గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివ గోల్వాల్కర్ ఆరఎసఎస్‌కు రెండవ సర్‌సంఘచాలక్‌గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్ భారతదేశం పర్యటిస్తూ భారతీయ ఆత్మను అర్థం చేసుకున్న గొప్ప సామాజికవేత్త. వారు ఆజన్మాంతం భారతజాతి నిత్య యవ్వనానికి ప్రరేరణదాతగా నిలిచారు. గొప్ప మేధావి. సంఘటనాశిల్పి. వివిధ సందర్భాలలో ఆయన యువకులకు ఇచ్చిన మార్గదర్శనం, స్ఫూర్తి నేటికి కూడా అర్థవంతమైనదే.
యవ్వనాన్ని సుదీర్ఘకాలం నిలబెట్టుకోవడం సాధ్యమేనని చెబుతూ, అందుకు మార్గమేమిటో శ్రీ గురూజీ వివరించారు. “శాఖకు వెళ్లాలి, మనకు ముసలితనం రాలేదని గుర్తుంచుకోవాలి. మహాభారతకాలం నాటికి అర్జునుని వయస్సు 70 సంవత్సరాలు. అప్పటికి అతడిని యువకుడనే అన్నారు. మనలోని ఉత్సాహాన్ని పనిలో పెట్టాలి. వ్యాయామం చెయ్యాలి. ఆటలాడాలి. ఇతరులతో సామరస్యంగా ఉండడానికి వీలైన వాతావరణాన్ని నిర్మించే ప్రయత్నం చెయ్యాలి. కాని, ఇప్పుడు చాలామందిలో వ్యాయామంపట్ల విముఖత పెరిగి పోతోంది. మహారాష్ట్రలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న ఒక యువకుడు జైలుకువెళ్లాడు. అతడు జైలులో రోజూ ఉదయంలేచి సూర్య నమస్కారాలు చేసేవాడు. ఇది చూసిన ఒక పెద్ద కాంగ్రెసు నేత అతడిని సూర్యనమస్కారాలు చెయ్యవద్దని అన్నాడు. ఎందుకు చెయ్యకూడదని ఆ యువకుడు అడిగితే, ఆ కాంగ్రెస్ నాయకుడు` నువ్వు చేస్తున్న వ్యాయామం కూడా ఒక రకం హింసే. నువ్వు శక్తిని ఉపాసిస్తున్నావు. అందువల్ల ఇతరులలో భయం ఉత్పన్నమవుతుంది. ఎవరి మనసులోనైనా భయాన్ని పుట్టించడం హింసే అవుతుంది అని చెప్పాడు. దేహబలంవల్ల ఇతరులకు భయం పుడుతుంది. కనుక దేహంలో బలం ఉండకూడదన్న వికృత భావన కూడా కొందరిలో ఉంది.
“రామకృష్ణ పరమహంస తనువు చాలించిన పిమ్మట ఆయన శిష్యులందరూ ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఉపాసన ఆరంభించారు. రామకృష్ణునివలె తాము కూడా భావ సమాధిని పొందినట్లు కనిపించడం కోసం చాలామంది శిష్యులు అశ్రువులు కారుస్తూ కూర్చోసాగారు. కన్నీరు కార్చడం పెద్ద కష్టమైన పనికాదు. కాస్త ప్రయత్నం చేస్తే వచ్చేస్తాయి. అలా వాళ్లు ఏడుస్తూ కూర్చోవడం నచ్చక వివేకానందుడు “ఇలా ఏడుస్తున్నారెందుకు?” అని అడిగాడు.“ఇవి భావ సమాధిలో వస్తున్న ఆనందాశ్రువులు” అని వాళ్లు చెప్పారు.“ఈ ఉత్తుత్తి వేషాలు కట్టిపెట్టండి. శ్రీరామకృష్ణులతో సమానమైన తపశ్శక్తి, వైరాగ్యం, భావతాదాత్మ్యం మనకు లేవు. నేను ఇదంతా సాగనివ్వను. తపస్సు చేయండి. శరీరాలను శక్తి సంపన్నం చేసుకోండి. బలిష్టులు కండి. ఏడ్చే సన్యాసులు నాకక్కరలేదు” అన్నాడు వివేకానందుడు.
