భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
డా. జడా సుబ్బారావు
‘మా అమ్మకు నచ్చనిది… నాన్నమ్మా, తాతయ్యా’ అన్న సమాధానం దగ్గర నా పెన్ను ఆగిపోయింది. మిగతా పేపర్ దిద్దలేకపోయాను. ఆలోచనలు కందిరీగల్లా కుట్టసాగాయి.ఖాళీగా ఉన్న ఆఖరు అవర్లో పేపర్లు దిద్దాలని మొదలు పెట్టాను. కానీ కళ్లల్లో ఉబికిన నీళ్లు పేపర్ మీద అక్షరాలను మసకమసగ్గా చేశాయి. ‘మీ అమ్మకు నచ్చనివి ఏంటో రాయండి’ అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి రాసిన సమాధానం అది. తొమ్మిది నెలలు మోసి కనీ పెంచి పిల్లలకు లోకాన్ని పరిచయం చేస్తుంది తల్లి. చుట్టూ ఉన్న ప్రపంచం గురించి విడమర్చి చెప్తుంది. ఎవరితో ఎలా మెలగాలో నేర్పిస్తుంది. సమాజంలో కుటుంబ స్థానం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం ఎలా ఉండాలో.. పిల్లలు కుటుంబం నుంచే నేర్చు కుంటారు. తల్లిదండ్రుల నడవడికే పిల్లల భవిష్యత్తుకి వ•లమవుతుంది. మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు, మంచి పెంపకంలో పెరిగిన పిల్లలు మాత్రమే శారీరకంగా, మానసికంగా సమాజాన్ని ఆరోగ్య వంతంగా ఉంచగలరు. .పేపరు దిద్దాలనిపించలేదు. మనసంతా చేదుగా అయిపోయింది. అడిగిన ప్రశ్నలకు పిల్లలు తెలిసో, తెలియకో, అమాయ కంగానో, కొన్నిసార్లు నవ్వు పుట్టించేటట్లుగానో సమాధానాలు రాస్తుంటారు. పేపర్లు దిద్దేటప్పుడు అలాంటి సమాధానాలను పైకి చదివి టీచర్లందరం అప్పుడప్పుడు సరదాగా నవ్వుకోవడం మావ•లే.కానీ ఈ సమాధానం చదివిన తర్వాత దానికి ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాలేదు. పిల్లల ప్రవర్తన కుటుంబ సంబంధాల్లోని‘దాగుడువ•తలు’పిల్లల మనస్తత్వాన్ని ఎంతగా కలుషితం చేస్తున్నాయో తల్చుకుంటున్న కొద్దీ ఏదో తెలియని ఆందోళన నన్ను చుట్టుముట్టింది.
సమాజం ఎటువైపు పోతుందో అన్న అభిప్రా యాన్ని పక్కన పెడితే, అసలు రక్తసంబంధాలు ఏ మలుపులు తీసుకుంటున్నాయో అర్థం కాలేదు. మనం పిల్లల్ని ‘సరైన రీతిలోనే పెంచుతున్నామా?’ అనిపించింది. పిల్లల్ని అమ్మమ్మ ఇంటికి దగ్గర చేస్తున్నామని సంబరపడుతున్నాం గానీ..నాన్నమ్మకు దూరం చేస్తున్నామని గ్రహించలేకపోతున్నాం.
తలెత్తి ఎదురుగా చూశాను. స్టాఫ్‌రూంలో టీచర్లందరూ ఎవరి పనుల్లో వాళ్లున్నారు. కొంత మంది ఏవో కబుర్లు చెబుతూ నవ్వుకుంటున్నారు. ఆ నవ్వుల వెనకున్న వాళ్ల సంబంధాలన్నీ పదిలంగానే ఉన్నాయా? అన్న సందేహం కలిగింది. నోరు నవ్వినప్పుడల్లా నొసలు వెక్కిరిస్తూనే ఉంటాయి. పొందిన వాటిని చూసుకుని పొంగినప్పుడల్లా, పోగొట్టుకున్న వాటి ఆనవాళ్లు ఏదో రూపంలో కళ్ల ముందు నిలుస్తూనే ఉంటాయి.
దూరంగా కనిపిస్తున్న సరళను దగ్గరకు రమ్మని పిలిచాను. మొదటి నుంచి నేను ఇంట్రావర్ట్. ఎవరితోనూ పెద్దగా కలవను.కలిస్తే మాత్రం అంత తొందరగా వాళ్లను వదులుకోను. భిన్న దృక్పథాలు, విభిన్న వ్యక్తిత్వాలు ఉన్న ‘స్టాఫ్‌రూం’ లో సరళ ఎందుకో బాగా దగ్గరైంది. ఏ విషయమైనా మొహమాటం లేకుండా చెప్తుంది. అందులో ఏ విధమైన దాపరికాలూ ఉండవు. కుండబద్దలు కొట్టినట్లుగా అభిప్రాయాలు చెప్తుంది.
సరళ నా వైపు వస్తూనే ‘‘ఏంటే అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? లేక ఏదైనా సమస్యా?’’ అంది. ఏమీ మాట్లాడకుండా పిల్లవాడు రాసిన జవాబు సరళకు చూపించాను.
అది చదివి పెద్దగా నవ్వుతూ ‘‘వాడు నిజమే రాశాడుగా! దానికి నువ్వెందుకు కంగారు పడుతున్నావ్? నేనైతే ఎప్పుడో వేరు కాపురం పెట్టేశాను. పెళ్లిళ్లకు, పండగలకు మొక్కుబడిగా వెళ్లి రావడం తప్ప అటు నుంచి పెద్దగా సంబంధాలు లేకుండా చూసుకున్నాను. పిల్లలకు నాన్న తరుపు బంధువులుంటారని తెలుసు. కానీ ఎలా ఉంటారో తెలియదు. పొరపాటున ఎప్పుడైనా కలిసినా వాళ్లని ఏ వరసలతో పిలవాలో అసలు తెలియదు’’ అంది సరళ చాలా తేలిగ్గా.
‘‘అదేంటే… అంత కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతావు’’ అన్నాను. నా వంక అదోలా చూస్తూ ‘‘వాస్తవాలెప్పుడూ కుండబద్దలు కొట్టినట్టే ఉంటాయి. వాటిని ఒప్పుకోవాలంటేనే మనసు అంగీకరించదు’’ అంది సరళ.
‘అంటే…అసలు నాన్నమ్మ ఇల్లు తెలియకుండానే పిల్లలు పెరుగుతున్నా రంటావా?’’ అన్నాను సరళతో.‘ఎందుకు తెలియదు? తెలుసు.. అయితే నానమ్మ ఇంటికి రాకపోకలు సాగించే పిల్లలు ‘వేళ్ల’ మీద ఉంటారు. తెలియని వాళ్లు వేలల్లోనూ, లక్షల్లోనూ ఉంటారు. పైగా ఆడదానికి పుట్టింట్లో మాత్రమే మనుషులుంటారు. వాళ్లు మాత్రమే మనుషులుగా కనిపిస్తారు. అత్తింట్లో అసలు మనుషులుండరు. ఒకవేళ ఉన్నా, వాళ్లంతా ఆస్తుల పంపకాలుగానూ, ఆదాయ వ్యయాల పట్టికలుగానూ కనిపిస్తుంటారు’’ అంది.
సరళ చెప్పింది నిజమే. అయినా నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలంటే ‘అహం’ అడ్డొస్తుంది. నిజాలు చేదుగా ఉంటాయి.ఎవరైనా జీవితంలోని ఎత్తు పల్లాలను అర్థం చేసుకున్నప్పుడే బంధాల విలువను గ్రహించగలుగుతారు. ఆస్తులతోనూ, అంతస్తులతోనూ కొలతలు వేయనప్పుడే మనిషిని మనిషిగా ప్రేమించగలుగుతారు. కలతలు రాని కాపురాలుండవు, గొడవలు జరగని కుటుంబా లుండవు. తప్పులు అటు నుంచో ఇటు నుంచో జరుగుతూనే ఉంటాయి. అహాన్ని పక్కనపెట్టి సహనంతో సర్దుకుపోవాలి. విడదీసే ‘కత్తెర’లా కాకుండా కలిపి కుట్టే ‘సూది’లా మారినప్పుడే బంధాలు నిలబడతాయి. సరళ మాటలు వింటుంటే గొంతుకేదో అడ్డం పడినట్లుగా అనిపించింది.
ఆమె వంక చూస్తూ ‘‘అందరిళ్లల్లోనూ అలాగే ఉందా? అత్తాకోడళ్లెప్పుడూ తూర్పూ పడమరలే. కొన్ని ఇళ్లల్లో తల్లీకూతుళ్లులా ఉంటే,మరికొన్ని ఇళ్లల్లో బద్ద శత్రువుల్లా ఉంటారు. కాదనను. కానీ, నాన్నమ్మకి గౌరవం ఇస్తూ, నాన్నమ్మ చుట్టూ తిరిగే పిల్లలు కూడా ఉన్నారుగా…’’
‘అందుకే వాళ్లు ‘వేళ్ల’మీద ఉంటారని చెప్పాను’’ అంది సరళ వెంటనే అందుకుంటూ. కాసేపయ్యాక ‘‘ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉంటే పిల్లల మెదళ్లు ఎలా వికసిస్తాయి? చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్ద వాళ్ల మీద మనమే విషాన్ని నూరిపోస్తుంటే భవిష్యత్తులో వాళ్లు మంచి పిల్లలుగా ఎలా ఎదుగుతారు’’ అన్నాను దిగులుగా.
నా వైపు చూసి చిన్నగా నవ్వుతూ ‘‘ఇన్నేళ్ల నుంచీ ఎన్ని వందల మంది పిల్లల్ని చూసుంటాం! ఏ పిల్లోడిని కదిలించినా ఏదో ఒక సమస్య. కొంత మందికి అమ్మా, నాన్న, అమ్మమ్మా, తాతయ్యే తెలుసు.నాన్న తరపు వాళ్లు తెలిసీ తెలియనట్లుగా ఉంటారు. ఒకవేళ మన పిల్లలు నానమ్మతోనో, తాతయ్యతోనో సన్నిహితంగా ఉంటే మనం భరించలేము. బలవంతంగా వాళ్లను కట్టడి చేస్తాం. ‘అతి గారాబం చేసి చెడగొడుతు’న్నారని చెప్పి వాళ్లకు పిల్లల్ని దూరం చేస్తాం. ‘కోడళ్ల’ నుంచి ‘తల్లులు’గా మారిన మనందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలేగా. పైగా ఏదో తక్కువైందని, రావలసింది రాలేదనీ చీ•కిమాటికీ గొడవలు పడుతూ సరిహద్దుల్లో సైనికుల్లా నిరంతరం అత్తింటి వాళ్లతో యుద్ధం చేస్తూనే ఉంటాం’’ అంది సరళ. నేనేమీ మాట్లాడ లేదు. నా ఆలోచనల్లో నేనున్నాను. సంభాషణ ఎక్కడ మొదలై ఎక్కడిదాకా వెళ్తుందో తెలియకుండా ఉంది.
నేను మౌనంగా ఉండడం చూసి ‘‘నువ్వు ఎన్నన్నా చెప్పవే గీతా! ఆడపిల్లలకు పుట్టిల్లు కావాలి. చిన్నపిల్లలకు అమ్మమ్మ ఇల్లు కావాలి. ఇక నాన్నమ్మ తాతయ్యలు వాళ్లకెందుకు? నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు… పిల్లలతో నీ పుట్టింటికి ఎన్నిసార్లు వెళ్లుంటావు? నీ పిల్లల్ని తీసుకుని మీ అత్తగారింటికి ఎన్నిసార్లు వెళ్లుంటావు? సెలవులొస్తే అమ్మమ్మ ఇల్లు, పండగొస్తే అమ్మమ్మ ఇల్లు. అసలు నానమ్మ ఇంటికి మన పిల్లల్ని దూరం చేసింది మనమే! మనం ఏ దారిలో నడిస్తే పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు. మనం అడ్డదిడ్డంగా నడుస్తూ పిల్లల్ని గట్టుమీద నడవమంటే ఎలా?’’
ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. సరళ వంక విస్తుబోయి చూస్తున్న నన్ను పట్టుకుని ఊపుతూ ‘‘దీనికే ఇంత ఆశ్చర్యపోతున్నావు. మొన్నా మధ్య పేపర్లో ఒక వార్త చదివాను. కొడుకులు చూడలేదని ఒకావిడ వృద్ధాశ్రమంలో చేరిందట. కొన్నేళ్లు గడిచాక ఒక స్కూలు నుంచి కొంతమంది అమ్మాయిలు ఆ వృద్ధాశ్రమాన్ని చూడ్డానికి వచ్చారట. పరిచయాల్లో భాగంగా ఒకమ్మాయికి అక్కడున్న ఒక ముసలావిడ తన నాయనమ్మే అని తెలిసిందట. తండ్రిని నిలదీస్తే తన తప్పు తెలుసుకుని తల్లిని ఇంటికి తీసుకెళ్లాడట. ఇందులో ముసలావిడ ‘కోడలి’ ప్రమేయం లేదని చెప్పగలమా?’’ అంది అక్కడినుంచి వెళ్లిపోతూ.
చెంపమీద ఛెళ్లున కొట్టినట్లయింది. చాలాసేపు సరళ వెళ్లిన వైపే చూస్తుండిపోయాను. నిజమే.. నేను మా అత్తగారింటికి ఎన్నిసార్లు వెళ్లుంటాను? అన్న ప్రశ్న నాలో సునామీని సృష్టించింది. అక్కడ ఉండలేక ఇంటికి బయల్దేరాను. కొన్నాళ్ల క్రితం భర్తతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ఎప్పటివో జ్ఞాపకాలు నా మనసును తూట్లు పొడుస్తూ నన్ను వెంబడించ సాగాయి.
* * *
‘‘చాపేకాళ్లే గానీ సాగే కాళ్లు కాదు. వయసుతో పాటే చాదస్తం పెరుగుతూ ఉంటుంది. చిన్నవాళ్లం.. మనమే వాళ్లని అర్థం చేసుకుని సర్దుకుపోవాలని చెప్పి ఇన్నాళ్లూ నా నోరు వ•యించారు’’ అంది గీత.
కాసేపు వెంకట్ ఏమీ మాట్లాడలేదు. కాసేపయ్యాక ‘‘చూడు గీతా! నాన్న పోయాక ఆ పల్లెలో అమ్మ ఒంటరిగా ఉంటోంది. ఆమెకు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో పాటు అనారోగ్యంతో మంచం పట్టిన కొడుకు కూడా ఉన్నాడు. ఇంటి మనుషులుగా మనం వాళ్లకి అండగా నిలిచి చేతనైన సాయం చేయాలి కానీ వాళ్ల నుంచి ఏమీ ఆశించకూడదు’’ అన్నాడు వెంకట్.
‘ఇలా చెప్పే ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నారు. అయినా మనుషులకు వయసొస్తే సరిపోతుందా, జ్ఞానం ఉండొద్దూ! పిల్లల ముందే నోట్లో చుట్ట పెట్టుకుని గుప్పు గుప్పుమని పొగ వదులుతూ ఉంటుంది. దాన్ని చూస్తూ పిల్లలు ఎక్కడ పాడైపోతా రనే భయంతో నేను చచ్చేదాన్ని. మీకేం…కన్నతల్లి కాబట్టి కారం పెట్టినా కమ్మగానే ఉంటుంది’’ అంది.
