హైదరాబాద్‌లో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు షరా మామూలుగా మారాయి. ఒకటి, రెండు కావు.. తరచూ ఎక్కడో ఓచోట అలాంటి దుర్ఘటనలు హిందువుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఇలాంటి పరిణామాలకు అడ్డుకట్ట పడటం లేదు. మొన్నటికి మొన్న దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో పూజారి పూజ చేస్తుండగా, భక్తుల సమక్షంలోనే, ఒక వ్యక్తి గర్భాలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి చేశాడు. తర్వాత తాపీగా బయటకు నడచి వెళ్లడం సీసీ కెమెరాల్లో నమోదైంది.
రాష్ట రాజధాని హైదరాబాద్‌లోనూ, శివారు ప్రాంతాల్లోని దేవాలయాలపై కొన్నేళ్లుగా ఇలాంటి ఉద్దేశ్యపూర్వక దాడులు జరుగుతున్నాయి. ఇవి కేవలం సంఘటనలుగా కాకుండా, పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్టుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దిల్‌సుక్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అక్టోబర్ 2వ తేదీన పూజారి పూజ చేస్తుండగా ఒక వ్యక్తి చెట్టు కొమ్మలతో లోపలికి వచ్చి అమ్మవారి విగ్రహంపై దాడి చేశాడు. ఆ తర్వాత ఏమీ పట్టనట్టు తాపీగా బయటకు నడిచి వెళ్లిపోయాడు. అక్కడున్న భక్తులు తొలుత నిశ్చేష్టులైనా.. తర్వాత తేరుకొని దుండగుడిని పట్టి పోలీసులకు అప్పగించారు. నిందితుడి పేరు మహమ్మద్ అన్సారీ అని, ఎఫఐఆర్ నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు తెలిపారు. అయితే, అతను మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు.
ఇదే మొదటిసారి కాదు…
ఇలా మత విశ్వాసాలను దెబ్బతీసే ఉన్న సంఘటనలు ఇటీవలి కాలంలోనే అనేకం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టే ప్రయత్నం అక్టోబర్ 14,2024 తేదీన చోటుచేసుకుంది. ముంబైకి చెందిన సల్మాన్ సలీమ్ ఠాకూర్ (30) గుడి తాళం పగలగొట్టి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఆ దాడివల్ల రేగిన ఉద్రిక్తతలు చల్లారకముందే శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలోని హనుమాన్ ఆలయం ప్రాంగణంలోని నవగ్రహ విగ్రహాలు సహా మరికొన్నిటిని (నవంబర్ 5, 2024) ధ్వంసం చేశారు. ఆ సంఘటనకు సంబంధిచి మతిస్థిమితం లేని 50 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు కాని, ఆ అనుమానితుడి గుర్తింపును వెల్లడించలేదన్న విమర్శలు వచ్చాయి.
బీఆరఎస్ పార్టీ అధికారంలో ఉన్న 2022లో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ సమీపంలోని చింతల్ బస్తీ రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ఇద్దరు మహిళలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.అది గమనించిన స్థానికులు వారిని అడ్డుకోబోగా, ఆ మహిళలు వారిపై ఎదురు దాడికి దిగారు. ఆ తర్వాత స్థానికులు వారిని పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అయితే, నిందితులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు చెప్పారు.
హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూలక్ష్మి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం నాటి (ఆగస్టు 26,2024) అర్ధరాత్రి సమయంలో మరో దుశ్చర్య చోటు చేసుకుంది. ఆ సంఘటనలో అమ్మవారి విగ్రహం ధ్వంసమైంది. దుండగులు భూలక్ష్మిమాత, నల్ల పోచమ్మ విగ్రహాలను ధ్వంసం చేశారు. అమ్మవారి కిరీటాన్ని కింద పడేశారు. పూజా సామాగ్రిని చెల్లా చెదురు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, జునైద్ అనే ప్రధాన నిందితుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అతని కుటుంబసభ్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. కాగా, పోలీస్ స్టేషన్‌కు కేవలం 50 గజాల దూరంలో ఉన్న ఆలయంలో గతంలో ఐదుసార్లు దాడులు జరిగాయని స్థానికులు చెప్పారు. ప్రణాళిక ప్రకారమే ఈ దాడులు జరుగుతున్నాయనే సందేహాలను వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం జుకల్ గ్రామంలోని సోమయ్య, చౌడమ్మ, పోచమ్మ ఆలయాలపై కొందరు దుండగులు నవంబర్ 9,2024 న దాడికి తెగబడి మూడు విగ్రహాలను ధ్వంసం చేశాడు. అర్ధరాత్రి ఆలయంలో శబ్దాలు రావడాన్ని గమనించిన స్థానికులు ఒక నిందితుడిని పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన సలీం అర్మాన్ గా గుర్తించారు. షాద్‌నగర్ పరిధిలోని జానంపేట గ్రామంలో ఉన్న అతి పురాతన బసవన్న ఆలయంలోని శివలింగాన్ని నవంబర్ 22, 2024న తేదీన గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
హైదరాబాద్ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్‌గూడ శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ ఆలయంలో అత్యంత అపవిత్ర చర్య వెలుగు చూసింది. జనవరి 10,2026 తేదీ రాత్రి ఒక వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి, అమ్మవారి విగ్రహం సమీపంలో అసభ్యకర, అపవిత్రమైన పనులకు పాల్పడ్డాడు. నిందితుడిని కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లాలోని హుగేరి గ్రామానికి చెందిన 26 ఏళ్ల అల్తాఫ్‌గా పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 200 ఏళ్ల నాటి చారిత్రక శ్రీ ద్విముఖి ఆంజనేయ స్వామి ఆలయంపై దుండగులు దాడికి తెగబడ్దారు. హనుమంతుడి ప్రధాన విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కేవలం డబ్బు సంపాదించడం కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.
