యావత్ మానవాళిని, ముఖ్యంగా యువతను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిపై ప్రధాని నరేంద్ర మోదీ సమర శంఖం పూరించారు. ఆగష్టు 2వ తేదీన దేశవ్యాప్తంగా 100 వారాల ఉద్యమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్షంగా కోటి మందికిపై యువతీయువకులను, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ఏకకాలంలో ప్రసంగిం చారు. సమాజానికి చీడపురుగు లాంటి మాదకద్రవ్యాల బారిన యువత పడకుండా చూడాల్సిన బాధ్యతను వారి తల్లిదండ్రులు, గురువులతో పాటుగా సామాజిక, ఆధ్యాత్మిక, ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించారు. ఆ దిశగా యువతకు అవగాహన కల్పించి, 2047నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఆరోగ్యకరమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన యువతరాన్ని నిర్మించడంలో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను, ఆచార, వ్యవహారాలను, కళలను వినియోగించాల్సిన ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు. సమష్టి కార్యాచరణ ద్వారా మాదక ద్రవ్య రహిత భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రధాని పూర్తి ప్రసంగ పాఠం జాగృతి పాఠకుల కోసం.

నమస్తే!

నేడు ఒక గొప్పదైన, కీలకమైన సంకల్పం చేయడానికి దేశ పౌరులమైన మనమందరం ఏకమయ్యాము. 28 వేలకు పైగా ప్రాంతాల నుండి ఇందులో పాల్గొంటున్న కోటి మంది యువతకు, ఈ కార్యక్రమంతో మమేకమైన గౌరవనీయులైన సాధువులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్య మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు నేను ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మనం ఒక సంకల్పంతో ఉద్యమంలా చేపడుతున్న ఈ కార్యక్రమం కేవలం ఒక వ్యక్తి, కుటుంబం, సమాజానికీ సంబంధించినది కాదు. ఇది యావత్ దేశానికి సంబంధించినది.

నా యువ మిత్రులారా!

వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్‌లో భాగంగా, ‘నశా ముక్త్ యువ’ (మాదకద్రవ్య రహిత యువత) అనే ఈ ఉద్యమనామమే దీని సంకల్పాన్ని స్పష్టం చేస్తోంది. నేడు, దేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరుణంలో, దేశ యువత శారీర కంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలి. వారిలో ఆత్మవిశ్వాసం తొణకిసలాడాలి. మాదక ద్రవ్యాలు వంటి ప్రాణాంతక వ్యసనాలకు యువత దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇదే ఈ ఉద్యమం లక్ష్యం. అందువల్ల, మాదకద్రవ్యాలు, వాటి వల్ల కలిగే అనర్థాలను యువత అర్థం చేసుకోవాలి. వాటి పట్ల పూర్తి అవగాహనతో ఉండాలి. వాటికి దూరంగా యువత ఉండేలా చూడాలని మన మందరం సంకల్పించుకోవాలి. ఈ ఉద్యమంలో నశా ముక్త్ యువ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

గత ఏడాది కాశీ పవిత్రభూమి నుండి ఈ ఉద్యమం ప్రయోగాత్మకంగా ప్రారంభం కావడం కాశీ పార్లమెంటు సభ్యునిగా నాకు సంతోషాన్నిస్తోంది. కాబట్టి, ఇది శాస్త్రీయ స్పష్టతతో పాటు ఆధ్యాత్మిక శక్తిని, సాధువుల ఆశీర్వాదాలను, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తనలో ఇముడ్చుకుంది. ఇది శతాబ్దాలుగా మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని తిరస్కరిస్తూ వస్తున్న సాంస్కృతిక నిబద్ధత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే కోట్లాది పౌరుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా 125కు పైగా ఆధ్యాత్మిక సంస్థలు ఈరోజు మాతో చేతులు కలిపాయి. సామాజిక సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు కూడా ఈ దిశగా సంకల్పం తీసుకున్నాయి.‘కాశీ ప్రకటన’ ద్వారా సమష్టిగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. కాశీలో పుట్టిన సంక్షేమ ఆధారిత ఆలోచన నేడు ఒక జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకోవడాన్ని మనం చూస్తున్నాము. ‘నశా ముక్త్ యువ’ ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.

