భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


– ‌పి.ఎస్‌.‌నారాయణ

సుజాత తండ్రి, గదిలోకి వస్తూనే, ‘‘క్యాబ్‌ ‌వచ్చింది బయిల్దే రండి!’’ అన్నాడు భార్య వంక చూస్తూ.

ఆమె సర్దిపెట్టిన సంచీలు అందుకుంటూ, ‘‘నడుస్తావా?వీల్‌ ‌చెయిర్‌ ‌తెమ్మంటావా?’’ అడిగింది బెడ్‌మీద ఉన్న కూతుర్ని.

‘‘నడుస్తాను!’’

ఆది సాయీరాంపురానికి ఈశాన్య దిక్కున కిలోమీటర్‌ ‌దూరంలో నల్లచెరువు పక్కగా ఉన్న నీలిమా నర్సింగ్‌ ‌హోం. అక్కడ కాన్పులే కాదు ఆక్కరలేదనుకున్న వారికి కడుపులూ తీసేస్తారు.

నిశ్శబ్దంగా ఉన్న ఆ వార్డులో ఉండి ఉండి ఓ పసిగుడ్డు ఏడుపు తీతువు పిట్ట కూతలా వినబడు తున్నది. ఆ ఏడుపుకి సుజాత అస్తవ్యస్తమవుతున్నది.

మనసంతా అలజడి. తనను ఛిద్రం చేసిన ఆ రాక్షసుడు కళ్లముందు కదలాడు తున్నాడు. ఆవేశం గుండెను ఊపేస్తుండగా ఒక్క ఉదుటున మంచం దిగింది. ‘నిన్ను ఎప్పటికైనా చంపేది ఆ యముడు కాదురా.. నేను సంధించబోయే ఆయుధమే…నువ్వు నెత్తురు కక్కుకు చస్తుంటే చూస్తూ ఆనందించేది నేనే…’ శరీరంలో రక్తం మరుగుతోంది…

ఆకర్షణ మత్తులాంటిది. ఆ మైకంలో ఉన్నప్పుడు ఎదుట ఉన్నది తాగునీటి జలాశయమో, మురుగు కాలువో తెలియదు. చేస్తున్నది మంచో, చెడో తెలియదు. సాంఘిక మర్యాదలు తెలియవు. కుటుంబ పరువూ గుర్తుకు రాదు.

ఉద్యోగంలో జేరిన మొదటిరోజే రాజేష్‌తో పరిచయం. అతడి దగ్గర నెల రోజులు పని నేర్చుకో మన్నారు. తను వెళ్లేటప్పటికి అతడు సీట్లోలేడు. కొలిగ్‌కు కడుపులో నొప్పి వస్తే ఆసుపత్రికి తీసుకు వెళ్లాడని తెలిసింది.

తరువాత రెండు గంటలకు వచ్చాడు. అందగాడే. నవ్వు ముఖం. ప్రతి మాటకు ముందు పెదవులు విచ్చుకుని చిరునవ్వుతో మెరుస్తున్నాయి. ‘‘వెల్కం… మిమ్మల్ని నా అంతటివాడిని చేయాలని కంపెనీ కోరుకుంటున్నట్లున్నది. ఎవరి ఆదృష్టం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?ఇవ్వాళ అమావాస్య వెళ్లిన పాడ్యమి. రేపు మొదలు పెడదాం. నేటికి పరిచయాలతో సరిపుచ్చుకుందాం. ఒక గంటలో మీకు కొత్త లాప్‌టాప్‌ ‌వచ్చే ఏర్పాటు చేస్తాను. రేప్పొద్దున దాని నెత్తిన కాస్త పసుపు పెట్టి పనికి శ్రీకారం చుడితే కంపెనీయే కాదు..పైనున్న దేవుడూ దీవిస్తాడు!’’

అతని రూపం, మాటలు ఎదుటివారిని తీయని మత్తులో ముంచేస్తాయి.

