తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్`సికింద్రాబాద్ జంటనగరాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. జై మహంకాళి నినాదాలతో లష్కర్ వీధులు మార్మోగగా, భక్తి పారవశ్యంలో మునిగిన నగరం మొత్తం బోనమెత్తింది. ఆగస్టు 2వ తేదీ ఆదివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు రంగం, అంబారీ ఊరేగింపుతో మరునాడు ఘనంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో నగరం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. అయితే, వేడుకల మధ్యలో జోగినిల ఆందోళన కాసేపు ఉద్రిక్తతలకు కారణమైంది.
బోనాలు మొదలైన రోజు తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు వేపాకులు, పసుపు, కుంకుమ, బెల్లం, ప్రత్యేక పాత్రలో వండిన అన్నంతో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ తెచ్చి అమ్మవారికి సమర్పించారు. విద్యుత్ దీపాలంకరణలు, తాత్కాలిక దుకాణాలు, పూల స్టాళ్లు, పిల్లల వినోద కార్యక్రమాలతో లష్కర్ కళకళలాడింది. ఊరేగింపు వాహనాలను ప్రత్యేకంగా అలంకరించారు. లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేయగా, ఆ అంచనాలను మించి జనం తరలివచ్చారు.
భక్తుల సౌకర్యార్థం సాధారణ దర్శనానికి మూడు, బోనాలు సమర్పించే మహిళల కోసం రెండు, వీఐపీల కోసం మరో ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు కేటాయించగా, సుమారు 1500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ ప్రత్యేకంగా 175 బస్సులను నడిపింది.
అమ్మవారికి సీఎం రేవంత్ పూజలు
బోనాలు మొదటి రోజు మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థించారు. అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు అందించారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు సీఎం వెంట ఉన్నారు.
అంతకుముందు తెల్లవారు జామునే హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా బోనం సమర్పించారు. హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద సహా పలువురు ప్రముఖులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ బోనం సమర్పించడం హైలైట్‌గా నిలిచింది. జాతర లాంఛనంగా మొదలు కావడానికి ముందు రోజే రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జోగినిల ఆందోళనతో గందరగోళం
తొలిరోజు మధ్యాహ్నం జోగినీలకు బోనాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం సమయం కేటాయించింది. నిర్ణీత సమయానికే వారు బోనాలతో వచ్చినప్పటికీ పోలీసులు వారిని అడ్డుకున్నారు.ఆ సమయంలో జోగినీల బోనం పడిపోవడంతో జోగినీలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బోనాలు తొలిరోజు వేడుకల్లో తమను అవమానపరిచారంటూ జోగినీలు రంగం జరిగే ముందు ఆలయం ముందు ధర్ణాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై జోగిని శ్యామల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అవసరం వచ్చినప్పుడే ప్రభుత్వం తమను గుర్తు చేసుకుంటుంది. బోనాల సందర్భంగా జోగినీలకు కనీస ఏర్పాట్లు చేయలేదు. ఆలయ సిబ్బంది తమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జోగినీలను అవమానించారు. ఈ విషయంలో ఆలయ కమిటీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఉదయం నుంచే గేట్ల వద్ద పోలీసులు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. జోగినిలని కూడా చూడకుండా పోలీసులు బయటకు నెట్టేశారని ప్రశ్నిస్తూ, తమకు గౌరవం, ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో పోలీసులకు, జోగినీలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, బ్యారికేడ్లు తొలగించుకుని జోగినీలు ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. రంగం కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ జోగినీలను చర్చలకు పిలిచి, దేవదాయ శాఖ ఉన్నతాధి కారులు మాట్లాడి ఆందోళనను విర మించాలని కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది.
