కృత్రిమ మేధ(ఏఐ) నైతిక విలువలు నేర్పదని, అది కేవలం గురువుతోనే సాధ్యమని, గురు పరంపరను గౌరవించుకోవడం మనదేశం అనాదిగా ఆచరిస్తున్న సత్‌ ‌సంప్రదాయమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ‌సహ సర్‌కార్యవాహ సీఆర్‌ ‌ముకుంద అన్నారు. అక్టోబర్‌ 3‌న హైదరాబాద్‌లో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్‌ ‌మహాసంఘ్‌(ఏబీఆర్‌ఎస్‌ఎం), ‌శైక్షిక్‌ ‌ఫౌండేషన్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన 11వ శిక్షాభూషణ్‌ ‌పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. యూనివర్శిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌(‌యూజీసీ) మాజీ ఛైర్మన్‌ ‌ప్రొ. ఎం.జగదీశ్‌ ‌కుమార్‌, ఐఐఎం, ‌బెంగళూరు విశ్రాంత ప్రొఫెసర్‌, ‌డీన్‌ ‌బి.మహదేవన్‌, ‌విజ్జాన విహార విద్యా సంస్థలు, గుడిలోవ, వైజాగ్‌ ‌మాజీ ప్రిన్సిపల్‌ ‌డి.రామకృష్ణారావు లకు శిక్షాభూషణ్‌ ‌పురస్కారాన్ని శీశీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామీ అందించారు. ఈ సందర్భంగా ముకుంద ప్రసంగిస్తూ అనాదిగా భారతీయ విద్యావ్యవస్థ వేళ్లూనుకున్న గురు పరంపరను మనం గౌరవిస్తున్నాం. ఆ క్రమంలోనే ముగ్గురు గురువులను నేడు పురస్కారాలతో సన్మా నించుకున్నాం అని అన్నారు.  ‘ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా ఈ గురుపరంపర మన దేశంలో యుగయుగాలుగా కొనసాగుతూ వస్తున్నది. సంఘ కార్యకర్తలుగా మేము దేశమంతటా పర్యటిస్తుం టాం. ఇప్పటికీ అనేక చోట్ల గురువులు పొందుతున్న మన్నన, మర్యాదలను ప్రత్యక్షంగా చూస్తుంటాం. నేను చెప్పినట్టుగా అది యుగయుగాలుగా కొనసాగు తున్న సంప్రదాయం’ అని తెలిపారు. ఇతర రంగాల తరహాలోనే విద్యావ్యవస్థపైన కూడా ఏఐ తన ప్రభావాన్ని చూపుతున్నది. విద్యార్థులు మొబైల్‌ ‌ఫోన్‌ ‌ద్వారా చాట్‌ ‌జీపీటీ లాంటి ఏఐ ఆధారిత సాంకేతికతతో సమస్త సమాచారాన్ని పొందు తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్తమానంలో గురు పరంపర తన ప్రాధాన్యతను నిలబెట్టుకుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే ఇలా అందివచ్చిన సమాచారం, నైపుణ్యంతో విద్యార్థి జీవనోపాధిని పొందవచ్చు కానీ నైతిక విలువలను సంపాదించు కోలేరు. ఇక్కడే గురువు ప్రాముఖ్యత తెలిసివస్తుంది.  విలువలతో కూడిన విద్యను ఏఐ లాంటి సాంకేతికత, మొబైల్‌ ‌ఫోన్‌ ‌తదితర అధునాతన పరికరాలు అందించలేవు. ఆ పనిని ఒక్క గురువు మాత్రమే చేయగలరు అని తెలిపారు. ఏఐతో గణితంలో క్లిష్టమైన సమస్యలకు సమాధానాలు పొందవచ్చు. కోడింగ్‌ ‌చేయవచ్చు. అల్గారిథమ్స్‌కు రూపకల్పన చేయవచ్చు అని అన్నారు. అదే సమయంలో విద్య అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి లేదా ఒక యంత్రం నుంచి మరొక యంత్రానికి సమాచారాన్ని బదలాయించడం కాదు అనే విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. అది అంతకన్నా అధికమైనది అని చెప్పారు. విద్యా బోధనను ఉన్నత స్థానంలో నిలబెట్టడంలో గురువు కీలకమైన పాత్ర పోషిస్తారు. విద్య, నైపుణ్యాలు, నైతిక విలువలను నేర్చుకోవడంలో విద్యార్థిని గురువు జాగృతపరుస్తారు. జీవిత పరమార్థాన్ని ఎరుకపరుస్తారు. ఇది సమాచారాన్ని, నైపుణ్యాలను సాంకేతికత నుంచి అందిపుచ్చు కోవడంతో వచ్చే జ్ఞానం కాదని తెలిపారు. అధునాతన సాంకేతికత ఆలంబనగా, ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా వడివడిగా ముందుకు సాగుతున్న మానవాళికి నైతిక విలువల ఆవశ్యకతను స్పష్టం చేశారు. వెల్లువెత్తుతున్న సాంకేతికతల ప్రవాహాన్ని ఆపడం ఎవరికి సాధ్యం కాదని, ఇలాంటి సమయంలోనే విద్యార్థుల అంతర్‌ ‌ప్రపంచంలోకి అడుగుపెట్టడం ద్వారా వారిలో నైతిక విలువలను పాదుగొల్పాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

