న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన అనంతరం, ప్రశ్నపత్రాల లీకులు సహా పలు అంశాలపై నిజమైన, కల్పితమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఇప్పుడు ప్రపంచం దృష్టి పార్లమెంటువైపు మళ్లింది. కఠినమైన శిక్షా చర్యల ద్వారా పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నివారణ) సవరణ బిల్లు, 2026ను ఉభయ సభలు  ఆమోదించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగల మరో అంశంగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆరఏ) సవరణ నిలిచింది.ఈ సవరణను అడ్డుకోవడమే లక్ష్యంగా, ప్రతిపక్షాల మద్దతు పుష్కలంగా ఉన్న  కొన్ని పౌర సంఘాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక  దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ వ్యవహారంలో ఎన్‌జీఓలు అని పిలిచే ప్రభుత్వేతర సంస్థల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. వీటికి విస్తృతమైన నెట్‌వర్క్‌లు కూడా ఉంటాయి. ప్రవంచవ్యాప్తంగా వీటికి రెండు ముఖాలు ఉంటాయి. ఒక ముఖం అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడపడితే అక్కడ విపరీతంగా ప్రచారానికి నోచుకుంటుంది. దానిని ‘మానవాళికి అంతరాత్మ’గా చిత్రీకరిస్తుంటారు. దీనికి విరుద్ధంగా రెండవ ముఖం ఉంటుంది. అదేమిటంటే ఏవైతే ఎన్‌జీఓ నెట్‌వర్క్‌లు తమను తాము మానవాళికి అంతరాత్మగా డప్పు కొట్టుకుంటాయో అవే నెట్‌వర్క్‌లు తాము బోధించే విలువలకు విరుద్ధంగా ‘సందేహాస్పద చర్యల’ కు పాల్పడుతున్నాయి. అందువల్ల, మనం ఎఫ్‌సీఆరఏ చట్టానికి ప్రతిపాదిత సవరణలను, వాటి ఉద్దేశ్యాన్ని హేతుబద్ధంగా విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీఓ)ను సాధారణంగా ఒక నిర్దిష్ట ఆశయంతో నడిచే సంస్థగా పరిగణిస్తారు. ఇది ప్రధానంగా సామాజిక-ఆర్థిక, మానవతా, లేదా పర్యావరణ సమస్యలపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ నియంత్రణకు అతీతంగా స్వతంత్రంగా పనిచేస్తుంది. దీనిని మొట్టమొదట 1945 ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో ప్రస్తావించినప్పటికీ, ఆర్థిక సరళీకరణ తర్వాత ఎన్‌జీఓ రంగం మరింత సంక్లిష్టమైన స్వరూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు, ప్రభుత్వ, వ్యక్తిగత విరాళాలతో పాటు విదేశీ, కార్పొరేట్ నిధులు కూడా ఇందులో భాగమవుతున్నాయి. చాలా ఎన్‌జీఓలు లాభాపేక్ష లేనివి అయినప్పటికీ, వాటి నిధుల వినియోగం ఎల్లప్పుడూ నిశిత పరిశీలనలోనే ఉంది. వాస్తవానికి, ప్రభుత్వ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, సేవల పంపిణీలోని లోపాలను పూరించడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత, ప్రధానంగా అణగారిన వర్గాలకు సంబంధించిన కొన్ని సమస్యల కోసం వాదించడం, సుస్థిరత, అలాగే ప్రభుత్వ జవాబుదారీతనాన్ని పెంచే క్రియాశీలత వంటివి కూడా వీటి విధులకు తోడయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ వైఫల్యాలు ,పెరిగిన అంతర్జాతీయ నిధుల కలయికతో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటిగా ఎన్‌జీఓ రంగం మారింది.

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) గణాంకాల ప్రకారం, ఒక కోటికి పైగా క్రియాశీలక ఎన్‌జీఓలు ఉన్నాయి, ఇవి సుమారుగా 2 ట్రిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని, 20 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.ఒక అంచనా ప్రకారం సొసైటీలు, ట్రస్టులు, సెక్షన్ 8 కంపెనీల పరిధిలో 34 లక్షలకు పైగా నమోదిత సంస్థలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ వ్యవస్థలలో ఒకటి భారతదేశంలో ఉంది. అయినప్పటికీ, వాటిలో చాలా తక్కువ భాగం మాత్రమే పూర్తి క్రియాశీలకంగా, వృత్తిపరంగా కార్యకలాపాలు నిర్వహస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, సుమారు 35,000 ఎన్జీఓలు చెల్లుబాటు అయ్యే ఎఫ్‌సీఆరఏ లైసెన్సులను కలిగి ఉన్నాయి. ఇది దశాబ్దం క్రితం ఉన్న 50,000కు పైగా సంఖ్యతో పోలిస్తే తక్కువ. సహజంగానే, ప్రభుత్వ అజెండాను నిర్దేశించడానికి, ప్రభావితం చేయడానికి అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం ఒక పెద్ద క్రీడా మైదానంగా మారింది. అందువల్ల, ఎఫ్‌సీఆరఏ చట్టం సామాజిక రంగంలో నిజమైన అంతర్జాతీయ సహకారానికి వీలు కల్పించే ఒక చట్టపరమైన చట్రాన్ని అందించడంతో పాటు, విదేశీ విరాళాల ప్రవాహం, వినియోగం భారతీయ చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసేందుకు ఉద్దేశించినది.

దురదృష్టవశాత్తు, కాలక్రమేణా, అనేక సంస్థలు ఎన్జీఓ వ్యాపారంలో స్వప్రయోజనాలను పెంచుకున్నాయి. అందిన నిధుల సద్వినియోగానికి బదులుగా వాటిని స్వయం ప్రకటిత కార్యకర్తలకు, పరిపాలనా అధిపతులకు, వ్యక్తిగత సౌకర్యాలకు  ఖర్చు చేశాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర విదేశీ శక్తులు తమ అజెండాలను ముందుకు తీసుకెళ్లేందుకు, నిధులను కుమ్మరించడానికి ఒక క్రీడాస్థలంగా భారత్ వంటి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం మారింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, గ్రీన్‌పీస్ వంటి సంస్థలు నిధులను దారి మళ్లించాయని, పక్షపాత నివేదికలను రూపొందించాయని ఆరోపణలు ఎదుర్కొన్నాయి. 2015లో, 10 శాతం కంటే తక్కువ ఎన్జీఓలు మాత్రమే తమ రిటర్న్‌లు, బ్యాలెన్స్ షీట్‌లు, ఇతర ఆర్థిక వివరాలను అధికారులకు సమర్పించాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జనవరి 10, 2017న, ప్రభుత్వ లేదా విదేశీ నిధులు పొందుతున్న దాదాపు 30 లక్షల ఎన్జీఓలపై పూర్తి ఆడిట్ నిర్వహించాలని ఆదేశిస్తూ, నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.  నిఘా నివేదికల ఆధారంగా కొన్ని అంచనాల ప్రకారం, ప్రధానంగా అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్ల ఎన్జీఓల క్రియాశీలత భారత ఆర్థిక వ్యవస్థకు 2-3 శాతం నష్టాన్ని కలిగిస్తోంది. విచిత్రమేమిటంటే, ఈ ఎన్జీఓలే ప్రభుత్వం నుండి జవాబుదారీతనం, పారదర్శకతను కోరుతూ, వాటిని పాటించడానికి నిరాకరిస్తున్నాయి. వారు అణగారిన సామాజిక వర్గాల సమ్మిళితత్వం, మానవ హక్కుల గురించి మాట్లాడతారు. కానీ, వాటికోసం వచ్చిన విరాళాలను ట్రస్టీల వ్యక్తిగత సౌకర్యాలకు మళ్లిస్తారు. విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం అందుకున్న నిధులను మత ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం మరో తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇది దేశీయ గుర్తింపు, ఆచారాలు, విశిష్ట సంప్రదాయాలను అణచివేస్తుంది. భారతదేశపు నిజమైన అవసరాలకు బదులుగా, అనేక ఎన్జీఓల అజెండా, వాదనాంశాలను సైద్ధాంతిక ధోరణులు, కార్పొరేట్ ప్రయోజనాలే నిర్దేశిస్తున్నాయి. కొందరి ఈ పారిశ్రామిక స్థాయి కపటత్వం కారణంగా, ఈ రంగం మొత్తం విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

2020 నుంచి పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూనే విదేశీ విరాళాలను సులభతరం చేసేందుకు అనేక సంస్కరణలు వచ్చాయి. ఎఫ్‌సీఆరఏ లైసెన్స్ రద్దు అయిన సందర్భంలో, నిధుల వినియోగానికి సంబంధించిన నిర్దిష్ట ప్రయోజన నిబంధన, ఆస్తుల నిర్వహణ సంబంధిత సమస్యలను 2026 సంస్కరణలు పరిష్కరిస్తాయి. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినప్పుడు లేదా రద్దు అయినప్పుడు, విదేశీ నిధులతో కూడిన ఆస్తులను పరిరక్షించడానికి ఒక నియమిత అధికార సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిత ఎఫ్‌సీఆరఏ సవరణలు ప్రతిపాదిస్తున్నాయి. నోటిఫై చేసిన ఎఫ్‌సీఆరఏ సవరణ నియమాలు, ఆమోదిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కార్యకలాపాల పరిధిలో రిజిస్ట్రేషన్‌ను నిర్దిష్ట ప్రయోజనాలకు అనుసంధానిస్తాయి. అనుమతించిన మతపరమైన కార్యకలాపాల నుండి మత ప్రచారాన్ని మినహాయిస్తాయి.

ఒక నిర్దిష్ట కారణం పేరుతో విరాళాలు సేకరించి నప్పుడు, దానిని అదే ప్రయోజనం కోసం ఉపయోగించాలని ఆశించడంలో తప్పేముంది? ఎన్జీఓ పరిశ్రమ దేశ చట్టానికి అతీతమైనదా? చట్టపరమైన నిబంధనలను పాటించనప్పుడు, సామాజిక సేవ పేరుతో ఆస్తులను పోగుచేయడానికి అటువంటి సంస్థలను ఎందుకు అనుమతించాలి? ఈ మధ్యవర్తుల ద్వారా ఒక విదేశీ విధ్వంసక ఎజెండా మన ప్రజాస్వామ్యంలోకి చొరబడటానికి మనం అనుమతించగలమా? ఒక విధంగా, ఇది దేశ సార్వభౌమత్వం, భద్రతకు సంబంధించిన ప్రశ్న. నిజానికి, అందుకున్న ప్రతి పైసా ఆశించిన కార్యానికే ఖర్చు అయ్యేలా చూసేందుకు, ప్రజల కార్యాచరణ, గ్రామీణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి మండలి (సీఏపీఏఆర్‌టీ) వంటి సంస్థలు ఈ చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి.

సోదరి నివేదిత పేర్కొన్నట్టుగా పౌర బాధ్యతా భావంతో, ఒక సహజ సంబంధంతో ఇచ్చే దానమనే పురాతన సంప్రదాయం కూడా భారతదేశానికి ఉంది. దేవాలయాలు సహా సామాజిక నిర్మాణాలు, సంస్థలు సరిగ్గా ఈ కార్యకలాపాలను నెరవేర్చడానికే ఉద్దేశించినవి. సమాజం చేపట్టే సంక్షేమ కార్యక్రమా లకు ప్రభుత్వం ఒక మధ్యవర్తిగా ఉండాలి. వలసవాదం,  ప్రభుత్వ-కేంద్రీకృత సంక్షేమవాద పాశ్చాత్య నమూనా స్వదేశీ స్వయంప్రతిపత్తి గల సామాజిక వ్యవస్థలను నాశనం చేశాయి. సేవ సహజంగా, పారదర్శకంగా, ఎలాంటి ఆశలు లేదా మోసపూరిత మార్గాలు లేకుండా ఉండాలనేది భారతీయ భావన. ఒక అజెండాతో నడిచే, మతమార్పిడి చేసే చర్య సేవ కాజాలదు. అది ఒక లాభాపేక్ష వ్యాపారం అవుతుంది. ప్రతిపాదిత సవరణలను ఎన్జీఓలకు, పౌర సమాజానికి లేదా ఏదైనా నిర్దిష్ట మత వర్గానికి ముప్పుగా చూడకూడదు. అంతేకాక, జవాబుదారీతనం, పారదర్శకత అనే పునాదులను పటిష్టం చేయడానికి, అలాగే స్వచ్ఛంద కార్యకర్తల నిబద్ధత, దృఢ విశ్వాసంతో ప్రజలకు నిజంగా సేవ చేయాలనుకునే ఎన్జీఓల విశ్వసనీయ తను పునరుద్ధరించడానికి దీనిని ఒక ప్రయత్నంగా భావించాలి.

