుడు కంసవధతో వీరధర్మంగా రాజ్యం నీకు సంక్రమించినట్లే. పైగా వయోభారం కారణంగా రాజ్యభారం వహించలేను’ అన్న తాత మాటలకు, ‘నాకు రాజ్యకాంక్ష ఎన్నడూ లేదు.కంసుడిని చంపింది రాజ్య లోభంతో కాదు(‘నహి రాజ్యేన మే కార్యం/నాప్యహం నృప కాంక్షితః/న చాపి రాజ్యలబ్ధేన/మయా కంసో నిపాతితః’)అని కృష్ణుడు వినయంగా బదులిచ్చాడు. నేను గోవుల మధ్య అడవుల్లో తిరిగేందుకు పోతాను (‘అహం స ఏవ గోమధ్యే/గోపై స్సహ వనే తరః’) అనీ విన్నవించాడు.

కన్నయ్య భక్తజనపక్షపాతి. పెద్దల్లో పెద్ద…పిన్నల్లో పిన్న. అందునా…అమ్మంటే ఎంతెంతో ఇష్టం. జగన్నాథుడైనా ఆమె ముందు పసిబాలుడే. ఆదిమధ్యాంత రహితుడు పాలకతల్లి యశోద వద్ద అమాయక శిశువుగా వర్ధిల్లాడు. అమ్మ చేతి మూరెడు తాడుకు బందీ అయ్యాడు.

‘చిక్కడు సిరి కౌగిటిలో

జిక్కడు సనకాది యోగిచిత్తాబ్జములన్‌

‌చిక్కడు శ్రుతి లతికావళి

జిక్కెనతడు లీల దల్లి చేతన్‌ ‌రోలన్‌’… -‌లక్ష్మీదేవి కౌగిలికి, వేదవేత్తలకు, సనకాదిమునుల చిత్తాలకు చిక్కనివాడు ప్రేమమయి అయిన తల్లి చేతికి లీలావిలాసంగా దొరికిపోయాడని పోతనా మాత్యుడు, చిన్నికృష్ణుడి లీలను వర్ణించారు. ఇద్దరు తల్లుల (దేవకి, యశోద) ముద్దుల తనయుడిని ‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు/తిద్దరాని మహిమల దేవకీసుతుడు’ అని అన్నమాచార్య కీర్తించారు.

కృష్ణుయ్యను స్నేహతత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణిస్తారు. స్నేహ మధురిమలను అనంతర యుగాలకు పంచాడు.‘కృష్ణమిత్ర మండలి’లో చోటు దక్కడం ధన్యమైనట్లుగా భావించే వారట. ఆ జట్టులో చేరిన వారి యోగక్షేమాల బాధ్యత ఆయనదే.

అష్టమి’ విశిష్టత…

దేవకీనందనుడు శ్రావణ బహుళ అష్టమినాడు జన్మించినందున ‘జన్మాష్టమి’ అని, ఆయనకు నామకరణానంతరం ‘కృష్ణాష్టమి’, బాల్యం గోకులంలో గడపడం వలన ‘గోకులాష్టమి’ అని, శ్రీకృష్ణుని జన్మదినం కనుక ‘శ్రీకృష్ణ జయంతి’ అని, లోకానికి శ్రీకరం కనుక ‘శ్రీజయంతి’ అని వ్యవహారంలోకి వచ్చింది.

దేశవ్యాప్తంగా అన్ని వైష్ణవ ఆలయాలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. గురాత్‌లోని ద్వారకలోని ద్వారాకాధీశుని ఆలయంలో,ఉత్తరప్రదేశ్‌ ‌మధురలో, బృందా వనంలో, ఒడిశాలోని పురీ జగన్నాథస్వామి, కేరళలోని గురువా యూర్‌లోని గురువాయూరప్పన్‌, ‌చెన్నైలోని పార్థసారథి స్వామి, తిరువాయూరులోని రాజగోపాల ఆలయం, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయం తదితర ప్రముఖ ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో కనువిందు చేస్తాయి. దేశ విదేశాలలోని ‘ఇస్కాన్‌’ ‌మందిరాలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాయి. తిరుమలలో శ్రీనివాసమూర్తి ఆ రోజు ప్రత్యేకంగా కొలువు తీరతారు. దీనిని ‘గోకులాష్టమి ఆస్థానం’గా వ్యవహరిస్తారు.

కృష్ణయ్య రోహిణీ నక్షత్రంలో రాత్రి అవతరించి నందున భక్తులు ఆ తిథినాడు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం పూజాదికాలు నిర్వహిస్తారు.

సమస్త ప్రాణుల్లో నివాసం ఉండడం, దేవతలలో ఆయనలో కొలువుదీరి ఉండడం వల్ల వాసుదేవ అనే పేరువచ్చింది (వాసనాత్‌ ‌సర్వభూతానాం వసుత్వాత్‌ ‌దేవ యోనితః….) అని వ్యాసభారతం పేర్కొంటోంది.

‘కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనమ్‌

‌వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణమ్‌ ‌హరిమ్‌’

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor