ఉక్రెయిన్, రష్యా, ఇరాన్ దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్త స్థాయికి చేరుకోవడం తాజా పరిణామం! పశ్చిమాసియా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒకదానితో ఒకటి ముడిపడి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ మూడు దేశాల మధ్య నడుస్తున్న తాజా రాజకీయ, సైనిక పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి. జూలై 25న కాస్పియన్ సముద్రంలో ఇరాన్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడిచేసింది. రష్యా, ఇరాన్‌ల మధ్య సైనిక సామగ్రిని, డ్రోన్ల విడిభాగాలను రవాణా చేస్తున్న మార్గాలను లక్ష్యంగా చేసుకునే తాము ఈ దాడి చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్‌కు చెందిన ఓడరేవుపై చిన్న స్థాయి బాలిస్టిక్ క్షిపణితో దాడి చేయాలని ఇరాన్ భావించింది. అయితే తీవ్ర దౌత్య చర్చల తర్వాత ప్రస్తుతానికి ఆ పరిస్థితి సర్దుమణిగింది.

రష్యా ఉక్రెయిన్‌పై వాడుతున్న ‘షాహిద్ రకం డ్రోన్లను ఇరాన్ లైసెన్స్‌తోనే రష్యా భారీగా ఉత్పత్తి చేస్తోంది. వీటికి ప్రతిగా రష్యా ఇరాన్‌కు ఎలక్ట్రానిక్ ఆయుధ సాంకేతికతను అందిస్తోంది. అమెరికా అభ్యర్థన మేరకు ఇరాన్ డ్రోన్ దాడులను తిప్పికొట్టడంలో సహాయం చేయడానికి ఉక్రెయిన్ తన సైనిక నిపుణులను ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలకు పంపింది. రష్యా డ్రోన్లను ఎదుర్కోవ డంలో తమకున్న నాలుగేళ్ల అనుభవాన్ని ఉక్రెయిన్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకు, అమెరికా బలగాలకు అందిస్తోంది. మొత్తంగా, ఇరాన్ రష్యాకు అనుకూలంగా పనిచేస్తుండగా, ఉక్రెయిన్ అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి మద్దతుగా నిలుస్తూ ఇరాన్ సరఫరా మార్గాలను దెబ్బతీస్తోంది.

ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం

ఉక్రెయిన్, రష్యా, ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, ఇది ఒకే ఒక ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి పరిణామాల వల్ల యుద్ధం నల్లసముద్రం నుండి కాస్పియన్ సముద్రం వరకు విస్తరిస్తోంది. రష్యా పరోక్షంగా అమెరికాపై దాడులకు ఇరాన్‌కు తోడ్పడు తుంటే, ఉక్రెయిన్ అమెరికాకు సాయపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అమెరికా-ఇరాన్ సంక్షోభం విడివిడిగా కాకుండా ఒకే పెద్ద అంతర్జాతీయ యుద్ధంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ లేదా రష్యా నేరుగా ఏదైనా నాటో దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే, పశ్చిమ దేశాలన్నీ నేరుగా యుద్ధంలోకి రాక తప్పదు. ఈ ఉద్రిక్తతల క్రమంలో అమెరికా, యూరప్, జపాన్‌లతో పాటు భారత్ వంటి దేశాలలో తీవ్ర ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వచ్చే ముప్పు ఉంది.

అమెరికా, చైనాల పాత్ర కీలకం

ఉక్రెయిన్, రష్యా, ఇరాన్ సంక్షోభంలో అమెరికా, చైనాలపాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ రెండు దేశాలు భిన్నమైన వ్యూహాలతో ఈ అంతర్జాతీయ రాజకీయాలను నడిపిస్తున్నాయి. అమెరికా ఒకే సమయంలో అటు ఉక్రెయిన్‌కు, ఇటు ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధాలు, నిఘా సమాచారాన్ని అందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే తీవ్ర సైనిక చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే, మరోవైపు యుద్ధం మరింత విస్తరించకుండా తెరవెనుక దౌత్య చర్చలు జరుపుతున్నారు. ఇక చైనా ఈ సంక్షోభంలో నేరుగా సైనిక జోక్యం చేసు కోకుండా, రష్యా-ఇరాన్ కూటమికి ఆర్థిక, దౌత్య పరమైన కొండంత అండగా నిలుస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు రష్యా, ఇరాన్ లపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ, చైనా ఆ దేశాల నుండి భారీగా ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ వారి ఆర్థిక వ్యవస్థలు పతనం కాకుండా కాపాడు తోంది. ఐక్యరాజ్య సమితిలో రష్యా, ఇరాన్‌లకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు తెచ్చే తీర్మానాలను చైనా అడ్డుకుంటోంది. తద్వారా, ఈ ప్రాంతంలో అమెరికా ప్రభావాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తోంది.

భారత్ – గల్ఫ్ దేశాల ప్రత్యామ్నాయ ప్రణాళికలు

హార్మూజ్ జలసంధి సంక్షోభం నేపథ్యంలో, భారతదేశం, గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ భారీ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు గల్ఫ్ దేశాలు కొత్త పైప్‌లైన్లు, పోర్టులను నిర్మిస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈలు తమ ముడి చమురును హార్మూజ్ గుండా కాకుండా భూమార్గంలో పైప్‌లైన్ల ద్వారా నేరుగా అరేబియా సముద్ర తీరానికి చేర్చేలా కొత్త మాస్టర్ ప్లాన్‌ను వేగవంతం చేశాయి. భారత్ తన ముడిచమురు అవసరాలలో 80% పైగా దిగు మతులపైనే ఆధారపడుతుంది. హార్మూజ్ జలసంధి మూతపడినా గల్ఫ్ దేశాల బైపాస్ మార్గాల వల్ల భారత్‌కు చమురు కొరత రాకుండా రక్షణ లభిస్తుంది. యుద్ధ వాతావరణంఉన్న మార్గాలలో నౌకల ప్రయాణ బీమాఖర్చు విపరీతంగా పెరుగుతున్నది. భారత్ వంటి అతిపెద్ద కొనుగోలుదారుకు నిరంతరం సరఫరాచేయడం గల్ఫ్‌దేశాల ఆర్థికవ్యవస్థకు అత్యంత కీలకం. అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను బ్లాక్ మెయిల్ చేసే ఇరాన్ భౌగోళిక వ్యూహాలకు ఈ కొత్త మార్గాలు అడ్డుకట్టవేస్తాయి. గతంలో ప్రకటించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ) ప్రస్తుత యుద్ధం కారణంగా నెమ్మదించినప్పటికీ, ఇప్పుడు దీనిని రక్షణ కవచంగా మారుస్తున్నారు. ఇందులో రెండు మార్గాలున్నాయి, భారతదేశాన్ని గల్ఫ్ దేశాలతో కలిపే తూర్పు కారిడార్, రెండవది గల్ఫ్‌ను ఐరోపాతో కలిపే ఉత్తర కారిడార్. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఉత్తర కారిడార్ (జోర్డాన్, ఇజ్రాయెల్ మార్గం) కొంత నెమ్మదించింది. దీనివల్ల భారత్, యూఏఈ, సౌదీ అరేబియాలు ప్రస్తుతానికి తూర్పు కారిడార్‌ను పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాయి. దీనికి సంబంధించిన నిర్వహణ ఒప్పందాలు జరి గాయి. ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ మార్గాల్లో హూతీల దాడులవల్ల సముద్ర గర్భంలో ఉండే ఇంటర్నెట్ డేటా కేబుల్స్ దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఐఎంఈసీ ఇప్పుడు ప్రపంచ డేటా రక్షణకు ఒక ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈమార్గం ద్వారా భారతదేశం నుండి గల్ఫ్ దేశాల మీదుగా ఐరోపాకు అత్యంత వేగవంతమైన ఫైబర్-ఆప్టిక్ డిజిటల్ కేబుల్స్ వేస్తున్నారు. గల్ఫ్ దేశాలలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్తును క్లీనఎనర్జీ పైప్‌లైన్లు, గ్రిడ్లద్వారా భారత్‌ను, ఐరోపాను అనుసంధానించేలా మౌలిక వసతులను రూపొం దిస్తున్నారు. భారత ఓడరేవుల నుండి యూఏఈ పోర్టులకు, అక్కడి నుండి సౌదీ అరేబియా మీదుగా రైలు మార్గాల ద్వారా సరుకు రవాణా చేసేలా మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది కేవలం చమురుకే కాకుండా మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యానికి కొత్త రూపునిస్తుంది.సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించి, రైల్ నెట్‌వర్క్ ద్వారా సరుకులను ఓడరేవులకు చేర్చడంవల్ల రవాణా సమయం 40%, ఖర్చు 30% వరకు తగ్గుతుందని అంచనా. మొత్తంగా, ఐఎంఈసీ కారిడార్ అనేది కేవలం చైనా ‘బెల్ట్ అండ్ రోడ్స్ (బీఆరఐ) ప్రాజెక్టుకు పోటీ మాత్రమే కాకుండా, మారుతున్న అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులలో ప్రపంచ సరఫరా గొలుసును కాపాడే ఒక లైఫ్ లైన్‌గా రూపాంతరం చెందుతోంది.

అమెరికా వ్యూహాత్మక పాత్ర

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌లో అమెరికా పాత్ర అత్యంత వ్యూహాత్మక మైనది. ఈ ప్రాజెక్టును కేవలం ఒక రవాణా మార్గంగా కాకుండా, చైనా ప్రాభవాన్ని తగ్గించడానికి, ఇరాన్ ఉద్రిక్తతల నడుమ తన జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అమెరికా ఒక ప్రధాన ఆయుధంగా వాడుకుంటోంది. నియమ నిబంధ నలతో కూడిన అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్స హించడానికి ఈ కారిడార్‌ను గట్టిగా సమర్థిస్తోంది. అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి దీనిని అమెరికా ఒక వారధిగా వాడు కుంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత దేశాన్ని ఒక తయారీ, సేవల హబ్‌గా మార్చడం ద్వారా చైనాపై ప్రపంచ దేశాలు ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా వ్యూహం. ఈ కారిడార్ వెంబడి వేసే డిజిటల్ నెట్‌వర్క్‌లలో చైనా హ్యాకింగ్ టెక్నాలజీ లేకుండా, అత్యంత సురక్షిత మైన సాంకేతిక సహాయం అమెరికా అందిస్తోంది. అయితే యుద్ధం వల్ల ప్రాజెక్ట్ కొంత నెమ్మదించింది.

