విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1న జాతికి అంకితం చేశారు. రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ, శంకు స్థాపన కార్యక్రమాలు చేశారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఈ రోజుకున్న విశేష ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ కూర్మనాథస్వామి, పైడితల్లి అమ్మవార్లకు భక్తితో ప్రణామాలు సమర్పించారు. “ఈ చరిత్రాత్మక సందర్భానికి సాక్షిగా నిలిచేందుకు ఇవాళ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిపై ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది” అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తోందని, కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌తో ‘నీలి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్య మంత్రులు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండింతల వేగంతో అభివృద్ధి చేస్తోందని అభినందించారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామారాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే వంటిదని, రాష్ట్ర యువత భవిష్యత్తుకు లాంచింగ్ ప్యాడ్ లాంటిదని అభిóవర్ణించారు. ‘దేశంలో గతంలోని 74 విమానాశ్రయాల సంఖ్య ఎన్డీఏ అధికారానికి వచ్చిన తరువాత 166కు పెరిగింది. ఉడాన్ పథకంతో సామాన్యులకు విమానయానం అందుబాటులోకి వచ్చిందన్నారు. రాజకీయ నాయకుల కుటుంబాల పేర్ల సంస్కృతికి స్వస్తి పలికి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతా రామరాజు పేరు పెట్టడం గర్వకారణం. పీఎం గతి శక్తి ద్వారా పాత రేవుల ఆధునికీకరణ, మూలపేట, రామాయపట్నంలో కొత్త రేవులు నిర్మాణం, విశాఖ-రాయపూర్ ఎక్స్‌ప్రెస్ వే పనులు జరుగుతున్నాయి. రైల్వే అనుసంధానత రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తూ 70కి పైగా స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం. ఐటీ రంగంలో ఏపీ యువత నైపుణ్యాలను ప్రోత్సహించేలా విశాఖలో సెమీ కండక్టర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశాంT. ఏఐ ఇన్ఫ్రా, గూగుల్ డేటా సెంటర్లు రాష్ట్రానికి రానున్నాయి. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ కోసం రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉత్తరాంధ్రలో రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం’ అని వివరించారు. ఈ ప్రాజెక్టులతో స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతగానో సహకరిస్తున్నారని, విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను నిలబెట్టారని, విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొంటూ, ధన్యవాదాలు తెలిపారు.వచ్చే ఏడాది నాటికి పోలవరాన్ని, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తిచేసి ప్రధాని నరేంద్ర మోదీతో ž ప్రారంభింపచేస్తామన ప్రకటించారు. గడచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు రూ.6.13 లక్షల పెట్టుబడులు వచ్చాయని, ఇవి పూర్తి అయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 3 ఏళ్లలో రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి అనుమతుల వచ్చాయని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి తెచ్చిన ఘనత కూడా మోడీదేనన్నారు.

గవర్నర్‌లు అబ్దుల్ నజీర్, అశోక గజపతిరాజు, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లోకం మాధవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జీఎంఆర్ సంస్థల అధినేత జీఎంఆర్ మల్లికా²ర్జునరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీకి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన కళాకారులు ఘన స్వాగతం పలికారు. 13 వేల మంది గిరిజన యువతులు “ధింసా” నృత్యంతో స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో మోదీతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఈ నృత్యాన్ని తిలకించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలను మోదీ అభినందించారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు
విశాఖపట్నం తర్లువాడలో ఏఎసఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ,టెస్టింగ్ యూనిట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. కర్నూలులోని పవన, సౌరశక్తి జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను, అనంతపురంలో 2500 మెగావాట్ల, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్ మిషన్ పథకాలను ప్రారంభించారు. కర్నూలు-4 రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టు, పెంచలకోన-యూరపాడు మధ్యనున్న గ్రిడ్‌కు శంకుస్థాపన చేశారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ రహదారి,ఖమ్మం-దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు వరుసల బైపాస్ రహదారులను ప్రారంభించారు.
విమానాశ్రయం ప్రత్యేకతలు
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పలు ప్రత్యేకతలకు నిలయం. ఎగిరే చేప ఆకృతిలో, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం, ఆధునిక సాంకేతికత, పర్యావరణహిత సదుపాయాల మేళవింపుతో ప్రపంచస్థాయి ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచింది. విశాఖపట్నం, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలకు మెరుగైన అనుసంధా నాన్ని అందిస్తూ, ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానయాన వేదికగా ఇది నిలువనుంది. సాంకేతికత, సుస్థిరత, సంస్కృతి మూడింటినీ మేళవించుకున్న ఈ నిర్మాణం దేశంలోని ఇతర విమానాశ్రయాలకు ఒక కొత్త ప్రమాణంగా నిలుస్తుంది.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రూ.5,640 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల్లో దీన్ని గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా జీఎంఆర్ సంస్థ నిర్మించింది. కొత్తగా, ఖాళీ భూమిపై ప్రణాళికా బద్ధంగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ తరహా ప్రాజెక్టు కావడంతో, పాత నిర్మాణాల పరిమితులేమీ లేకుండా ఆధునిక సదుపాయాలన్నింటినీ మొదటి నుంచే పొందుపరిచే వీలు లభించింది. ఏటా 60 లక్షల మంది ప్రయాణి కులు రాకపోకలు సాగించేలా దీనిని తీర్చిదిద్దారు. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను తట్టుకునేలా 77,342 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. నిర్దేశిత గడువు కంటే ఐదు నెలల ముందుగానే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం విశేషం.

కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచేలా, భవిష్యత్తు విమానయాన అవసరాలను తీర్చేలా విమానా శ్రయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. కృత్రిమ మేధ (ఏఐ), బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం), ఎయిర్‌సైడ్ 4.0 సాంకేతికత, ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ (ఏపీవోసీ), బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజి హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ వంటివి ఇక్కడి సాంకేతిక ప్రత్యేకతలు. ఆటోమేటెడ్ బ్యాగేజి హ్యాండ్లింగ్ వ్యవస్థల వల్ల ప్రయాణికుల సామాన్లు వేగంగా, కచ్చితత్వంతో గమ్యస్థానం చేరనున్నాయి. వీటి సాయంతో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేయడం, కార్యకలాపాలను కచ్చితత్వంతో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. ఏపీవోసీ కేంద్రం ద్వారా వాతావరణ పరిస్థితులు, గేట్ల కేటాయింపు, వనరుల నిర్వహణ వంటి అంశాలను ఒకేచోట నుంచి సమన్వయం చేసుకునే వీలుంటుంది. బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్ విధానంతో చెక్-ఇన్, భద్రతా తనిఖీల వద్ద నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం స్ఫూర్తిగా విమానాశ్రయ రూపకల్పన సాగింది. టెర్మినల్ పైకప్పు సంప్రదాయ కాటేజీలను, అరకు లోయ ప్రకృతి దృశ్యాలను తలపిస్తుంది. ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్‌ను మేళవించి, రాష్ట్ర సాంస్కృతికత అడుగడుగునా ప్రతిబింబించేలా టెర్మినల్ రూపొందింది. దేశంలోని ఇతర విమానాశ్రయాలతో పోలిస్తే ఇలాంటి ప్రాంతీయ శైలి, ఆధునిక సాంకేతికత మేళవింపు అరుదైన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
గంటకు 275 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు వీచినా చెక్కుచెదరని రీతిలో టెర్మినల్ భవనాన్ని పటిష్ఠంగా నిర్మించడం ఈ విమానాశ్రయ ప్రత్యేకతల్లో ఒకటి. తీర ప్రాంతంలో తరచూ తుఫానులు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ పటిష్ఠత ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 3,800 మీటర్ల పొడవైన రన్‌వేతో పాటు సమాంతరంగా టాక్సీవేను ఏర్పాటు చేశారు. ఈ సుదీర్ఘ రన్‌వే భారీ వైడ్‌బాడీ విమానాలు రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉంటుంది. ఏకకాలంలో 18 విమానాలు నిలిపేందుకు వీలుగా స్టాండ్లు నిర్మించారు. 55 మీటర్ల ఎత్తులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ను నెలకొల్పారు.ఎలాంటి అంతరాయం లేకుండా భారీ సంఖ్యలో విమానాల రాకపోకలు సాగించేందుకు ఈ వసతులన్నీ దోహదపడతాయి. సరుకు రవాణా కోసం 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక కార్గో టెర్మినల్ నిర్మించారు. దీని ద్వారా ఏటా 25 వేల టన్నుల సరుకును తరలించేందుకు వీలు కలుగుతుంది. ఔషధాలు, సముద్ర ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతికి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వర్గాలకు కొత్త మార్గం అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో ఎగుమతులు మరింత పెరిగే కొద్దీ ఈ కార్గో సదుపాయాలను దశలవారీగా విస్తరించే వీలుంది.
పర్యావరణహిత సాంకేతికతలకు ఈ విమానా శ్రయంలో పెద్దపీట వేశారు. తక్కువ విద్యుత్తుతో పనిచేసే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) వ్యవస్థలు, విద్యుత్ ఆదా చేసే లైటింగ్ అమర్చారు. ఇవి నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని హేతుబద్ధం చేస్తాయి. 5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్ర మాలు, విద్యుత్ వాహనాల చార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ మరిన్ని ప్రత్యేకతలు. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా టెర్మినల్‌ను తీర్చిదిద్దగా, దీన్ని అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్‌జీబీసీ)లో నమోదు చేయడం విమానాశ్ర యానికి మరో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతర్జాతీయంగా పర్యావరణహిత భవనాలకు ప్రామాణికంగా భావించే ఈ కౌన్సిల్ గుర్తింపు దక్కడం విశేషం.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ విస్తరణకు జీఎంఆర్ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆరఓ) కేంద్రం, లాజిస్టిక్స్ హబ్ కోసం 154 ఎకరాల్లో ఏరోసిటీని, సిబ్బంది కోసం 139 ఎకరాల్లో టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. వీటికి తోడు మరో 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీంతో భోగాపురం కేవలం ప్రయాణికుల విమానాశ్రయంగానే కాక, నిర్వహణ, రవాణా, లాజిస్టిక్స్ సేవలను ఒకచోట అందించే సమగ్ర విమానయాన కేంద్రంగా ఎదగనుంది. ఈ విస్తరణ ప్రణాళికలు పూర్తయితే విమానాశ్రయం చుట్టూ నూతన ఆర్థిక కార్యకలాపాలకు వేదిక ఏర్పడ నుంది.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్