కొన్ని పనుల విషయంలో ఒంటరిగా ప్రయత్నిస్తు న్నప్పుడు మనిషి నిరుత్సాహానికి లేదా అలసటకు గురవ్వవచ్చు. ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించే సంకల్పం సన్నగిల్లవచ్చు. కానీ, అదే పని లక్షలాది మంది కలిసి, భుజం భుజం కలిపి సాగించే సామూహిక ఉద్యమంగా మారినప్పుడు, ఒంటరిగా ఏమీ సాధించలేకపోయిన వారు కూడా కొత్త ఉత్సాహంతో ఉత్తేజితులవుతారు. సమష్టి కృషితో గొప్ప శక్తి లభిస్తుంది. నేడు అదే స్ఫూర్తితో సాగుతున్న ఈ ప్రచార ఉద్యమం ప్రతి యువకుడి హృదయాన్ని తాకనుంది. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని కొద్దిసేపటి క్రితమే దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతీయువకులు ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా జీవించాలని దృఢ నిశ్చయం చేసుకోవడమే కాకుండా, మాదకద్రవ్య రహిత జీవనం గురించిన సందేశాన్ని మీ పాఠశాలలు, కళాశాలలు, సమాజంలో వ్యాప్తి చేయడానికి కూడా వీరు సంకల్పించారు.

ఈ రోజు తీసుకున్న సంకల్పం వచ్చే 100 వారాల పాటు నిరంతరాయంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఆదివారం కళలు, సంస్కృతి, క్రీడలు, ధ్యానం, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. వ్యసన విముక్తికి సంబంధించిన సందేశం కొత్త వ్యక్తులకు చేరుతుంది. వచ్చే 100 ఆదివారాలు మాదకద్రవ్య రహిత భారత్ దిశగా వేసే 100 బలమైన అడుగులుగా నిలుస్తాయి.

నేడు వేలాది పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది ‘మై భారత’ (My Bharat) స్వచ్ఛంద కార్యకర్తలు కూడా ఈ రోజు మాతో అనుసంధానమయ్యారు. ఎనఎసఎస్‌కు చెందిన యువ సభ్యులు కూడా మాతో చేరారు. వివిధ ప్రాంతాలు, విద్యాసంస్థలు, నేపథ్యాలకు చెందిన కోటి మందికి పైగా యువతీయువకులు ఈ రోజు ఏకమయ్యారు. మీరే ఈ గొప్ప ఉద్యమానికి నాయకులు. భారతీయ యువత తమ బాధ్యతల పట్ల ఎంతటి అవగాహన, వివేకం, చిత్తశుద్ధి కలిగి ఉన్నదనే విషయంపై నా నమ్మకాన్ని మీరు మరింత బలపరిచారు. ఈ ఉద్యమానికి సంబంధించి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీరు భారతదేశపు ‘అమృత తరానికి’ (Amrit Generation) చెందినవారు. రాబోయే 20-25 ఏళ్లలో, మీరు మీ జీవన గమనాన్ని తీర్చిదిద్దుకోవడమే కాకుండా, 2047 నాటికి ‘వికసిత్ భారత’ లక్ష్యం వైపు దేశాన్ని నడిపిస్తారు. మీరు ఆ (వికసిత్ భారత్) శిఖరాగ్రాన నిలిచి, దాని ఫలాలను పూర్తిగా అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. దేశానికి మీ శక్తిసామర్థ్యాలు, సృజనాత్మకత, ప్రతిభ ఎంతో అవసరం. కాబట్టి, దేశం కోసం, మీ భవిష్యత్తు కోసం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మాదకద్రవ్యాల వినియోగం మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అది యువతను వారి కలల నుంచి క్రమంగా దూరం చేస్తుంది. యువతీయువకులు ప్రదర్శించిన ఒక నాటకాన్ని మనం ఇప్పుడే చూశాము. వారు ఆ నాటకం ద్వారా చాలా తక్కువ సమయంలోనే, అత్యుత్తమ రీతిలో సమస్యను ఎత్తిచూపారు. దానివల్ల తలెత్తిన సంక్షోభాన్ని వివరించారు. సామూహిక కృషితో దానిని అధిగమించడానికిì ఒక మార్గాన్ని చూపడం వంటివి చేయగలిగారు. ఆ ప్రదర్శన క్లుప్తంగానే ఉన్నప్పటికీ, “రండి, ఒక నాటకాన్ని చూద్దాం!” అన్న ఆహ్వానానికి అనుగుణంగా అది కేవలం ఒక నాటకం మాత్రమే కాకుండా, అంతకు మించిన గొప్ప సందేశాన్ని మనకు అందించింది. అది మనల్ని చైతన్యపరిచింది. ఆ సవాలు(మాదక ద్రవ్యం)ను ఎదుర్కోవడంలో స్ఫూర్తినిచ్చింది.

