వాహనాలు బీమా చేసుకోని పక్షంలో భవిష్యత్తులో పెట్రోల్‌ ‌బంకుల్లో అటువంటి వాహనాలకు పెట్రోలు, డీజిల్‌ను విక్రయించడం ఆపేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని సూతప్రాయంగా అంగీకరించింది. ఈ ఆలోచన భద్రత కోసమే తప్ప శిక్షేమీ కాదు. వాహనాలు తప్పని సరిగా బీమా చేయించుకోవాలన్నదే  ఈ సూచన వెనుక ఉద్దేశం. ప్రస్తుతానికి ఇది అమలయ్యే అవకాశం లేదు. వాహనదార్ల మీద దీన్ని బలవంతాన రుద్దే ఉద్దేశం కూడా లేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, వాహనదార్లకు సరైన భద్రత కల్పించడానికి, వాహనాలకు నష్టం కలగకుండా ఉండడానికి ఇటువంటి చర్య ఒకటి అవసరమని, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

తమ వద్దకు వచ్చే వాహనదార్లకు ఇంధనాన్ని అమ్మే ముందు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌విక్రేతలు ఈ వాహనదార్లకు ఇంధనాన్ని విక్రయించవచ్చా, లేదా అన్న విషయాన్ని బీమా సంస్థ వద్ద నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పక్రియలను ఉపయోగించి వాహనాల నంబర్లను స్కానింగ్‌ ‌చేయడం ద్వారా బీమా చేసిందీ లేనిదీ నిర్ధారించుకోవడానికి  అవకాశం ఉంటుంది. ‘వాహన్‌’ ‌వ్యవస్థ ద్వారా బీమా రికార్డులను పరిశీలిస్తే బీమా విషయం నిర్ధారణ అవుతుంది. బీమా సంస్థల రికార్డుల ప్రకారం వాహనానికి బీమా లేని పక్షంలో పెట్రోలు బంకులు వాహనాలకు పెట్రోల్‌ ‌సరఫరాను నిరాకరించడానికి అవకాశం ఉంటుంది. వాహన దారు తమ కార్లకు, ద్విచక్ర వాహనాలకు బీమా చేసుకోనంతవరకూ ఏ పెట్రోల్‌ ‌బంకులోనూ అతనికి ఇంధనం విక్రయించే అవకాశం ఉండదు.

ఏదైనా వాహనం పెట్రోల్‌ ‌బంకులోకి ప్రవే శించగానే ఆ వాహనానికి సంబంధించిన నంబర్‌ ‌ప్లేటును ఫోటో తీయడం లేదా స్కానింగ్‌ ‌చేయడం జరుగుతుంది. దాన్ని ‘వాహన్‌’ ‌యాప్‌లో అప్‌లోడ్‌ ‌చేసిన మరుక్షణం ఆ వాహనానికి బీమా చేయించిందీ లేనిదీ నిర్ధారణ అయిపోతుంది. ఇదంతా జరగడానికి కొద్ది సెకన్ల కాలం మాత్రమే పడుతుంది. ఈ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయవ్యవస్థ బీమా నియంత్రణ సంస్థలకు, రవాణా విభాగాలకు ఈ సూచనను పంపించి, ఇందుకు అవసరమైన పక్రియను రూపొందించవలసిందిగా ఆదేశించింది. దీనిపై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంలోని రవాణా మంత్రిత్వశాఖను కూడా ఆదేశించింది. బీమా సంస్థల అధికారులు, రవాణా విభాగాల నిపుణులు, ప్రభుత్వ అధినేతలు అతి త్వరలో ఈ పక్రియను, విధానాన్ని పరిశీలించి ఒక సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించే అవకాశం ఉంది.

దీని అవసరం ఏమిటి?

ఇటీవల సుప్రీంకోర్టు ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసును విచారిస్తున్నప్పుడు  దేశంలో లక్షలాది వాహనాలకు బీమా జరగలేదనే విషయం తెలిసింది. వాహనదార్లు తమ వాహనాలకు బీమా చేయించడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్టు, దానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వనట్టు కూడా అర్థమైంది. దేశంలో సుమారు 56 శాతం వాహనాలు బీమా చేయకుండానే  రోడ్ల మీద తిరుగుతున్నాయని  సుప్రీం కోర్టు దృష్టికి వచ్చింది. మరో విధంగా చెప్పాలంటే, దేశంలో మొత్తం 30.46 కోట్ల వాహనాలుండగా, అందులో 16.54 కోట్ల వాహనాలకు బీమా పాలసీ లేదని అర్థమవుతోంది. దేశంలో 2024లో 4.87 లక్షల రోడ్డు  ప్రమాదా లు జరిగాయి. వీటిలో అనేక వాహనాలకు బీమా చేయించనందువల్ల వాహనదార్లు ఇప్పటికీ తమ సొమ్ము కోసం ఎదురు చూడవలసి వస్తోంది. వాహన నష్టంతో పాటు, సొమ్ము నష్టం కూడా భారీస్థాయిలో ఉంటోంది. దేశంలోని అనేక న్యాయస్థానాల్లో ఇటువంటి వివాదాలకు సంబంధించి లక్షలాది కేసులు అపరిష్కృతంగా మగ్గుతున్నాయి. వాహనదారు మరణించడం వల్ల అతని కుటుంబ సభ్యులకు అందుతున్న సొమ్ము అంతంత మాత్రంగా ఉంటోంది.

