ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం
ప్రధాని నరేంద్రమోదీ 12 సంవత్సరాల పాలన దాటిన వేళ మన దేశంలో ఒక చిత్రమైన చర్చ జరిగింది. ప్రజలచేత ఎన్నికైన ప్రధానిగా నరేంద్రమోదీ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించాడు అంటూ కొందరు సామాజిక మాధ్యమంలో పోస్ట్‌లు పెట్టారు. వెంటనే కాంగ్రెస్‌పార్టీవారు, ఆ పార్టీలతో సంబంధంలేని నెహ్రూ అంధభక్తులు రంగంలోకి దిగారు. నెహ్రూ ప్రధాని పదవీ కాలాన్ని ప్రజలు ఎన్నుకున్న, ప్రజల మద్దతు లేనిదిగా విడగొట్టి చూడడం ఒక నేరంగా వారి వాదనలు సాగాయి. ఈ నెహ్రూ భక్త బృందానికి ఆయన పటం మీద ఈగ వాలినా ఇబ్బందే. ఇక ఆయన కీర్తి కిరీటంలోని ఒక రాయిని తొలగిస్తామంటే ఎలా ఊరుకుంటారు. వారిష్టం వచ్చినట్టు వారి పోస్ట్‌లు పెట్టారు. అదంతా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం అని, రాజ్యాంగం ప్రసాదించినదని అన్నారు. వారి మీద తిరిగి అలాంటివి గుప్పిస్తే ఆ భక్తులంతా తమని ట్రోలింగ్ చేస్తున్నారంటూ గింజుకున్నారు. తమ విమర్శలు సహేతుకం, ఇతరులు చేసే విమర్శలు దురద్దేశపూర్వకం అనే ఈ అంధభక్తుల ధోరణితోనే అసలు చిక్కు.
జవహర్‌లాల్ నెహ్రూ విమర్శలకు అతీతుడని, ఆయన మీద ఉమ్మేయడమంటే ఆకాశంలోకి ఉమ్మేయడమేనంటూ ఒక నెహ్రూ భక్తుడు, కమÖ్యనిస్టు ఒకరు, తమ సొంత దినపత్రికలో వ్యాసం రాశాడు. అంత అంధభక్తి పనికి రాదని, నెహ్రూ చేసిన తప్పు లను ఎత్తి చూపటం ఎంత అవసరమో వివరిస్తూ నేను అదే పత్రికకు సమాధాన వ్యాసం రాసి పంపాను. కాని ఆ నెహ్రూ భక్త కమ్యూనిస్టు పత్రిక వారు దానిని ప్రచురించలేదు. నేను రాసిన దానిలో ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యక్తిగత విమర్శ కాదు. అంతా నెహ్రూ అనుసరించిన విధి, విధానాలకు సంబంధించినది మాత్రమే. ఆ ప్రధానివల్ల దేశానికి జరిగిన నష్టం గురించే. అయినా ఆ ప్రశ్నించేవర్గం, భావవ్యక్తీకరణకు కట్టుబడి ఉంటామనే ఎర్రోళ్ల పత్రికలో నెహ్రూ మీద విమర్శనకు స్థానం ఇవ్వలేదు.
జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాని పదవి ప్రారంభ దినం నుండి మరణం వరకు సాగిన కాలాన్ని నిశితంగా పరిశీలించటం, విమర్శ నాత్మకంగా విశ్లేషించటం ఈ దేశంలో జరగనివ్వ లేదు. ఆయన ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ పదవుల నిచ్చి ఒక మేధోవర్గపు కంచెను తన చుట్టూ నిర్మించుకున్నాడు. ఆ కంచెగా ఏర్పడిన వర్గంలో విశ్వవిద్యాలయాల్లో ఆయన ద్వారా ప్రొఫెసర్ పోస్ట్ పొందనివారు, చరిత్రకారులు చాలామంది ఉన్నారు. విమర్శలను నెహ్రూని తాకకుండా అడ్డు గోడలా నిలవటమేకాదు ఆయన ఒక మేధావి, సైంటిఫిక్ టెంపర్ ఉన్నవాడు, విజ్ఞానశాస్త్రం ఔపాసనం పట్టినవాడూ, విమర్శలను సహించే సహనశీలి వంటి పలురకాల భుజకీర్తులు తగిలిస్తూ ప్రభుత్వ ఖర్చుతో, ప్రభుత్వ విభాగాల ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్లారు. ఆ విధంగా నెహ్రూని అంత ఎత్తున, మరే భారతీయ నాయకుడు చేరుకోలేని స్థానంలో నిలిపే ప్రయత్నం మేధో అంధభక్తులు చేశారు.
అయితే వాస్తవం భిన్నమైనది. నెహ్రూను ప్రజలు ఎన్నుకున్నాక,ఆయన పాలించిన కాలం 12ఏళ్లు మాత్రమే అనేది నిజం. భారతదేశానికి స్వతంత్రం ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్న బ్రిటీష్‌పాలకులు తమ భావజాలం భారత దేశంలో కొనసాగించే మనిషి కోసం వెతికి, నెహ్రూని ఎంచుకున్నారు. భారతీయత నచ్చని, హిందూ అనే పదం వినటానికి ఇష్టపడని, భారతీయ సంస్కృతి మెచ్చలేని లక్షణాలను ప్రధానిని చెయ్యటానికి తగిన అర్హతలుగా బ్రిటిష్‌వారు భావించారు.
నెహ్రూ ఆలోచనల్లో తెల్లదొర.అందుకే ఆయనకు భారతదేశంలో ఉన్న విశిష్టత తెలియక, దానిని వెతుక్కోవాల్సి వచ్చింది. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అంటే తనకు తెలియనిది వెతుక్కోవటమే కదా! అదే ఆయన రాసిన గొప్ప పుస్తకం పేరు అని నెహ్రూ అంధభక్తులు అంటారు.
ఆగస్టు 14`15 తేదీల్లో జరిగిన అంశాలు నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన ప్రసంగం జాగ్రత్తగా గమనిస్తే ఆయనలోని డొల్లతనం అర్థమవుతుంది.
స్వతంత్ర భారతదేశంలో తొలి ‘క్విడ్‌ప్రోకో’ నెహ్రూని ప్రధానిగా మౌంట్‌బ్యాటన్ నియమించటం. దానికి ప్రతిఫలంగా మౌంట్‌బ్యాటన్‌ని తొలి గవర్నర్ జనరల్‌గా నెహ్రూ అంగీకరించటం, బ్రిటిష్ సైనిక అధికారిని భారత సైనికజనరల్‌గా కొనసాగించడం. అంతేకాదు, భారత్‌ను రెండూ దేశాలుగా విడదీసి ఇటు భారత్, అటు పాకిస్తాన్ సైనిక దళాలకు బ్రిటీష్ జనరల్స్ ఉండి 1947 కశ్మీరీ యుద్ధం నడిపించారు. దీనివలన బ్రిటీష్‌వారి కుట్ర కొనసాగుతోందన్న ఆలోచన నెహ్రూకు రాలేదు. తనకి ప్రధాని పదవి దక్కితే చాలనుకున్నాడు.
ప్రధాని పదవికోసం ఆయన ఎంతగానో వేచి చూశాడు. అది అందుకున్న సమయంలో, ఆ ఉత్సాహంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలియనంత ఆనందంలో తేలిపోతున్న వైనం రామచంద్ర గుహ పుస్తకం, ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’లో చూడవచ్చు. ఇదీ నా మంత్రివర్గం అంటూ కవర్ తీసుకువెళ్లి, గవర్నర్ జనరల్ మౌంట్‌బ్యాటన్‌కి ఇచ్చాడు నెహ్రూ. మౌంట్ బ్యాటన్ కవర్ తెరిస్తే అది ఖాళీ కవరు. అందులో అసలు కాగితమే లేదు. నెహ్రూ పాలన ఎలా ఉండబోతున్నదో ఆ రోజే తెలిసింది.
ఇక అర్ధరాత్రి ఆయన చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని అతి గొప్ప ప్రసంగంగా ప్రస్తావిస్తుంటారు అంధభక్తులు. నెహ్రూ ప్రసంగం ట్రైటిల్‌లోనే ‘డెస్టినీ’ అనే పదం ఉంది. దానికి తెలుగు అర్థం ‘విధి’ అంతగా హేతువాద, నాస్తికవాదిగా చెప్పుకునే నెహ్రూ ‘విధి’ని నమ్మటం ఏమిటి? నేను యిలా పాలిస్తా అని చెప్పలేక ‘విధి’ మీద వదిలినవాడు మన తొలి ప్రధాని. అందుకే భారతదేశం, భారతీయత పునాది మీదకాక విదేశీ ఆలోచనాధోరణి, విధానాల మీద సాగింది ఆయన పాలన.
నెహ్రూ తొలి ప్రసంగ ప్రారంభవాక్యం గుర్తుందా?
When the whole world is sleeping India is raising (ప్రపంచమంతా నిద్రపోతుండగా భారత్ నిద్రలేస్తున్నది) అన్నది ఆ తొలివాక్యం. సైన్స్‌ని ఔపాసన పట్టినవాడు నెహ్రూ అని ఆయన భక్తులు చెపుతారు. వారి కుహనాదేవుడు నెహ్రూకి భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, ప్రపంచమంతా ఏకకాలంలో నిద్రపోదని, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో టైమ్‌జోన్ ఉంటుందని తెలియని సైంటిస్టా మన తొలి ప్రధాని!
బ్రిటీష్‌వాడు గవర్నర్ జనరల్‌గా, ఆ దేశంవాళ్లే సైనిక జనరల్స్‌గా ఉంటే వచ్చే ప్రమాదం ఏమిటో పాకిస్తాన్ నేత మహమ్మదాలి జిన్నా ముందుగా గుర్తించి వదిలించుకున్నాడు. కాని మన ప్రపంచ మేధావి నెహ్రూకి మాత్రం ఆ ప్రమాదం అర్థం కాలేదు. జూన్ 1948వరకు మౌంట్‌బ్యాటన్ గవర్నర్ జనరల్‌గా కొనసాగించాడు. అప్పుడు నెహ్రూ చూపు ఎవరి మీద ఉండేదో భారతీయు లందరికీ తెలుసు కాబట్టి వేరుగా చెప్పటం లేదు.
మన దేశం జనవరి 15ని ప్రతి సంవత్సరం ఆర్మీడేగా జరుపుకుంటుంది. 1949లో ఆ తేదీనగానీ నెహ్రూ బ్రిటీష్ జనరల్స్‌ని వదిలించుకునే నిర్ణయం తీసుకోలేదు. దీనికి అసలు కారణం తనను భారతీయ సైనిక జనరల్స్ పదవీచ్యుతుడిని చేస్తారన్న భయం. కాని, బయటకు చెప్పిన కారణం మన దేశ సైనిక అధికారులకు యుద్ధ అనుభవంలేదన్నది. ఈ విషయం ఒకసారి భారతీయ సైనికాధికారుల సమావేశంలో ప్రస్తావిస్తే, నాటి సైనిక అధికారి తిమ్మప్ప లేచి “మీకు ప్రధానిగా పాలన అనుభవం లేదు కదా. మనం కూడా బ్రిటీష్ ప్రధానికి ఆ సీటు అప్పగిద్దాం” అనేసరికి నెహ్రూ షాక్ తిన్నాడు. కోపంతో ఎవరున్నారు సమర్థ అధికారి అని అడిగితే అధికారులందరూ జనరల్ కరియప్ప పేరు సూచిం చారు. అంతేకాక,రెండవ ప్రపంచ యుద్ధ నైపు ణ్యానికి, సాధించిన విజయాలకు మెచ్చి బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చిన మెడల్స్, టైటిల్స్ చిన్నవరుస నెహ్రూ ముందు ఉంచారన్నది కథనం. అంత షాక్ ఇస్తేగాని నాటి ప్రధానికి బ్రిటిష్‌వారి మీదున్న వ్యామోహం తొలగలేదు.
నెహ్రూ అంధభక్తులు ఆయనకు ఎన్నెన్నో భుజ కీర్తులు పెట్టారు. అందులో ఆయన ప్రజాస్వామ్యవాది అని, విమర్శలను స్వీకరిస్తాడు గాని ఆగ్రహించడు అనేవి కొన్ని. అందుకు సాక్ష్యంగా నాటి మేటి కార్టూనిస్టు శంకర్‌తో ఆయన అన్నట్లుగా చెప్పిన డైలాగ్ “డోంట్ స్పేర్ మీ శంకర” (శంకర్ నన్ను వదిలి పెట్టవద్దు)ని ఉటంకిస్తుంటారు. అంత తన మీద విమర్శలను ఆయనే ప్రోత్సహించారంటారు.
కాని వాస్తవంలో నెహ్రూ తనని విమర్శించిన వారిని జైళ్లకు పంపాడు. ప్రముఖ హిందీ కవి మజ్రూహ్ సుల్తాన్‌పురి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన పద్ధతులు, పాలన గమనించి ‘ఖాదీ అనే పాము చర్మం కప్పుకున్న విషపురుగు వంటివాడు, హిట్లర్‌కి ఏ మాత్రం తీసిపోడు’ అని అన్నాడు. అంత పెద్ద కవిని అరెస్టు చేయించి, అతి వేగంగా విచారణ జరిపించి జైలుశిక్ష విధించి, దాదాపు రెండేళ్లు జైలులో పెట్టాడు.
హిట్లర్ వంటి నెహ్రును తప్పించుకోనివ్వకుండా దాడి చేయండి. అతగాడు బ్రిటీష్ (కామన్‌వెల్త్) వారి బానిస. ప్రజలు దాడిచేసి, అతడు తప్పించుకు నేందుకు వీలు లేకుండా చూడమన్నాడు సుల్తాన్‌పురి. తన హిట్లర్ మనస్తత్త్వం బయట పెట్టాడు అని ఆ కవి మీద కోపం నెహ్రూకి.
ఇక తమ నాయకుడి పాలన గురించి కొండా వెంకటప్పయ్య పంతులు వ్యంగ్యంగా గాంధీకి ఒక ఉత్తరం రాసాడు. 1947లో స్వతంత్రం వచ్చింది, ఆగస్టు 15న నెహ్రూ ప్రధాని అయ్యాడు. గాంధీ హత్య జనవరి 30, 1948న జరిగింది. అంటే అప్పటికి నెహ్రూ పాలన మొదలై ఆరునెలలకు అటూ ఇటూ ఆ కొద్ది నెలల్లోనే ఆయన అసలు స్వరూపం కొండా వెంకటప్పయ్య పంతులుగారికి అర్థమైంది. “మహాత్మా, మనం ఏదో అనుకున్నాంగాని, బ్రిటీష్ వారే మెరుగైనవారు అనిపిస్తున్నారు మన పాలకులు” అన్నది కొండావారి ఉత్తరంలోని సారాంశం.
ఎంత వేగంగా పెద్దలు అతడి నిజస్వరూపం తెలుసుకున్నారనే విషయం బయటకు రానివ్వకుండా కాంగ్రెస్, నెహ్రూ అంధభక్తులు వాస్తవాన్ని ఎలా పాతర వేశారో అర్థమవుతుంది.
1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నాటికి నెహ్రూది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు. 1952లో తొలి సారస్వత ఎన్నికలకు నిర్ణయం జరిగింది. అప్పటివరకు ఆగి, ఆ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచి, అప్పుడు రాజ్యాంగ సవరణకు పూనుకోవటం ఒక ప్రజాస్వామ్యవాది చెయ్యాల్సినది. కాని జవాహర్‌లాల్‌లోని హిట్లర్ 1951లోనే తొలి రాజ్యాంగ సవరణ తెచ్చాడు. అది భావవ్యక్తీకరణ మీద ఆంక్షలు విధించేందుకు, మరెవరూ మజ్రూహ్ సుల్తాన్ పురి బాటలో తన మీద విమర్శలకు వినకుండా ఉండేందుకు తెచ్చిన సవరణ అనేది నిపుణుల అభిప్రాయం.
