– ‌జి. వి. శ్రీనివాస్‌

‘‘అమ్మా!
సంబోధన ‘ప్రియమైన’ అని మొదలుపెట్టాలో, ‘పూజ్యనీయ’ అనాలో నాకింకా అర్థం కావడం లేదు. నిన్ను అనాలో, వి•రు అనాలో కూడా నాకెప్పటికీ బోధ పడదేమో?
అందరూ అంటూ ఉంటారు అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం, మమతకు ఆకారం అని.
చిన్నప్పుడు బడిలో చెప్పేవారు అమ్మ అంటే క్షమకు నిజమైన రూపం అని.
సృష్టికి మూలపురుషులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటె ఒక శక్తి ఉందని, ఆమెను ఆదిపరాశక్తి అంటారని గుడిలో ప్రవచనం చెప్తుంటే విన్నాను. ‘అమ్మలగన్న అమ్మ చాలా పెద్దమ్మ’ అని పోతన గారు నీ గురించి చెప్పారని విని, అబ్బురపడ్డాను.
అమ్మా !
అసలు నువ్వెక్కడ ఉంటావో నాకు తెలియదు. ఎలా ఉంటావో కూడా తెలియదు. నా దృష్టిలో వేలవేల రూపాల ఒకే ప్రతిరూపం నువ్వు.
అమ్మా!
కోప్పడను,ఏమనుకోను అని నువ్వు మాటిస్తే నీతో నా గుండె వేదన పంచుకోవాలని ఉంది. ఈ ప్రపంచంలో నా బాధను తీర్చగల ఒకే ఒక వ్యక్తివి నీవే. చెప్పనా అమ్మా.!?.
ఎలా కన్నావమ్మా? ఇలాంటి మూర్ఖులను. అదిగో నీ కళ్లు అప్పుడే సిందూర వర్ణ రంజితం కాబోతున్నాయి. నేను చెప్పేది పూర్తిగా విన్న త•ర్వాత నీకు ఏమనిపిస్తే అది చేద్దువు గానీ! అంతవరకు కాస్తా ప్రసన్నవదనంతో నా ఘోషను వినమ్మా.
దేవుళ్లు అంటే మన దేశంలో ఎంతటి భక్తి భావమో నీకు తెలియంది కాదు. దేవుని రూపం కనబడగానే కొందరు సాష్టాంగ ప్రణామాలు చేస్తారు. మరికొందరు నిలబడిన చోటనే చెప్పులు విప్పి, లెంపలు వేసుకుంటూ ప్రార్థన చేస్తారు. అంతటి భయభక్తులు మనవారికి దేవుడు అంటే.
కానీ అమ్మా! దేవుని చిత్రాలను అగరుబత్తుల ప్యాకెట్లపై, సరకులు వేసే సంచులపై ముద్రిస్తున్నారు. మొన్ననే ఇంటికోసం బియ్యం కొనడానికి వెళ్లా నమ్మా. ఆ కంపెనీ బియ్యం బాగుంటాయని అందరూ అంటారు. అవే కావాలని అడిగాను. షాపులో పనిచేసే కుర్రాడు అక్కడ ఉన్న బియ్యం బస్తాలపై కూర్చోని సెల్‌ ‌ఫోన్లో వీడియోలు చూసుకుంటున్నాడు. లేచి, తను కూర్చున్న బస్తాను కిందకు లాగాడు. అప్పుడు చూశానమ్మా. గుండె పగిలిపోయింది. ఏదో తెలియని దుఃఖం కమ్ముకుంది.
అంతసేపు అతను కాళ్లను మఠంగా వేసుకొని కూర్చున్నది…ఎలా చెప్పనమ్మా?
రత్నభూషిత , పద్మాసన, మందస్మిత సుందర రూప లక్ష్మీదేవి వర్ణ చిత్రంపై.
మరొకటి కూడా గమనించాను. ఖాళీ అయిన బియ్యం సంచులు మూలన పడేసి, శుభ్రం చేసుకోవడానికి వాడుకుంటున్నారు.
చెప్పమ్మా! తప్పు ఎవరిది? చూడగానే నమస్కరించాలనే లక్ష్మీదేవి చిత్రాన్ని తమ వ్యాపార ప్రయోజనం కోసం బియ్యం బస్తాపై పెద్దగా ముద్రించిన వారిదా? ఆ బస్తాను కేవలం బస్తాగానే చూస్తూ, కాళ్లతో తొక్కుతున్న వారిదా?ఏదైనా మాకెందుకులే అనుకునే మాలాంటి వాళ్లదా?
దీపావళి వస్తే లక్ష్మీ బాంబుల అమ్మకాలు అగ్రస్థానం అందుకుంటాయి. వాటిపై లక్ష్మీదేవి సుందర రూపం. కానీ బాంబ్‌ ‌పేలగానే ఆ చిత్రం తునాతునకలు అయిపోతుంది. చూస్తున్న నా గుండెల్లో బాంబుల మోత.
అగరుబత్తి ప్యాకెట్లు, బట్టల సంచులు, దీపావళి సామాన్లపై ఒకటేమిటీ చూడగానే గుర్తుపట్టి ఒక బ్రాండింగ్‌ ఏర్పరుచుకొనేలా వ్యాపార నిపుణులు అన్నింటిపై దేవుళ్ల చిత్రాలను ముద్రిస్తున్నారు. మనం వాటిని వాడిన తర్వాత చెత్తకుప్పలో పడేస్తున్నాం. కొన్నిసార్లు అశుద్ధంతో కూడా ఆ చిత్రాలు కలిసి పోతున్నాయి. దేవుని బొమ్మలు వేయకుండా బ్రాండ్‌ ‌క్రియేట్‌ ‌చేసుకోలేరా?