లక్షణమైన శిష్యులు లేరు

అనాదిగా లక్షణమైన శిష్యులు దొరకడం దుర్లభంగా ఉండేదని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ ‌స్వామీజీ అన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గురువుగా ఉండటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గురు స్థానంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరు నమస్కరి స్తారు. సన్మానిస్తారు. పురస్కారాలు అందజేస్తారు.  అందుకనే గురువుగా ఉండాలనే ఆశ అందరిలోనూ ఉంటుంది. అస్త్ర, శస్త్రాలను ప్రయోగించడంలో శ్రీరామచంద్రుడికి గురువుగా విశ్వామిత్ర మహర్షి నిలిచారు. అంతటా గౌరవ, మర్యాదలను అందుకున్నారు. ఆంజనేయస్వామిని కూడా గురువుగా పరిగణించాలి. శ్రీరాముడు, సీతామాతకు మధ్య వారధిగా మారుతి నిలిచారు. సీతామాత యోగక్షేమాల సమాచారాన్ని శ్రీరాముడికి అందించారు. ఇంతటి ఉపకారం చేసిన నిన్ను ఆలింగనం చేసుకోవడం ద్వారా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని ఆంజనేయుడితో రాముడు అన్నారు. హనుమాన్‌ను గురువుగా భావించారు. తదుపరి అవతారంలో గురువుగా జన్మించాలని శ్రీరామచంద్రుడు ఆకాంక్షించారు. భక్తితో పాటుగా ఆనందాన్ని కలిగించే శ్రీమద్‌ ‌రామాయణాన్ని అందరికీ చేరవేయడంలో ముఖ్యమైన భూమికను మారుతి పోషించారు. శ్రీరామచంద్రుడు ఆకాంక్షించినట్టుగానే తదుపరి అవతారంలో శ్రీకృష్ణుడుగా జన్మించారు. ‘‘కృష్ణం వందే జగద్గురుం’’ అని అనిపించుకున్నారు.అలా గురువు కావాలనే ఆశ అందరిలోనూ ఉంటుంది. కానీ అలా అనుకునేవారి మాట వినే శిష్యులు కావాలి కదా? గతంలో గురుకులాల్లో గురువుగారి ముందు శిష్యులు కూర్చునేవారు కాదు. గురువు కూర్చుని ఉంటే శిష్యులు నిలబడి ఉండేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. శిష్యులు కూర్చుని ఉంటే గురువు నిలబడి పాఠాలు చెబుతున్నారు. ఇది మీ అందరికి(సభలో ఉపాధ్యాయులను ఉద్దేశించి) అనుభవంలోకి వచ్చిన విషయమే. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు ఇదే పరిస్థితి. మనదేశంలో ఇప్పటికీ గురువుల పట్ల కాస్తో కూస్తో గౌరవ,మర్యాదలు ఉన్నాయి. అదే విదేశాల్లో అయితే తరగతి గదిలో గురువు పాఠాలు చెబుతుంటే విద్యార్థులు వారికి తోచిన భంగిమల్లో, గురువు పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా కూర్చొని కనిపిస్తారు. అయినప్పటికీ అదే వాతావరణంలో గురువు పాఠాలు చెప్పాలి. అలాంటి వారిని గురువు సరిచేసే పరిస్థితి విదేశాల్లో ఏ మాత్రమూ లేదు. లక్షణమైన శిష్యుడు దొరకడం చాలా కష్టమైపోయింది. జగద్గురువుగా అవతరించిన శ్రీకృష్ణ భగవానుడ్ని మాకు ఉపదేశం చేయండి అని ఒక్కరు కూడా అడగలేదు. చెరసాలలో జన్మించినప్పుడు తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు అడగలేదు. గోకులంలోని వారు బాలకృష్ణుని లీలలకు పరమానందభరితలయ్యారే తప్ప ఉపదేశం చేయమని ఆయన్ను అడిగిందిలేదు. ఉజ్జయినిలో సాందీపని గురువు కూడా ఆ పని చేయలేదు అని స్వామీజీ అన్నారు.