కాంగ్రెస్‌పార్టీవల్లనే స్వాతంత్య్రం వచ్చి ఉంటే 1947 తర్వాత నెహ్రూ ప్రధానిగా దేశాన్ని అద్భుతంగా నడిపి ఉంటే అపుడు మరో పార్టీకి ఓటువేసే ఆలోచన చెయ్యకూడదు. పోలైన ఓట్లలో కనీసం 90 శాతం ఆ పార్టీకి దక్కాలి. కాని వాస్తవంలో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్‌పార్టీకి దక్కింది దాదాపు 45 శాతం మాత్రమే. బీజేపీకి, నరేంద్రమోదీకి 40శాతం ఓట్లకన్నా తక్కువ వచ్చాయి. అంటే 60 % ఓటు బీజేపీ, మోదీ వ్యతిరేక ఓటు అని వాదించే కాంగ్రెస్, నెహ్రూ అంధభక్తులకు 1952లోనే 55% ఆ పార్టీకి, నెహ్రూ నాయకత్వానికి వ్యతిరేకం అనే విషయం గుర్తుచేయాలి.
జాతీయ స్థాయిలో నెహ్రూకి సాటి నిలువగలిగిన నాయకుడు మరొకరు లేరు అని అంధభక్తులు ప్రచారంలోకి తెచ్చారు. కాని 1952 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఆయన పోటీ చేసిన నియోజక వర్గంలో వచ్చిన మెజారిటీ కన్నా నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని నల్గొండ నియోజక వర్గంలో కమÖ్యనిస్టుపార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ వచ్చింది.
భారత్‌కి చెందాల్సిన కశ్మీర్ భాగం పాకిస్తాన్ చేతిలోకి పోయింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసింది, భారత్‌లో కలవటానికి సిద్ధపడ్డ కలాత్ సంస్థానం (నేటి బలూచిస్తాన్‌ని) మన దేశంలో కలవ నివ్వనిది, టిబెట్ విషయంలో మనమేమి చెయ్యలేం అని బహిరంగంగా చేతులెత్తి, చైనా టిబెట్‌ని ఆక్రమించేలా చేసింది, కశ్మీర్‌కి ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించింది జవాహర్ లాల్ నెహ్రూనే.
జునాఘడ్ సంస్థానం విలీనంలో, హైదరాబాద్ సంస్థానాన్ని లొంగదీసుకోవటం రెండూ సర్దార్‌పటేల్ ద్వారా జరిగాయి కాబట్టి గానీ, లేకుంటే నెహ్రూ వాటి విషయంలోనూ సమస్యను జటిలం చేసేవాడు.
తన వ్యక్తిగత ఇమేజ్, తన రొమాంటిక్ జీవనానికి ప్రాధాన్యతనిచ్చినందుకే జవాహర్‌లాల్ నెహ్రూ 1947-52 మధ్య కాలం భారత్‌కి డిజాస్టర్. అయినా ఆ ఐదు సంవత్సరాలు ప్రధాని నెహ్రూ ‘క్రెడిట’ లోకెయ్యాలని వాదిస్తారు ఆయన అంధభక్తులు. కాని ఈ అయిదేళ్ల కాలంలో ఆయన చేసిన తప్పిదాలు బయటకు రానివ్వరు. దాచేస్తే దాగవు వాస్తవాలు. ఇప్పటికైనా బయట పెట్టకపోతే భారత్‌కి ద్రోహంచేసిన వారమవుతాం.
డా॥ దుగ్గరాజు శ్రీనివాసరావు
సీనియర్ జర్నలిస్ట్