నల్లమల అడవి పేరు వినగానే మనసులో రెండు భావనలు ఏకకాలంలో మెదులుతాయి- ఒకటి గాంభీర్యం, మరొకటి కాస్త భయం. ఎందుకంటే ఇది సాధారణ అటవీ ప్రాంతం కాదు… నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎనఎస్‌టీఆర్) పేరుతో దేశంలోనే అతి పెద్ద పులుల అభయారణ్యంగా గుర్తింపు పొందిన రాజ్యం. కృష్ణా, పెన్నా నదుల మధ్య వందల కిలోమీటర్ల పొడవునా పరుచుకున్న ఈ దట్టమైన అరణ్యంలో వందకు చేరువలో పులులు గాండ్రిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వందల రకాల పక్షులు, జంతువులు, జలచరాలకు ఆలవాలమైన ఈ అభయారణ్యం చూసేందుకు కనువిందుగా అనిపించినా, లోలోపల ఒక చేదు నిజం దాగి ఉంది. ఈ రాజ్యానికి రాజైన పులికే కడుపు నిండా తిండి దొరకడం లేదు! ఆకలితో అలమటిస్తున్న పులుల్లో కొన్ని వేటగాళ్ల తూటాలకు బలైతే, మరికొన్ని తిండి కోసం ప్రమాదకర జీవులతో తలపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇటీవల వరుసగా సంభవించిన రెండు పులుల మరణాలు ఈ చేదు నిజాన్ని రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసేలా బయట పెట్టాయి.

గత కొద్ది వారాల్లో నల్లమల అడవుల్లో రెండు పులులు మృత్యువాత పడ్డాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు-రాచర్ల అటవీ ప్రాంతంలోని గుండ్లకమ్మ రేంజ్‌లో జులై 31న ఒక పెద్దపులి కళేబరం లభించింది. అది చనిపోయి 35-40 రోజులు గడిచిపోయినట్లు అటవీ అధికారులు అంచనా వేశారు. మరీ దారుణం ఏమిటంటే… ఆ పులి కాళ్లు, గోళ్లు మాయమయ్యాయి! నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో మరో పులి (టి-66ఎఫ్) మృతి చెందింది. ఈ రెండు మరణాల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఒక్క పులి ప్రాణం పోయినా అది తీవ్రమైన విషయమేనని, క్షేత్రస్థాయిలో పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు చేపట్టాలని అటవీ శాఖను ఆదేశించారు. దీనికోసం ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనలో మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది.

గుండ్లకమ్మ రేంజ్‌లో జరిగిన ఘటనలో ఉచ్చులో చిక్కుకున్న పులిని కొందరు దుండగులు నాటు తుపాకీతో కాల్చి చంపి, గోళ్లను అక్రమ వ్యాపారం కోసం ఎత్తుకెళ్లినట్లు తేలింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత స్థాయి కమిటీ (హెచఎల్‌సీ) ఛైర్మన్ మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని నిర్ధారించారు. పోలీసులు, అటవీశాఖ సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో ఏడుగురు వేటగాళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏడు గోర్లు స్వాధీనం చేసుకున్నారు. పులి పంజాలో ముందుభాగంలోని కాళ్లకు ఐదేసి చొప్పున 10 గోర్లు, వెనుక భాగంలో నాలుగు చొప్పున 8 గోర్లు ఉంటాయి. అంటే మొత్తం 18 గోర్లు ఉంటాయి. మరి ఏడు గోళ్లు దొరికితే మిగిలిన వాటి సంగతి తేలాల్సి ఉంది. మరోవైపు దాదాపు పది రోజులుగా పులి కళేబరం అక్కడ పడి ఉన్నా గుర్తించలేకపోవ డానికి అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది.

