భారతదేశపు సనాతన సంప్రదాయాలు కేవలం ఆధ్యాత్మిక నమ్మకాలు మాత్రమే కావు, అవి వేలసంవత్సరాల క్రితమే రూపుదిద్దుకున్న అత్యున్నత వైజ్ఞానిక సూత్రాలు. మనం చేసే ప్రతి పూజ వెనుక, ఆచరించే వ్రతం వెనుక ఒక శాస్త్రీయత ఉంది. సమాజంలో ఐక్యతను పెంపొందించడం, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందడం అనే మూలసూత్రాలపైనే భారతీయ సంప్రదాయాలు నిర్మితమయ్యాయి. మన పూజలు, వ్రతాల వెనుక శాస్త్రీయ విజ్ఞానం దాగుంది.

శ్రావణమాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమెంది. దీనిని మహిళలమాసంగా చెప్పొచ్చు. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య, శాస్త్రీయ దృక్పథంలో కూడా ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రావణ మాసం శ్రీమహా విష్ణువుకు, పరమశివునికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో ప్రతిరోజూ ఒక పండుగలానే సాగుతుంది. కొత్తగా పెళ్లయిన మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తారు. ఇది అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం, ఆయురారోగ్య అష్టైశ్వర్యాల కోసం ఆచరించే వ్రతం. శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుని జన్మదినాన్ని మహో త్సవంగా జరుపుకుం టారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీ కట్టే వేడుకతో పాటు ద్విజులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించే రోజురాఖీ పౌర్ణమి. ఇలా నెలంతా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.

ఆరోగ్య, శాస్త్రీయ దృక్పథం: శ్రావణ మాసం వర్షకాలంలో వస్తుంది. ఈ సమయంలో వాతా వరణంలో తేమ ఎక్కువగా ఉండి, శరీరంలో జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే ఈ మాసంలో వ్రతాల పేరుతో శాకాహారం తీసుకోవడం, ఉపవాసాలు ఉండడంవల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే క్రిమి కీటకాలు, వ్యాధుల నివారణకు పూజల్లో వాడే పసుపు, తోరణాలు, ముగ్గులు, ధూపం ఎంతగానో సహాయపడతాయి. మన పూర్వికులు ధర్మం, శాస్త్రం, ఆరోగ్యాన్ని ఒకే తాటిపైకి తెచ్చి పండుగలు, పూజల రూపంలో మనకు అందించారు. ఈ మాసంలో మహిళలు చేసే పూజలు, వ్రతాలు వాటి వెనుక ఉన్న ఆరోగ్య, మానసిక విజ్ఞానం చాలా విశేషమైనవి.

ఉదయాన్నే తలస్నానం చేసి, పూజచేయడం, గంటలు మోగించడం, మంత్రాలు జపించడం వల్ల మెదడు ప్రశాంతత పొంది, ఒత్తిడి తగ్గి సానుకూల శక్తి వస్తుంది. ఈ కాలంలో రావి, మర్రి, తులసి మొక్కలను పూజించడం వల్ల ఆక్సిజన్ అందదమే కాక, ప్రకృతిని గౌరవించే అలవాటు పెరుగుతుంది. మంత్రోచ్ఛారణలో ఉండే శబ్దప్రకంపనలు మెదడు లోని ఆల్ఫాతరంగాలను పెంచి ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. తెల్లవారుజామున నిద్రలేవడం, పూజలు చేయడం వల్ల లభించే విటమిన్ డి, తాజా గాలి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పేరంటాలు-ఆధ్యాత్మిక భావన: ఈ మాసంలో ఇంట్లో పూజ లేదా శుభకార్యం ముగిసిన తర్వాత ముత్తైదువులను ఆహ్వానించి, సత్కరించడాన్ని పేరంటం అంటారు. ఆహ్వానించిన మహిళలందరినీ సాక్షాత్తూ గృహలక్ష్మి, గౌరీస్వరూపాలుగా భావిస్తారు. తెలుగు సంస్కృతిలో పేరంటాలు, శనగల తాంబూలం, పసుపుబొట్టు అనగానే లక్ష్మీదేవి కటాక్షం, మంగళ కరమైన వాతావరణం, స్త్రీ సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ, కార్తీక మాసాల్లోనూ, పూజలు, నోములు, శుభకార్యాల సమయంలోనూ వీటిని  ఇస్తుంటారు.

ఇవి మతపరమైన ఆచారాలు మాత్రమే కావు… స్త్రీల ఆరోగ్యాన్ని, మానసిక ఆనందాన్ని, సామాజిక సంబంధాలను, పర్యావరణ పరిరక్షణను మేళవించిన అద్భుతమైన సనాతన సంప్రదాయం. పేరంటంలో ఇచ్చే తాంబూలంలో తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, పండు, పువ్వులు, శనగలు ఉంటాయి. తమలపాకు అగ్రభాగంలో లక్ష్మీదేవి, మొదలులో జ్యేష్ఠాదేవి, మధ్యలో సరస్వతి ఉంటారని నమ్మకం. అందుకే అగ్రభాగం ఇతరుల వైపు ఉండేలా తాంబూలం ఇస్తారు. తమలపాకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. పూజ ప్రసాదాలు తిన్నతర్వాత తాంబూలం సేవిస్తే అజీర్తి సమస్యలురావు. ఇక నానబెట్టిన లేదా ఉడక బెట్టిన శనగలు ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉన్న పోషకాహారం.

పేరంటంలో పసుపుబొట్టు ఇచ్చే సంప్రదాయం ఉంది. పసుపు సహజసిద్ధమైన యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్. క్రిమిసంహారక గుణం కలిగిఉన్న పసుపు కాళ్లకు రాసుకోవడం వల్ల చర్మవ్యాధులు, పాదాల పగుళ్లు రాకుండా ఉంటాయి. పసుపు, కుంకు మలు మంగళకరం, గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమై నవి. రెండు కనుబొమ్మల మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. బొట్టు పెట్టినపుడు ఒత్తిడి కలగడం వల్ల నాడులు శాంతించి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

సనాతనంగా వస్తున్న ఇటువంటి ఆచారాలు కేవలం మూఢనమ్మకాలు మాత్రమే కాదు.  రోజువారీ పనుల ఒత్తిడి నుండి స్త్రీలకు లభించే విశ్రాంతి, ఒకరినొకరు కలుసుకుని కష్టసుఖాలు పంచుకునే మంచి అవకాశం.మరోవైపు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనగలు ‘గురు గ్రహానికి’ ప్రతీక. గురుబలం ఉంటే సౌభాగ్యం, సంతాన ప్రాప్తి, బుద్ధి వికాసం కలుగుతాయి. అద్భుతమైన వైజ్ఞానిక సమాహారమే మన సంస్కృతి. మూలాలను కాపాడు కుంటూ, వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను గ్రహించి ఆచరించడమే మనం భావితరాలకు ఇచ్చే గొప్ప కానుక. శ్రావణ మాసం మనిషికి, ప్రకృతికి ఉన్న పవిత్రమైన బంధాన్ని గుర్తుచేసే ఉత్సవాలు. శాస్త్రీయ విజ్ఞానంతో కూడిన మన సంప్రదాయాల సారం ఆధునిక జీవన విధానంతోనూ అనుసంధానం చేయాలి. అమూల్యమైన జీవనాన్ని ఆస్వాదించాలి.

జయశ్రీ ఆచంట

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.