రష్యా, చైనాల సొంత వాణిజ్యమార్గాలు

అమెరికా-భారత్ నేతృత్వంలోని ఐఎంఈసీ కారిడార్‌కు పోటీగా చైనా, రష్యాలు తమ సొంత అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యంపై తమ పట్టును పెంచుకోవడానికి ఈ రెండు దేశాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. చైనా-రష్యా దేశాలు ముందుకు తెస్తున్న ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలీవిధంగా వున్నాయి.

రష్యా-ఇరాన్-భారత్ మార్గం: ఇది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నుండి ఇరాన్ మీదుగా భారతదేశంలోని ముంబై ఓడరేవును కలిపే 7,200 కిలోమీటర్ల పొడవైన నౌక, రైలు, రహదారి మార్గం. తన ముడిచమురును ఈ మార్గం ద్వారానే రష్యా ఎగుమతులు చేస్తోంది.

చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ ఐ): చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బిలియన్ డాలర్ల ‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (బీఆరఐ)లో భాగమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గుండా వెళుతుంది. చైనా ఈ మార్గం ద్వారా పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ను తన దేశంతో అనుసంధానించి, అవసరమైతే నేరుగా ఇక్కడి నుండి భూమార్గం ద్వారా చమురు రవాణా చేసుకోగలదు.

రష్యా నార్తర్న్ సీ రూట్ (ఎనఎసఆర్): గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ మహాసముద్రంలోని మంచు కరుగుతుండటంతో రష్యా ఈ కొత్త సముద్ర మార్గాన్ని తెరిచింది. ఇది ఆసియా, ఐరోపాలను రష్యా ఉత్తర తీరం గుండా కలుపుతుంది. దీని అభివృద్ధికై చైనా రష్యాకు భారీగా నిధులు సమకూరు స్తోంది. నాటో జోక్యం చేసుకోలేని, రష్యా పూర్తి అధీనంలో ఉన్న దీనిని “సిల్క్ రోడ్ ఆన్ ఐస” అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం రెండు పెద్ద వాణిజ్య కూటములుగా విడిపోతోంది. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏ కూటమి శాసిస్తుందనేది ఈ మార్గాల విజయంపైనే ఆధారపడి ఉంటుంది.

వాణిజ్య మార్గాలపై బహుముఖ యుద్ధాల ప్రభావం

ఈ బహుముఖ యుద్ధాలు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై తీవ్రమైన ప్రభావం చూపుతూ, ఈ వాణిజ్య కారిడార్లను దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్నాయి. ఐఎంఈసీ ప్లాన్ ప్రకారం గల్ఫ్ దేశాల నుండి సరుకులు రైలు మార్గంలో జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్టుకు చేరాలి. అక్కడి నుండి సముద్ర మార్గంలో యూరప్‌కు వెళ్లాలి. యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల ప్రైవేట్ కంపెనీలు ఈ ప్రాంతంలో మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి. దీనివల్ల ఐరోపా వైపు వెళ్లే మార్గం తీవ్రంగా ఆలస్యమవు తోంది. రష్యా-ఇరాన్-భారత్‌లను కలిపే ఐఎనఎస్ టీసీ మార్గానికి కాస్పియన్ సముద్రం అత్యంత కీలకం. అయితే ఇటీవలి ఉద్రిక్తతల వల్ల ఈ సురక్షిత మార్గం కూడా ఇప్పుడు యుద్ధరంగంగా మారింది. ఇది భారత్-రష్యా వాణిజ్యవేగాన్ని తగ్గిస్తోంది. చైనా తన బీఆరఐ మార్గాలను ఇరాన్, ఇరాక్, సిరియా మీదుగా ఐరోపాకు అనుసంధానించాలని చూసింది.

హౌతీలు వాణిజ్య నౌకలపై చేస్తున్న క్షిపణి దాడుల వల్ల ప్రపంచ నౌకలన్నీ సూయజ్ కెనాల్‌ను వదిలేసి, ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని వెళ్తున్నాయి. ఈ సంక్షోభమే భారత్, గల్ఫ్ దేశాలు హోర్ముజ్, ఎర్ర సముద్రాలకు దూరంగా కొత్త ప్రత్యామ్నాయ మార్గాలను వేగంగా పూర్తి చేయాలనే పట్టుదలను పెంచింది. ప్రస్తుత యుద్ధాలు ఈ వాణిజ్య మార్గాలను తాత్కాలికంగా దెబ్బతీసినప్పటికీ, దీర్ఘకాలంలో వీటి ప్రాధాన్యతను మరింత పెంచాయి.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.