లైడన్‌ ‌రాగిరేకులను మొదటి రాజేంద్ర చోళుడు జారీ చేశాడు. ఈ శాసన పత్రంతో రెండు భాగాలున్నాయి. ఒకటి సంస్కృతం విభాగం (5 ఫలకాలు) చోళరాజ వంశావళిని వివరిస్తుంది. ఇది విష్ణుస్తోత్రంతో, పౌరాణిక (సౌర) పూర్వికుల పేర్లతో ప్రారంభమవుతుంది. తమిళ విభాగం మొదటి రాజేంద్ర చోళుని తండ్రి అయిన రాజరాజు (క్రీ।।శ।। 985-1012) పాలన గురించి వివరిస్తుంది. శాసనం ప్రకారం మొదటి రాజరాజు పాలన చేపట్టిన 21వ సంవత్సరంలో, ఒక బౌద్ద విహారాన్ని నిర్మించడం కోసం ఒక గ్రామం అనై మంగళంతో పాటు 26 పరిసర గ్రామాల మొత్తం ఆదాయాన్ని, దాని భూమిని దానం చేయాలని ప్రకటించాడు. కోరమండల్‌ ‌తీరంలోని ఓడ రేవు పట్టణమైన నాగపట్టణంలో శ్రీవిజయ (ఇండోనేషియా) మలయరాజు ఈ విహారాన్ని నిర్మించాడు. రాజేంద్ర చోళుని ముద్రను కలిగున్న ఒక భారీ కంచు ఉంగరంతో కలిపి ఉంచిన 21 రాగిఫలకాలు 5 ఫలకాలపై గ్రంథ లిపిలో సంస్కృత వచనం ఉండగా 16 ఫకాలపై తమిళ వచనం ఉంది. 1703- 1712 మధ్య బాటలియాలో మతగురువుగా పనిచేసిన ఫ్లోరింటియస్‌ ‌క్యాంపర్‌ ‌భారతదేశం నుండి తీసుకు వెళ్లారు. తరువాత అవి అతని మనుమరాలు జోహన్నా కాంపర్‌ అధీనంలోనికి వచ్చాయి. చివరకు నెదర్లాండ్‌లోని లైడెన్‌ ‌విశ్వవిద్యాలయ గ్రంథలయా నికి చేరుకున్నాయి.

సుమారు 300 ఏళ్ల తరువాత భారతదేశం చేసిన దౌత్య పరమైన ప్రయత్నాల ఫలితంగా 2026 మే16న భారత ప్రధాని నరేంద్ర మోదీకి డచ్‌ ‌ప్రధాని రాబ్‌ ‌జెటెన్‌ అధికారికగా లైడెన్‌ ‌కాపర్‌ ‌ప్లేట్స్‌ను అందజేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘‘ఇది ప్రతీ భారతీయుడు గర్వించ దగ్గ క్షణం, మన పూర్వికుల గొప్పదనాన్ని చాటే ఈ చారిత్రక ఆధారాలను భద్రపరిచినందుకు నెదర్లాండ్స్ ‌ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

చారిత్రక పరిశోధకులు ఈ పరిణామాన్ని కేవలం ఒక వస్తువు తిరిగి రావడంలా చూడటం లేదు. ప్రముఖ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చోళుల కాలంలోనే భారత్‌కు ఆగ్నేయాసియా దేశాలతో ఎంతటి బలమైన సముద్ర వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు ఉండేదో చెప్పడానికి ఈ లైడెన్‌ ‌ప్లేట్స్ అతిపెద్ద నిదర్శనం, వలసరాజ్యాల కాలంలో దోపిడీకి గురైన మన వారసత్వాన్ని, సొంతం చేసుకునే హక్కు భారత్‌కు ఉందని ఈ ఘటన నిరూపించింది. ఈ శాసనాలు భారత్‌కు తిరిగి రావడానికి వెనుక 2012 నుంచి సాగుతున్న దౌత్య ప్రయత్నాలే కారణం. యునెస్కో కూడా భారత్‌ ‌వాదనను సమర్ధించింది. అంతర్జాతీయ దౌత్యంలో పెరుగుతున్న ప్రభావానికి మన సంస్కృతిని కాపాడుకోవటంలో భారత్‌ ‌చూపిస్తున్న పట్టుదలకు ఈ విజయం ఒక ఉదాహరణ. ఎన్నో వజ్రాలు ప్రధానంగా కోహినూరు, లండన్‌ ‌మ్యూజియంలో కల ఎన్నో కళాఖండాలను వెనక్కి రప్పించాల్సి ఉంది.