ఈ రోజుల్లో యువత స్టార్టప్‌ల ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. కృత్రిమ మేధస్సు(ఏఐ)ను ముందుండి నడిపిస్తోంది. క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. అంతరిక్ష పరిశోధన నుండి విజ్ఞాన శాస్త్రం వరకు కొత్త మైలురాళ్లను యువత నెలకొల్పడాన్ని మనం చూస్తున్నాం. కానీ మిత్రులారా, ఒక యువకుడు మాదకద్రవ్యాల వ్యసనానికి బలి అయినప్పుడు, నష్టపోయేది కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాదు. ఒక కల కనుమరుగవు తుంది. అది అకాల మరణం చెందుతుంది. ఒక కుటుంబం ఓడిపోతుంది. యావత్ కుటుంబం ఛిన్నాభిన్నమైపోతుంది. అంతేకాకుండా అలాంటి వారిని సమాజం ద్వేషిస్తుంది.మత్తుపదార్థం శరీరానికి మాత్రమే హాని చేయదు. అది ఒక తల్లి చిరునవ్వును దూరం చేస్తుంది. ఒక తండ్రి కలలను ఛిద్రం చేస్తుంది. రాఖీ బంధంపై సోదరికున్న ఆశను బలహీనపరుస్తుంది. ఒక తమ్ముడికి ఆదర్శప్రాయుడైన అన్నను లేకుండా చేస్తుంది. వృద్ధ తల్లిదండ్రులు తమ కళ్లెదుటే తమ సొంత బిడ్డ నెమ్మదిగా తనను తాను కోల్పోవడాన్ని, క్రమంగా క్షీణించి, నశించి పోతుండటాన్ని చూస్తూ ప్రతిరోజూ వేదనతో జీవిస్తారు. కుటుంబాలలో, సమాజంలో ఇలాంటివి జరిగినప్పుడు, దేశం అనివార్యంగా బలహీనపడు తుంది. తత్ఫలితంగా, మన యువతను మాదక ద్రవ్యాల వ్యసనం అనే ఉచ్చులోకి లాగడానికి శత్రు దేశాలు కుట్రలతో శాయశక్తులా ప్రయత్నిస్తాయి. మాదకద్రవ్యాల సరఫరా ద్వారా లాభపడటం, మనదేశం వంటి దేశాన్ని నాశనం చేయడం కూడా వారి ఉగ్రవాద కుట్రలో భాగమే. కాబట్టి, మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకోకుండా మన యువతను మనం కాపాడుకోవాలి.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మీ సామర్థ్యాన్ని కాపాడుకోవాలి. మాదకద్రవ్యాలు తాత్కాలిక ఉల్లాసాన్ని ఇవ్వవచ్చు, కానీ అవి మీ వృత్తిని, కుటుంబ జీవితాన్ని అధోగతికి లాగుతాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మాదక ద్రవ్యాలను మనం ఏ విధంగానూ ఆమోదించ కూడదు.

మన సమాజంలో కూడా మాదకద్రవ్యాల వినియోగాన్ని ఎల్లప్పుడూ ఒక దురాచారంగానే పరిగణిస్తూ వచ్చారు. మన సాధువులు, గురువులు దీని పట్ల మనల్ని హెచ్చరించారు. శ్రీ గురుగ్రంథ సాహిబ్‌లో కూడా ఈ విషయాన్ని “జితు పీతై మతి దూరి హోయి బర్‌లు పవై విచి ఆయీ.. ఆప్‌నా పరాయియా న పఛానాయీ ఖస్‌మహు ధకే ఖాయీ” అని పేర్కొన్నారు. విచక్షణ జ్ఞానాన్ని, బుద్ధిని హరించి, స్వపర భేదాన్ని విస్మరించేలా చేసే మత్తుపదార్థం మనిషిని వినాశనం వైపు నడిపిస్తుంది అని దాని అర్థం.