దాతృత్వ, విద్యా, సామాజిక, సాంస్కృతిక, అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో విదేశీ విరాళాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశం నిజమైన అంతర్జాతీయ సహకారాన్ని, మానవతా సహాయాన్ని స్వాగతిస్తుంది. అదే సమయంలో, భారతదేశం వెలుపల నుండి వచ్చి దేశంలో వినియోగించే నిధులు తప్పనిసరిగా పారదర్శకత, జవాబుదారీతనం, భారతీయ చట్టాలకు అనుగుణ్యత అనే చట్రంలో ఉండాలి. ప్రతిపాదిత విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026 ఈ చట్రాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీని ప్రాముఖ్యత కేవలం విదేశీ విరాళాల స్వీకరణ, వినియోగాన్ని నియంత్రించడంలోనే కాకుండా, ఒక సంస్థ ఎఫ్‌సీఆరఏ సర్టిఫికేట్ చెల్లుబాటు కానప్పుడు, విదేశీ నిధులతో కూడిన ఆస్తులతో వ్యవహరించ డానికి ఒక స్పష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో కూడా ఉంది. ఇందులో ఇమిడి ఉన్న విదేశీ విరాళాల పరిమాణం, సమర్థవంతమైన నియంత్రణను ప్రత్యేకంగా ,ముఖ్యమైనదిగా చేస్తుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, 2019 `2022 మధ్య కాలంలో 13,520 సంస్థలు రూ.55,741 కోట్ల విదేశీ విరాళాలను అందుకున్నాయి. అంతేకాకుండా, ఎఫ్‌సీఆరఏ పోర్టల్ ప్రకారం, 15 జూలై 2026 నాటికి, 14,449 క్రియాశీల ఎఫ్‌సీఆరఏ సర్టిఫికెట్లు ఉండగా, 22,498 రద్దు అయ్యాయి. 15,212 సర్టిఫికెట్లకు కాలం చెల్లింది. ఈ విధంగా, వివిధ వర్గాలలో ఉన్న 52,159 సంస్థలలో, 37,710 సంస్థల సర్టిఫికెట్లు రద్దు అయ్యాయి లేదా వాటి గడువు ముగిసిపోయింది. దీనితో పోలిస్తే, 14,449 సంస్థలు మాత్రమే క్రియాశీలంగా ఉన్నాయి.  మరో మాటలో చెప్పాలంటే, క్రియాశీల సర్టిఫికెట్లు ఉన్న సంస్థల సంఖ్య కంటే, రద్దు అయిన లేదా గడువు ముగిసిన స్థితిలో ఉన్న సంస్థల సంఖ్య 2.6 రెట్లకు పైగా ఉంది.

ఎఫ్‌సీఆరఏ అధికారిక అనుమతి ముగిసిన తర్వాత, విదేశీ నిధులతో నడిచే సంస్థల చట్టపరమైన హోదా, వాటి ఆస్తులను ఎందుకు అస్పష్టంగా వదిలి వేయకూడదో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

నిధుల నియంత్రణ నుండి ఆస్తుల నియంత్రణ వరకు

ఒక సంస్థకు మంజూరు చేసిన ఎఫ్‌సీఆరఏ సర్టిఫికేట్‌కు కాలం చెల్లడం లేదా రద్దు అయినప్పుడు ఆ సంస్థకు అందిన విదేశీ విరాళాలతో ఏర్పరుచు కున్న స్థిర, చరాస్తులు ఏమవుతాయి? అనే ప్రాథమిక ప్రశ్నకు ప్రతిపాదిత సవరణ సమాధానం ఇస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న  చట్రం(ఫ్రేమ్‌వర్క్) ప్రకారం, ఎఫ్‌సీఆరఏ సర్టిఫికేట్‌ను రద్దు చేసినప్పుడు లేదా అప్పగించినప్పుడు, విదేశీ విరాళాలు, వాటి ద్వారా చేకూర్చుకున్న ఆస్తులకు నిబంధనలు వర్తిస్తాయి. సర్టిఫికేట్‌ను పునరుద్ధరించక పోవడం, పునరుద్ధరణ దరఖాస్తు సమర్పించక పోవడం లేదా పునరుద్ధరణ దరఖాస్తు తిరస్కరణ వంటి కారణాల వల్ల సర్టిఫికేట్ చెల్లుబాటు కాకుండా పోయే పరిస్థితులకు కూడా ఈ చట్రాన్ని ప్రతిపాదిత బిల్లు వర్తింపజేస్తుంది. విదేశీ విరాళాలు, ఆస్తులను ఒక నియమిత అధికార సంస్థకు తాత్కాలికంగా అప్పగించాలని ఈ బిల్లు  ప్రతిపాదిస్తుంది. ఇది ఎఫ్‌సీఆరఏ చెల్లుబాటు తాత్కాలికంగా నిలిచిపోవ డానికి, అర్హతను శాశ్వతంగా కోల్పోవడానికి మధ్య ఉన్న ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని చూపుతుంది. ఒకవేళ ఏదైనా సంస్థ తదనంతరం కొత్త సర్టిఫికేట్‌ను పొందినా, లేదా దాని సర్టిఫికేట్ పునరుద్ధరణకు నోచుకున్నా, దానికి అప్పటిదాకా తాత్కాలిక ంగా ఉన్నహక్కు రద్దు అవుతుంది. ఉపయోగించని విదేశీ విరాళాలు లేదా ఆస్తులు దానికి తిరిగి అప్పగించడం జరుగుతుంది. కేవలం చట్టాన్ని అనుసరించడం కోసమే అలా జరుగుతుంది. విదేశీ విరాళాల ద్వారా ఏర్పరుచుకున్న ఆస్తులను రక్షించడంతో పాటు, అదే సమయంలో నిజాయితీగల సంస్థలకు తమ చట్టపరమైన హోదాను పునరుద్ధరించుకునే అవ కాశాన్ని కల్పించడానికి ఈ విధానం ప్రయత్నిస్తుంది.

ప్రజా ప్రయోజనం – ఆస్తుల రక్షణ

శాశ్వతంగా హక్కు పొందిన ఆస్తులను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. వాటిని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలకు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికార సంస్థలకు లేదా ఏజెన్సీలకు బదిలీ చేయవచ్చు, లేదా నిర్దేశించిన ప్రక్రియల ద్వారా విక్రయించవచ్చు. విక్రయించగా వచ్చిన ఆదాయం, ఉపయోగించని విదేశీ విరాళంతో కలపగా వచ్చిన మొత్తం భారత సంఘటిత నిధిలో జమ అవుతుంది. ఒక సంస్థ చెల్లుబాటు అయ్యే ఎఫ్‌సీఆరఏ హోదాను కోల్పోయినప్పుడు, అది చట్టబద్ధమైన, ప్రకటించిన ప్రయోజనాల కోసం అందించిన విదేశీ విరాళాలు, ఆస్తులపై నిరవధిక ప్రైవేట్ నియంత్రణకు దారితీయ కూడదు అనే ఇది ఒక ముఖ్యమైన సూత్రాన్ని ప్రతిపాదిత ఎఫ్‌సీఆరఏ సవరణ బిల్లు ప్రతిష్టిస్తుంది. అదే సమయంలో, దీని అమలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, తగిన రక్షణ చర్యలకు లోబడి ఉండాలి. చట్టం అనుమతించిన చోట, విధానపరమైన లోపాలను సరిదిద్దుకుని, తమ చట్టబద్ధమైన హోదాను పునరుద్ధరించుకునేందుకు నిజమైన సంస్థలకు తగిన అవకాశం ఉండాలి.

ప్రార్థనాస్థలాల పరిరక్షణ

ప్రతిపాదిత చట్టం ప్రార్థనా స్థలాల ప్రత్యేక స్వభావాన్ని కూడా గుర్తిస్తుంది. శాశ్వతంగా కేటాయించిన ఆస్తి పూర్తిగా లేదా పాక్షికంగా ఒక ప్రార్థనాస్థలం అయినట్లయితే, దాని ధార్మికపరమైన స్వభావం దెబ్బతినకుండా చూసుకుంటూనే, దాని నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇది ముఖ్యం ఎందుకంటే ప్రార్థనాస్థలాలను కేవలం సాధారణ ఆర్థిక లేదా వాణిజ్య ఆస్తులుగా పరిగణించలేము. అవి సామాజిక, సాంస్కృతిక, ధార్మికపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వాటి స్వరూపాన్ని తప్పక రక్షించాలి.