అమ్మా!
ప్రతి చిన్న విషయానికి మనోభావాలు దెబ్బ తిన్నాయనే అనేవారు వీటి విషయంలో మరెందుకు మౌనం వహిస్తున్నారో తెలియదు.
వాళ్లకు ఎవరు చెప్పాలమ్మా? గుడిలో అయితేనే దేవుడు గానీ, ఇవేవీ దేముని ప్రతిరూపాలు కావా? మార్పు ఎక్కడ నుంచి మొదలవ్వాలో చెప్పమ్మా?
అలాగే నువ్వు గమనించే ఉంటావు కదా! జనం ఒకప్పటిలా ట్రాఫిక్‌ ‌రూల్స్‌ను గౌరవించడం లేదు. దూరంగా పోలీసును చూస్తేనే హెల్మెట్‌ ‌పెట్టుకోవడం, దాటిపోగానే తీసి, బండికి తగిలించడం. అమ్మా! హెల్మెట్‌ అనేది మన రక్షణ కోసమే అని, పోలీస్‌ ‌కోసం కాదని వీళ్లకి తెలియదా? తెలుసు, కానీ నిర్లక్ష్య భావన.
రాంగ్‌ ‌సైడ్‌లో రావడం గొప్ప అనుకుంటారు. ఎవరైనా అది తప్పు అని చెప్పే సాహసం చేస్తే.. అంతెత్తున లేచి విరుచుకుపడతారు. చూస్తూ మౌనంగా ఉండలేకపోతున్నాను. వాళ్ల నోటికి జడిసి, మూగనవుతున్నాను.
కుంకుమ ఇష్టపడే నా శ్రీమతికి ఇప్పుడు కుంకుమ అంటేనే భయపడుతుంది. బజార్‌లో కొన్న కుంకుమ పెట్టుకుంటే చర్మం దురద. అందమైన నుదురుపై మచ్చ మిగులుతుంది. రూపాయి సంపాదనే ముఖ్యమా? జనుల ఆరోగ్యంతో పని లేదా?
అమ్మా! ప్రోటీన్‌ ‌కోసం పన్నీర్‌ ‌తినాలి అనుకుంటే అది కూడా కృత్రిమమే. చివరకు కమ్మగా తినే పెరుగును కూడా పాలు వాడకుండా పౌడర్లు, రసాయ నలతో తయారుచేసి, జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఆ జనాల్లో వాళ్ల కుటుంబాలు, స్నేహితులు ఉంటారనే సృహ కూడా ఉండదేమో ఆ వెధవలకు. క్షమించు అమ్మా! కోపంతో మాట జారాను.
మతం పేరుతో దారుణాలు. ఇంతకాలం గుర్తురాని పురాతనవాదం ఇప్పుడే గుర్తుకు వచ్చింది. మతం అంటే మూర్ఖత్వం కాదని, మానవత్వమే అసలైన మతమని, అదే సర్వజన సమ్మతం అని ఎప్పుడు తెలుసుకుంటారు?. మతం అంటే అందరినీ కలిపేదే గాని విడదీసేది కాదని ఎప్పుడు నేర్చు కుంటారు?
ప్రాచీనతే తమ మార్గం అనుకునే వారికి అసలు ప్రాచీనకాలంలో సమాజ వ్యవస్థ ఎలా ఉండేదో కనీస అవగాహన కూడా లేదేమో అనిపిస్తోంది వారి వాదనలు వింటే. అప్పట్లో వర్ణ వ్యవస్థే గాని కుల వ్యవస్థ లేదని, ఒకే వృత్తి చేసే వారందరూ ఒకే వర్ణం అని వీరు ఎప్పుడు తెలుసుకుంటారు?
పేపర్‌ ‌తిరగేస్తే చాలు అభం, శుభం తెలియని పసివాళ్లపై లైంగిక దాడులు. ఆస్తి కోసం కన్నవాళ్లనే పొట్టన పెట్టుకుంటున్న వైనాలు. పరువుహత్యలు. ప్రియుడి కోసం భర్తనే చంపించే భారతనారీలు. ఏమిటమ్మా ఈ దారుణాలు?
ఎంత అమ్మ అయితే మాత్రం ఇంతటి క్షమ పనికిరాదమ్మా!.
మేము చెప్తే ఎట్లాగూ ఈ నీచులు మారరు. ఈ పాడు పనులు చేసేవాళ్లు కూడా ఒక తల్లి బిడ్డలే కదా!ఇంటికి వచ్చినప్పుడు నీ బిడ్డలకు నువ్వాయినా చెప్పొచ్చు కదమ్మా.
నీ బిడ్డే కదమ్మా!? నువ్వు చెప్తే వింటారు. తల్లిగా దండించే హక్కు నీకుంది. గట్టిగా బుద్ది చెప్పు. లేదంటే కాళికవై ఈ విషపురుగులను ఏరి వెయ్యి తల్లీ!
ఈ అక్షర నివేదన ప్రతీ తల్లి చదువుతుందని, తన బిడ్డనయినా బాధ్యతగల పౌరునిగా తీర్చిదిద్దుతుందని ఆశతో…
ఈ ఉత్తరం చదివి, తన బిడ్డలకు మంచి బుద్ధులు నేర్పే మాతృమూర్తులకు వందనాలతో …’’
ఇట్లు
నీ బిడ్డ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.