భారతదేశంలోకి విదేశీ నిధుల రాక, వాటి వినియోగానికి సంబంధించిన చర్చ కొత్తదేమీ కాదు. చాలా కాలంగా, విదేశీ సహాయంతో నడిచే అనేక సంస్థలు విద్య, ఆరోగ్యం, విపత్తు సహాయం, సామాజిక సేవ, మతపరమైన కార్యకలాపాలు, పరిశోధన వంటి రంగాలలో దేశంలో గణనీయమైన కృషిని చేస్తున్నాయి. ఇటువంటి చట్టబద్ధమైన, పారదర్శకమైన కార్యకలాపాలన్నింటినీ స్వాగతించాలి. అయితే, రాజకీయ ప్రభావం, సామాజిక అస్థిరత, మత మార్పిడి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు లేదా భారతదేశ జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే చర్యల కోసం తమ ప్రకటించిన లక్ష్యాలకు భిన్నంగా విదేశీ నిధులను ఎన్‌జీఓలు వినియోగించినప్పుడు సమస్య తలెత్తుతుంది. ఈ ప్రాథమిక ఉద్దేశ్యం తోనే  విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సీఆరఎ) రూపొందింది. 

విదేశీ నిధులు, రాజకీయ కార్యకలాపాలను పర్యవేక్షించడమే ప్రధాన లక్ష్యంగా, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో 1976లో ఇది మొట్టమొదటసారిగా అమలులోకి వచ్చింది. తదనంతరం, 2010లో పాత చట్టం స్థానంలో మరింత కఠినమైన ఎఫ్‌సీఆరఏ`2010’ వచ్చింది.  ఇది 2011 మే 1న అమలులోకి వచ్చింది. విదేశీ నిధులపై పూర్తి నిషేధం విధించడం ఈ చట్టం ఉద్దేశ్యం కాదు. బదులుగా, భారతదేశానికి వచ్చే విదేశీ నిధులను పారదర్శకంగా స్వీకరించేలా, ఏ నిర్దిష్ట ప్రయోజనం కోసం అయితే వాటికి అనుమతి లభించిందో, ఆ ప్రయోజనం కోసమే అవి ఖర్చు చేసేలా చూడటమే దీని లక్ష్యం.

ఎఫ్‌సీఆరఏ సవరణ ఆవశ్యకత

ప్రస్తుత సమావేశాల్లో ప్రతిపాదిత చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారని తీవ్రంగా ఊహా గానాలు వినిపిస్తున్నాయి. ఒక సంస్థ ఎఫ్‌సీఆరఏ సర్టిఫికేట్ రద్దు అయినప్పుడు, ఆ సంస్థ దానిని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు, లేదా సర్టిఫికేట్ పునరుద్ధరణకు నోచుకున్నప్పుడు, విదేశీ నిధుల ద్వారా సంపాదించిన ఆస్తులను నిర్వహించడానికి, విదేశీ విరాళాలను నిర్వహించడానికి ఒక చట్రాన్ని ఏర్పాటు చేయడమే ఈ బిల్లులోని ఒక కీలక నిబంధన. ఈ లక్ష్యంతో, అటువంటి ఆస్తుల తాత్కాలిక నియంత్రణ, నిర్వహణను, అలాగే వాటి అంతిమ పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి ఒక నియమిత అథార్టీని నియమించాలని ఈ ప్రతిపాదన సూచిస్తున్నది. నిర్దేశిత విధానం ద్వారా సంస్థ తన ఎఫ్‌సీఆరఏ నమోదును పునరుద్ధరించుకుంటే, ఆస్తులు, వినియోగించని విదేశీ నిధులను తిరిగి పొందేందుకు కూడా ఆ సంస్థకు అవకాశం ఉంటుంది. ఈ ఆస్తులలో ఏదైనా ప్రార్థనాస్థలం ఉన్నట్లయితే, అక్కడ ధార్మికపరమైన కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలని కూడా ఈ బిల్లు నిర్దేశిస్తుంది. ఈ బిల్లులో ఉన్న మరో ముఖ్యమైన మార్పు శిక్షా నిబంధనలకు సంబంధించినది. ప్రస్తుతం ఉన్న గరిష్ట శిక్షా కాలం ఐదేళ్ల నుంచి ఏడాదికి తగ్గించాలని ఇందులో ప్రతిపాదించారు. అంతేకాకుండా, నిర్దేశిత అధికారి జారీచేసే ఆదేశాలపై సమీక్ష, న్యాయపరమైన అప్పీలుకు కూడా ఇందులో అవకాశం కల్పించారు. మరో మాటలో చెప్పాలంటే, దీనిని కేవలం విదేశీ సంస్థలపై తీసుకునే చర్యగా మాత్రమే పరిగణించడం అసంపూర్ణం అవుతుంది. విదేశీ నిధుల విషయంలో జవాబుదారీ తనం, పారదర్శకత, జాతీయ ప్రయోజనాలే దీనికి సంబంధించిన ప్రధాన అంశాలు.

విదేశీ నిధుల పర్యవేక్షణ

దేశంలోకి వచ్చే విదేశీ నిధుల మూలాలు, వాటి వినియోగాన్ని పర్యవేక్షించడం అనేది ఏ సార్వభౌమ దేశానికైనా ఒక సాధారణ విధానం. ఇలా చేస్తున్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే కాదు. అమెరికా సహా అనేక దేశాలు విదేశీ నిధులు, విదేశీ ఏజెంట్లు, విదేశీ సంస్థలు, రాజకీయ ప్రభావాలకు సంబం ధించిన అంశాలను నియంత్రించే ప్రత్యేక చట్టాలు, యంత్రాంగాలను కలిగి ఉన్నాయి. కాబట్టి, విదేశీ విరాళాలపై భారతదేశం అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను ఏదైనా నిర్దిష్ట మతం లేదా వర్గానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యగా భావించడం వాస్తవ విరుద్ధం.

గతంలోనూ అనేక సవరణలు

ఈ చట్టాన్ని సవరించడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు, వివిధ ప్రభుత్వాలు 1984, 2010, 2016, 2018, 2020, 2022 సంవత్స రాలలో ఈ చట్టాన్ని సవరించాయి. వాస్తవానికి, 2010లో ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో మరింత కఠినమైన కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.

ఈ సమస్య కేవలం ఊహాజనితం కాదని గణాంకాలు సూచిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, కేవలం 2016`2020 మధ్య కాలంలోనే 6,600కు పైగా ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జీఓలు) ఎఫ్‌సీఆరఏ నమోదులు రద్దు అయ్యాయి. విదేశీ వనరుల నుండి నిధులు పొందుతున్న మొత్తం 52,156 ఎన్‌జీఓలు, ఇతర సంస్థలలో, కేవలం 14,435 సంస్థలు మాత్రమే ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నాయని మరో గణాంక వివరాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 22,496 సంస్థల నమోదులు రద్దు అయ్యాయి.15,225 సంస్థలు పూర్తిగా నిష్క్రియంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం, నమోదు రద్దు అయిన సంస్థలకు ఎఫ్‌సీఆరఏ కింద విదేశీ విరాళాలను స్వీకరించడం లేదా వినియోగించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి, అటువంటి సంస్థలన్నీ తమ నమోదులను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి.

ఉల్లంఘనలకు తార్కాణాలు

2015లో, గ్రీన్‌పీస్ ఇండియా ఎఫ్‌సీఆరఏ నిబంధనలను ఉల్లంఘించిందంటూ పలు ఆరోపణలను ఎదుర్కొంది. వీటిలో విదేశీ విరాళాల కోసం నిర్దేశిత బ్యాంకు ఖాతా వెలుపల లావాదేవీలు నిర్వహించడం, విరాళాలను తప్పుగా లేదా తక్కువగా నివేదించడం, పరిపాలనా ఖర్చుల పరిమితిని మించడం, భారతీయ ఎన్‌జీఓలు లేదా కార్యకర్తల న్యాయపరమైన ఖర్చులను భరించడానికి ఒక విదేశీ ఎన్‌జీఓ ఆర్థిక సహాయం అందించడం, ఇతర నియమపాలనకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. విచారణ అనంతరం, కేంద్ర హోం శాఖ దాని నమోదును నిలిపివేసి, తదుపరి చర్యల కోసం ప్రక్రియను ప్రారంభించింది. అదేవిధంగా, 2025లో లడఖ్‌కు చెందిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ’ (ఎసఈసీఎం ఓఎల్) ఎఫ్‌సీఆరఏ లైసెన్స్‌ను కూడా కేంద్ర హోం శాఖ రద్దుచేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి తార్కాణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే, విదేశీ నిధులను పొందే ప్రతి సంస్థా అనుమానాస్పద మైనది కాదని కూడా గుర్తించాలి. భారతదేశంలో అనేక సంస్థలు విదేశీ సహాయంతో ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథ శరణాలయాలు, విపత్తు సహాయక చర్యలు, గ్రామీణాభివృద్ధి, పరిశోధన, విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలు ఇతర సామాజిక కార్యక్రమాలు వంటి రంగాలలో సేవలందిస్తున్నాయి. ఎఫ్‌సీఆరఏ ఉద్దేశ్యం చట్టబద్ధమైన కార్యకలాపాలను పరిరక్షించడమే తప్ప వాటిని నిలిపివేయడం కాదు. చట్టబద్ధమైన విదేశీ సహాయాన్ని స్వాగతించడం, అదే సమయంలో విదేశీ నిధుల దుర్వినియోగాన్ని ఏ పరిస్థితుల్లోనూ సహించకపోవడం ప్రభుత్వ ఉద్దేశ్యం. నిబంధనలను పాటిస్తూ, పారదర్శకమైన లెక్కలను నిర్వహించే సంస్థ పట్ల అనుమానానికి తావుండదు. ఎందుకంటే, వ్యక్తులు, సమాజం, ప్రభుత్వాలు.. ఇలా అన్నింటికీ నిధుల అవసరం ఉంటుంది.

క్రైస్తవ సంస్థలో గందరగోళం-వ్యతిరేకత

ఈ చట్టానికి సంబంధించిన సవరణల విషయంలో, చర్చిలేదా క్రైస్తవ సంస్థలే దీనికి లక్ష్యమనే వాదన అత్యంత రాజకీయ వివాదానికి దారితీస్తోంది. వాస్తవానికి, ఎఫ్‌సీఆరఏ రూపకల్పన ఏ నిర్దిష్ట మతం కోసమూ జరగలేదు. అలాగే ఇందులో ఏ మతం గురించీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే మతపరమైన కార్యకలాపాలలో నిమగ్నమైన సంస్థలు చట్టం నిర్దేశించిన షరతులకు లోబడి ఉంటేనే విదేశీ విరాళాలను స్వీకరించగలవు. అయితే, గతంలో అనేక సందర్భాల్లో, చర్చిలు, వాటికి అనుబంధంగా ఉన్న సంస్థలు భారతదేశంలోని ధార్మిక విశ్వాసాలతో కూడిన ప్రజలను చట్ట విరుద్ధంగా మతమార్పిడి చేయడానికి విదేశీ నిధులను ఎలా దుర్వినియోగం చేశాయనేది రహస్యమేమీ కాదు. దేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించిన అనేక అక్రమ చర్చిలు, మసీదులు, మదర్సాలు ఇతర మతపరమైన సంస్థల ఉనికి, అలాగే వాటి కార్యకలాపాలు అందరికీ తెలిసిన విషయమే. బహుశా అందుకే దొరికి పోతామనే భయం కేవలం అటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో నిమగ్నమైపోయిన వారి మనసుల్లోనే ఉంటుందేమో! మన దేశంలో, ఏదైనా సంస్థ మతపరమైన, విద్యాపరమైన లేదా సామాజిక సేవా కార్యక్రమాలలో నిజాయతీగా నిమగ్నమై, విదేశీ నిధులను చట్టబద్ధంగా వినియో గిస్తుంటే, కేవలం ఆ నిధులను స్వీకరించినంత మాత్రాన దానిని అనుమానంతో చూడరు. పైగా, అటువంటి సంస్థకు ప్రజల్లో గౌరవం లభిస్తుంది. అయితే, ఒక సంస్థకు ఉన్న మతపరమైన గుర్తింపు దానిని భారతీయ చట్టాలకు అతీతంగా ఉంచదని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? అలాగే, చట్టం పట్ల భయపడు తున్నట్లు నటించడం లేదా ఇతరులను భయపెట్టడానికి దానిని ఆయుధంగా వాడుకోవడం వంటి చర్యలకు ఎందుకు పాల్పడాలి?

