పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ద్విముఖ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు బలోచ్ తిరుగుబాటుదారులు (బీఎలఏ, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి ఉగ్రవాద సంస్థల హింసాత్మక దాడులతో దేశభద్రత క్షీణిస్తుండగా, మరోవైపు ప్రధాని షెహబాజ్ షరీఫ్, దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి (హోం మంత్రి) మొహసిన్ నఖ్వీ మధ్య రాజకీయ విభేదాలు ప్రభుత్వాన్ని బలహీనపరుస్తు న్నాయి. ఈ రాజకీయ సంక్షోభంలో హోంమంత్రికి పాక్ శక్తిమంతమైన ఆర్మీ పూర్తి మద్దతు ఇస్తుండటం గమనార్హం.
బలూచిస్తాన్‌లో హింస అత్యంత తీవ్ర రూపం దాల్చింది, అక్కడ పాకిస్తాన్ సైన్యానికి, స్థానిక వేర్పాటువాద గ్రూపులకు (ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ-బీఎల్ ఏ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ – బీఎల్ ఎఫ్) మధ్య గెరిల్లా యుద్ధం జరుగుతోంది. జూలై, ఆగస్టు 2026 నాటి తాజా కథనాల ప్రకారం, వేర్పాటువాద గ్రూపులు కేవలం ఒకే నెలలో 48కి పైగా వ్యూహాత్మక దాడులు చేసి, దాదాపు 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినట్లు ప్రకటించాయి. క్వెట్టా, గ్వాదర్, జియారత్ వంటి ప్రాంతాల్లో పెరుగుతున్న హింసను అణచివేయడానికి పాకిస్తాన్ సైన్యం ‘ఆపరేషన్ షాబాన’ వంటి భారీ వైమానిక, భూతల సైనిక చర్యలను చేపట్టింది. ఈ ఆపరేషన్లలో వందలాదిమంది బలూచ్ తిరుగుబాటు దారులను చంపినట్లు ఆర్మీ ప్రకటించగా, సాధారణ పౌరులు కూడా పెద్ద సంఖ్యలో బలవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా పాకిస్తాన్‌కు ఇస్తున్న వాణిజ్య ప్రాధాన్యత హోదాను రద్దు చేస్తామని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది, ఇది పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతోంది.
గణనీయంగా పెరిగిన బలూచ్‌ల పోరాట సామర్థ్యం
బలూచ్ తిరుగుబాటుదారుల పోరాట సామర్థ్యాలు, వ్యూహాలు, సాంకేతికత గత కొన్ని సంవత్సరాలుగా అనూహ్యంగా పెరిగాయి. ఒకప్పుడు కేవలం పాత రైఫిళ్లతో చిన్నపాటి దాడులు చేసిన వీరు, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీని వణికించే ఒక అత్యాధునిక గెరిల్లా సైన్యంగా రూపాంతరం చెందారు. గతంలో కేవలం కొండల్లో, ఎడారుల్లో మాత్రమే దాక్కున్న తిరుగుబాటుదారులు, ఇప్పుడు క్వెట్టా, గ్వాదర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నారు. 2024లో ప్రారంభ మైన “ఆపరేషన్ హిరూఫ” ద్వారా వారు ఒకే రాత్రి, ఒకే సమయంలో బలూచిస్తాన్‌వ్యాప్తంగా 12కంటే ఎక్కువ ప్రాంతాలలో సైనిక పోస్టులు, హైవేలపై దాడులు చేసి సైన్యాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. డ్రోన్ల ద్వారా సైనిక కదలికలపై నిఘా ఉంచడం, కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోను, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించడంలో నిపుణులయ్యారు. దీనితో పాక్ ఇంటెలిజెన్స్ వీరి ప్రణాళికలను కనిపెట్ట లేకపోతోంది. విద్యావంతులు దీనిలో చేరడంతో ఇంటర్నెట్, అంతర్జాతీయ మీడియాను వాడుకుంటూ తమ డిజిటల్ ప్రచారాన్ని బలంగా నడుపుతున్నారు. బీఎలఏ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆత్మాహుతి దళంలో మహిళలు కూడా భారీగా చేరుతున్నారు. బలూచ్ తిరుగుబాటుదారులు తమ పరిధిని పెంచుకోవడానికి ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని టిటిపితో, సింధ్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద గ్రూపులతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల వీరికి ఆయుధాలు, నిధులు, శిక్షణ అందుతున్నాయి. గల్ఫ్ దేశాలలో, యూరప్‌లో నివసిస్తున్న బలూచీల నుండి వీరికి క్రిప్టోకరెన్సీ, హవాలామార్గాల ద్వారా భారీగా నిధులు అందుతు న్నాయి. బలూచ్ తిరుగు బాటుదారులు తమ సామర్థ్యాలను పెంచుకోవడంతో, పాక్Ž సైన్యం ఎన్ని ఆపరేషన్లు చేసినా వారిని అణచివేయలేకపోతోంది.