వ్యసనం నుంచి బైటపడటంలో మన సంస్కృతి మార్గనిర్దేశం చేస్తుంది. దాని నివారణకు హెచ్చరికలను కూడా చేస్తుంది. యోగా, ధ్యాన శక్తితో పాటు సామాజిక మద్దతు, వ్యసనానికి వ్యతిరేకంగా మన అంతర్గత సంకల్పాన్ని బలపరుస్తుంది. అంతేకాకుండా, దానిని అధిగమించడానికి సహాయపడే పునరావాస కేంద్రాల వంటి సౌకర్యాలు కూడా ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, ఒక యువకుడు పొరపాటున మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకున్నంత మాత్రాన, దాని నుంచి బైటపడటానికి అతడికి ఇక ఎలాంటి మార్గాలు లేవని అనుకోరాదు. కుటుంబంలోని ఒకరు వ్యసనానికి బానిసలైతే, సామాజిక ప్రతిష్టను కాపాడుకునే నెపంతో, ఆ విషయాన్ని ఆ కుటుంబం దాచిపెట్టకూడదనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు సహాయం చేయగల వారిని సంప్రదించాలి. వారితో మనసు విప్పి మాట్లాడాలి. నిపుణుల సహాయం తీసుకోవాలి. వైద్యపరమైన సహాయంతో మీ బిడ్డ వ్యసనం నుండి బయటపడటానికి ప్రయత్నించండి. పిల్లలు అటువంటి ప్రమాదకరమైన ఊబిలో చిక్కుకోకముందే వారికి అండగా నిలిచేలా, కుటుంబంలో వారితో స్వేచ్ఛగా సంభాషించే ఒక వాతావరణాన్ని మనం పెంపొందించుకోవాలి. కొంచెం శ్రద్ధ వహిస్తే (వ్యసనానికి సంబంధించిన) ఆ మార్పులు మీకే కనిపిస్తాయి. అతడు లేదా ఆమె ఏదో అయోమయంలో ఉన్నట్లు అనిపించడం, కళ్లలోకి సూటిగా చూడకపోవడం, తన గదికే పరిమితం కావడం, అర్ధరాత్రి వేళ ఇంటికి రావడం, ఎక్కువ డబ్బులు అడగడం వంటి ఈ సంకేతాలన్నీ ఏదో తేడాగా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తాయి.

ఈ సందర్భంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని మన ప్రొఫెసర్లకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అదేమిటంటే.. దయచేసి మీ విద్యార్థులతో సాధారణ పాఠ్యాంశాలతో పాటు, మాదకద్రవ్యాల ముప్పును గురించి చర్చించండి. మీ విద్యా ప్రాంగణాలలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించండి. మీ ప్రయత్నాలు గణనీయమైన ఫలితాలను ఇవ్వగలవు. మిత్రులారా! మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే-వ్యసనాన్ని జయించిన యువత బలహీనులు కాదు. వ్యసనాన్ని అధిగమించిన వ్యక్తి నిజమైన యోధుడు. సమాజం వారిని గౌరవించాలి, ఆదరించాలి. వారికి మరో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే, ఒక వ్యక్తిని నిర్వచించేది మాదక ద్రవ్యాలతో కూడిన అతడి లేదా ఆమె గతం కాదు. వారి ధైర్యమే వారిని నిర్వచిస్తుంది.