లైడెన్‌ ‌రాగి శాసనాలలోని 16 తమిళరేకులలోని 5 సంస్కృత రేకుల పూర్తి సారాంశం ఈ కింది విధంగా వుంది. తమిళ భాగం పూర్తిగా పరిపాలన, భూమి కొలతలు, పన్ను మినహాయింపులను వివరిస్తున్నది.

భూదాన ప్రకటన (రాయల్‌ ‌డిక్రీ) దాత: చోళ చక్రవర్తి 1వ రారాజ చోళుడు (కీ।।శ।। 985-1014) ఈ దానాన్ని నోటి ద్వారా ఆదేశించగా అతని కుమారుడైన 1వ రాజేంద్రచోళుడు, తండ్రి మాటను గౌరవిస్తూ రాగిరేకులపై శాసనాన్ని ప్రకటించాడు. దానం పొందిన సంస్థ నాగపట్టణంలో ఇండోనేషియా రాజు (శ్రీవిజయ సామ్రాజ్యం) శ్రీమార విజయోత్తుంగ వర్మన్‌ ‌నిర్మించిన చూడా మణివర్మ బౌద్ద విహారానికి దానంగా ఇచ్చిన గ్రామం ‘‘అనై మంగళం’’. ఈ గ్రామంలో వచ్చే మొత్తం ఆదాయంను బౌద్ద సన్యాసుల ఆహారం, వసతి, విహార నిర్వహణకోసం కేటాయించారు.

ఈ రాగిరేకులలో అత్యధిక భాగం ఈ గ్రామానికి ఇచ్చిన పన్ను మినహాయింపే ఉంది. దీనిని తమిళంలో ‘‘పల్లించందమ్‌’’ అం‌టారు. అంటే, బౌద్దజైన సంస్థల కిచ్చేదానం. ఈ గ్రామవాసులు చోళ ప్రభుత్వానికి ఎటువంటి పన్ను కట్టవలసిన పనిలేదు ముఖ్యంగా, కడమై (భూమి పన్ను) కుడిమై (వ్యక్తిగత పన్నులు) అరిగాడి ప్పాట్టం (గ్రామ సంతలపై పన్ను) తరి-ఇరై (చేనేత కార్మికుల మగ్గాలపై చెల్లించే పన్ను) తట్టు కాయం (స్వర్ణకారులు చెల్లించే పన్ను) ఈళంపూచ్చి (కల్లు గీసే వారిపై వేసే పన్ను) నాడుకావల్‌ ‌గ్రామ (రక్షకులు) కావలి కాసేటందుకు విధించే పన్ను) ఇవన్నీ బౌద్ద విహారానికి చెందేటట్లు మినహాయింపు.

