ఆర్ఎస్ఎస్ 100 – నాటక సమీక్ష

ఇది ఒక నాటక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది ఒక యుగావిష్కరణ. ఇది మన స్వంత చరిత్రతో మనకు కలిగే ఒక అనుభవం. భోపాల్‌లో ప్రదర్శితమైన రెండున్నర గంటల నిడివి గల ఈ శక్తిమంతమైన నాటకం, విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా సాగిన వెయ్యేళ్ల సుదీర్ఘ పోరాటంలో, చివరి దశలో స్వాతంత్య్రం కోసం పరితపించిన భారతదేశపు గాథను ఆవిష్కరించింది. గత శతాబ్దంలో భారతదేశ చరిత్రను గాఢంగా ప్రభావితం చేసిన మహర్షి అరవిందుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వాతంత్య్ర వీరసావర్కర్, మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వంటి మహనీయులు ఒకే వేదికపై సమావేశమై ఉండటం ఎంతో ఉద్వేగభరితంగానూ, స్ఫూర్తిదాయకం గానూ అనిపించింది. వీరందరితో పాటు, ఇతరులతో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భారతీయ సమాజంలో ఒక ప్రత్యేకమైన, కఠినమైన మార్గాన్ని ఎంచుకున్న మరొక వ్యక్తి కూడా వేదికపైన కనిపించారు. ఆయనే డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గెవార్. ఇంతటి గొప్పవారిని ఒకే వేదికపైన చేర్చిన ఆ నాటకం పేరు యుగప్రవర్తక్ డాక్టర్ హెడ్గెవార్.

ఆరఎసఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాగపూర్‌కు చెందిన ‘నాదబ్రహ్మ’ అనే సంస్థ ఈ నాటకాన్ని రూపొందించింది. దీని 54వ ప్రదర్శన ఇటీవల భోపాల్‌లో జరిగింది. ఈ నాటకం ఆరఎసఎస్ సమగ్ర ప్రస్థానంపైన కాకుండా, కేవలం డాక్టర్ హెడ్గెవార్ జీవిత గాథపై మాత్రమే దృష్టి సారిస్తుంది. దేశ స్వాతంత్య్ర పోరాట కాలంలో భారతదేశ భవిష్యత్తు పట్ల ఉన్న ఆందోళనలు ఈ నాటకంలోని ప్రతి సన్నివేశంలోనూ ప్రతిబింబిస్తాయి.

నాటకంలో ఒక సందర్భంలో గాంధీజీని సూటిగా కొన్ని ప్రశ్నలను డాక్టర్ హెడ్గెవార్ అడుగుతారు. వాటికి ఆయన స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతారు. పైగా, తన దైనందిన ప్రార్థన సమయానికి ప్రాధాన్యతను ఇస్తారు.  తన ఆలోచనా పరిధిలో భిన్నాభిప్రాయాలకు ఏ మాత్రం స్థానం లేదా గౌరవం ఇచ్చేందుకు ఆయన సుముఖత కనబరచరు. హెడ్గెవార్ తన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని సంప్రదించే సాహసాన్ని రెండుసార్లు చేశారు. మొదట నాగపూర్‌లో. ఆ తర్వాత కలకత్తా సమావేశం సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సమక్షంలో. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం తీర్మానాన్ని కాంగ్రెస్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? హిందూ-ముస్లిం ఐక్యత అనే ఎండమావి కోసం ఆచరణ సాధ్యం కాని మార్గాన్ని కాంగ్రెస్ ఎందుకు అనుసరిస్తున్నది? అని ఆయన ప్రశ్నించారు.

గాంధీజీకి పర్యాయపదంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇస్లాం మత పెద్ద అయిన ‘ఖలీఫా’కు మద్దతుగా ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపిస్తున్న తరుణంలోనే ఈ ప్రశ్నలు తలెత్తాయి. కేరళలో జరిగిన మోప్లా మారణకాండ, బలవంతపు మత మార్పిడుల పట్ల తీవ్ర ఆవేదనకు గురైన హెడ్గెవార్, ఖలీఫా విషయంలో కాంగ్రెస్ అవలంబించిన విచిత్రమైన వైఖరిని చూసి అయోమయానికి, ఆందోళనకు గురయ్యారు. గాంధీజీకి ఉన్న తిరుగులేని ఆధిపత్యంతో, కాంగ్రెస్ పార్టీ అదుపులేని వాహనంలా వేగంగా ముందుకు దూసుకుపోతూ ఉండేది. అంతిమంగా, హెడ్గేవార్ తన ప్రశ్నలతో ఒంటరిగా మిగిలిపోతారు. ఆయన దృష్టి భారతదేశ భవిష్యత్తుపై నిలిచింది. అది వెయ్యి సంవత్సరాల అణచివేతకు సామూహిక బాధితు రాలిగా ఉండి, పోరాడుతున్నప్పటికీ విచ్ఛిన్నంగానే మిగిలిపోయింది. అన్నిటికంటే హిందూ సమాజ ఐక్యతకు, సంఘటనకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.

అంత సుదీర్ఘకాలం పాటు సాగిన బానిసత్వం, పోరాటాల ఫలితంగా హిందూ సమాజం ఎంతగా క్షీణించిందంటే, దానిని చైతన్యపరచడం, ఏకం చేయడం, జాతీయ భావనతో ఉత్తేజపరచడం ఒక మహా సవాలుగా మారిందని నేతాజీ కూడా అంగీకరించారు. అయితే, హెడ్గెవార్ వ్యక్తం చేసిన ఆందోళనలతో ఏకీభవిస్తూనే, తమ దివ్యదృష్టి కారణంగా భారతదేశ ఉజ్వల భవిష్యత్తు పట్ల పూర్తి విశ్వాసంతో మహర్షి అరవిందుడు ఉన్నారు.

ఇక్కడి నుండి చరిత్ర రెండు ధారలుగా సాగు తుంది. అందులో ఒకటి కాంగ్రెస్ నాయకత్వంలోని స్వాతంత్య్ర ఉద్యమధార. స్వరాజ్య ఉద్యమానికి చెందిన దాదాపు అన్ని పోరాటాలు ఒక నిర్ణయాత్మక ముగింపునకు చేరకుండానే మధ్యలోనే చల్లారి పోయాయి. కానీ యావత్ ఉద్యమ ఘనతను కాంగ్రెస్ పార్టీ తనదిగా చేసుకుంది. రెండవ ధార హిందూ సమాజ సంఘటనకు సంబంధించినది. ఇది కేవలం డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గెవార్ నేతృత్వంలో కొద్దిమంది సహచరులతో నాగపూర్‌లోని ఆయన నివాసం నుండి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, అది దాదాపు ఎవరికీ తెలియని ఒక శక్తిగా చరిత్ర అనే అరణ్యంలోకి అడుగు పెడుతుంది. 25 మందిలో 20 మంది వేసిన ఓట్ల ఆధారంగా సంస్థకు ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ’ అని పేరు పెట్టడం, అలాగే డాక్టర్ హెడ్గెవార్‌ను తమ మొదటి ‘సర్‌సంఘచాలక’గా అందరూ సమష్టిగా అంగీకరించడం అనే ప్రక్రియతో ఈ ప్రయాణం మొదలైంది.