విదేశీ నిధులు`విదేశీ ప్రభావం

అసలు చర్చ విదేశీ నిధులను అనుమతించాలా లేక నియంత్రించాలా అనే దాని గురించి కాదు, బదులుగా వాటి ద్వారా కలిగే విదేశీ ప్రభావాన్ని అర్థం చేసుకోవడం గురించినది. విదేశాల నుండి వచ్చిన నిధులను ఆసుపత్రిలో రోగికి చికిత్స అందించడానికి, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల చదువుకు తోడ్పడటానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం చేయడానికి లేదా శాస్త్రీయ పరిశోధనలకు వినియోగించినట్లయితే అవి మానవ సంక్షేమానికి సాధనాలుగా ఉపయోగపడతాయి. అయితే, అదే డబ్బును దేశంలోని అమాయక ప్రజలను చట్టవిరుద్ధంగా మతమార్పిడి చేయడానికి, దాని సామాజిక నిర్మాణాన్ని ప్రభావితం చేయడానికి, రాజకీయ వాతావరణాన్ని నడిపించడానికి, హింసాత్మక లేదా విధ్వంసక కార్యకలాపాలను ప్రోత్స హించడానికి, లేదా దేశీయ చట్టాలను ఉల్లంఘించ డానికి ఉపయోగిస్తే అది ఆమోదయోగ్యం కాదు.

విదేశీ నిధులను వినియోగించే సంస్థల విధులు

–         ఆ విదేశీ నిధుల పూర్తి మూలాన్ని వెల్లడించాలి.

–         స్వీకరించిన నిధులు, చేసిన ఖర్చులకు సంబం ధించిన ఖచ్చితమైన వివరాలను అందించాలి.

–         నిర్దేశిత బ్యాంకింగ్ విధానాన్ని పాటించాలి.

–         విదేశీ విరాళాలను కేవలం నిర్ణీత ప్రయోజనం. ఉద్దేశిత లబ్ధిదారుల కోసమే వినియోగించాలి.

–         సంబంధిత పత్రాలు, లెక్కలను సకాలంలో సమర్పించాలి.

–         విదేశీ దాతకు, భారతీయ సంస్థకు మధ్య ఏవైనా అనుమానాస్పద ఆర్థిక లేదా రాజకీయ సంబంధాలను దాచకూడదు. నిజమైన పారదర్శకత అంటే ఇదే అవుతుంది.

అప్రమత్తత అవసరం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని దేశీయ, విదేశీ శక్తులు ఎలాగైతే గందరగోళ ప్రచారాన్ని వ్యాపింపజేశాయో, అదే విధంగా ప్రస్తుతం కొందరు నీతిబాహ్య మతగురువులు, కుట్రపూరిత చర్చి వర్గాలు, రెచ్చగొట్టే భాయ్‌జాన్‌లు, ఇతర సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వీటి పట్ల దేశం అప్రమత్తంగా ఉండాలి. విదేశీ నిధులు దేశంలోకి రావాలి, కానీ అవి భారతీయ చట్టాల పరిధిలోనే రావాలి. సేవలు అందించాలి, కానీ పారదర్శకతతో కూడి ఉండాలి. మతపరమైన లేదా సామాజిక కార్యకలాపాలు జరగాలి, కానీ అవి రాజ్యాంగం, చట్టాల పరిధికి లోబడి ఉండాలి. మన జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించే విదేశీ నిధుల విషయంలో ఎలాంటి వివక్ష, ఒత్తిడి లేదా భయం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది సార్వ భౌమాధికారం, ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశ విధానం. మనం కోరుకునేది నిధుల రూపంలో వచ్చే “దానం” తప్ప, “దానవుడ్ని” కాదు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.