విద్యానగర సభా ప్రాంగణాన మంజుల మంజీర ధ్వనులు నాట్యమాడి కాలవశాన నిలిచిపోయిన ఆంధ్ర కవితా శారద, మరికొంత కాలానికి తంజాపురి విజయభవన సభా సదనంలో అందచందాలతో అవతరించింది. కృష్ణదేవరాయలే తిరిగి రూపుగొన్నాడా? అన్నట్టుగా రఘునాథ భూపాలుడు; అల్లసానిపెద్దన అచ్చున వచ్చినట్లుండే చేమకూర వేంకటకవి; భువన విజయమే పునర్నిర్మితమైనదా? అనిపించే విజయ భవనం.. తెలుగు సరస్వతి ఆ నగరిలో కొలువు దీరింది. దాని ఫలితంగానే వెలువడింది శృంగార రస ప్రధానమైన ‘విజయ విలాసం’ చక్కెర మడిలో అమృతం పారించిన కావ్యంగా వినుతికెక్కింది.

చేమకూర వేంకటకవి కావ్యాల్లో తెలుగు భాష అందచందాలు వయ్యారాలు ఒలకబోస్తూ ఎంతో మనోహరంగా ఉండేవి. ముఖ్యంగా ఒక పదం నామ వాచకంగానూ, క్రియాపదంగానూ వాడే చమత్కారం ఆ కవి ప్రత్యేకత. అందుకే రఘునాథ రాయలంతటి కవి. ‘క్షితిలో నీ మార్గమెవరికిన్‌ ‌రాదు సుమీ’ అని కీర్తించాడు.

పాఱ చూచిన రిపుసేన పాఱజూచు

అర చందమామ నేలిన దొరగా నెన్నుదురు నెన్నుదురు

మనసు భద్రమయ్యే మన సుభద్రకిపుడు

అందందు నరుగ నరుగానరుగా?

‘‘మామ కాగమ వార్త’’ వంటి సభంగ శ్లేషలు ఎక్కువగా చేమకూర ఎక్కువగా వాడారని ఆచార్య మలయవాసిని (‘ఝమ్మందినాదం’ పుస్తకంలో) పేర్కొన్నారు.

దక్షిణాంధ్ర యుగంలో వెలసిన ఆంధ్ర ప్రబంధాల్లో ‘విజయ విలాసం’ మేలుబంతి. ఈ కావ్యంలో..విజయుడు ముగ్గురు కన్యల్ని వివాహం చేసుకొని, పుత్రలాభం పొందిన ఘట్టాలు వర్ణితమయ్యాయి. అంటే నాయకుడొకడు, నాయికలు ముగ్గురు(ఉలూచి, చిత్రాంగద, సుభద్ర).చేమకూర ఈ కావ్యాన్ని రఘునాథరాయలుకే అంకితమిచ్చాడు.

‘అపాత్రదానం కూడదు. రఘునాథ భూపాలు డనేక మంచి గుణములు కలవాడు. రఘునాథుడు చంద్రుని వంటి కాంతిని, సహస్రముఖుడైన ఆదిశేషుని మాటకారితనం, బుధుని వంటి వివేకాన్ని, శుక్రాచార్యుని వంటి నీతిని, మహేశ్వరుని వంటి ఐశ్వర్యాన్ని కలిగినవాడు. అంతేకాదు చక్కని పరి పాలనా దక్షత, భోగానుభవము, సమరస భావము, ప్రశస్తమైన కవితాగుణము, అపారమైన జ్ఞానము ఆయనకు ఉన్నాయి కనుక కృతి భర్తగా ఆయన అన్నివిధాల తగినవాడు’ అని చేమకూర పద్యరూపంలో చెప్పారు.

రఘునాథ రాయలకు శ్రీరామచంద్రుడు ఇష్టదైవం. అందుకే కవి కావ్యా రంభంలో…

‘‘శ్రీ లెల్లప్పుడొసంగ, నీ సకల ధాత్రీ చక్రమున్‌ ‌బాహువీ / ఠీలగ్నంబుగ జేయ, దిగ్విజయ మీన్‌ ‌డీకొన్న చందాన, నే

వేళన్‌ ‌సీతయు లక్ష్మణుండు దను సేవింపంగ విల్‌పూని, చె / ల్వౌలీలన్‌ ‌దగు రామమూర్తి రఘునాథాదీశ్వరున్‌ ‌బ్రోవుతన్‌’’-అని స్తుతించాడు.