చరిత్రలో నిలిచిపోయిన ఈ కీలక ఘట్టంలో, తన దార్శనికత, దృఢ విశ్వాసాల ప్రేరణతో  డాక్టర్ హెడ్గేవార్ అజ్ఞాతమైన భవిష్యత్తు వైపు అడుగులు వేశారు. కొద్ది కాలంలోనే, అంకితభావం కలిగిన స్వయంసేవకుల శ్రేణులు ఆ ‘మార్గం’లో భాగమయ్యాయి. ఆరఎసఎస్ పరిధిలో ఏ ఒక్క వ్యక్తికీ సర్వాధికారం ఉండకూడదని హెడ్గెవార్ తీర్మా నించారు. “కాషాయ ధ్వజమే మనకు ‘గురువు’, దానికి మాత్రమే మనమందరం అంకితమయ్యాము. ఒక వ్యక్తి ఎంతటి గొప్పవాడైనప్పటికీ, మానవ సహజ బలహీనతలకు అతీతులు కాలేడు” అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ బలహీనపడి, చీలిపోవడం ప్రారంభమైన తరుణమది. ఒక నిరాయుధుడైన వ్యక్తి గుణగణాలలో ఏదో ఒక ప్రత్యేకతను శతాబ్దాలుగా గాయపడిన సమాజం చూసింది. ఆయన వెనుక ఏకం కావడానికి ప్రేరేపితమైనది. “మనం రాజకీయ అధికారాన్ని అనుసరించకూడదు. దానికి బదులుగా, మన సాంస్కృతిక పరిసరాలను ఆవరించిన అవరోధాలను తొలగించాలి” అనే ఆయన దృక్పథం అత్యంత స్పష్టమైనది. వినాశకరమైన విభజన తర్వాత భారతదేశం వారసత్వంగా పొందిన రక్తసిక్తమైన అధికారం, స్వతంత్ర భారతదేశ ప్రస్థానం, ఆరఎసఎస్ పోరాటం.. ఇవన్నీ మన గడప వరకు ప్రవహించిన చరిత్రకు సాక్షులుగా నిలుస్తున్నాయి.

ఆరఎసఎస్ శతాబ్ద కాలంలోనే, అనేక అత్యున్నత అధికార కేంద్రాల ఆవిర్భావం, పతనాలను మనదేశం చూసింది. దేశాల నిర్మాణం, పరిణామక్రమంలో చరిత్రలో ఏ ఒక్క అధ్యాయమూ అంతిమమైనది కాదు. ప్రతి అధ్యాయం వీరులకు సముచిత స్థానాన్ని ఇస్తుంది. అటువంటి స్థానం, గుర్తింపు పొందిన ఒక మహోన్నత వ్యక్తి వ్యక్తిత్వం, కార్యకలాపాలపై ఈ నాటకం దృష్టి సారించింది.

‘నాదబ్రహ్మ’ బ్యానర్‌పై, నిర్మాత పద్మాకర్ ధనోర్కర్, రచయిత డాక్టర్ అజయ్ ప్రధాన్, దర్శకుడు సుబోధ్ సుర్జీకర్, సంగీత దర్శకుడు. 40 మంది నైపుణ్యం కలిగిన కళాకారులతో కూడిన బృందం ఒక శతాబ్దపు కాలాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించింది. రంగస్థల ప్రదర్శనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించి, రూపొందించిన దృశ్యాలు ఈ నాటకానికి ప్రాణం పోశాయి. శక్తిమంతమైన గాత్రం, సూటిగా సాగే సంభాషణలు, సంగీతంతో కూడిన నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆసాంతం కట్టిపడేసింది. ఈ నాటకాన్ని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ చూడాలి. దేశాన్ని నడిపించే పాలకులు, అధికారులు (వీలైతే వారి కుటుంబాలతో సహా), వివిధ రాజకీయ, సామాజిక సంస్థలకు చెందిన కార్యకర్తల కోసం దీని ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, సమాజంలోని వివిధ రంగాలలో చురుకుగా ఉన్న బృందాలు ఈ నాటకాన్ని ప్రదర్శించాలి. చరిత్ర ఎలాంటిదైనప్పటికీ, అది మనందరిదీ. మనం దానిని చదవాలి. ముఖ్యంగా ఇప్పటివరకూ ఎవరూ తిరగేయని కీలకమైన అధ్యాయాలను చదవాలి.

– ‘పాంచజన్య’ నుంచి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.