ఒకరోజు ఉన్నట్లుండి లంచ్‌ ‌తర్వాత మాయ మయ్యాడు. పునర్దర్శనం మూడు రోజుల తర్వాత.

‘‘అమ్మ నన్ను చూడాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే రాజమండ్రి వెళ్లాను!’’ అన్నాడు తను అడగకుండానే. ‘‘వెళ్లకుండా ఉండలేకపోయాను… అసలే అనారోగ్యపు మనిషి!’’

‘‘ఏమిటి సమస్య?’’

‘‘ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఒకటి తగ్గినా మరోటి పుట్టుకొస్తుంది. రొటీన్‌… ఈసారి అలాంటి కారణంతో వెళ్లలేదు లెండి… ఆమెకు రెండు రోజులు వరుసగా నేను కలలో కనబడ్డానట…అంతే!’’

‘‘మీరంటే అంత ప్రేమన్నమాట…కన్నపిల్లల మీద ప్రేమ తండ్రికంటే తల్లికే ఎక్కువ!’’

‘‘యూ ఆర్‌ ‌కరెక్ట్…‌మా నాన్నా అంతే. వస్తే ఎందుకొచ్చావ్‌ అనడు. రాకపోతే ఎందుకు రాలేదు అని అడగడు…అంటే ఆయనకు నా మీద ప్రేమలేదని కాదు… తల్లులకూ, తండ్రులకూ తేడా అదే. మీరు బాగా పట్టేశారు!’’

ఆ కంపెనీలో జేరి సంవత్సరం గడవకముందే ఆ మాయ తన మనస్సునే కాదు శరీరాన్నీ కప్పివేసింది. రామకృష్ణా బీచ్‌, ‌సింహాచలం కొండలు, అరకు లోయ… ఒకటేమిటి… చెట్టాపట్టాలు వేసుకుని అన్ని మూలలూ తిరిగేశారు. విశ్రాంతి కావాలి అనుకున్న రోజు అతడి గది ఉండనే ఉన్నది. రూమ్మేట్‌ అతడి చిన్ననాటి స్నేహితుడే, తామిద్దరూ గదికి వెళ్లిన మరుక్షణంలోనే మాయమైపోయేవాడు సమయం తెలియనంతగా తెరలు కప్పేసి…

తమ పెళ్లికి అతడి వాళ్లూ తనవాళ్లూ పచ్చజెండా ఊపాలి. అది బహు తేలిక అన్నది ఇద్దరి నమ్మకం. దానికి ప్రథాన కారణం ఇద్దరిదీ ఒకే కులం, గోత్రాలు కలవకపోవటం. ఆ ధైర్యంతోనే అతడి చొరవను తను తోసిపుచ్చలేక పోయింది. ఆ చొరవ పచ్చటి తోటలా పెరిగిపోతుంటే పరుగెడుతున్న కాలానికి కళ్లాలు వేయలేకపోవటం తను చేసిన పెద్ద తప్పు.

ఉన్నట్లుండి మళ్లా మాయమయ్యాడు. ఊరుకెళ్లి ఉంటాడు అనుకున్నది. రెండు రోజులు చూసింది. ఎప్పుడు ఫోన్‌ ‌చేసినా స్విచ్‌ ఆఫ్‌లో ఉన్నది అనే సమాచారం. తల్లికి ఎలా ఉన్నదో… ఆసుపత్రిలో ఆమెకు సేవలు చేస్తూ ఫోన్‌ ఆఫ్‌ ‌చేయలేదు గదా!ఈ మధ్యయితే తరచూ ఆమె అనారోగ్యం గురించే మాట్లాడుతున్నాడు. గుండె దడదడ లాడసాగింది. ఏమన్నా అయితే తమ వివాహం వాయిదా పడుతుంది. అది తనకిష్టం లేదు.