రఘునాథుడు కవి చేమకూర గురించి చెపుతూ-

‘‘ప్రతి పద్యము నందు జమ

త్క ృతి గలుగం జెప్పనేర్తు; వెల్లెడ బెళుకౌ

కృతి వింటి మపారముగా

క్షితిలో నీ మార్గమెవరికిన్‌ ‌రాదు సుమీ’’.

‘సొగసుగా ఉండే ఈ కావ్యాన్ని చాలాసార్లు తృప్తి కలిగేటట్లుగా విన్నాం. నీవు రాసే ప్రతి పద్యంలోను చమత్కారాన్ని ప్రదర్శిస్తావు. అంటే శబ్దంలోనో, భావంలోనో, అర్థ్ధంలోనో, చమత్కృతిని పొందు పరచి కవిత్వం రాయడంలోనూ,అర్థరస భావ అలంకారాది విషయాలన్నింటిలోను సమర్ధుడవు. నేర్పుతో కూడిన ఈ కవితా పద్ధతి ఎవరికి సాధ్యం కాదు’ అని ప్రశంసించడంలో రెండు విషయాలు స్పష్టమవు తాయి. చేమకూర వారి కవితా సౌరభాన్ని రఘునాథుడు పరిపూర్ణంగా ఆస్వాదించడం ఒకటి కాగా, ఆనాటి రాజులు కవులను ఎంత ఘనంగా గౌరవించేవారో అనేది రెండవది.

చేమకూర రచనలో ప్రతి ప•ద్యంలోనూ చమత్కృతి ఉంటుందనీ, ఈ కవిత్వ పద్ధతి అన్యులకు సాధ్యం కాదన్న రఘునాథుని మాటను నాటి నుంచి నేటి కవులు, పండితులూ, విమర్శకులవరకు అంగీకరించిన వాస్తవం.

ఇందప్రస్థ పురాన్ని వర్ణించే పద్యంతో కథను ప్రారంభించాడు కవి. ఆ నగరాన్ని పాలిస్తున్న ధర్మరాజు గుణగణాలను వెల్లడించాడు. ‘లోకంలో రాజులకు ఒక లోపం ఉంటుంది. తాము ఆజ్ఞలు జారీ చేస్తారేగాని అవి తమకు కూడా వర్తిస్తాయని భావించరు. కానీ ధర్మరాజు అటువంటివాడు కాడు..ఆజ్ఞా పరిపాలనా వ్రతుడు’’ అని చెప్పాడు. అంటే ఆజ్ఞలను అమలు చేయడంలో ప్రజలకు ఆదర్శంగా ఉంటాడు.

ఈ కావ్య కథానాయకుడైన అర్జునుణ్ణి …

‘అతని నుతింప శక్యమె! జయంతుని తమ్ముడు సోయగంబునన్‌ /‌బతగకులాధి పధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్‌

‌క్షితిధర కన్యకాధిపతికిన్‌ ‌బ్రతిజోదు సమిజ్జయంబునం / దతని కతండెసాటి చతురబ్ధి పరీత మహీతలంబునన్‌’… అని పరిచయం చేశారు

 అందంలో జయంతుని తమ్ముడు, దయారసంలో పక్షీంద్రుడైన గరుత్మంతుణ్ని ధ్వజంగా కలిగిన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుని ప్రాణ స్నేహితుడు, యుద్ధంలో పార్వతీపతి ఈశ్వరునికి పోటీ నిలిచేటంతటి వీరుడు. నాలుగు సముద్రాలు ఆవరించిన ఈ భూలోకంలో అర్జునుని అందానికి, దయాగుణానికి, యుద్ధంలో చూపే శౌర్యానికి అతనికతడే సాటి..అంటూ ఉపమానాలను చక్కగా ఉపయోగించుకున్నాడు కవి.