పారగమ్య సరిహద్దులు
బలూచిస్తాన్ సరిహద్దులు అత్యంత బలహీ నంగా, పారగమ్యంగా ఉండటంవల్ల పాకిస్తాన్ ఆర్మీకి ఈ ప్రాంతంపై నియంత్రణ సాధించడం అసాధ్యంగా మారింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో ఉన్న సరిహద్దులే బలూచిస్తాన్ తిరుగుబాటుకు ప్రధాన ఊపిరిగా నిలుస్తున్నాయి. ఈ సరిహద్దుల గుండా వారు బలూచిస్తాన్‌లోకి వచ్చి పాక్ సైన్యంపై లేదా చైనా ప్రాజెక్టులపై దారుణంగా దాడులు చేసి వెంటనే, తిరిగి సులభంగా ఇరాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ భూభాగాల్లోకి పారిపోతున్నారు. పాక్ ఆర్మీ సరిహద్దులు దాటి వారిని వెంటాడలేదు. ఆఫ్ఘనిస్తా న్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత, అక్కడ అమెరికా సైన్యం వదిలివెళ్లిన అత్యాధునిక పరికరాలు సులభంగా దాటగలిగే ఈ సరిహద్దుల ద్వారానే చాలా సులువుగా బలూచ్ తిరుగుబాటు దారుల చేతికి చేరుతున్నాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి బిలియన్ డాలర్ల విలువైన డ్రగ్స్, ఇంధనం బలూచిస్తాన్ సరిహద్దుల ద్వారా పాక్‌లోకి అక్రమంగా చేరతాయి. ఈ అక్రమవ్యాపారం ద్వారా వచ్చే నల్లధనమే తిరుగుబాటు గ్రూపులకు ప్రధాన ఆర్థిక వనరుగా మారుతోంది. సరిహద్దుకు ఇరువైపులా నివసిస్తున్న బెలూచీలకు ఒకే రకమైన సంస్కృతి, రక్తసం బంధాలు ఉంటాయి. దీనివల్ల సరిహద్దు దాటి వచ్చే తిరుగుబాటుదారులకు ఆశ్రయం, రక్షణ కల్పించడం జరుగుతోంది. దీనిని అడ్డుకోవడం సైన్యానికి సవాలుగా మారింది. ఏ సైన్యమైనా విజయం సాధించాలంటే స్థానిక ప్రజల మద్దతు, సమాచారం ముఖ్యం. బలూచిస్తాన్‌లో పాక్ సైన్యానికి స్థానికుల మద్దతు అస్సలులేదు. దీనికి విరుద్ధంగా, సామాన్య ప్రజలే సైన్యం కదలికల గురించిన ముందస్తు సమాచారాన్ని తిరుగుబాటుదారులకు అందిస్తు న్నారు. సైన్యం చేసే అరాచకాల వల్ల, బాధితుల కుటుంబాలకు చెందిన యువకులు సైన్యంపై పగతో తిరుగుబాటు గ్రూపుýలో చేరుతున్నారు. బీఎలఏకు చెందిన ‘మజీద్ బ్రిగేడ’లో చదువుకున్న యువతులు కూడా ఆత్మాహుతి దాడులకు సిద్ధపడుతున్నారు. ఈ సరికొత్త మానసిక యుద్ధవ్యూహాన్ని ఎదుర్కోవడం పాక్ ఆర్మీకి అసాధ్యంగా మారింది. తిరుగుబాటు దారులు ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉండటంతో, సైన్యం ఎప్పుడూ రక్షణాత్మక ధోరణిలోనే ఉండాల్సి వస్తోంది. ఇది వారి మనో స్థయిర్యాన్ని దెబ్బతీస్తోంది. బలూచిస్తాన్‌లో తిరుగు బాటును అణచివేయడానికి చైనా ప్రాజెక్టుల రక్షణకు పాకిస్తాన్ సైన్యానికి చెందిన మూడు విభాగాలు, పారా మిలిటరీ బలగాలు అక్కడ భారీ ఎత్తున మోహరిం చాయి.