ఈ ఇంధన నిరాకరణ పథకం ఇంతవరకూ అమలులోకి రాలేదు. ఇందుకు సంబంధించి గడువులు, తేదీలు కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడానికి అవకాశం ఉంది. న్యాయస్థానం కూడా ఈ మేరకు ఒక సూచన చేసింది. సుప్రీంకోర్టు బీమా సంస్థలకు, రవాణా విభాగాలకు, రవాణా మంత్రిత్వ శాఖలకు, కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు పంపిన సూచనలకు వీటి నుంచి సమాధానాలు, స్పందనలు లభించాల్సి ఉంది. ఆగస్టు 14లోపల తమ సమాధానాలను పంపించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆగస్టు 18నుంచి వీటి మీద విచారణ ప్రారంభం అవుతుంది. వాహనదార్లు కూడా తమకు తాముగా తమ వాహనాలకు బీమా చేయించవలసిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘వాహన్‌’‌యాప్‌ను డౌన్‌లోడ్‌ ‌చేసుకుని, దానిద్వారా బీమా చేయించుకోవడం మంచిది. బీమా చేయించుకోవడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా, బీమా చేయించుకోకపోయినా, ఆలస్యంగా చేయించుకున్నా, గడువు ముగిసినా వాహనదార్లు బాగా ఇబ్బందిపడాల్సి ఉంటుంది. నిజానికి సుప్రీంకోర్టే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా విభాగాలు ఇప్పటికే దీనిమీద శ్రద్ధ పెట్టడం జరుగుతోంది. ప్రభుత్వం ప్రయోగాత్మ కంగా ఈ పక్రియను ఏ ప్రాంతంలో చేపట్టబో తోందన్నది  ఇంకా వెల్లడి కాలేదు.

ముందు జాగ్రత్తలు అవసరం

ఈ ఇంధన నిరాకరణ పథకం విషయంలో వాహనదార్లు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే, వాహనదార్లు ఈ విషయంలో ఎటువంటి లోపాలు, లొసుగులు లేకుండా బీమాను పూర్తి చేసుకుని సర్వసన్నద్ధంగా ఉండడం మంచిది. మీరు మీ వాహనానికి చేయించిన బీమా గడువు ముగిసిపోలేదని నిర్ధారించు కోవడం అవసరం. దాని గడువు ముగిసేలోగా బీమా చేయించుకోవడం శ్రేయస్కరం. బీమా కాగితాలను మీ ఫోన్లో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బీమా చేయించుకోని వాహనాలకు ఇంధ నాన్ని విక్రయించకపోవడమన్నది  ప్రస్తుతం అమలు జరగకపోయినా బీమా చేయించు కోవడాన్ని మరింత కఠినం చేస్తూ రవాణా అధికారులు, పోలీసులు నిబంధనలు రూపొందించే అవకాశం ఉంది.

అంతేకాదు, ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కొత్త వాహనాలకు బీమా విధానం ఏ విధంగా ఉండాలన్నది కూడా నిర్ధారించింది. కొత్త ద్విచక్ర వాహనాలకు ఆరేళ్లు, కొత్త కార్లకు నాలుగేళ్లు తప్పనిసరిగా బీమా చేయించాలని ఆదేశించింది. కాగా, 2018లో సుప్రీంకోర్టు రూపొందించిన నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలకు అయిదేళ్లు, కార్లకు వ•డేళ్లు బీమా చేయించడం జరిగేది. న్యాయవ•ర్తులు సంజయ్‌ ‌కారోల్‌, అగస్తీన్‌ ‌జార్జ్ ‌మాసీలతో కూడిన ధర్మాసనం దేశంలో వాహన ప్రమాదాలు పెరగడం పట్ల, 56 శాతం వాహనాలకు బీమా లేకపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాము బీమా విషయంలో నిబంధనలు రూపొందించి ఎనిమిదేళ్లు కావస్తున్నప్పటికీ, అత్యధిక శాతం వాహనాలకు బీమా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాహనాల భద్రత కోసం తాము ఈ బీమా గడువు కాలాన్ని ఒక సంవత్సరం పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. వాహనదార్లకు సకాలంలో పరిహారం లభించడంతోపాటు, న్యాయస్థానాల చుట్టూ తిరగడాన్ని కూడా తగ్గించాలని తాము భావిస్తున్నట్టు తెలియజేసింది.

జి.రాజశుక
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor