భారత్‌పై అమెరికా సోషల్ మీడియా దిగ్గజం మెటా కుట్రకు పాల్పడుతోందనే సంగతి మరోసారి తేటతెల్లమైంది. ఫేస్‌బుక్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో కూడిన ఒక వీడియోను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇటీవల తొలగించడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మÖడవసారి అధికారంలోకి వచ్చిననాటి నుంచి దేశ సార్వభౌమత్వానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా మెటా అధీనంలోని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల చర్యలు మితిమీరి పోతున్నాయి. అయితే ఇంత విపరీతాలు జరుగుతుంటే చేతులు కట్టుకొని, చూస్తూ కూర్చోవడానికి మోదీ సర్కారు సిద్ధంగా లేదు.

మెటా మెడలు వంచడానికి, దానితో తాడో పేడో తేల్చుకోవడానికి ఉపక్రమించింది. ఆ క్రమంలో సామాజిక మాధ్యమాల నియంత్రణపై చర్చించడానికి కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతికతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆగస్టు 3న సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్ట్ తాత్కాలికంగా తొలగించిన విషయంపై మెటా ప్రతినిధులను కఠినంగా ప్రశ్నించింది. అయితే సాంకేతిక లోపం కారణంగా వీడియో తొలగింపు జరిగిందంటూ సమాధాన మిచ్చిన మెటా ప్రతినిధుల ఉదాసీన వైఖరి పట్ల కమిటీ మండిపడింది. ప్రధాని వీడియో ఐదు గంటలపాటు అందుబాటులో లేకపోవడం తీవ్రమైన విషయం అని హెచ్చరించింది. దీనిపై మెటా ప్రతినిధులు క్షమాపణ చెప్పారు. అయితే కేవలం క్షమాపణ చెప్పినంత మాత్రాన విషయ తీవ్రత తగ్గిపోదని కమిటీ వేలెత్తి చూపింది.దీనికి జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని స్పష్టం చేసింది. వీడియోను తొలగించిన అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మెటా ఇండియాపై తెలంగాణలో ఎఫఐఆర్ నమోదైన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ప్రధాని వీడియో తొలగింపునకు నైతిక బాధ్యత వహిస్తూ మెటా ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) మార్క్ జుకెర్‌బెర్గ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది. మెటా పరిధిలోని సామాజిక మాధ్యమాల్లో ఉన్న వివాదాస్పదమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌పై కంపెనీ తీసుకున్న చర్యల వివరాలను అడిగింది. మహిళలు, బాలలు, రైతులు, పల్లె ప్రజలు, శ్రామికులు , సాధారణ ప్రజల గోప్యతను ఎలా రక్షిస్తారని, ప్రభుత్వ ప్రజా క్రమాన్ని ఎలా నిర్ధారిస్తారని కమిటీ ప్రశ్నించింది. బాలల లైంగిక వేధింపుల కంటెంట్ తొలగించకపోవడం, హోమ్ మంత్రిత్వ శాఖ, ఐటీ మంత్రిత్వ శాఖ సూచనలను పాటించకపోవడంపై మోటా ప్రతినిధులను కమిటీ నిలదీసింది. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ ప్రధానమంత్రి కంటెంట్‌ను తొలగించడం మెటా ఇండియాకు ఇది మొదటిసారి కాదని ఆరోపించారు. 2024 ఎన్నికల ఫలితాలపై జుకెర్‌బెర్గ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆ తరువాత క్షమాపణ చెప్పిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు.  దేశాన్ని అస్థిరపరిచే ఉద్దేశ్యం మెటాకు ఉందని విమర్శించారు.

మెటా అనుచిత వైఖరి వివరాల్లోకి వెళితే.. విద్యార్థి నిరసనకారులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో జూలై 28న తొలగింపునకు గురైంది. ఇదే విషయాన్ని వినియోగదారులు గుర్తించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొనివచ్చారు. దీంతో వీడియోను ఫేస్‌బుక్ పునరుద్ధరించింది. పొరపాటు జరిగిందంటూ మెటా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనను కేంద్రం చాలా తీవ్రంగా పరిగణించింది. మెటా, ఇన్‌స్టాగ్రామ్ అంతర్జాతీయ అధిపతులకు  ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. జూలై 23న అప్‌లోడ్ చేసిన ఆ వీడియోలో, పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రభుత్వం త్వరలో కఠినమైన చర్యలను ప్రకటిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