వారం అయినా పత్తాలేడు. ఫోన్‌ ‌కాల్‌ ‌లేదు. వెళ్దామన్నా తనది రాజమండ్రి అనయితే చెప్పాడు గాని పూర్తి చిరునామా తను ఎన్నడూ అడగలేదు, అతడు చెప్పనూ లేదు… వారం అయినా రాకపోవటంతో ఒకరోజు ఆఫీసు నుంచి అతడి గదికి వెళ్లింది అతడి స్నేహితుడిని అడిగితే విషయమేమైనా తెలుస్తుందేమోనని.

గదికి తాళం వేసి ఉన్నది. ఒక్కడే తోచక ఎక్కడ తిరుగుతున్నాడో! అతడు ఏ ఆఫీసులో పనిచేస్తున్నాడో తెలియదు. ఇంటివాళ్ల నడిగితే ‘ఆఫీసు పని మీద బెంగళూరు వెళ్లాడండి… ఎప్పుడొచ్చేది చెప్పలేదు’ అన్నారు.

ఆ టెన్షన్‌లోనే శనాదివారాల్లో విజయవాడ గూడా వెళ్లలేకపోయింది.

హెచ్‌ ఆర్‌ ‌డిపార్ట్‌మెంటులో అడిగితే, ‘తల్లికి ఆరోగ్యం బాగాలేదని రెండు వారాలు శెలవు పెట్టాడు’ అని చెప్పారు. అర్థంకానిదల్లా తల్లికి అంత అనారోగ్యంగా ఉంటే తనకు కనీసం ఫోన్‌ అయినా చేయకపోవటం…

మరో వారం గడిచినా ఏ సమాచారమూ లేదు. అతడి మిత్రుడూ బెంగళూరు నుంచి రాలేదు. దాంతో అమ్మ ఫోన్‌ ‌చేస్తున్నా ఆఫీసులో పని ఎక్కువగా ఉన్నదంటూ తను కుంటి సాకులు చెప్పటం.

దుఃఖం ముంచుకొస్తోంది. దిగులు ముంచు కొస్తోంది. తెలియని భయం మనసునంతా ఆవరించి శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్నది.దానికితోడు మరో రెండు వారాలు శెలవు పెంచినట్లుగా తెలియటంతో మరింత కంగారుపడింది.

‘రాజేష్‌ ‌రాజమండ్రి చిరునామా అతడి పర్సనల్‌ ‌ఫైల్లో చూసి చెప్పగలరా… వాళ్లమ్మగారికి ఒంట్లో బాగాలేదంటున్నారు గదా…నేను శనాదివారాల్లో విజయవాడ వెళుతున్నాను…దారిలోనే కాబట్టి చూసి వెళతాను…ఆమె మా అమ్మకు స్నేహితురాలు!’ తన ఆదుర్దాను వాళ్లు అపార్థం చేసుకోకుండా చిన్న అబద్ధం కూడా చెప్పింది.

వివరాలు తీసుకుని శనివారం ఉదయం జన్మభూమిలో రాజమండ్రి వచ్చింది. స్టేషన్‌ ‌నుంచి ఆటోలో వాళ్లుండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. తేలిగ్గానే దొరికింది. ఉద్విగ్నత నడుమ లిఫ్ట్‌లో నాలుగో అంతస్తుకు వెళ్లి అతడి ఫ్లాట్‌ముందు నిలబడి కాలింగ్‌ ‌బెల్‌ ‌నొక్కుతుంటే వేళ్లు వణకసాగినాయ్‌. ఇం‌ట్లో ఉన్నాడో, ఆసుపత్రిలో ఉన్నాడో…

ఎవరో ముసలాయన తలుపు తీశాడు. అతడి తండ్రి కాదు గదా?

‘నమస్కారమండి… నా పేరు సుజాత…రాజేష్‌ ‌కొలీగ్‌ అం‌డి… వారి అమ్మగారికి బాగుండక పోవటంతో శెలవు పెట్టారు అని తెలిసింది. ఎలా ఉన్నదో చూద్దామని వచ్చాను!’ అన్నది వినయంగా.