భారతమాత సేవలో 15 లక్షల మంది గురువులు

ఏబీఆర్‌ఎస్‌ఎం ‌ప్రస్థానాన్ని సంస్థ అధ్యక్షుడు ప్రొ. నారాయణ్‌లాల్‌ ‌గుప్తా వివరించారు. దేశవ్యాప్తంగా 15 లక్షల 8 వేల మంది ఉపాధ్యాయులు ఏబీఆర్‌ఎస్‌ఎం‌లో సభ్యులుగా ఉన్నారు. అలాగని ఇదేదో ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితమైన సంస్థ కాదు. ఇది జాతి హితానికి ఉద్దేశించిన ఒక పవిత్రమైన సంకల్పం నుంచి ఉద్భవించింది.  దేశానికి స్వరాజ్యం సిద్ధించిన తర్వాత అనేక ఉపాధ్యాయ సంఘాలు ఏర్పడ్డాయి. అయితే అవి దురదృష్టవశాత్తూ పాశ్చాత్య భావనలు స్ఫూర్తిగా ఆవిర్భవించాయి. ఎక్కడైతే ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాల తరహాలో వ్యవహరిస్తుంటాయో అలాంటి చోట ఉపాధ్యాయుల పాత్ర కార్మికులు, ఉద్యోగుల పాత్రకు పరిమితమైపోతుంది. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించే అనేక మంది ఉపాధ్యాయలను ఆవేదనకు గురిచేసింది. ఎందుకంటే అనాదిగా భారతీయ సమా జానికి మార్గదర్శకులుగా గురువులు ఒక ఉన్నతమైన స్థానంలో సముచితమైన గౌరవాన్ని పొందుతున్నారు. సమాజానికి నేతృత్వం వహిస్తున్నారు. అలాంటి వారిని కార్మికులు, ఉద్యోగులుగా చూడటం భారతీయ గురు పరంపరకు తగినది కాదు. విద్యా వ్యవస్థలో గురువులకు గౌరవం, విద్యాబోధనలో భారతీయత, దేశ హితం లక్ష్యంగా 1988లో ఏబీఆర్‌ఎస్‌ఎం ఆవిర్భవించింది. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు దేశవ్యాప్తంగా విద్యారంగంలో ప్రత్యేకించి విద్యాబోధనలో విశేష కృషి చేస్తున్న లక్షలాది ఉపాధ్యాయులు ఏబీఆర్‌ఎస్‌ఎం‌లో సభ్యులుగా ఉన్నారు. భారతమాతకు జై నినాదంతో ముందుకు సాగుతున్నారు అని నారాయణ్‌లాల్‌ ‌గుప్తా తెలిపారు.