ఇక కథానాయిక సుభద్రాదేవి.. నిండు యౌవనంలో ఉంది. ఆమె మాట్లాడితే చిలకలను అభిమానించినట్లుగా ఉంటుంది. ఆమె కన్నులు చాలా అందమైనవి చకోరపక్షిలా.హంసనడక. ‘మనసు భద్రమయ్యే మన సుభద్రకిపుడు’ అని వాడాడు కవి.

ఒక బ్రాహ్మణుని ఏకైక ధనమైన ఆవును దొంగలెత్తుకొని పోయినారు. ఆ బ్రాహ్మణుడు పరుగున వచ్చి అర్జునుడికి మొరపెట్టుకున్నాడు. దొంగను శిక్షించి తన ఆవును తిరిగి ఇప్పించమని ప్రార్థ్ధించాడు. ఈ కార్యసాధనకు అర్జునికి విల్లు, అంబులూ అవసరమైనాయి. వాటిని గ్రహించేటందుకు ధర్మరాజు ద్రౌపది ఉన్న కేళీగృహం వైపు వెళ్లవలసి వచ్చింది. ఫలితంగా, వారి పూర్వ ప్రతిజ్ఞ ప్రకారం, అర్జునుడు ఏడాది పాటు భూప్రదక్షిణం చేసి రావలసి వచ్చినది.

అర్జునుడు ఇందప్రస్థం వదలి భూప్రదక్షిణకు బయలుదేరాడు. ప్రయాణ సందర్భంగా సామంతులైన రాజులిచ్చిన కానుకలను గ్రహించాడు, పావన సరస్సులలోను, నదుల్లోను స్నానాలు చేస్తూ తీర్థయాత్ర కొనసాగించాడు. తనకు అవ్వయైన గంగానదిని చూడగానే, అధికాసక్తితో అక్కడి స్వచ్ఛమైన నీటిలో స్నానమాడాడు. అతను ఆ నదీ తీరంలో విడిది చేసినప్పుడు, భాగీరథిని దర్శించడానికి వచ్చిన నాగకన్య ‘ఉలూచి’కి, సుందరాకారుడైన అర్జునుడు ప్రథమ దర్శనంలోనే ఆకర్షించాడు.

‘ఈ నరుడు ఎవరు? ‘ఈతడు మన్మథుడిని కూడా గెలవజాలిన సౌందర్య వంతుడు.వీరత్వంలోనూ, విలాసంలోనూ ఏ రాజు ఇతనికి సమానం కాలేడు’ అనుకొంది.

‘‘నువ్వు బువ్వు నవ్వు జవ్వని నాసిక

చివురు నీవురు జవురు నువిదమోవి

మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతివేణి

మెఱపు నొఱపు బఱపు దెఱవమేను’’

అర్జునుని అందానికి వశమైన ఉలూచి క్షణాల్లో అతన్ని నాగలోకం తీసుకు వెళ్లింది. కళ్లు తెరచి చూచిన అర్జునుడి ఎదుట మనోహరాంగి నిలిచి ఉంది. ఆమె అందాన్ని మననం చేసుకుంటున్నాడు. ఆమె (ఉలూచి) ముక్కు, నవ్వు పువ్వును కూడా పరిహసించేటంత అందం, అధరము చివురుటాకు సౌకుమార్యం, సుందరమైన నల్లటి కొప్పు, ఆ కాంత శరీరం మెరుపు తీగకాంతిని మించి ఉందట.

ప్రేయసి ఉలూచితో పా•ణిగ్రహణ విధిని నిర్వర్తించాడు.తీర్థయాత్ర కొనసాగింపుగా, మణిపురం చేరి, అక్కడి ఉద్యానవనంలో విహరిస్తున్న మలయధ్వజ కుమార్తె చిత్రాంగద అందచందాలకు ముగ్ధుడయ్యాడు. అయితే ఇక్కడ చిత్రాంగదను అర్జునుడు చూచినాడు కాని, ఈ కురువీరుణ్ణి ఆమె చూడలేదు.