నేడు, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో యువతకు అండగా ప్రభుత్వం నిలిచింది. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలను విక్రయించేవారిపైనా, వాటిని అక్రమంగా తరలించేవారిపైనా కఠినమైన చర్యలు తీసుకుంటు న్నాము. గతంతో పోలిస్తే అలాంటివారి అరెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. వేల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటు న్నాము. ఇది మాదకద్రవ్యాల నిర్మూలన విషయంలో మా ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నదీ నిరూపి స్తోంది. ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలన్నీ కలిసి ‘మిషన్ మోడ’లో (ప్రత్యేక కార్యాచరణతో) పరిష్కరిస్తాయనే పూర్తి నమ్మకం నాకు ఉంది. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ద్వారా, యువశక్తిని కాపాడుకోవడమే కాకుండా, ‘వికసిత్ భారత’ నిర్మాణ సంకల్పాన్ని మన దేశ యువత ముందుకు తీసుకువెళుతుందని నేను విశ్వసిస్తున్నాను. నేడు నా కనుల ఎదుట అనేక మంది గొప్ప సాధువులు ఉన్నారు. వారికి నేను దూరం నుండే నమస్కరిస్తున్నాను. ప్రస్తుతం నేను దేశం నలుమూలలా విస్తరించి ఉన్న సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మిక గురువులు, వారికి సంబంధించిన సమÖహాలు, యువ భక్తులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. వచ్చే 100 వారాలలో, ఒక్కో సంస్థ ఒక్కో వారానికి బాధ్యత తీసుకోవాలి. ఆ వారం మొత్తం దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమానికి ఆ సంస్థ నాయకత్వం వహిస్తుంది. మిగిలిన వారంతా అందులో భాగస్వాములవుతారు. ఆదివారం జరిగే ఒక భారీ కార్యక్రమంతో ఆ వారపు కార్యక్రమం ముగుస్తుంది. రెండవ వారంలో, మరో సంస్థ, మరొక బృందం వారం పొడవునా కార్యక్రమాలను నిర్వహించి, ఆదివారం నాడు ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టాలి. మన దేశంలోని ఆధ్యాత్మిక, సామాజిక, యువజన సంస్థలు ఒక్కొక్కటి ఒక్కో వారం బాధ్యత తీసుకోవాలి. ఇతర వర్గాలను కూడా కలుపుకొని పోవాలి. ఆదివారం నాడు సమష్టిగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇలా 100 వారాల పాటు చేసుకుంటూ ముందుకు సాగిన పక్షంలో, దేశవ్యాప్తంగా ఎంతటి భారీ ఉద్యమం ఉద్భవిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. పవిత్రమైన ఈ కార్యక్రమంలో పాల్గొని, మన అందరినీ ఆశీర్వదించ డానికి సమయం కేటాయించిన సాధువులు, ఆచార్యులు, సంస్థý ప్రముఖులకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నిజంగా ఒక అద్భుతమైన కార్యాన్ని సాధిస్తున్నారు అని చెప్పడం ద్వారా ఇక్కడ సమావేశ మైన కోటి మందికి పైగా యువతను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ‘మై భారత’ (My Bharat) స్వచ్ఛంద కార్యకర్తలను నేను అభినందిస్తున్నాను. వారు ఏదైనా సాధించాలని సంకల్పిస్తే, దానిని తప్పక పూర్తి చేస్తారు. ఇటీవల నాకు ఈ స్వచ్ఛంద కార్యకర్తలను కలిసే అవకాశం లభించింది. వారు భారతదేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి, అక్కడ వారం రోజుల పాటు గడిపారు.ఒకప్పుడు దేశపు “చివరి గ్రామాలు”గా పేరొందిన ఆ ప్రాంతాలు, ఇప్పుడు దేశపు “మొదటి గ్రామాలు”గా గుర్తింపు పొందాయి. వారి అనుభవాలు నిజంగా స్ఫూర్తిదాయకం. అలాంటి కార్యకర్తలు నేడు ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించగలగడం, దేశం పట్ల వారికి ఉన్న అంకితభావానికి, బాధ్యతాయుతమైన సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. వారికి నా అభినందనలు, ప్రశంసలు తెలియజేస్తున్నాను. మీ సామూహిక కృషి ద్వారా ఈ ఉద్యమం ప్రతి ఇంటికీ చేరుతుందని, ప్రతి యువకుని హృదయాన్ని తాకుతుందని, అదే సమయంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులకు పెను భయంగా మారుతుందనే పూర్తి విశ్వాసం నాకు ఉంది. మనం కలిసి ముందుకు సాగుదాం. మీ అందరికీ శుభాకాంక్షలు! ధన్యవాదాలు!

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.