సమర్థరామదాసు కూడా “మనం ఢీకొంటే రాళ్లు పగిలిపోవాలి. అలా ఉండాలి మన శరీరాలు” అని అనేవారు. మన స్వయంసేవకులు కూడా ఈ విధంగా చురుకైన, ఉత్సాహభరితమైన, బలిష్ఠమైన, తేజోవంతమైన శరీరాలను నిర్మించుకోవాలి. ఎటువంటి శ్రమపడవలసి వచ్చినా వెనుదీయకూడదు.”
తమ కాళ్లనే నరుక్కున్నారు: జీవితానికి నిబద్ధత అనేది ఉండి తీరాలని చెబుతూ, “సత్సంబంధాలు స్థాపించుకొనడానికి, ఎదుటివారికి ఇష్టంలేని వాటిని విడిచిపెట్టడం అవసరమవుతూ ఉంటుంది. కాని ఏమి విడిచిపెట్టవచ్చు, ఎంత వరకు విడిచిపెట్టవచ్చు అనేదానికి ఒక పరిమితి ఉంది. ఈ సామరస్య నిర్మాణం మన నాయకుల దృష్టిలో ఎంత ముఖ్యమైపోయిందంటే, వాళ్లు మిగిలిన విషయాల న్నిటినీ మరిచిపోయారు. దేశ శ్రేయస్సును పక్కన పెట్టడానికి కూడా వాళ్లకేమీ సంకోచమనిపించలేదు. ఇదంతా వాళ్లు దేశ స్వాతంత్య్రం సాధన పేరు మీదే జరిపారు. కాని ఎవరి నుంచి, ఎవరికొరకు స్వాతంత్య్రాన్ని సాధించాలో వాళ్లు మరిచిపోయారు. వందేమాతరాన్ని వదులుకున్నారు. ధర్మం ప్రసక్తిని విడిచిపెట్టారు. మన ప్రాచీన కాలాన్ని విస్మరించారు. స్వాభిమానాన్ని వదిలేశారు. చివరకు మన సొంత దేశంలోనే హిందువు అన్న మాటను ఉచ్ఛరించడం, హిందువుల శ్రేయస్సు గురించి మాట్లాడడం అపరాధంగా మారిపోయింది. మన మాతృభూమి విభజనకు, మనం మాతృభావనతో పూజించుకొనే గోవుల హత్య కొనసాగడానికి కూడా మన నేతలు సమ్మతించారు. హిందూ మహిళలకు మానహాని జరుగుతున్నా కూడా నేతలకు ఏ బాధా కలగటం లేదు” అన్నారు శ్రీగురూజీ.
“ఇలా జీవితంలో ఏ రకమైన నిబద్ధత లేకపోవడంవల్ల కలిగిన పరిణామమే నైతిక విలువల పతనం. అన్ని దిక్కుల స్వార్థచింతన విజృంభించింది. ధనం, అధికారం ప్రాబల్యాన్ని చెలాయిస్తున్నాయి. సమాజానికి మంచిదారి చూపే సంస్థలన్నిటినీ పనిగట్టుకుని విచ్ఛిన్నం చేశారు. మనకు ఇంత అనర్థం జరిగిందన్న స్పృహ కూడా మనలో లేకపోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పైపెచ్చు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడమే తమ ప్రగతిశీలత అని చదువుకున్నవారు అనుకుంటున్నారు. ‘హిందూ’ అన్నమాట వినబడితే వాళ్లు ముఖం తిప్పేసుకుంటారు. హిందువు కావడమే అపరాధమైనట్లు, తమ గురించి తమకు ఇంత బుద్ధి భ్రమ, సమాజం పట్ల ఇంత హీనభావన ఉన్న పరిస్థితి ప్రపంచంలో మరెక్కడా కానరాదు.”