ఆయనకు తను చెబుతున్నది అర్థం కానట్లుగా ముఖం పెట్టాడు. అయోమయంగా తన వంక చూస్తూ లోపలున్న భార్యని పిలిచాడు. ‘ఆ అమ్మాయి ఏదో అడుగుతున్నది చూడు!’

వచ్చిన ఆమెను చూస్తుంటే తనకూ అయోమయ మయింది. ఆరోగ్యంగానే ఉన్నది కదా!

‘నేను రాజేష్‌ ‌కోసం వచ్చానండి… మేం ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం!’

ఆమె ఒక్కక్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగి, ‘రాజేష్‌ అం‌టే చలపతిరావు గారి అబ్బాయా…వాళ్లు ఇప్పుడు ఇక్కడలేరు గదమ్మా! రెండేళ్లయింది వెళ్లిపోయి. అప్పుడే పక్క పోర్షన్‌లో ఉన్న మేము దీంట్లోకి మారాం!’ అన్నది.

హతాశురాలయింది. నోరు పెగల్చుకోవటానికి రెండు నిమిషాలు పట్టింది. ‘ఇప్పుడు వాళ్లు ఎక్కడుంటున్నారండి?’

‘తెలియదమ్మా…ఈ రెండేళ్లలో మళ్లా వాళ్లు ఎప్పుడూ కనబడనేలేదు!… ఎవరితోనూ అంతగా కలిసేవాళ్లు కాదు!’

విజయవాడ వెళ్లబుద్ధి కాలేదు. బస్టాండుకు వచ్చి విశాఖపట్నం బయల్దేరే టందుకు తయారుగా ఉన్న బస్సును దిగాలుపడుతూ ఎక్కేసింది. నాలుగురోజులు వరకూ మనసు మనసులో లేదు. ఒకరోజు ఆదుర్దాను ఆపుకోలేక రాత్రి పొద్దు బోయిన తరువాత అతడి స్నేహితుడి గదికి వెళ్లింది..బెంగళూరునుంచి వచ్చాడేమో చూద్దామని.

గదిలో లైటు వెలుగుతుండటంతో మనసు తేలికపడింది. వడివడిగా వెళ్లి మూసివున్న తలుపు తట్టింది. తీసిన అతడు అంత పొద్దుబోయిన తరువాత వచ్చిన ఆమెను చూస్తూనే కంగారుగా, ‘చెప్పండి!’ అన్నాడు.

‘రాజేష్‌ ఊరికి వెళ్లి నెలయింది.ఇంతవరకూ రాలేదు.ఎన్నిసార్లు ఫోన్‌ ‌చేసినా కనెక్ట్ ‌కావటంలేదు. నాకు చాలా ఆదుర్దాగా ఉన్నది.వాళ్ల అమ్మగారికి ఎలా ఉన్నది?’ త్వరత్వరగా అడిగింది.

కొద్దిక్షణాలపాటు అతడు మౌనంగా తననే చూస్తూ ఉండిపోవటంతో తనలో మరింత ఆదుర్దా పెరిగింది.

తేరుకుని, కొద్దిసేపటి తరువాత ‘అదేమిటి మీకు తెలియదా?’ అన్నాడు విస్మయంగా తన ముఖంలోకే చూస్తూ.

‘‘ఏమైంది?… ఆమె పోయారా?’’ కంగారు పడుతూ అడిగింది. తనలోని భయం నిజం కాకూడదు అనుకుంటూ.

‘‘వాడు పెళ్లిచేసుకుని భార్య సహా అమెరికా వెళ్లిపోయాడు గదా! పదిరోజుల క్రితం!’’

ఒక్కసారిగా కళ్లు తిరుగుతున్నట్లనిపించగా కుప్పలా కూలబడిపోయింది ఆ గది గడపమీదే, తను ఊహించనిది పిడుగు నెత్తినపడటంతో.

చుట్టూ చీకటి. అంతా చీకటి…

తనకు అప్పటికే మూడు నెలలయింది పీరియడ్స్ ‌వచ్చి!

* * *

‘‘నా చేయి పట్టుకో… పడేవ్‌!’’ అన్నది లిఫ్ట్ ‌దిగి నున్నటి నేల మీద నడుస్తూ ముఖద్వారం మెట్లు దిగుతుండగా తల్లి.

‘‘అక్కరలేదు!’’ కాస్తంత చికాగ్గా అన్నది సుజాత. కారణం తెలిసిందే కాబట్టి మాట్లాడలేదు ఆమె.

తరువాత ఆయిదు నిమిషాలకు..పోతున్న క్యాబ్‌ అద్దంలోనుంచి బయటకు చూస్తున్న కళ్లకు రోడ్డు పక్కన చెట్లన్నీ ఎండిపోయినట్లుగానే కనబడుతున్నాయి తన భవిష్యత్తులాగా. విజయవాడలోని తమ ఇంట్లో కాలు పెట్టేటంతవరకూ ఎవ్వరూ నోరు తెరవలేదు.లోపలకు వెళుతూనే తల్లి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి కూతురుకు ఇచ్చింది.

‘‘వద్దు!’’ అన్నది సుజాత అందుకోకుండానే.

 ‘‘నేను ఈరోజు విశాఖపట్నం వెళ్లిపోతున్నాను!’’ అన్నది తలవంచుకుని.

‘‘నిన్ననే గదే అబార్షన్‌ అయింది. అప్పుడే అంత హడావిడిగా వెళ్లటం దేనికి? కాస్త నీరసం తగ్గనీయ్‌…!’’

‘‘‌శారీరకంగా బాగానే ఉన్నాను.మానసికంగానే నీరసపడింది. దానికి కారణం నువ్వు. అది మర్చిపోయేటందుకే వెంటనే వెళ్లి ఉద్యోగంలో జేరదామనుకుంటున్నాను…!’’

‘‘పువ్వుల్లో పెట్టి పెంచుకున్న మమ్మల్ని నీ ఛండాలపు పనితో నలుగురిలో తలెత్తుకోలేకుండా చేశావ్‌!’’ అన్నది తీక్షణంగా చూస్తూ. ‘‘అందుకే ఇంటి పెద్దగా కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి ఆ పని చేశాను. ఇక ఓ మంచి కుర్రవాడిని చూసి వివాహం జరిపిస్తే తల్లిగా నా బాధ్యత తీరిపోతుంది!’’

‘‘నీ మాట వినకపోతే బావిలో దూకి చస్తాను అంటూ బెదిరించి ఇంటి గౌరవాన్ని కాపాడుకున్నా ననుకుంటూ తృప్తి పడుతున్నావు.మళ్లా పెళ్లిమాట ఎత్తావో నువ్వు చేద్దామనుకున్న ఆ పని నేను చేసి నా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాను!’’

‘‘అంటే ఇలాగే ఉండి ఎండి మోడయిపోతావా?’’

‘‘మనిషికి వివాహం ఒక్కటే పరమావధి కాదు.జీవితంలో ఓ దౌర్భాగ్యుడి చేతిలో కోలుకోలే నంతగా మోసపోయిన నేను దాన్ని కప్పిపుచ్చుకుని, మనసు చంపుకుని మరొకరిని మోసం చేయాలా?’’ అక్కడ నుంచి లేచి తన గదివైపు వడివడిగా అడుగులు వేయసాగింది.

‘‘చదువుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆర్థం చేసుకున్నది ఇంతేనన్నమాట… నువ్వు చేసింది నలుగురుకీ తెలిస్తే మేం తలెత్తుకు తిరగగలమా? బ్రతకగలమా?’’ పెద్దగా అరిచింది.

‘‘నువ్వు ఏమైనా చెప్పు… అది నా వల్ల కాదు! ఆ వచ్చేవాడు మీ ప్రలోభాలకు లొంగి నాకు మొగుడయినా ఆ సంసారం సజావుగా సాగేది కొద్దికాలమే… నన్ను అలాంటి నరకంలోకి తోయవద్దు!’’ మరోమాటకు అవకాశం లేనట్లుగా చెప్పేసింది సుజాత. ‘‘చెదపట్టిన పుస్తకానికి మంచి రూపం తేవటం ఎవరి వల్లా కాదు… బాగున్న పేజీలను ఉపయోగించుకోవటం ఒక్కటే దారి!’’ చటుక్కున గది తలుపు తీసింది లోపలకు వెళ్లేందుకు.

‘‘సరే తల్లీ! ఇక చేసేదేమున్నది… నోరుమూసుకుని కూర్చుంటాం!’’ అన్నది రెండు చేతులనూ నోటిమీద పెట్టుకుంటూ.

‘‘వివాహానికి పునాది నమ్మకం… అది లోపిస్తే సర్వం కుప్పకూలిపోతుంది, ముఖ్యంగా ఆడదానికి!’’

ఆమె మాట్లాడలేదు. కూతురు మొండిదని తెలుసు. గర్భస్రావానికి ఒప్పుకోవటానికే నానా రభస చేసింది. పెళ్లి విషయంలో కొన్నాళ్లు ఆగితేనే కానీ తను అనుకున్నది సాధించలేదు.

‘‘సివిల్స్‌కు తయారయ్యేందుకు వెళ్లి కోచింగ్‌లో జేరతాను.మాటమాట్లాడితే నన్ను రమ్మనవద్దు. ఉద్యోగమూ, చదువుతో చాలా బిజీగా ఉంటాను. ఇవ్వాళ వెళ్లొద్దంటున్నావు కాబట్టి, రేపు వెళతాను! పరీక్షలు అయిదారు నెలల్లోనే ఉండవచ్చు. అంతగా అయితే మీరు ఆ సమయంలో వద్దురుగాని..నాకు ఇంటి పనుల్లో సాయంగా ఉంటారు.అదయినా మీకు ఇష్టమయితేనే, బలవంతం లేదు!’’

* * *

ఆరు నెలల తరువాత ఓ రోజు చిరుజల్లులు పడుతున్న వేళ సుజాత తల్లీ, తండ్రీ విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దిగి ఆటోలో కూతురు ఇంటికి వెళ్లేటప్పటికి తొమ్మిదయింది. మూడు రోజుల క్రితం సుజాత తల్లికి ఫోన్‌ ‌చేసింది, ‘‘అమ్మా! పరీక్షలు పదిరోజుల్లోకి వచ్చాయి.ఆఫీసుకు శెలవు పెట్టాను. మీరు ఎప్పుడయినా రావచ్చు!’’ అంటూ.

ఎప్పుడు రమ్మనమంటుందా! ఎప్పుడు వెళ్దామా! అని ఎదురు చూస్తున్న వాళ్లకు ఆ పిలుపు అమృతం కురిసినట్లే అనిపించింది. కన్నప్రేమ ఎన్ని కష్టనష్టాల నయినా ఎదుర్కొంటుంది.ఎన్ని అవమానాలనైనా భరిస్తుంది. అక్కడ ఉన్నప్పుడే ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి!

వెంటనే బయల్దేరారు రకరకాల పిండివంటలు చేసుకుని చాలా రోజులకు కూతుర్ని చూడబోతున్నా మన్న ఆనందం కళ్లల్లో మెరుస్తుండగా. సివిల్స్‌కు తయారవుతుండటంతో ఇన్నాళ్లూ తను రాకపోతే రాకపోయింది..తమనీ రావద్దని ఆంక్షలు పెట్టింది. తాము వస్తే తన చదువుకు గండి కొడతామట. ఇదెక్కడ గోలో! ఈవిడగారు కలెక్టరయి ఊళ్లు ఏలాలా, ఓ సంసారం అంటూ లేకుండా!