విగ్రహాలను ధ్వంసం చేయడం, అపవిత్ర చర్యలకు పాల్పడటం హిందువులకు తీవ్ర వేదన కలిగిస్తోంది. కొన్ని ఆలయాలు పోలీస్ స్టేషన్లకు అతి సమీపంలోనే ఉన్నా, పదేపదే దాడులకు గురయ్యా యని స్థానికులు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి ఘటన తర్వాత ఉద్రిక్తత, రాస్తారోకోలు, నిరసనలు, అరెస్టులు, రాజకీయ ఆరోపణలు జరుగుతున్నాయి. కొద్ది రోజులకు వాతావరణం చల్లబడుతుంది. కానీ మళ్లీ ఇంకోచోట కొంతకాలానికి అలాంటి సంఘటనే పునరావృత మవుతోంది.
ఈ వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైన అంశం నిందితుల మానసిక స్థితి. చాలా కేసుల్లో పోలీసులు, లేదా నిందితుల కుటుంబసభ్యులు ‘మతిస్థిమితం సరిగా లేదు’ అని చెబుతున్నారు. ఇది కొన్నిసార్లు వాస్తవం కావచ్చు. మానసిక అనారోగ్యంతో బాధపడేవారిని నేరస్థులుగా కాక, చికిత్స అవసరమైనవారిగా చూడాలనేది చట్టం. మానవతా దృక్పథం చెప్పే మాట కూడా. కానీ, ‘ఈ వాదనను వైద్య నివేదికలతో ధ్రువీకరించి, పారదర్శకంగా ప్రజల ముందుంచుతున్నారా? లేక ప్రాథమిక దశలోనే దర్యాప్తును ఆ దిశగా మళ్లిస్తు న్నారా?’ అని హిందూ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేసు తీవ్రతను తగ్గించి, లోతైన దర్యాప్తును నీరుగారుస్తున్నారని, వీటి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేయడం లేదని ఆరోపిస్తున్నాయి. కొన్ని ఘటనలు ఉద్దేశపూర్వక దాడులుగా, కొన్ని మానసిక సమస్యల ఫలితంగా, మరికొన్ని కేవలం దొంగతనం కోసం జరిగినవిగా పోలీసులు చెబుతున్నారు. నేపథ్యం ఏదైనా, విశ్వాసాలకు విఘాతం కలిగినప్పుడు చాలాచోట్ల సమగ్ర దర్యాప్తు జరగడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాడులకు అడ్డుకట్ట పడదా?
ప్రధానంగా తాజాగా జరిగిన సంతోషిమాత ఆలయంపై దాడిని ‘మత చాందసవాదుల అనాగరిక చర్య’గా భారతీయ జనతాపార్టీ అభివర్ణించింది. రాజధాని సహా రాష్ట్రంలోని దేవాలయాలపై ఈ వరుస దాడుల వెనుక కుట్ర, ఒకే ప్యాటర్న్ కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆరోపించారు. ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితులకు మతిస్థిమితం లేదంటూ పోలీసులు కేసులను పక్కదారి పట్టించడాన్ని సహించబోమని హెచ్చరించారు. అసలు కుట్రదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బుజ్జగింపు రాజకీయాల వల్లే సంఘవిద్రోహ శక్తులు బరితెగిస్తున్నాయని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 15కు పైగా ఆలయ ధ్వంసం ఘటనలు జరిగాయని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని దేవాలయాలపై, హిందువుల మనోభావాలపై దాడులు పెరిగాయని, బుజ్జగింపు రాజకీయాలు సర్వసాధారణమయ్యాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దేవాలయాల పరిరక్షణ, శాంతిభద్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సంతోషిమాత ఆలయంపై దాడి అత్యంత దారుణమైనదన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, తక్షణ దర్యాప్తు, కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలసి కోరారు.
స్పందించేది కొందరే…
ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు,భారతీయ జనతాపార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇతర హిందూ సంఘాలే బహిరంగంగా స్పందిస్తూ, నిరసనలు చేపడుతున్నాయి, ఘటనా స్థలాలను సందర్శిస్తున్నాయి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సహా ఇతర రాజకీయపక్షాల స్పందన అంతంతమాత్రంగానే ఉందని, ఓటు బ్యాంకు రాజకీయాల భయంతో కఠిన చర్యలకు వెనకాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి దేవాలయాలపై దాడులకు కారణాలు ఏవైనా, ప్రజల విశ్వాసాలు గాయపడుతున్నాయన్నది కాదనలేని వాస్తవం. ఈ అలజడిని చల్లార్చాలంటే ప్రభుత్వం మాటల్లో కాకుండా చర్యల్లో నిబద్ధత చూపాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పోలీసులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నేతలు రాజకీయాలకతీతంగా స్పందించాలని, లేకపోతే ఇలాంటి ప్రతి సంఘటనా మరో వివాదానికి, మరింత అపనమ్మకానికి దారితీస్తూనే ఉంటుందన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068