బంధనాలవల్ల కలిగే భయాన్ని పట్టించుకో కూడదు: వర్షపు నీరు కొండలపై పడి జారిపోతుంది. దాన్ని అలాగే పోనిస్తే ఏ ఉపయోగమÖ ఉండదు. అలా ప్రవహించిపోయే నీటికి ఆనకట్ట కట్టి జలాశయంలో దానిని నింపామంటే ఆ నీరు విద్యుత్తు ఉత్పాదనకు, వ్యవసాయానికి, ఇతర పనులకి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మన జీవితాలు సుఖమయమవుతాయి. ఇదంతా బంధనంవల్ల సాధ్యం కాగలదు తప్ప బంధనముక్తి ద్వారా కాదు. ఇలా నిలవ చేసిన నీటిని కూడా ఒక క్రమపద్ధతిలో విడుదల చెయ్యాలి తప్ప ఎలా పడితే అలా వదిలిపెడితే బంధనాలు తప్పకుండా ఎదురవుతాయి. వాటిని మనం తప్పించుకోలేము. కనుక కావలసింది బంధనాల నుంచి విముక్తి కాదు, బంధనాలవల్ల భయాన్ని లెక్కచెయ్యకపోవడమే.
సమాజ రుణాన్ని తీర్చుకోవాలి: మనిషి సమాజ రుణాన్ని మరిచిపోకూడదనేది శ్రీ గురూజీ బోధనలలో ముఖ్యాంశంగా ఉండేది. “సమాజంవల్లనే వ్యక్తికి కీర్తి, సౌకర్యాలు, రక్షణ లభిస్తాయి. మనకి సమాజం పట్ల కలుగుచున్న ఉపకారాలు లెక్కలేనన్ని. కాని ఈ ఉపకారాలను పొందడం రుణం తీసు కోవ డంతో సమానమే అవుతుంది. రుణం తీసుకుంటూ, దానిని తిరిగి చెల్లించకపోవడం మర్యాదస్తుల లక్షణం కాదు. మనిషి రుణ విముక్తుడై ఉండాలని మన ధర్మశాస్త్రాలలో చెప్పారు. అందుకు నిరంతరం ప్రయత్నిస్తుండాలి.
“ఈ లక్ష్యాన్ని సాధించడానికి తగిన వాతావరణం సామాజిక వ్యవస్థ నిర్మాణం ద్వారా మాత్రమే వీలవుతుంది. ఆ వ్యవస్థలో వ్యక్తి తన శక్తి సామర్థ్యా లకు అనుగుణంగా, తనకుతాను వికాసం పొందేందుకు అవకాశమిచ్చేదిగా ఉండాలి. వ్యక్తి చింతాగ్రస్తుడై ఉన్నట్లయితే అతడు వికాసం పొందలేడు. ప్రస్తుతం చదువుకున్న వారు కూడా తమ సొంత అవసరాలు తీర్చుకొందుకు అజన్మాంతం ఆరాటపడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో అంతిమ లక్ష్యప్రాప్తి అసంభవం.”
“ఇటువంటి సమాజరచన ఒక్కరోజులో అయిపోయే అవకాశం ఎలాగూ లేదు. అదీగాక ప్రస్తుతకాలంలో అనేక సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి పెనుగులాటలో ఉన్నాయి. దీనిని పోటీ అనవచ్చు. ఈ పరిస్థితులలో మనం “పాతదంతా చెత్త” అనే అభిప్రాయాన్ని విడిచిపెట్టి, విషయాన్ని వైజ్ఞానిక దృష్టికోణంతో పరిశీలించాలి. ముందు మన దేశం గురించి ఆలోచించాలి. దృఢమైన పునాదిమీద సంస్కారవంతమైన, వ్యవస్థితమైన రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. తద్వారా జాతీయ భావనను వ్యాప్తి చెయ్యాలి. ఈ భూమిని తల్లిగా భావించుకొనే సమాజమొకటి ఈ దేశంలో ఉంది. ఈ సమాజానికి ఒక విశిష్ట జీవన పద్ధతి, ఆధార భూమిక, సామÖహికమైన ఆకాంక్షలు ఉన్నాయి. ఈ సమాజాన్ని రాష్ట్రీయ సమాజం అనే పేరుతో వ్యవహరించవచ్చు. ఈ సందర్భంలో శ్రీ గురూజీ దేశం అనే మాటకు ఇచ్చిన వివరణ ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినదే. ఈ వాస్తవాన్ని విస్మరించిన కారణంగానే నేటివరకు అనేక ఆపదలకు మనం గురయ్యాం. దేశ విభజనకన్నా మించిన ఓటమి ఇంకేమి ఉండగలదు?