సుజాతకు తనతో కలిసి బీటెక్‌ ‌చేసిన ప్రసన్న మంచి స్నేహితురాలవ్వటమే కాకుండా క్యాంపస్‌ ‌సెలక్షన్‌లో ఇద్దరికీ ఒకే కంపెనీలో ఉద్యోగాలు రావటంతో, అంతవరకు కాలేజీ హాస్టల్‌లో ఒకే గదిలో ఉన్నవాళ్లు, ఉద్యోగంలో జేరగానే కంపెనీకి దగ్గరలోనే ఓ రెండు పడక గదుల ఇల్లు అద్దెకు తీసుకుని మారిపోయారు.

ఆటో దిగుతున్న సుజాత తల్లిదండ్రుల్ని చూస్తూనే ప్రసన్న ఎదురొచ్చి వాళ్ల చేతుల్లోని పెట్టె, సంచీ అందుకున్నది.

వెనగ్గా కూతురు వస్తున్నదేమో అని ఆత్రంగా చూస్తున్న వాళ్లకు ఆమె రాకపోవటంతో, ‘‘సుజాత తన గదిలోనే ఇంకా ముణగదీసుకు కూర్చుని చదువుకుం టున్నదా?’’ అన్నది తల్లి ముఖంచిట్లించి.

ఎప్పుడు చూద్దామా అని ఆతురతపడుతున్న ఆమెకు కూతురు కనబడక పోవటం నిరాశే కాకుండా చిరాకూ పుట్టిస్తోంది.

‘‘స్నానాలు చేసి భోజనాలు చేస్తే ఆసుపత్రికి వెళదాం!’’ అన్నది ప్రసన్న ముభావంగా కొద్దిక్షణాలు ఆగి.

‘‘ఆసుపత్రికి దేనికి?’’ కంగారుపడుతూ అడిగింది ఆమె.

‘‘నొప్పులు మొదలవ్వటంతో మొన్న రాత్రి ఆసుపత్రిలో జేరింది… నిన్న ఉదయమే కాన్పు అయింది. తల్లీ పిల్లవాడు కులాసాగానే ఉన్నారు…!’’ ముఖం పక్కకు తిప్పుకుంటూ అన్నది.

ప్రసన్న మాటలు అర్థంగాక అయోమయంగా చూడసాగింది. ‘నొప్పులేమిటి, కాన్పు ఏమిటి•?’’ బిగుసుకుపోతూ అడిగింది ఆమె. ‘‘ఎవరికీ?’’ మాట కూడా తడబడుతున్నది.

‘‘సుజాతకే!’’

భార్యాభర్తలు షాక్‌నుండి తేరుకునేటప్పటికి పావుగంట పట్టింది. ఆమెకయితే కళ్లవెంట నీరు గిర్రున తిరుగుతోంది.

ప్రసన్న మరోసారి హెచ్చరించటంతో బయిల్దేరారు ముగ్గురూ ఆటోలో. ఆసుపత్రిలో సుజాత పడుకున్న గదిలోకి వెళుతూనే కూతుర్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది ఆమె పెదవులు వణుకుతుండగా.

‘‘రా అమ్మా!’’ అన్నది సుజాత. ‘‘అమ్మమ్మ చంపేయాలనుకున్న పిల్లవాడు తల్లి గర్భంలో నిర్భీతితో బతికి బయటకు వచ్చాడు తన తల్లి సామ్రాజ్యాన్ని రక్షించేందుకు వజ్రాయుధాన్ని చేతబట్టి!…’’ ఆమె ఆ మాటలు చెబుతున్నప్పుడు ఎడారిలో వాన కురుస్తున్నట్లుగా ముఖం సంతోషంతో వెలిగిపోతున్నది. తాను విజయం సాధించినందుకు గర్వంతో నిండి ఉన్నది ఆ కంఠం.