దీంతోపాటు ఈ ఘటనలో ఇంకా ఇతరుల ప్రమేయం, అటవీ సిబ్బంది పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగు తున్నట్టు సమాచారం. మొత్తానికి నల్లమలలో వేటను నిలువరించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, గత ఏడాది నాలుగో దశ పులుల గణనలో నమోదైన 9 పులులు, ఒక కూన ప్రస్తుతం ఆచూకీ లేకుం డా పోయాయంటున్నారు. ఇవి కూడా వేటగాళ్ల బారిన పడ్డాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపాలు కూడా ఈ సందర్భంగా బయటపడ్డాయి. వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు రూ.10 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన అత్యాధునిక థర్మల్ డ్రోన్ వాడకుండా మూలనపడేసినట్లు తేలింది. దీంతో వారానికోసారి కెమెరా ట్రాప్ నివేదికలు తప్పనిసరి చేస్తూ, కొత్తగా 25 బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. సిబ్బంది తప్పనిసరిగా స్థానికంగా నివసించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో మరణించిన పులి (టి-66ఎఫ్) పైనా కమిటి విచారణ చేపట్టింది. అయితే ఈ మరణం వెనుక వేటగాళ్ల హస్తం లేదని విచారణలో తేలింది. ఆకలికి తట్టుకోలేక ఆహారం కోసం ముళ్లపందిని వేటాడేం దుకు ప్రయత్నించిన ఆ ఆడపులికి ముళ్లు గుచ్చుకుని తీవ్రంగా గాయపడింది. ఆ గాయాలతోనే క్రమేపీ శక్తి కోల్పోయి, కృశించిపోయి ప్రాణాలు వదిలింది. పులి శరీర భాగాలన్నీ భద్రంగానే లభించడంతో ఇది సహజ మరణమేనని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణం మాత్రం మరింత లోతైన సమస్యను ఎత్తిచూపు తోంది.. అదే ఆహార కొరత!

తూర్పు కనుమల్లో భాగం నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్‌లోని  మార్కాపురం, నంద్యాల, పల్నాడు జిల్లాలతో పాటు  తెలంగాణలోని నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో 5,725 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులోని కొండలనే నల్లమల కొండలు అంటారు. ఈ నల్లమల కొండల సరాసరి ఎత్తు 520 మీ. వీటిలో 923 మీ. ఎత్తుతో బైరానీ కొండ, 903 మీటర్ల ఎత్తుతో గుండ్ల బ్రహ్మేశ్వరం కొండ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ కొండలు, లోయలోన్లి దట్టమైన అడవుల్లో పులులు సమృద్దిగా ఉండటం వలన ఈ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది మన దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణా కేంద్రం. ఒక్కడ 89 పులులు ఉన్నట్లు లెక్కించారు.

ఆకలికి అసలు కారణం

నిపుణుల ప్రకారం నల్లమల అభయారణ్యంలో పులులు, చిరుతలకు యాభై రోజులకు ఒక్కసారి కూడా తగినంత వేట లభించడం లేదు. దీంతో అవి తరచూ అటవీ సరిహద్దు గ్రామాల్లోకి వచ్చి పశువులు, ఇతర సాధు జంతువులను వేటాడాల్సి వస్తోంది. ఇది మనిషి-వన్యప్రాణి సంఘర్షణకు, ప్రమాదాలకు, పులులు వేటగాళ్ల కంట పడేందుకు దారితీస్తోంది. వాస్తవానికి గతంలో వన్యప్రాణుల సంతతిని పెంచేందుకు పచ్చర్ల, తెట్టగుండం, పెద్దపెంట వంటి ప్రాంతాల్లో ప్రత్యేక ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. బయటి నుంచి తెచ్చిన జింకలు, దుప్పులను వీటిలో ఉంచి, స్థానిక వాతావరణానికి అలవాటు చేశాక అడవిలోకి వదిలేవారు. కొన్నాళ్లు ఈ ప్రక్రియ సజావుగా సాగినా తర్వాత అధికారుల నిర్లక్ష్యంతో అది మూలపడింది. నల్లమలలో పచ్చిక మైదానాలు తక్కువగా ఉండటం, ముదురు గడ్డి, పొదలే ఎక్కువగా ఉండటంతో అవి జింకలు, దుప్పులకు ఆహారంగా పనికిరావడం లేదు. దుప్పులు, జింకలు ఎక్కువగా లేత పచ్చికను మాత్రమే మేతగా తీసుకుంటాయి. దాంతో అవి నల్లమల నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. దీనితో పులులు ఆకలితీర్చుకోవడానికి సమీప గ్రామాల్లోకి రావడం వేటగాళ్ల ఉచ్చులో పడిపోవడం జరుగుతోంది.

