‌ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు ఆశలు పెట్టుకోవడం సాధారణం. అది కూడా ప్రభుత్వ పెన్షనర్ల కోసం రూపొందించిన పథకానికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. కానీ, అలాంటి పథకం కోసం కనీసం మార్గదర్శకాలు కూడా రూపొందించకుండా, విమర్శల నుంచి తప్పించుకునేందుకు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే సీన్‌ ‌రివర్స్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్యపథకం కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పింఛన్‌దారుల ఆరోగ్య పథకం ప్రకటించకముందు నుంచే వారి ఆదాయం నుంచి కోత పెట్టడం ప్రారంభించిన ప్రభుత్వం, ఆ తర్వాత కొద్ది నెలలకు అట్టహాసంగా పథకాన్ని ప్రకటించింది. కానీ, ఆ పథకం అమలులో విఫల మవుతోందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తు న్నాయి. కొత్త పథకం పేరుతో ప్రభుత్వం క్యూఆర్‌ ‌కోడ్‌తో కూడిన డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డులను అంద జేస్తోంది. అయితే.. అవి నిజంగా ఆరోగ్య భరోసా ఇస్తున్నాయా? అనే సందేహాలు చుట్టుముడు తున్నాయి. కేవలం డిజిటల్‌ ‌కార్డుల పంపిణీతోనే ప్రభుత్వం సరిపెట్టుకుందన్న విమర్శలు వ్యక్తమవు తున్నాయి.

ముందు కోతలు… తర్వాత కార్డులు

కొత్త హెల్త్ ‌స్కీమ్‌ అధికారికంగా ప్రకటించక ముందే ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల నుంచి ప్రీమియం వసూలు చేయడంపై విమర్శలు వచ్చాయి. రెండు నెలల పాటు ప్రీమియం వసూలు తర్వాత వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ పథకాన్ని హడావిడిగా ప్రారంభించింది. ప్రీమియం మొత్తం వసూలులో చూపిన వేగం, పథకం అమలులో మాత్రం కనిపించలేదు. చివరకు జూలైలో కార్డులు జారీ చేసినా, అవి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం కొత్త వివాదానికి దారి తీసింది. డబ్బులు ముందే తీసుకున్న ప్రభుత్వం వైద్యసేవలు అందించడాన్ని ఎలా మరచిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకత, విమర్శలతో ఎట్టకేలకు ప్రభుత్వం ఆరోగ్య కార్డుల ఆధునికీకరణలో భాగంగా క్యూఆర్‌ ‌కోడ్‌ ‌రూపొందిం చింది. మొబైల్‌లో డౌన్‌లోడ్‌ ‌చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 943 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 2,594 రకాల వ్యాధులకు నగదురహిత వైద్యం అందుతుందని ప్రకటించింది. జిల్లాల్లో కొత్తగా మరికొన్ని వెల్‌నెస్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. సీజీహెచ్‌ఎస్‌ ‌ధరలు అమలు చేస్తామని ప్రకటించింది. ఇలా కాగితాలు, నివేదికల మీదే సమగ్ర వైద్య భద్రతా వ్యవస్థలా కనిపిస్తోంది… క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు.