చైనా ప్రాజెక్టులపై దాడులు
గ్వాదర్ పోర్టు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌కు గుండెకాయ వంటిది. చైనా పాకిస్తాన్‌లో పెట్టిన 65 బిలియన్ల డాలర్ల సీపెక్ పెట్టుబడులను పూర్తిగా నిర్వీర్యం చేయడమే బలూచ్ తిరుగుబాటు దారుల ప్రధాన వ్యూహాత్మక లక్ష్యంగా మారింది. చైనాను ఓడించడంకంటే, ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్వహణ వ్యయాన్ని భారీగా పెంచడం ద్వారా చైనా ఇక్కడి నుండి వెళ్లిపోయేలా చేయడమే తిరుగుబాటు దారుల వ్యూహం. ఈ నిరంతర దాడుల కారణంగా పాకిస్తాన్‌లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) సగానికి పైగా పడిపోయాయి. చైనా ప్రభుత్వం తమ పౌరుల రక్షణ కోసం సొంత చైనీస్ సెక్యూరిటీ బలగాలను బలూచిస్తాన్‌లోకి పంపేందుకు పాకిస్తాన్‌పై ఒత్తిడి తెస్తోంది.
కేపీకేలో భీకర ఘర్షణలు
ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీకే) ప్రావిన్స్‌లో పాకిస్తాన్ భద్రతా బలగాలకు, తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ), దాని అనుబంధ గ్రూపులకు మధ్య ఘర్షణలు భీకర దశకు చేరుకున్నాయి. టీటీపీకి ఆశ్రయం ఇవ్వద్దని పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘన్ తాలిబన్లను ఎంత వేడుకున్నా వారు పట్టించుకోవడంలేదు. కేపీకే ప్రావిన్స్‌లో నిరంతరం టీటీపీ చేతిలో బలవుతున్న స్థానిక పోలీసులు, తమకు ఆర్మీ నుండి సరైన రక్షణ, ఆయుధాలు అందడంలేదని సైన్యానికి వ్యతిరేకంగా ఏకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం గమనార్హం. ‘పఖ్తూన్ తహఫుజ్ మూవ్‌మెంట్ (పీటీఎం) వంటి సంస్థలు పాక్ సైనిక చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనితో పాక్Ž ఆర్మీ ప్రస్తుతం చరిత్రలోనే అతిపెద్ద భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
అధికార పోరాటం
పాకిస్తాన్‌లో ప్రస్తుతం నడుస్తున్న అధికార పోరాటం అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన దశకు చేరుకుంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల (హోం) మంత్రి మోహ్సిన్ నఖ్వీల మధ్య తీవ్రమైన విభేదాలు బహిరంగమయ్యాయి. ఈ అంతర్గత పోరాటం పాకిస్తాన్ పౌర ప్రభుత్వ ఉనికినే ప్రమాదంలో పడేసి, దేశంలో సరికొత్త రాజకీయ ప్రకంపనలకు కారణమ వుతోంది. మోహ్సిన్ నఖ్వీ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ, “పాకిస్తాన్ ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పాత వ్యవస్థతో దేశ సమస్యలను పరిష్క రించడం అసాధ్యమని ప్రకటించారు. నఖ్వీ మరో బాంబు పేలుస్తూ, పాక్ చరిత్రలోనే అత్యంత భారీ అవినీతి కుంభకోణాన్ని తాము కనిపెట్టామని చెప్పారు. నఖ్వీ ఎవరి పేర్లనూ అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఆయన టార్గెట్ ప్రస్తుత పాలకులైన పీఎంఎల్-ఎన్ , వారి మిత్రపక్షాలేననేది నిష్టుర సత్యం. మోహ్సిన్ నఖ్వీకి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పూర్తి మద్దతు ఉంది. మీడియా మొఘల్ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నఖ్వీ, ఆర్మీ అండతో పాకిస్తాన్ తదుపరి ప్రధాన మంత్రి కావాలని ఆశిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నఖ్వీ వ్యాఖ్యలపై షెహబాజ్ షరీఫ్ నమ్మకస్తుడైన రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ అధికార నిర్మాణంలో పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య చీలికలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ఇద్దరి మధ్య ఘర్షణ నిరూపిస్తోంది. హోంమంత్రి నఖ్వీ వెనుక సైన్యం ఉండటంతో, ప్రధాని షరీఫ్ ఆయనను పదవి నుండి తొలగించలేక, ఆయన చేస్తున్న ఆరోపణలను భరించలేక తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు.
ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం
పాకిస్తాన్ అధికార వర్గాల్లో నడుస్తున్న ఈ ఘర్షణలు దేశంలో ప్రభుత్వం ఏ క్షణంలోనైనా పడిపోయే ప్రమాదాన్ని, తీవ్రమైన రాజకీయ మార్పులను సూచిస్తున్నాయి. హోం మంత్రి మోహ్సిన్ నఖ్వీ ద్వారా సైన్యం ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగంగా ఎండగడుతోంది కాబట్టి, షెహబాజ్ షరీఫ్‌ను మార్చడానికి ఆర్మీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసిందని అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పీపీపీ, ఇతర చిన్న పార్టీలు ఎప్పుడూ సైన్యంవైపే ఉంటాయి. సైన్యం నుంచి సిగ్నల్ రాగానే, వారు షెహబాజ్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహ రించుకుని, దాన్ని పడగొట్టే అవకాశం ఉంది. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం పడిపోతే, సైన్యం మద్దతుతో మేధావులు, ఆర్థిక నిపుణులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లతో కూడిన ‘టెక్నోక్రాట్ ప్రభుత్వం’ ఏర్పాటుకావచ్చు. ఒకవేళ ప్రస్తుత పార్లమెంట్‌ను రద్దు చేయకుండా కేవలం ప్రధానమంత్రిని మాత్రమే మార్చాలని సైన్యం భావిస్తే, షెహబాజ్ షరీఫ్ స్థానంలో ఆర్మీ చీఫ్‌కు అత్యంత నమ్మకస్థుడైన మోహ్సిన్ నఖ్వీని కొత్త ప్రధానమంత్రిగా కూర్చోబెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తీవ్ర ఒత్తిడి నడుమ అసెంబ్లీని రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లవచ్చు. అయితే, ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నంత కాలం, అతని పార్టీని (పీటీఐ) పూర్తిగా తొక్కేయడానికి సైన్యం ప్రయత్ని స్తున్నంత కాలం, ఈ ఎన్నికలు కేవలం ఒక నాటకం లాగే సాగుతాయి. ప్రభుత్వం స్థిరంగా లేకపోతే ఐఎంఎఫ్ తదుపరి విడత రుణ సహాయాన్ని నిలిపివేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ మరోసారి ప్రత్యక్ష లేదా పరోక్ష సైనిక నియంత్రణలోకి వెళ్లడం దాదాపు ఖాయంగా మారింది. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం పడిపోయి, సైన్యం మద్దతుతో టెక్నోక్రాట్ ప్రభుత్వం ఏర్పడితే, అది ఇమ్రాన్ ఖాన్‌కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే టెక్నోక్రాట్ ప్రభుత్వం దేశంలో ఎన్నికలను సుదీర్ఘ కాలం పాటు వాయిదా వేస్తుంది. ఎన్నికలు జరగనంత కాలం ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రజల్లో ఎంత మద్దతు ఉన్నా ఉపయోగం ఉండదు. అయితే, సైన్యం నేరుగా దేశాన్ని పాలించాలనుకుంటే ప్రజా తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది కనుక, తెరవెనుక ఇమ్రాన్ ఖాన్‌తో రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలను కూడా తోసిపుచ్చలేం!

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్