‘‘గర్భస్రావం చేయించాను గదే… పాతికవేలు ఖర్చుపెట్టి!’’ ఆమెకు అంతా అయోమయంగా ఉన్నది. ఇదెలా సాధ్యం? జరిగిందేమిటో జీర్ణించుకోలేక పోతున్నది ఆమె.

‘‘నువ్వు డబ్బుతో దాన్ని జరిపించాలని అనుకున్నావు…నేను కన్నీటితో చేతులు పట్టుకుని నా ధ్యేయాన్ని డాక్టర్‌ ‌ముందుంచటంతో ఓ స్త్రీగా నా ధైర్యానికి మెచ్చుకుంటూ నా అభ్యర్థనను అంగీకరించింది. నువ్వెప్పుడు వెళ్లి అడిగినా నువ్వి చ్చిన డబ్బు ఆమె తిరిగి ఇచ్చేస్తుందిగాని దిగులు పడబోకు!’’

ఏం మాట్లాడాలో తెలియనట్లుగా తల్లిదండ్రు లిద్దరూ బిత్తరపోయి చూస్తుండి పోయారు కూతురి మాటలకు.

‘‘ఛిద్రమయిన మనస్సుకూ కొన్ని కోరికలూ, కొన్ని ధ్యేయాలు ఉంటాయి.ఉద్యోగం చేస్తూ పైపైకి వెళ్లాలని ఎలా కోరుకుంటామో, జీవితంలోనూ సుఖ సంతోషాలతో శాంతిగా గడపాలని అలాగే కోరుకుంటాం. కానీ నేను ఆశించినవి గాలిమేడలలై కూలిపోగా ఈ మార్గాన్ని, మీకు కష్టం కలిగించేద యినా ఎన్నుకోవాల్సి వచ్చింది.అంతేగాని నేనేం తప్పు చేయలేదు. నమ్మిన మగవాడు మోసం చేయటం ఏ ఆడదీ సహించలేదు. నా జీవితంతో ఆడుకున్న వాడి మీద నా కసిని తీర్చుకోక తప్పదు.అదే నాకు మనశ్శాంతిని కలిగిస్తుంది… జీవితానికి తృప్తినిస్తుంది…!’’

కూతురి మాటలు వాళ్ల మనస్సులను అతలా కుతలం చేస్తున్నాయి.

‘‘ఇంటికి వెళ్లగానే ముందు లాయరును సంప్రదించి వీడి జన్మకు కారకుడయిన వాడి మీద పోలీసు కేసు పెట్టి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా జుట్టుపట్టుకు లాక్కువచ్చేలా చేస్తాను. నేను పోగొట్టు కున్న ఆనందం, సుఖం, శాంతి వాడికీ అందకుండా చేస్తాను.జీవితాంతం కటకటాల వెనుక చిప్పకూడు తింటూ కుళ్లికుళ్లి ఏడ్చేలా చేస్తాను!’’ కసిగా అన్నది.

‘‘పెళ్లి చేసుకోవా?’’

‘‘నా నిర్ణయం ఎప్పుడో చెప్పాను… ఇప్పుడూ చెబుతున్నాను. పగిలిన నా గుండెమీద మరో ముళ్లదుప్పటి దేనికి?నన్ను మోసం చేసిన ఆ రాక్షసుడి అంతం చూడటమే నా ధ్యేయం.నా భవిష్యత్తుకే దీపమైన వీడిని నిబద్ధతతో పెంచి అత్యున్నతుడిగా నిలబెట్టటం నా విధి. ఇకనైనా నీ ఆ ఆలోచనను పూర్తిగా మనస్సు నుంచి తుడిచేసుకో!’’ స్పష్టంగా చెప్పింది సుజాత. ‘‘కన్నతల్లిగా నా బాగుకోసం నువ్వు చేయగలిగిన సాయం ఏదైనా ఉన్నదీ అంటే అదొక్కటే!’’

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.