భూదానాన్ని అమలుచేయడానికి ఒక పెద్ద ప్రభుత్వ యంత్రాంగం పనిచేసింది. అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. అనైమంగళ గ్రామసభ క్షత్రియ శిఖామణి- వళనాడులో జరిగింది (తంజా వూరు ప్రాంతం). ఇది పట్టణ కూట్రం అనే జిల్లాలో ఉండేది. దానం అమలు చేయడానికి గ్రామపెద్ద లందరూ సమావేశమ య్యారు. ‘‘తిరుమందిర-ఓలై’’ రాజు పక్కనే ఉండిరాజు నోటిమాట ద్వారా ఇచ్చే ఆదేశాలను తాటిఆకుపై వ్రాసుకునే రాజకీయ కార్యదర్శి (రాయల్‌ ‌స్క్రైబ్‌) ఉం ‌టాడు. ఈ పక్రియను ధ్రువీకరిస్తూ గ్రామపెద్దలు, రెవెన్యూ అధికారులు సాక్షులుగా సంతకాలు చేశారు ‘‘పురపు-వరి- తిణైక్కళమ్‌’’ ఇది చోళులకాలం నాటి లాండ్‌ ‌రెవెన్యూ శాఖ. వీరు ఈ అనై మంగళ గ్రామ సరిహద్దును నిర్ణయించడానికి ‘‘పిడి శూజిందు’’ అనే పద్దతిని అనుసరించారు. ఈ పద్దతి ప్రకారం ఒక అధికారిక ఆడ ఏనుగును గ్రామ సరిహద్దుల వెంట నడిపిస్తారు. అది నడిచిన మార్గాన్ని బట్టి అనైమంగళ గ్రామ సరిహద్దులను నిర్ణయిస్తారు. నాలుగు వైపుల కచ్చితంగా కొలిచి రాశారు. సర్వేయరు ఏనుగు వెనుక నడిచి రాళ్లు పాతిస్తాడు. ఈ సరిహద్దుల్లో ఉన్న కాల్వలు, చెరువులు, బావులు, తోటలపై పూర్తి హక్కులను బౌద్ధ్ద విహారానికి బదిలీ చేస్తారు.

నీటి పారుదల, వనరులపై హక్కులు దానం పొందినవారికే చెందుతాయి. వీరు దానం పొందిన భూముల్లో బౌద్ధ విహార నిర్వాహకులు కొత్తగా కాల్వలు తవ్వుకోవడానికి, నదీ జలాలను వాడుకోవ డానికి పూర్తి అనుమతి ఉంది. గ్రామ భూముల్లో పెద్ద ఇళ్లు నిర్మించుకోవడానికి, ఉప్పు తయారు చేసుకోవడానికి, ఔషధ మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటుకోవడానికి హక్కులు కలిగుంటారు.

లైడెన్‌ ‌రాగి ఫలకాలలో పొందుపరచిన రాజరాజచోళుడి రాజవంశచరిత్ర, దాని వెనుక ఉన్న విశేషాలు సంస్కృతంలో ఉన్నాయి. చోళ రాజులు ఈ రాగి ఫలకాలపై తమ వంశావళిని సంస్కృత భాషలో చాలా వివరంగా చెక్కించారు. చోళులు తాము సూర్యవంశానికి చెందిన వారమని, ఈ వంశవృక్షావళి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, మహావిష్ణువు ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. మనువు, శ్రీరామచంద్రుడు జన్మించిన సూర్యవంశంలోనే తాము జన్మించామని పేర్కొన్నారు.

రాగి ఫలకాల ప్రకారం కరికాల చోళుడు, విజయాలయ చోళుడు, ఆదిత్య చోళుడు, పరాంతకచోళుడు, సుందరచోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు పరిపాలించినట్లు లైడెన్‌ ‌శాస నాలు చెప్తున్నాయి. చోళులు హిందువులు అయినా ఒక విదేశీ బౌద్ధ విహారానికి అంతపెద్ద దానం చేయడం వారి విశాల హృదయానికి నిదర్శనం. అంతర్జాతీయంగా భారతదేశానికి ఆగ్నేయాసియా ఇండోనేషియా, మలేషియాతో మంచి సంబంధా లుండేవని ఈ లైడాన్‌ ‌రాగి రేకుల ద్వారా తెలుస్తున్నది.