బాలల లైంగిక దోపిడీ ప్రకటనలపై కేంద్రం హెచ్చరిక

జూలై ప్రారంభంలో, వినియోగదారులకు బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన ప్రకటనలు, కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ చూపిస్తోందనే ఆధారాలు  బీబీసీ దర్యాప్తులో బయటపడటంతో భారత్ పట్ల మెటా కుట్ర వెలుగులోకి వచ్చింది . బీబీసీ ఐ దర్యాప్తు ప్రకారం, భారతదేశంలో బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను ప్రోత్సహించే చెల్లింపు ప్రకటనలను ఇన్‌స్టాగ్రామ్ ప్రదర్శిస్తోంది. ఈ ప్రకటనలు వినియోగదారులను టెలిగ్రామ్ ఛానెళ్లకు మళ్లిస్తున్నాయని, అక్కడ అలాంటి కంటెంట్‌ను కొనుగోలు చేయవచ్చని ఆ దర్యాప్తులో తేలింది. బీబీసీ దర్యాప్తు ఆధారంగా, మరింత లోతుగా విచారణ చేయాలని అధికారులను ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. ఆ తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌లోని చెల్లింపు ప్రకటనలలో బాలల లైంగిక దోపిడీ సమాచారం ఉన్నందుకు ప్రభుత్వం మెటాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. బాలల దుర్వినియోగాన్ని ప్రోత్సహించే అన్ని ప్రకటనలు, కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని ఇన్‌స్టాగ్రామ్‌ను ఆదేశించింది. ఇదే నెలలో వినియోగదారులు ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌లను ఉపయోగించి చాట్ చేయడానికి అనుమతించే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రారంభించడాన్ని కూడా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. అది ఆన్‌లైన్ మోసాలు,  స్కామ్‌లను పెంచే అవకాశం ఉందని హెచ్చరించింది.

దేశం విడిచివెళ్లండి: వాట్సాప్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక

ఈ ఏడాది ఫిబ్రవరిలో, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వాట్సాప్‌ను తీవ్రంగా మందలించారు. “మీరు మా రాజ్యాంగాన్ని పాటించలేకపోతే, భారతదేశం విడిచి వెళ్ళండి. పౌరుల గోప్యతకు భంగం కలగడాన్ని మేము అనుమతించము,” అని హెచ్చరించారు. వాట్సాప్ 2021 గోప్యతా విధానానికి సంబంధించిన ఒక పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం ప్రకారం, వాణిజ్య ప్రకటనలు, మార్కెటింగ్ కోసం వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్, దాని అన్ని గ్రూప్ కంపెనీలతో పంచుకోవడానికి వాట్సాప్‌కు అనుమతి ఉంది. ఈ విషయంపై విచారణ జరుపుతున్నప్పుడు వాట్సాప్ గుత్తాధిపత్యం వినియోగదారులకు ఎటువంటి నిజమైన ఎంపికను మిగల్చడం లేదని, దాని డేటా సేకరణ పద్ధతులను “వ్యక్తిగత సమాచార చౌర్యం”తో చీఫ్ జస్టిస్ పోల్చారు.

జుకెర్‌బెర్గ్ వాచాలత్వం

గతంలో జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో 2024 భారత ఎన్నికల ఫలితాలపై  మెటా సీఈఓ మార్క్ జుకెర్ బెర్గ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్‌కు మెటా కంపెనీ క్షమాపణలు చెప్పింది. భారతదేశం సహా అనేక దేశాల్లోని  ప్రభుత్వాలు కోవిడ్ అనంతర ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయాయని ఆయన పేర్కొన్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 2024 ఎన్నికలు కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి తిరిగి అధికారాన్ని ఇచ్చాయని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వరుసగా మÖడవసారి అధికారాన్ని కైవసం చేసుకుందని అన్నారు. 2024 ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. జుకెర్‌బెర్గ్ వ్యాఖ్యలు “వాస్తవాలకు విరుద్ధం” అని తోసిపుచ్చారు.

ఆగస్టు 3న బీజేపీ ఎంపీ దూబే చెప్పినట్టుగా భారత్‌ను అస్థిరపరిచే ఉద్దేశ్యంతో ఒక పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్న మెటా లాంటి పాశ్చాత్య సామాజిక మాధ్యమ దిగ్గజాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. తమ వేదికలపై కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న డీప్ ఫేక్‌ల పట్ల తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న సామాజిక మాధ్యమాలను కట్టడి చేయడానికి ఒక చట్టం చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. అంతే కాకుండా వాట్సాప్ ద్వారా పెచ్చరిల్లిపోతున్న డిజిటల్ అరెస్టులను సమమూలంగా నిర్మూలించే విధి, విధానాలకు కూడా ఈ చట్టంలో చోటు కల్పిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా తెలియపరచడం ఆ దిశగా ఒక శుభపరిణామం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.