‘‘అందుకే నిన్ను ఇంటికి రమ్మని నేనెప్పుడూ బలవంతం చేయలేదుగా! ఏవైనా మంచి చెడులకు నేనొక్కడినే వెళ్లొస్తున్నాను. ఈ మధ్య అది కూడా లేదు. ఎప్పుడు ఊరికి వెళ్లినా ‘పిల్లోడు కళ్లలో మెదులుతున్నాడు, తీసుకొచ్చి మొహం చూపించు’ అని అమ్మ ఒకటే గొడవ. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి మా అమ్మ చుట్ట కాలుస్తోంది. అయినా ఆ అలవాటు నాకు రాలేదు. మానేయమని అమ్మతో నేనెలా చెప్పగలను’’ అన్నాడు వెంకట్.
‘సరే అది వదిలేస్తే… పొలం మీద వచ్చే డబ్బులు, వృద్ధాప్యంలో వచ్చే పెన్షన్ కూడా మీ అమ్మ మీ తమ్ముడికే పెట్టేస్తోంది. పెద్ద కొడుకుని ఒకలా, చిన్నకొడుకుని మరోలా చూడడం మీ అమ్మకే చెల్లింది. పెట్టుపోతలు మనవి, కట్టుడు పళ్లు ఆవిడకన్నట్లుగా తయారైంది పరిస్థితి. అక్కడ్నుంచో ఇక్కడ్నుంచో వచ్చిన డబ్బుల్ని దాచి మనవడికి ఒక ఉంగరమో, గొలుసో చేయించాలనే ఆలోచన కూడా లేదావిడకి’’ గొంతు పెంచింది గీత.
వెంకట్ ఏమీ మాట్లాడలేదు. ‘‘చూడు గీతా! ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటు న్నాం. ఏ లోటూ లేకుండా ఉంటున్నాం. అనారోగ్యం వెంటబడి నప్పుడల్లా అప్పుల కోసం పరిగెట్టడం తప్ప దాచుకు నేంత డబ్బు వాళ్ల దగ్గర ఎక్కడుంది? వాళ్లకేదైనా అవసరం వస్తే ఆదుకుని బంధాలు నిలబెట్టుకోవాలి కానీ ప్రతిదాన్నీ భూతద్దంలో చూసుకుని మన చేతులతో మనమే బంధాల్ని తెంచుకోకూడదు’’ అన్నాడు వెంకట్.
‘‘అవునవును మరి.. నేనే అందరితోనూ బంధాలను తెంచుకోవాలని చూస్తున్నాను! ఆరుగురు ఆడపిల్లల్లో ఆఖరుదాన్ని. అల్లారుముద్దుగా పెరిగినదాన్ని. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు. మీరేమీ చెప్పక్కర్లేదు’’
‘‘గీతా! మనుషుల్లో కనిపించే లోపాలనే పట్టుకుని వేలాడుతూ అరచేతిలో ఉన్న ఆనందాన్ని దూరం చేసుకోకూడదు. ఎప్పుడో ఏదో జరిగిందని బతికున్నంత కాలం వాటినే తల్చుకుంటూ, అందుకు కారణమైన వాళ్లని తిట్టుకుంటూ మనం సాధించేదేమిటో నాకు అర్థం కావట్లేదు.మాట పట్టింపులుండొచ్చు గానీ మనుషుల్ని దూరం చేసుకునేంత ఉండకూడదు. నీ తల్లిదీ, నా తల్లిదీ ఒకే వయసు. కానీ కూతురుగా నీ తల్లికి నువ్వు చేసినంత కూడా కొడుకుగా నా తల్లికి నేను చేయలేక పోతున్నాను’’ అన్నాడు. ఏమీ మాట్లాడకుండావెళ్తున్న గీతవైపుచూస్తూమౌనంగాఉండిపోయాడు వెంకట్. ఆమెను ఎలా సముదాయించాలో తెలియలేదు. ‘నీ పెళ్లాం టెంకాయ చెట్ల మధ్య పెరిగింది కానీ మనుషుల మధ్య పెరగలేదురా.ఆరుగురు ఆడపిల్ల లతో కలిసి పెరిగిన దానికి ప్రేమ ఎక్కువుంతుందను కున్నాను. పక్కవాళ్ల పొడగిట్టని ఒంటరితనం దీనికెలా అబ్బిందో? అత్త కొంపమీద అగ్గిపుల్లేసి పుట్టింట్లో దీపం వెలిగించుకునే దాన్ని దీన్నే చూసా’ అన్న తల్లి మాటలు గుర్తొచ్చాయి వెంకట్’కి.