ఒక దేశ పాలకుడు, సామ్రాజ్య చరిత్రను పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాడు. వారు చారిత్రక స్పృహతో పురావస్తు సంరక్షణ, వారసత్వ ప్రదేశాల రక్షణ, సాహిత్య ప్రోత్సాహం, మ్యూజియంల నిర్మాణం శాసనాల అధ్యయనం, నిష్పక్షపాత చరిత్ర రచనలు చేయించాలి.

ఈ రాగి ఫలకాలు చోళ చక్రవర్తి 1వ రాజరాజ చోళుడు, పాలనా కాలానికి చెందినవి. ఈ ఫలాకాలను క్రీ।।శ।। 985-1014 మధ్యకాలంలో రూపొందించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇవి 21 పెద్దరాగి ఫలకాలు మూడు చిన్నవి సుమారు 30 కిలోల బరువున్నాయి. తమిళనాడు నాగ పట్టణం లోని బౌద్ధవిహారం ‘‘చూడామణి విహారం’’ను కీ।।శ।।1006లో శైలేంద్ర రాజవంశానికి చెందిన శ్రీ విజయన్‌ ‌రాజు శ్రీ మార విజయత్తుంగ వర్మన్‌ ‌చోళ చక్రవర్తి 1వ రాజరాజ (985-1014) నుండి పొంది నిర్మించారు. సమకాలీన శాసనాలలో రారాజేశ్వరం పెరుంపల్లి అని కూడా ఈ విహారాన్ని పిలిచేవారు. ఈ విహారం హిందూ మహా సముద్రం అంతటా సాంస్కృతిక, మతపరమైన మార్పిడులను సులభతరం చేసే మహాయన బౌద్ద సంస్థగా పనిచేసింది. శ్రీ విజయ పంపిన బుద్ధుని కాంస్యవిగ్రహాల వంటి విరాళాలను స్వీకరించింది. మధ్యయుగ దక్షిణ భారతదేశంలోని చివరి ప్రధాన బౌద&ధ కేంద్రాలలో ఒకటి, చోళ రాజ్యాన్ని ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధించే సముద్రయాన బౌద్ధానికి కేంద్రం నాగపట్టణం. దాని పాత్రను ఇది నొక్కి చెప్పింది. అయితే పూర్తి వివరాలు తమిళనాడు పురావస్తుశాఖ వారి పరిశోధనలలో తేలాల్సుంది.

చోళుల పోషణలో క్రీ।।శ।। 1006 ప్రాంతంలో ఈ మఠాన్ని నిర్మించిన శ్రీ విజయరాజు శ్రీ విజయమర విజయత్తుంగ వర్మ. తండ్రి చూడామణి వర్మన్‌ను గౌరవించడానికే ఈ విహారానికి అనైమంగళం సమీపంలోని 26 గ్రామాలను దానం చేసినట్లు చోళరాజు ద్రువీకరించినారు. చోళ-శ్రీవిజయ రాజ్యాల మధ్యగల దౌత్య సంబంధాలను ప్రతిబింబిస్తూ, నిరంతర దీపారాధన, మఠ నిర్వహణకు నిబంధనలతో మహాయాన బౌద్ధ కేంద్రంగా ఈ విహారం పాత్రను నొక్కి చెబుతుంది.

11వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చోళ సామ్రాజ్యాన్ని, ఆగ్నేయాసియాలోని శ్రీ విజయ సామ్రాజ్యంతో ముఖ్యంగా సుమిత్ర, మలయా ద్వీప కల్పంతో అనుసంధానించే సముద్ర బౌద్ద నెట్‌వర్క్‌లలో చూడామణి విహారం ఒక ప్రముఖపాత్రను పోషించింది. ఈ మఠం శ్రీవిజయ రాజధాని అయిన ‘‘పాలెం బాంగ్‌’’ ‌నుండి వచ్చిన 150 లేదా 200మంది సన్యాసులకు ఆశ్రయం కల్పించింది. ఇది సిద్ధాంత అధ్యయనం,ఆచార సాధన కోసం ఆగ్నేయాసియా మత గురువులు భారతదేశంలో నిరంతరం ఉండటానికి వీలు కల్పించింది. ఈ ఏర్పాటు హిందూ మహాసముద్ర అనుసంధానంలో శ్రీవిజయ వ్యూహాత్మక పెట్టుబడిని ప్రతిబింబిస్తుంది. బిహార్‌లోని నలందా విశ్వవిద్యా లయంలో ‘‘అతిషా’’ వంటి శ్రీ విజయ పండితులు శిక్షణ పొందినారు. జావాలోని బోర్‌ ‌బుదుర్‌లో కూడా శ్రీ విజయ పండితులు శిక్షణ పొందారు. జావాలోని బోర్‌ ‌బుదుర్‌ ‌వంటి ఆగ్నేయాసియా కేంద్రాల మధ్య బౌద్ధ్ద యాత్రీకులు, అవశేషాలు, రాత ప్రతుల ప్రవాహాన్ని సులభతరం చేసింది.

అతిషా దీపంకర శ్రీ జ్ఞాన (182-1054 సిఇ) భారతదేశంలోని విక్రమశిల మఠానికి మఠాధిపతి బెంగాలీ పండితుడు. ఇతడు ఇండోనేషియాలోని సుమిత్రా కేంద్రంగా పనిచేసిన బౌద్దమఠాధికారి సెర్లింగ్‌పా ధర్మకీర్తి వద్ద 1011 ప్రాంతంలో విద్య నభ్యసించాడు. శ్రీ విజయ సామ్రాజ్యానికి సముద్ర యానం చేశాడు. తరువాత 1042లో టిబెట్టు వెళ్లి అక్కడ బౌద్దాన్ని సంస్కరించాడు.

అతిషా సెర్లింగ్‌పాను అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక గురువుగా భావించే వారు. సెర్లింగ్‌పా పేరు విన్నప్పుడల్లా భక్తితో కన్నీళ్లు వచ్చేవని, ఆయన దగ్గర భోది చిత్త, లోజోంగ్‌ (‌మనస్సు శిక్షణ) నేర్చుకున్నానని తన అత్యంత ప్రసిద్ధ గ్రంధమైన ‘‘జ్ఞానోదయ మార్గానికి దీపం’’ గ్రంథంలో నాసుకున్నాడు.

చోళరాజవంశం అధికార రాజముద్ర బొమ్మ, పులితోపాటు కొన్ని నాణేలు, ముద్రలలో రెండు చేపల బొమ్మ, ఒక్కవిల్లు ఉన్నాయి. చేపలు పాండ్య చిహ్నము విల్లు చేరరాజుల చిహ్నం. వాటిని తమ సామంతులుగా చేసుకున్నట్లుగా తెలియ జెప్పే చిహ్నం. వారి జండాపై పులి బొమ్మ ఉంటుంది. దక్షిణ భారతంపై వారి సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది.

చైనా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా నుండి వచ్చే బౌద్ధ సన్యాసులు, వ్యాపారులు నావికులు నాగపట్టణంలో ఎక్కువగా విడిదిచేసేవారు. వారి ప్రార్థనలు, బసకోసం ఒక అంతర్జాతీయ స్థాయి మఠం అవసరమై ఈ చూడామణి బౌద్ద విహారం నిర్మించారు. ఈ విహారానికి నాటి చైనా చక్రవర్తి లియావో పెద్ద కాంస్య గంటలను కానుకగా పంపాడు. 1856లో నాగపట్టణంలో జరిపిన త్రవ్వకాల్లో 350 అరుదైన బుద్దుని విగ్రహాలు లభించాయి. 1867లో బ్రిటిష్‌ ఈస్ట్ ఇం‌డియా కంపెనీ వీటిని కూల్చివేసి నూతన కళాశాలలను నిర్మించింది.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.