పరిష్కారం వైపు అడుగులు

ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం పులుల ఆహార సమతుల్యతను పునరుద్ధరిం చేందుకు కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. అదే అడవి దున్నల పెంపకం. నల్లమలలో ముదురు గడ్డి, పొదలే ఎక్కువగా ఉన్నాయి. అడవి దున్నలయితే ముదురు గడ్డిపొదలను బాగా తింటాయి. ఆ తర్వాత అక్కడ లేత గడ్డి కూడా వస్తుంది అది దుప్పులు, జింకలకు ఆహారంగా మారుతుంది. దాంతో అవి నల్లమల నుంచి బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పులులతోపాటు ఇతర మాంసాహార జంతువులకు ఆహారం దొరుకు తుందని అటవీ అధికారుల ఆలోచన. బ్రిటిష్ కాలంలో నల్లమలలో అడవి దున్నల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత వాటికి జబ్బులు రావడం, సరైన ఆవాసాలు లేకపోవడంతో క్రమేపీ వాటి సంఖ్య తగ్గింది. అందువల్ల మధ్యప్రదేశ్ నుంచి 50 అడవి దున్నలను తీసుకువచ్చి గిద్దలూరు నల్లమలలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వరం చుట్టూ నలభై కిలోమీటర్ల పరిధిలో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని అడవిదున్నలను మూడు విడతలుగా నల్ల మలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. శాకాహార జంతువుల సంఖ్య పెరిగితే పులులు అడవి దాటి బయటికి రావాల్సిన అవసరం తగ్గి, సహజ సిద్ధమైన వేట అందుబాటులోకి వస్తుందన్నది ఈ లక్ష్యం వెనుక ఉన్న ఆలోచన. నల్లమల పులుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. యాంటీ పోచింగ్ క్యాంపుల సంఖ్యను 89 నుంచి 150కి పెంచడం, డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లు, ఎం-స్ట్రైప్స్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించడం, ‘హనుమాన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం ఇందులో భాగం. జన్యుపరమైన వైవిధ్యాన్ని పెంపొందిం చేందుకు మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి రెండు, మధ్యప్రదేశ్ నుంచి మరో రెండు ఆడపులులను తరలించేందుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

ముందున్న సవాలు

నల్లమల టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని గణాంకాలు గర్వంగా చెబుతున్నప్పటికీ, ఆ సంఖ్యను కాపాడుకోవడంలో ఎదురవుతున్న సవాళ్లు అంతే తీవ్రంగా ఉన్నాయి. అడవిదున్నల తరలింపు వంటి చర్యలు దీర్ఘకాలిక పరిష్కారానికి ఒక ముందడుగే అయినప్పటికీ… క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, అవినీతిని అరికట్టడం, కేటాయించిన నిధులు సద్వినియోగం కావడం లాంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని ఆధునిక పరికరాలు తెచ్చినా, ఎంత భారీ బడ్జెట్ కేటాయించినా వాటిని సద్వినియోగం చేసేది మనుషులే. చివరకు నల్లమల అడవుల్లో పులి గాండ్రింపు నిరంతరాయంగా మార్మోగాలంటే… ప్రతి పులి కడుపునిండా తిండి తినే హక్కుకు ప్రభుత్వం, ప్రజలు హామీ ఇవ్వాల్సిందే.

– తురగా నాగభూషణం

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.