ఉపాధ్యాయులకు పురస్కార గ్రహీతల సందేశం

పురస్కార గ్రహీతలలో ఒకరైన యూనివర్శిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌(‌యూజీసీ) మాజీ ఛైర్మన్‌ ‌ప్రొ.ఎం.జగదీశ్‌కుమార్‌ ‌మాట్లాడుతూ ఇటీవల ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానాలు ఇచ్చాను. వారు మానవాళిపై కృత్రిమ మేధ(ఏఐ) ఆధిపత్యం, దేశానికి సేవ చేసే దిశగా ఉండవలసిన నైపుణ్యాలు, ప్రశాంతమైన జీవనానికి కావలసిన విలువలు లాంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఇవి నవతరం ఆలోచనాధోరణికి అద్దం పడుతున్నాయి. విద్యార్థుల ఆలోచనా పక్రియను రూపుదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది. అభివృద్ధి చెందిన భారత్‌కు మూల స్థంభాలుగా యువతీయువకులు నిలుస్తారు అని తెలిపారు. భారతీయ సమాజానికి ఉపాధ్యా యులు పునాది. ప్రతి ఒక్కరికి గోత్రం ఉంటుంది. గోత్రం అనేది మన గురువును సూచిస్తుంది. మాత, పిత, గురువు అనే వారు ముగ్గురు గురువులుగా సమ సమాజనిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. విద్యార్థులకు జీవన విలువల బోధించడం ద్వారా నిజమైన గురువులుగా  ఉపాధ్యాయులు కృషి చేయాలి అని ఐఐఎం, బెంగళూరు విశ్రాంత ప్రొఫెసర్‌, ‌డీన్‌ ‌బి.మహదేవన్‌ ‌పిలుపునిచ్చారు. విజ్జాన విహార విద్యా సంస్థలు, గుడిలోవ, వైజాగ్‌ ‌మాజీ ప్రిన్సిపల్‌ ‌డి. రామకృష్ణారావు ప్రసంగిస్తూ ఉపాధ్యాయ సమాజానికి ప్రతినిధిగా ఈ పురస్కారాన్ని అందుకున్నాను. ఇటీవల ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌చాంబర్స్ ఆఫ్‌ ‌కామర్స్ అం‌డ్‌ ఇం‌డస్ట్రీ(ఫిక్కి) నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యాను. ఆ కార్యక్రమానికి ఇంగ్లండ్‌ ‌నుంచి ఒక ఉపాధ్యాయుడు హాజరయ్యారు. మన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) గురించి గొప్పగా మాట్లాడారు. ఎన్‌ఈపీ ద్వారా యావత్‌ ‌ప్రపంచానికి మానవీయ విలువలను బోధించే ఒక నవ్యతతో కూడుకున్న భారతీయ విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని అన్నారు.

ప్రసంగం అనంతరం వేదిక మీద నుంచి ఆయన నేరుగా నా దగ్గరకు వచ్చారు. అయితే విధానం అమలులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. అమలు సక్రమంగా జరిగిన పక్షంలో ఆశించిన ఫలితాలను అందుకోవచ్చు అని తెలిపారు. ప్రభుత్వ విధానాన్ని కార్యాచరణకు తీసుకురావడంలో తరగతి నుంచే పాటుపడే మొదటివరుస యోధులుగా ఉపాధ్యాయులు నిలుస్తారు. మన దేశంలో 1.3 కోట్ల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల విద్యలో 95 లక్షల మంది, ప్రీ ప్రైమరీ విద్యలో 14.5 లక్షల మంది, ఉన్నత విద్యలో 18 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 1.3 కోట్ల మంది ఉపాధ్యాయులే కనుక ఎన్‌ఈపీని కార్యాచరణకు తీసుకురావడంలో కంకణబద్ధులైన పక్షంలో వచ్చే మూడు లేదా నాలుగు సంవత్సరాలో ఆశించిన ఫలితాలను మనం కనులారా చూడవచ్చు అని అన్నారు.

 ఏబీఆర్‌ఎస్‌ఎం ‌జాతీయ సంస్థాగత కార్యదర్శి మహేంద్ర కపూర్‌, ఏబీఆర్‌ఎస్‌ఎం ‌జాతీయ కార్యదర్శి ప్రొ. గీతా భట్‌, ఏబీఆర్‌ఎస్‌ఎం ‌తెలంగాణ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ అధ్యక్షుడు డా. భాస్కర్‌, ఏబీఆర్‌ఎస్‌ఎం ‌తెలంగాణ కన్వీనర్‌ ‌డా. ఏలూరి యాదయ్య, ఏబీఆర్‌ఎస్‌ఎం ‌తెలంగాణ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ ‌ప్రధాన కార్యదర్శి డా.జగన్‌, ‌తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్‌) ‌రాష్ట్ర అధ్యక్షుడు వి.రాజశేఖర్‌, ‌తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.