కీలకమైన కార్యకర్తల జవాబుదారీతనం

మరొక ముఖ్యమైన సంస్కరణగా కీలకమైన కార్యకర్తలు(కీ ఫంక్షనరీస్) అనే పదానికి ప్రతిపాదిత చట్టబద్ధమైన నిర్వచనం ఉంటుంది. కీలకమైన కార్యకర్తలుగా కంపెనీల డైరెక్టర్లు, సంస్థల భాగస్వాములు, ట్రస్టీలు, హిందూ అవిభక్త కుటుంబ కర్త, పాలక లేదా నిర్వహణ సంస్థల కార్యనిర్వాహ కులు, సభ్యులు, ఒక సంస్థను నిర్వహించడానికి బాధ్యత వహించే ఇతర వ్యక్తులు ఉంటారు. కేవలం ఒక చట్టపరమైన సంస్థపై మాత్రమే జవాబుదారీతనం ఉండకూడదు. సంస్థలను నిర్వహించే బాధ్యత గల వ్యక్తులు తగిన శ్రద్ధ వహించి, చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో, ప్రతిపాదిత చట్రం రక్షణలను గుర్తిస్తుంది. ఒక నేరం తమకు తెలియకుండా జరిగిందని లేదా దానిని నివారించడానికి తాము తగిన శ్రద్ధ వహించామని ఒక కీలక కార్యకర్త నిరూపించుకోవచ్చు. ఖాయిలా పడిన సంస్థల చివరి కీలక కార్యకర్తల బాధ్యతలను కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. వారు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన చట్టబద్ధమైన విధిని కలిగి ఉంటారు. ఒక సంస్థ ఉనికిలో లేకుండా పోయిన తర్వాత, విదేశీ విరాళాలు, ఆస్తులు అనిశ్చిత చట్టపరమైన స్థితిలో మిగిలిపోకుండా నిరోధించడమే ఈ బిల్లు ఉద్దేశ్యం.

కాలపరిమితితో కూడిన ముందస్తు అనుమతి

ముందస్తు అనుమతి ద్వారా విదేశీ విరాళాలు స్వీకరించే సందర్భాలలో ఎఫ్‌సీఆరఏ రిజిస్ట్రేషన్ లేని సంస్థల నుంచి మరింత క్రమశిక్షణను కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. అటువంటి అనుమతి ఒక నిర్దిష్ట మూలం, మొత్తం,  ప్రయోజనాలకు మంజూరు అవుతుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం, విరాళాన్ని నిర్దేశించిన కాలపరిమితిలోగా స్వీకరించి, వినియోగించుకోవాలి. ఇది ఒక సహేతుకమైన పాటించాల్సిన సూత్రం. ఒక నిర్దిష్ట ఆమోదిత ప్రయోజనం కోసం స్వీకరించిన నిధులను నిరవధికంగా వినియోగించకుండా వదిలివేయ కూడదు లేదా అనుమతి మంజూరు చేసిన ప్రయోజనానికి వెలుపల ఉన్న కార్యకలాపాలకు మళ్లించకూడదు.

శిక్షల హేతుబద్ధీకరణ

ప్రతిపాదిత చట్టం ఎఫ్‌సీఆరఏ కింద నేర శిక్షలను కూడా సవరించాలని కోరుతోంది. ప్రస్తుత నిబంధనలు ఐదేళ్ల వరకు జైలు శిక్షను విధించగలిగినప్పటికీ, ప్రతిపాదిత బిల్లు గరిష్ట జైలు శిక్షను ఒక సంవత్సరానికి తగ్గించాలని కోరుతోంది. అదే సమయంలో, ఎఫ్‌సీఆరఏ నేరంపై దర్యాప్తు ప్రారంభించే ముందు కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం. పరిపాలనా పర్యవేక్షణను బలోపేతం చేస్తూ, నేర శిక్షలను హేతుబద్ధీకరించే ప్రయత్నాన్ని ఇది సూచిస్తుంది. తీవ్రమైన ఉల్లంఘనలను సమర్థవంతంగా ఎదుర్కోవడం, అదే సమయంలో నిజాయతీగల సంస్థలను అనవసరమైన వేధింపుల నుండి రక్షించడం లక్ష్యంగా ఉండాలని నిర్దేశిస్తుంది.

సామాజిక నిర్మాణ పరిరక్షణ

ఎఫ్‌సీఆరఏ చట్రాన్ని భారతదేశ సామాజిక, జనాభా వైవిధ్యం నేపథ్యంలో కూడా చూడాలి. భారతదేశం ఒక బహుళత్వ ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రతి పౌరుడు మనస్సాక్షి, ధార్మిక స్వేచ్ఛ సహా రాజ్యాంగ స్వేచ్ఛలను అనుభవిస్తాడు. చట్టబద్ధమైన ధార్మిక, దాతృత్వ మానవతా కార్యకలాపాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అయితే, రాజ్యాంగం ద్వారా సంప్రాప్తించిన స్వేచ్ఛలు విదేశీ నిధుల దుర్వినియో గానికి ఒక రక్షణ కవచంగా మారకూడదు. విదేశీ విరాళాలను నిర్బంధమైన లేదా మోసపూరితమైన మత మార్పిడికి, ఉద్దేశపూర్వకంగా సామాజిక విభజనలను ప్రోత్సహించే కార్యకలాపాలకు, లేదా ప్రభుత్వానికి ప్రకటించిన వాటికి విరుద్ధమైన ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఇక్కడ ఆందోళన చట్టబద్ధమైన, ధార్మికపరమైన సేవ గురించి కాదు.

సామాజిక సామరస్యం, జనాభా స్థిరత్వం లేదా సమాజ సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేయగల కార్యకలాపాల కోసం విదేశీ నిధులతో కూడిన వనరులను దుర్వినియోగం చేసే అవకాశం గురించే అసలు ఆందోళన. అందువల్ల, పటిష్టమైన ఆర్థిక పరిశీలన, పారదర్శకమైన లెక్కలు, సమర్థవంతమైన పర్యవేక్షణ అత్యవసరం. విదేశీ విరాళాలు అందుకునే ప్రతి సంస్థ దాని ధార్మిక పరమైన, సైద్ధాంతిక లేదా సామాజిక స్వభావంతో సంబంధం లేకుండా జవాబుదారీ తనంతో కూడిన ప్రమాణాలకు లోబడి ఉండాలి.

విదేశీ నిధులు – జాతీయ కథనం

భారతదేశ జాతీయ కథనానికి సంబంధించి ఒక విస్తృతమైన సమస్య కూడా ఉంది. నేడు భారతదేశం సాంకేతికత, వ్యవస్థాపకత, విజ్ఞానం, మౌలిక సదుపాయాలు, ప్రజాస్వామ్యం, మానవ వనరులు, సాంస్కృతిక వైవిధ్యంలో అపారమైన బలాలను కలిగి ఉంది.

భారతదేశం ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తున్న కొద్దీ, దాని ప్రపంచ ప్రతిబింబం, జాతీయ కథనం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. భారతదేశంపై చట్టబద్ధమైన అంతర్జాతీయ విమర్శలు ఉండవచ్చు. ఏ ప్రభుత్వంపైనైనా విమర్శ అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఆవశ్యకమైన అంశం. అయితే, చట్టబద్ధమైన ప్రజాస్వామ్య విమర్శకు, భారతదేశ విజయాలు, సంస్థాగత సామర్థ్యం, అభివృద్ధి సామర్థ్యాన్ని క్రమపద్ధతిలో విస్మరిస్తూ, దాని బలహీనతలను మాత్రమే ఎంచుకొని, బాహ్య నిధులతో ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కథనాలకు మధ్య వ్యత్యాసం ఉంది. ప్రభావాన్ని కొనుగోలు చేయడానికి, కథనాలను తయారు చేయడానికి లేదా భారతదేశ చట్టబద్ధమైన జాతీయ ప్రయోజనాలను దెబ్బతీయడానికి సాధనాలుగా విదేశీ నిధులతో నడిచే సంస్థలు మారకూడదు. అదే సమయంలో, చట్టబద్ధమైన అసమ్మతిని, స్వతంత్ర పాత్రికేయాన్ని, మానవతావాద కార్యకలాపాలను లేదా చట్టబద్ధమైన పౌర-సమాజ కార్యకలాపాలను అణచివేయడానికి నియంత్రణను ఉపయోగించకూడదు. పారదర్శకత, జవాబుదారీతనం, జాతీయ ప్రయోజనం పట్ల లక్ష్యం స్పష్టంగా ఉండాలి. చట్టబద్ధమైన ప్రజాస్వామ్య భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించరాదు.

దేశాభివృద్ధికి విదేశీ విరాళాలు దోహదపడాలి

నిజమైన అంతర్జాతీయ దాతృత్వం, మానవతా సహాయం, విద్యా సహకారం, అభివృద్ధి భాగస్వామ్యా లను స్వాగతించడాన్ని భారతదేశం కొనసాగించాలి. కానీ అటువంటి సహకారం భారతదేశ చట్టాలను, రాజ్యాంగ వ్యవస్థను, సార్వభౌమత్వాన్ని, సామాజిక సామరస్యాన్ని గౌరవించాలి. విదేశీ విరాళాలు భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలి. సమాజాలను బలోపేతం చేయాలి. చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనాలకు మద్దతు ఇవ్వాలి. అవి భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చేసే, దాని సామాజిక సమైక్యతను బలహీనపరిచే లేదా దాని జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించే సాధనాలుగా ఎన్నడూ మారకూడదు. అందువల్ల, ఎఫ్‌సీఆరఏ సవరణ బిల్లుకు ఆర్థిక నియంత్రణకు మించిన ప్రాముఖ్యత ఉంది. ఇది విదేశాల నుండి భారత దేశంలోకి ప్రవేశించే డబ్బుపై జవాబుదారీతనాన్ని నెలకొల్పడం, అటువంటి వనరులు చట్టబద్ధమైన, ప్రకటిత ప్రయోజనాలకు అనుసంధానమై ఉండేలా చూడటానికి సంబంధించినది. ఎఫ్‌సీఆరఏ సవరణ బిల్లు-2026 ప్రధానంగా విదేశీ విరాళాల ప్రవాహాన్ని నియంత్రించడంపై దృష్టి సారించిన వ్యవస్థ నుండి, ఆ విరాళాల ద్వారా సృష్టించిన ఆస్తుల దీర్ఘకాలిక చట్టపరమైన స్థితిని కూడా పరిష్కరించే వ్యవస్థ వైపు ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది.

ప్రతిపాదిత సంస్కరణలు ఆర్థిక జవాబుదారీ తనాన్ని బలోపేతం చేయగలవు, నిబంధనల పాటింపును మెరుగుపరచగలవు. విదేశీ నిధులతో కూడిన ఆస్తుల పరిరక్షణకు తోడు, అంతిమంగా అవి చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనాల కోసం వినియోగితమవుతాయని నిర్ధారించగలవు. అయితే, అమలు పారదర్శకంగా, ఊహించదగినదిగా,  నిష్పక్షపాతంగా ఉండాలి. చట్టం అనుమతించిన చోటల్లా, నిజమైన సంస్థలకు తగిన విధానపరమైన రక్షణలు, లోపాలను సరిదిద్దుకోవడానికి, చట్టబద్ధమైన హోదాను తిరిగి పొందడానికి నిజమైన అవకాశం ఉండాలి. అంతిమంగా, విదేశీ విరాళా లను భారతదేశ చట్టాల ప్రకారం అనుమతించిన, చట్టబద్ధమైన, న్యాయమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజా ప్రయోజనం, జాతీయ భద్రత మార్గదర్శక సూత్రాలుగా ఉండాలి. తగిన రక్షణలతో అమలు చేస్తే, ఎఫ్‌సీఆరఏ సవరణ బిల్లు-2026 దేశానికి మరింత బలమైన, సువ్యవస్థీకృతమైన నియంత్రణ నిర్మాణాన్ని అందించగలదు. ఇది చట్టబద్ధమైన పౌర సమాజ కార్యకలాపాలను పరిరక్షిస్తూనే, దేశ సామాజిక సామరస్యం, జాతీయ భద్రత, సార్వభౌమత్వం, అభివృద్ధి, దీర్ఘకాలిక శ్రేయస్సును కాపాడు తుందనడంలో ఎలాంటి సందేహం లేదు

 – జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.