* * *
ఆలోచనలకి విరామం ఇచ్చి ఆటో దిగి ఇంట్లోకి నడవసాగాను. ఇన్నాళ్లూ ఏదో పొందానన్న సంతృప్తి నాలో ఉండేది. కానీ దేన్ని కోల్పోతున్నానో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. నాలుగు అడుగులు ముందుకేస్తే బంధాలు దగ్గరవుతాయి. అదే వెనక్కి నడిస్తే దగ్గరైన బంధాలు కూడా దూరం అవుతాయి. కత్తిరించడమైనా, కలిపి కుట్టడమైనా మన చేతిలోనే ఉంటుంది. దగ్గర చేసుకోవడమైనా, దూరం చేసుకోవడమైనా మన మాట తీరులోనే ఉంటుంది.
నా ఎనిమిదేళ్ల కొడుకు చేతన్ ‘‘అమ్మా!అమ్మమ్మ లైనులో ఉంది మాట్లాడ తావా? తాతయ్య పొలం గట్టుమీద జారిపడ్డాడంట. అమ్మమ్మ కంగారు పడుతోంది’’ అన్నాడు.
‘తర్వాత మాట్లాడ’తానన్నట్టుగా తల అడ్డంగా ఊపి ఆయన పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను. మనుషులకి ఏ లోటూ లేకుండా పెరగడమంత ‘లోటు’ ఇంకొకటి ఉండదు! అల్లారుముద్దుగా పెరగడమంత ‘వైకల్యం’ మరొకటి ఉండదు!
ఆయన చేతి మీద చేయి వేస్తూ ‘‘మీ అమ్మగారెలా ఉన్నారో ఫోన్ చేసి కనుక్కోండి’’ అన్నాను.
ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ‘‘నాలుగు రోజులు సెలవు పెడతాను. మీ అమ్మగారిని చూసొద్దాం. కేతన్’ని ఒక్కపూట వదిలితేనే నా ప్రాణం అల్లాడిపోతుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని చూడకుండా ఉన్నందుకు ఆవిడెంతగా తల్లడిల్లుతుందో. ఎవరిదైనా తల్లి ప్రాణమేగా’’ అన్నాను.
ఆ మాట అంటున్నప్పుడు నా గుండె నిజంగానే బద్దలయింది. లోలోపల నుంచి అనురాగాల ఊటలేవో పొంగి పొర్లుతున్నాయి. పైకి పెరిగాక చెట్టుకొమ్మలు కలుసుకుంటాయి. మనుషులు మాత్రం ఎదిగేకొద్దీ మేడల్నో, గోడల్నో చూసుకుని ఆత్మీయుల్ని దూరం చేసుకుంటారు.
‘‘అమ్మా… అమ్మమ్మ ఇంటికేనా? నేను కూడా వస్తాను’’ అన్నాడు కేతన్ నా ఒళ్లో కూర్చుంటూ.
‘‘కాదురా… ఈసారి నాన్నమ్మ ఇంటికెళ్దాం. నిన్ను చూడాలనిపిస్తుందంట’’ అన్నాను. వాడు వెనక్కి తిరిగి అనుమానంగా, అయోమయంగా చూస్తూ ‘‘నిజంగానా’’ అన్నాడు.
వాడి తల నిమురుతూ ‘‘నిజమేరా… అక్కడ మీ నాన్నకు అమ్మ ఉంది. నీకు నాన్నమ్మ ఇల్లుంది. అక్కడికి కాకుండా ఇంకెక్కడికెళ్తాం మనం. ఇకనుంచీ ఎప్పుడు సెలవులిచ్చినా ముందు అక్కడికే వెళ్దాం. నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులుండొచ్చు’’ అన్నాను పైకి లేస్తూ.
వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. నా మాటలు విన్న ఆయన కళ్లు ఆనందంతో తడిసి పోయాయి. నా మనసు తేలికయింది.