రంగం భవిష్యవాణిలో అమ్మవారి ఆగ్రహం
జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం రంగంలో ఆలయ ఆవరణలో పచ్చి మట్టికుండపై నిలిచిన జోగిని మాతంగి స్వర్ణలత..అమ్మవారిని ఆవాహన చేసుకుని భవిష్యవాణి వినిపించారు. ఈసారి తాను సంతోషంగాలేనని, కాకుండా, ఏటా తాను చెప్పే మాటలను ఎవరూ ఆచరించడంలేదని, విగ్రహ ప్రతిష్ఠ చేస్తామన్న మాటను నెîరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరునెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే వాడవాడలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాట ప్రకారం విగ్రహ ప్రతిష్ఠ పూర్తిచేస్తే భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, కొంగు బంగారమవు తుందని అభయమిచ్చారు.
రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వరద ఉధృతిలో ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందని, తద్వారా భారీ ప్రాణనష్టం జరగనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనం వావివరసలు మరచి, అహంకారం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టిన మాతంగి, తాను దోసెడంత ఇస్తే గోరంత కూడా తిరిగి ఇవ్వడం లేదని అన్నారు. ఇక్కడ అమ్మవారి ప్రతిరూపంగా జోగిని పలికే ప్రతి పలుకు నిజమవుతుందని భక్తుల విశ్వాసం.
కోఆప్టెడ్ సభ్యులుగా జోగినీలు
జోగినీలు ప్రత్యేక గుర్తింపు కావాలని కోరారని, భవిష్యత్‌లో వారికి ఎలాంటి ఇబ్బందులు లేñకుండా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. గుర్తింపు కార్డుల ఇచ్చేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. పురపాలక సంఘాల్లో వారిని కో-ఆప్షన్ సభ్యులుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అమ్మవారి ఆశీర్వచనం లభించిందని తెలిపారు..
అరకొర నిధులు:బండి సంజయ్
బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బోనాల తొలిరోజు ఆదివారం అమ్మవారిని దర్శించు కున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రంజాన్ పండుగ నిర్వహణకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాలకు కేవలం రూ.20 కోట్లు మంజూరు చేసిందని తప్పుపట్టారు. రాష్ట్ర జనాభాలో 80 శాతానికి పైగా ఉన్న హిందువులు జరుపుకునే పండుగకు ఇంత తక్కువ నిధులివ్వడం వివక్షకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. జంట నగరాల్లో మూడు వేలకుపైగా ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తుండగా, ఈ నిధులు ఏమాత్రం సరిపోవని విమర్శించారు.గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే భక్తులకు కనీస తాగునీటి సదుపాయం కూడా లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం ఆలయ దర్శనాలు చేయడమే కాకుండా భక్తుల సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచించారు. గత బీఆరఎస్ ప్రభుత్వం కూడా బోనాల ఉత్సవాలకు తగిన నిధులు కేటాయించలేదని గుర్తుచేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సహా అన్ని హిందూ పండుగలకు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా ఏర్పాట్లు
జాతర సందర్భంగా ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో ఆగస్టు 4వ తేదీ ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. పొగాకు బజార్, సుభాష్ రోడ్, జనరల్ బజార్ నుంచి మహం కాళి ఆలయానికి వెళ్లే మార్గాలను మూసి వేయగా, కర్బాలా క్రాస్‌రోడ్స్ వద్ద వాహనాలను రాణిగంజ్ వైపు మళ్లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రాణిగంజ్ క్రాస్‌రోడ్స్ నుంచి మినిస్టర్ రోడ్డు, గోపాలపురం లైన్ మీదుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. భక్తుల వాహనాల కోసం 14 ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రెండోరోజు ఉదయం రంగం ద్వారా భవిష్యవాణి వినిపించిన అనంతరం.. సాయంత్రం ఏనుగు అంబారీపై అమ్మవారి చిత్రపటంతో భారీ ఊరేగింపు, పలహార బండ్ల ఊరేగింపులతో లష్కర్ బోనాల జాతర వైభవంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. మాతంగి హెచ్చరికలు, జోగినిల ఆందోళన, రాజకీయ విమర్శల మధ్య ఈసారి బోనాలు ప్రత్యేక చర్చను లేవనెత్తాయి. వచ్చే ఏడాది మరింత ఘనంగా ఈ వేడుకలు జరగాలని, సంప్రదాయాలకు తగిన గౌరవం లభించాలని, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.
– సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068