దేశ నిర్మాణ కార్యంలో నిమగ్నులం కావాలి: “విచ్ఛిన్నమైన ఆలోచనలతో కొట్టుకుపోవద్దని విద్యార్థులకు నా ప్రార్థన. ఈ విషయం గురించి స్వతంత్రంగా ఆలోచించాలి. నేను మీపై అబద్ధపు పొగడ్తలు కురిపించను. మిమ్మల్ని దేశం మÖల స్తంభాలు అని అంటూ ఉంటారు. కాని ఇటువంటి స్తంభాలపై దేశం నిలబడలేదు. కనుక ఈ దేశానికి సేవకులుకండి, సమస్త శక్తితో దేశ నిర్మాణ కార్యంలో నిమగ్నులవ్వండని మాత్రమే నేను చెబుతున్నాను. ఏ దేశంలో యువశక్తి తన సమస్త సామర్థ్యాన్ని పణంగాపెట్టి దేశప్రగతికై కృషి చేస్తుందో, ఆ దేశం మాత్రమే ప్రగతిపథంలో ముందు నిలుస్తుంది.కనుక, మీరు కీర్తి, సంపద, అధికారం అనే వాటిపై కాంక్షను దేశమనే వేదికపై బలి ఇవ్వవలసందిగా నేను మరీ మరీ అర్థిస్తున్నాను. అలా చెయ్యడంలోనే దేశ సౌభాగ్యం, సమాజ గౌరవం, స్వీయసుఖం ఉన్నాయి.
“నేడు యువతరం మాత్రమే భోగప్రవృత్తిని త్యజించి, స్వార్థరహితంగా రాష్ట్రోన్నత సాధనకు నడుం కట్టే సాహసానికి పూనుకోగలదు. మీలో ఉన్న ఈ గొప్ప యోగ్యతను మీరు మీ తోటి విద్యార్థులు ఎరుగుదురు. కనుక నేడు దేశం ముందున్న రకరకాల సమస్యలను నిర్మూలించే బాధ్యతను చేపట్టేందుకు అవసరమైన యోగ్యతను సాధించడానికి కలిసి సాధన చెయ్యాలి.
శ్రీ గురూజీ వివిధ సందర్భాలలో అనేకమంది యువకులకు మార్గదర్శకమైన ప్రబోధం చేస్తూ లేఖలు వ్రాశారు. ఆ లేఖలలో గల ప్రబోధపు సారాంశాన్ని ఈ విధంగా వర్ణించవచ్చు. “విద్యార్థులను మిగిలిన సమాజానికి భిన్నమైన వేరే వర్గంగా పరిగణించడం సరికాదనిపిస్తోంది. సర్వసాధారణ ప్రజలలో ఉండే గుణగణాలే యువకులలోనూ వ్యక్తమవుతూంటాయి. అపరిపక్వమైన వయసువల్ల, అనుభవరాహిత్యంవల్ల సులువుగా ఆవేశానికిలోనయ్యే వయసు కావడంవల్ల వారి చేష్టలు అదుపునకు లొంగని ఉద్రేకంతో కూడుకొని ఉంటాయి. ఈనాటి యువకులకు సత్ప్రవర్తనకు సంబంధించిన సంస్కారాలను ఎవ్వరూ ఇవ్వటంలేదు. వారికి జీవితంలో ఒక రకమైన అస్థిరత, అభద్రత గోచరిస్తున్నాయి. ఆ కారణంగా వారు నిరాశాపూరితు లవుతున్నారు. తమ సమస్త శక్తులను ఒడ్డి సాధించే కృషి చేయవలసిన ధ్యేయమేదీ వారి కళ్లముందు లేదు. వారికి మార్గదర్శకులుగా ఉండవలసిన వారిలోగాని, ప్రజానాయకులనబడే వారిలోగాని ఏ ప్రేరణ దాయకమైన ఆదర్శమÖ వారికి కనిపించటంలేదు. కుటుంబ వ్యవసŸ్థ నేడు పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. నేటి యువతరంలో మనఃక్షోభ, అశాంతి, విశృంఖలత మొదలైన చెడులక్షణాలు ఉత్పన్నమవడానికి ఇవి కొన్ని కారణాలు. ఈ పరిస్థితినే యువకులలో, విద్యార్థులలో గల క్రమశిక్షణారాహిత్యమనవచ్చు.”