కార్డు ఉంది…చికిత్స లేదు

ప్రభుత్వం హెల్త్ ‌కార్డులు అందించిన తర్వాత ఆస్పత్రికి వెళ్లిన ఉద్యోగులకు ఎదురైన అనుభవాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎమర్జెన్సీ కేసుల్లో కూడా కార్డు చెల్లదని కార్పొరేట్‌ ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్‌ ‌స్ట్రోక్‌ ‌గురైన తన తల్లిని ఒక ఉద్యోగి ఆస్పత్రికి వెళ్తే హెల్త్ ‌కార్డు పనిచేయదని, నగదు చెల్లించాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారట. గుండెపోటుతో వెళ్లిన పోలీసు ఉద్యోగికి కూడా అదే సమాధానం ఎదురైందని, మరో ఉద్యోగిని ముందుగా 50 వేల రూపాయల అడ్వాన్స్ ‌చెల్లిస్తేనే చేర్చుకుంటామని ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. బాధిత పెన్షనర్లు కూడా ముందు బిల్లు చెల్లించి.. తర్వాత రీయింబర్స్‌మెంట్‌ ‌చూసుకోవాలని ప్రైవేటు ఆసుపత్రుల వారు ఉచిత సలహాలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ చేతిలోని కార్డులు అవసరానికి పనిచేయకపోతే ఏం చేయాలి? ఆ కార్డుకు విలువ ఎక్కడ? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి.. కార్డులు జారీ చేశామని చెప్పేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. క్యూఆర్‌ ‌కోడ్‌లతో డిజిటల్‌ ‌కార్డులు అందజేసింది. కానీ, కార్పొరేట్‌ ఆస్పత్రుల వాదన వేరేలా ఉంది. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలు రూ.100 కోట్ల దాకా ఉన్నాయని, ప్యాకేజీ రేట్లు సవరించకపోతే కొత్త పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని అవి స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య గురించి ముందే తెలిసి కూడా… బకాయిల సమస్య పరిష్కరించకుండానే ప్రభుత్వం ఎందుకు కార్డులు పంపిణీ చేసిందని, తమ నుంచి ప్రీమియం ఎందుకు వసూలు చేశారని ఉద్యోగులు, పెన్షనర్లు నిలదీస్తున్నారు.

సాధారణంగా ఏ ప్రభుత్వ పథకం ప్రారంభమైనా ముందు జీవో, మార్గదర్శకాలు, అమలు విధానం స్పష్టంగా ఉంటాయి. కానీ, ఇక్కడ పరిస్థితి తారుమా రైంది. విమర్శల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ముందుగా కార్డులు మంజూరు చేశారని, తర్వాత కూడా మార్గదర్శకాలు రావడం చాలా ఆలస్య మైందని అంటున్నారు. ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ఈ అంశంలో స్పష్టంగా కనిపిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ట్రస్ట్ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నప్పటికీ అమలులో స్పష్టత లేకపోవడం దేనికి నిదర్శనమన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

పేరుకే ఉచిత వైద్యం.. ఫీజు చెల్లిస్తేనే ఓపీ…

ఈ పథకంపై మరో పెద్ద విమర్శ… ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, వైద్య పరీక్షలు. గతంలో ఈ ఆరోగ్య పథకం కింద ఉద్యోగులు నేరుగా కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ముందుగా వెల్‌నెస్‌ ‌సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ అవుట్‌ ‌పేషెంట్‌ ‌విభాగంలో ప్రాథమిక పరీక్షలు పూర్తయిన తర్వాత ఆక్కడి వైద్యులు రిఫర్‌ ‌చేస్తేనే కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పథకం కింద కార్డులు పొందిన ఉద్యోగులు గానీ, పెన్షనర్లు గానీ.. నేరుగా ప్రైవేటు లేదా కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళితే అవుట్‌ ‌పేషెంట్‌, ‌స్కానింగ్‌ ‌తదితర పరీక్షలకు కార్డు హోల్డర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆరోగ్య రంగంలో ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత పెరిగింది. క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌, ఎంఆర్‌ఐ, ‌యాంజియోగ్రామ్‌ ‌వంటి పరీక్షలకు వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. కానీ, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్తే.. ఇవి ఉచితంగా లేకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