‘అపుడు నృపుడు ప్రపుల్ల నవాంబుజ ప్ర

సన్న ముఖుడయి మలయధ్వజ క్షితీశ

కమల హితునకు మామకాగమ వార్త

దెలుపు మనుచు విశారదు బిలిచి పనిచె’

చిత్రాంగదను చూచినప్పటి నుంచి ఆమెపై వలపు విరహంగా మారింది. ఇంక ఆ రాత్రి ఎలానో గడిసి ప్రభాత సమయంలో సచివుడు విశారదుని పిలిచి,తన రాక గురించి మయధ్వజుడికి తెలియచేయాలని ఆదేశించాడు. ఆ అభిప్రాయాన్ని చమత్కారంగా అర్జునుని నోట చెప్పించినాడు కవి.

మామక + ఆగమన వార్త – అంటే నా రాకను గురించిన వార్త తెలుపుము.

మామకు + ఆగమన వార్త – మామలాంటి వాడు (అతని కూతురును తాను వివాహం చేసుకొనబోతున్నాడు కాబట్టి) అయిన రాజుకు నా రాక గురించి చెప్పమనడం రెండవ అర్థం.అర్జున, చిత్రాంగదల పెళ్లి జరిగింది.

అనంతరం ద్వారక చేరిన అర్జునుడు, ప్రియురాలు సుభద్ర సౌందర్యం తనివితీరా చూడవచ్చని సంతసించాడు. అయితే యతిగా వెళితే పనిసానుకూలమవుతుందని భావించి సన్యాసి వేషం ధరించాడు. ఆయనకు కొన్నాళ్లు సపర్యలు చేసిన సుభద్రతో,‘ ‘ఓ సుందరీ! అందమైన మంచి చిలుక నీ చేయిపట్టుకొన్నది, శ్రేష్ఠమైన హంస నీకు సన్నిహితంగా వచ్చి నీ కాలు తొక్కింది. ఈ రెండు కూడా మంచి శకునాలే. త్వరలోనే నీకు వివాహం జరుగుతుంది.’ అని చెప్పింది. దాంతో యతిరూపంలో ఉన్నవాడు అర్జునుడని, తన కోసం ఈ రూపంలో ద్వారకానగర ఉద్యానవనంలో ప్రవేశించాడని సుభద్రకు తెలిసింది. అర్జునుడు తన కోర్కెను వెల్లడించి, అనురాగంతో ఆమె చేయిపట్టుకొన్నాడు. సుభద్ర చేతిని సున్నితంగా విడిపించుకొంటూ ‘పెద్దలున్నారు. వారు సంగతి తెలుసుకొని వివాహం చేస్తారు. ఇంతగా తొందర పడడం తగద•’, అంటూ అంతఃపురానికి వెళ్లిపోయింది. వారికి అనతికాలంలోనే వివాహమైంది.

‘కలయగ మంచి లగ్నమిది, గట్టిగ నేగడె లెన్ని యయ్యెనో / తెలిసెద నంచు నోర్తు, జనుదేరద దే మని యోర్తు నెచ్చెలిన్‌

‌బిలిచెద నంచు నోర్తు, నొక పేరిడివా రిటులేగి రంద; ఱ /చ్చెలియల వెంటనే సగము సిగ్గరిగెన్‌ ‌దరుణీలలామకున్‌’ అని శోభన ఘట్టాన్ని వివరించారు కవి చేమకూర.

చేమకూర వారి కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ‘సామెతలతోను శబ్దాలంకరములతోనూ నిండియుండి యర్థ గౌరవములు కలదయి రసవంత మయి యున్నందున చేమకూర వేంకటకవి కవిత్వము సర్వజనాదరణీయమయినదని తలచుచున్నాను’ అని సెలవిచ్చినారాంధ్ర కవి చరిత్రకారులు.‘ఈ చేమకూర చక్కెర మడిలో నమృతము పారించి పెంచినది కాని మట్టిలో నీరు పారించి పెంచినది కాదు’ అని కళాప్రపూర్ణ వేదం వేంకటరాయ శాస్త్రి శ్లాఘించారు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.