వెల్‌నెస్‌ ‌సెంటర్లే సిద్ధంగా లేవు

ప్రభుత్వం వెల్‌నెస్‌ ‌సెంటర్లను బలోపేతం చేస్తామని, మరిన్ని వెల్‌నెస్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించగా, ప్రస్తుత కేంద్రాల తీరుపైనే ఎప్పటినుంచో తీవ్ర విమర్శలు ఉన్నాయి. వెల్‌ ‌నెస్‌ ‌సెంటర్లలో వైద్య నిపుణులు లేరని, కేవలం జూనియర్లతో నడిపిస్తున్నారని, సరిపడ పరికరాలు లేవని, అవసరమైన మందులు అందుబాటులో ఉండవని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తప్పనిసరిగా వెల్‌ ‌నెస్‌ ‌సెంటర్లకే వెళ్లాలంటూ కొత్త ఆరోగ్య పథకంలో నిబంధనను చేర్చడం, ఉద్యోగులకు, ముఖ్యంగా పెన్షనర్లకు మరింత ఇబ్బందిగా మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు.. డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డుల జారీ పక్రియలో కూడా అనేక లోపాలు బయటపడ్డాయని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. కొన్ని కార్డుల్లో మరణించిన వారి పేర్లు ఉండటం, పాత చిరునామాలు కనిపించడం, కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడం, కొందరికి కార్డులు డౌన్‌లోడ్‌ ‌కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయని అంటున్నారు. ఈ లోపాలను సరిచేయడానికి వెబ్‌సైట్‌ను తొలి 15 రోజుల్లోనే తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి. ఏర్పడింది. పెరిగిన సాంకేతికత దృష్ట్యా డిజిటల్‌ ‌వ్యవస్థను అందుబాటు లోకి తీసుకొస్తున్నామని, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నామని చెప్పిన ప్రభుత్వం… కనీస డేటా ధ్రువీక•రణ కూడా చేయలేదా? అనే సందేహం కార్డుల్లో పొరపాట్లు చూశాక సహజంగానే వ్యక్తమవుతున్నాయి.

 ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ట్రస్టు బోర్డు సమావేశంలోనే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అవుట్‌ ‌పేషెంట్‌ ‌సేవలు, పలు ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా అందించాలని సభ్యులు కోరినట్లు సమాచారం. అదనంగా వెల్‌నెస్‌ ‌సెంటర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఉద్యోగుల ప్రధాన అభ్యంతరాలకు మాత్రం ఇప్పటికీ సమాధానం కనిపించడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఈ పథకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ ‌కార్డులు డౌన్‌లోడ్‌ ‌కావడం లేదని, చికిత్స పరిమితులు ఎక్కువగా ఉన్నాయని, ఈ పరిస్థితిలో ఆరోగ్యశ్రీ పథకమే మెరుగ్గా ఉందని కొందరు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 29.80 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాల్సి ఉంది. అంటే ఇది ఒక చిన్న సంక్షేమ పథకం కాదు. లక్షలాది కుటుంబాల ఆరోగ్య భద్రతకు సంబంధించిన కీలక వ్యవస్థ. అలాంటి పథకం ప్రారంభ దశలోనే ఇన్ని సందేహాలు, ఇన్ని లోపాలు బయటపడటం ప్రభుత్వానికి సవాల్‌గా నిలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారంపై కొన్ని కీలక ప్రశ్నలు వస్తున్నాయి. ఉద్యోగుల నుంచి ప్రీమియం వసూలు చేసే ముందే అవసరమైన మార్గదర్శకాలు ఎందుకు జారీ చేయలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘కార్పొరేట్‌ ఆస్పత్రులతో బకాయిల సమస్య పరిష్కరించకుండా పథకాన్ని ఎందుకు ప్రారంభిం చారు? మార్గదర్శకాలు లేకుండానే కార్డులు ఎలా పంపిణీ చేశారు? డేటాలో ఇన్ని తప్పులు ఎలా జరిగాయి? నగదురహిత వైద్యం పేరుతో అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు ఎదురవుతోంది?’ వంటిబ ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం రావడం లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు.

 హెల్త్ ‌కార్డు అనేది ఒక ప్లాస్టిక్‌ ‌కార్డు కాదు… అనారోగ్య సమయంలో ఉద్యోగి కుటుంబానికి భరోసా. ఆ భరోసా ఆస్పత్రి గేటు దగ్గరే ఆగిపోతే, క్యూఆర్‌ ‌కోడ్‌ ఎం‌త ఆధునికమైనదైనా ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిన ఉద్దేశం మంచిదేకావచ్చు. కానీ, అదొక్కటే  సరిపోదు. ఉద్యోగులు, పింఛన్‌దారుల నుంచి ప్రీమియం తీసుకున్న ప్రభుత్వం, వారికి నిజమైన నగదురహిత వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందటున్నారు. లేదంటే ఈ హెల్త్ ‌కార్డులు ఆరోగ్యభరోసాకు ప్రతీకగా కాకుండా.. అమలుకాని హామీలకు నిదర్శనంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

సుజాత గోపగోని
సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.