నీట్-యూజీ లీకేజీ తర్వాత కేంద్ర ప్రభుత్వం మొత్తం పరీక్షల ప్రక్రియ ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే ఎన్‌టీఏ సంస్కరణల కోసం నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు చట్ట సవరణ  బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదింపచి చట్టరూపం ఇచ్చింది. దేశంలో పరీక్షవ్యవస్థను మరింత పటిష్ఠంగా, విశ్వసనీయంగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు వందేమాతరం గీతానికి జనగణమన గీతంతో సమాన హోదా కల్పిస్తూ చారిత్రక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో కీలకమైనవి ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు చట్ట సవరణ బిల్లు, వందేమాతరం బిల్లు,  విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు.. ఇందులో అత్యంత కీలకంగా నిలిచింది ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు చట్ట సవరణ  బిల్లు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించిన నీట్-యూజీ లీకేజీ తర్వాత జరిగిన వరుస పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎన్‌టీఏ పనితీరులో సాంకేతిక, నిర్మాణాత్మక మార్పులు సూచించేందుకు కేంద్రం ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఆధార్ రూపకర్త నందన్ నీలేకని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, సురక్షితంగా, సాంకేతికత ఆధారంగా జరిగేలా తగిన సంస్కరణలను ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎన్‌టీఏ పరీక్షల్లో ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా టెక్నాలజీని గరిష్టంగా ఎలా వాడుకోవాలనే విషయంపై వీరు ప్రధానంగా దృష్టి సారిస్తారు.ఈ కమిటీలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, కేంద్ర ఉన్నత విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, ప్రముఖ లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా ఉన్నారు.

పరీక్షల అక్రమాలపై కేంద్రం ఇప్పటికే పాలనా పరమైన చర్యలు ప్రారంభించింది. ఎన్‌టీఏలో 47మంది అధికారులను తొలగించారు. అలాగే పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థలో సంస్కరణలు, సాంకేతిక భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యాంటీ పేపర్ లీక్ చట్టం

ప్రశ్నపత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే దిశగా  2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. దీనిని ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు.  లోక్‌సభలో చర్చ అనంతరం ఆమోదం పొందగా, మరుసటిరోజు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి ఆమోదముద్ర వేశారు. దీనితో ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు’ చట్టంగా మారినట్లు పేర్కొంటూ న్యాయశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త చట్టం ప్రకారం ప్రశ్నపత్రాల లీకేజీ పాల్పడిన వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ సంస్థలు, వ్యవస్థీకృతంగా నేరానికి పాల్పడితే రూ.10కోట్ల వరకు జరిమానా విధిస్తారు. ఐదు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష వేస్తారు. ఇంతకుముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు పేపర్ లీకేజీ కేసులపై విచారణ జరిపేది. కానీ, ఇకపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలు ఈ కేసుల్ని విచారిస్తాయి. పేపర్ లీక్ కేసుల త్వరితగతి విచారణకోసం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. రోజువారీ విచారణలో భాగంగా కేసులను మరింత వేగంగా పరిష్కరించనున్నారు.

గతంలో పేపర్ లీకేజీ కేసుల విచారణకు కాల పరిమితి అంటూ లేదు. కొత్త బిల్లు ప్రకారం ఈ కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తి చేయాలి. కేసు నమోదయ్యాక మూడు నెలల్లో తీర్పును వెలువరించాలి. తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు 30 రోజుల గడువు నిర్ణయించారు. అప్పీల్‌పై కూడా 90 రోజుల్లోనే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలు, పరీక్షార్థుల తనిఖీ, బయోమెట్రిక్ నమోదు, భద్రతా ప్రమాణాలు, సీట్ల కేటాయింపు, ప్రశ్నపత్రాల కూర్పు, పేపర్‌ల లోడింగ్, ఇన్విజిలేషన్‌లకు సంబంధించి కొత్త నిబంధనలు, ప్రమాణాల రూపకల్పనకు సంబంధించి బిల్లులో ప్రతిపాదనలు చేశారు. పేపర్ లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్, నకిలీ వెబ్‌సైట్ల రూపకల్పన, నకిలీ ఐడీ కార్డులను జారీచేయడం.. ఇలా 15 అనైతిక చర్యలను నేరాలుగా పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మళ్లీ విశ్వాసం పెరిగే అవకాశం ఉంది.

మరింత బలోపేతం: మోదీ

దేశంలో పరీక్షవ్యవస్థను మరింత పటిష్ఠంగా, విశ్వసనీయంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించడం దేశానికి ఒక చారిత్రాత్మక సందర్భమని పేర్కొన్నారు. దేశంలో పరీక్షల నిర్వహణలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. గతంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పేపర్ లీక్ ఘటనలను ఎదుర్కొన్నాయని, అందుకే పరీక్షా విధానంలో సమగ్ర సంస్కరణలు అవసరమయ్యాయని తెలిపారు. ఈ దిశగా ఇది ఒక కీలక అడుగు అని మోదీ తెలిపారు. పేపర్ లీక్‌లాంటి పరిస్థితులను ఇకపై ఎక్కువకాలం కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని మోదీ చెప్పటం హర్షణీయం. అయితే ఇది కేంద్రస్థాయిలో మాత్రమే కాదు, రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి.

వందేమాతరానికి మరింత గౌరవం

యావత్ భారతావని వందేమాతర గేయం 150 సంవత్సరాల వేడుకను జరుపుకుంటున్న తరుణంలో అత్యంత కీలకమైన వందేమాతరం బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించడం మరో గొప్ప విజయం. ప్రధానంగా 1971నాటి “ప్రినెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట” (జాతీయ గౌరవ నిరోధక చట్టం)కు సవరణలు చేస్తూ ఈ నూతన బిల్లును ప్రవేశపెట్టారు. ఇకపై వందేమాతరం గీతంలోని పూర్తి ఆరు చరణాలనూ పాడాలి. ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం అత్యంత ప్రధానమైన మైలురాయిలాంటిది. ఈ నూతన సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, వందే మాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, గానం జరుగుతున్న అధికారిక లేదా సభాపూర్వక కార్యక్రమాలకు భంగం కలిగించడం లేదా అవమానించడం  చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఇందుకు  మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది.

ఇది కేవలం ఒకసాధారణ చట్ట సవరణ మాత్రమేకాదని, దేశ సమైక్యతను, అఖండతను, జాతీయ ప్రతీకల గౌరవాన్ని మరింత బలోపేతం చేసే అత్యున్నత చర్యని పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా కేంద్రప్రభుత్వం నొక్కి చెప్పింది. లక్షలాది మంది వీరులు ప్రాణత్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్య్రానికి ఊపిరిగా నిలిచిన గేయానికి చట్టభద్రత కల్పించడం భావితరాలకు ఇచ్చే గొప్ప నివాళి అని వాదించింది. ప్రతిపక్షాలకు చెందిన కొందరు ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత కనబరచినా చివరకు పార్లమెంట్ ఉభయసభల్లోనూ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది

ఇప్పటి వరకు కేవలం జాతీయ పతాకం, భారత రాజ్యాంగం, జాతీయ గీతమైన ‘జనగణమన’లకు మాత్రమే పరిమితమైన చట్టబద్దమైన రక్షణను, శిక్షార్హమైన అధికార పరిధిని ఇకపై వందేమాతర గీతానికి కూడా వర్తిస్తాయి. మొదటిసారి ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్లవరకు జైలుశిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండూ విధించేందుకు చట్టంలో స్పష్టమైన నిబంధనలు చేర్చారు. ఒకవేళ ఇదే నేరాన్ని పునరావృతంచేస్తే, మరింత కఠినమైన శిక్షలు, వాన్ బెయిలబుల్ ప్రక్రియలు ఆమలవుతాయి. భారత రాజ్యాంగంలోని 51(ఎ) అధికరణం కింద పేర్కొన్న మౌలిక విధులలో ప్రతీ పౌరుడు జాతీయ చిహ్నాలను, గీతాలను గౌరవించాలని ఉటంకించిన అంశానికి ఈ చట్టం ఒక బలమైన న్యాయపరమైన రక్షణ కవచంగా మారుతుంది.

చారిత్రిక నేపథ్యం..

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో వందేమాతరం గీతానికి అపూర్వ స్థానం ఉంది. ప్రముఖ సాహితీవేత్త బంకించంద్ర చటోపాధ్యాయ 1875 డిసెంబరు 7న ఈ అమృతగీతాన్ని సంస్కృత, బెంగాలీ భాషల కలయిగా రాశారు. ఆ తర్వాత 1882లో వెలువడిన  ప్రసిద్ధ నవల ఆనందమఠంలో చేర్చారు. 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ టాగూర్ వందేమాతర గీతాన్ని స్వయంగా స్వరపరచి ఆలపించడంతో ప్రాచుర్యం లోకి వచ్చింది. అప్పటి కింకా ఆయన జనగణమన గీతం రాయలేదు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమ నినాదంగా మారింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది. క్రమంగా క్విట్ ఇండియా, స్వదేశీ ఉద్యమాల్లో వందేమాతరం ప్రముఖంగా వినిపించింది. ఎందరో దేశ భక్తులు కొరడా దెబ్బలు తింటూ, ఉరికంబ మెక్కినప్పుడు వందేమాతరం అంటూ నినాదం చేయడం ఆంగ్లేయులను హడలెత్తించింది

సంతుష్టీకరణతో అన్యాయం

స్వాతంత్రోద్యమ సమయంలో కాంగ్రెస్ వేదికలపై వందేమాతర గీతాన్ని ఆలపించేవారు. 1930 ప్రాంతంలో జాతీయ గీతంగా గుర్తించాలనే చర్చ మొదలు కాగా ముస్లింలీగ్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతర గీతంలో దేశాన్ని తల్లితో, కాళితో, సరస్వతితో, లక్ష్మితో పోల్చడం వారికి నచ్చ లేదు. కాంగ్రెస్‌లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా వ్యతిరేకులతో గొంతు కలిపారు. కాంగ్రెస్ పార్టీలో వందేమాతర గీతానికి వ్యతిరేకంగా ఒత్తిడి పెరిగింది. ముస్లింలను దూరం చేసుకోవడం వారికి ఇష్టంలేదు. అప్పటికే కాంగ్రెస్‌పార్టీలో సంతుష్టీకరణ విధానాలు మొదలయ్యాయి. వందేమాతరం గీతంలో మొదటి రెండు చరణాలు పాడితే చాలనే నిర్ణయం తీసేసు కున్నారు. ఒక దేశభక్తి గీతాన్ని మతపరమైన ఎజెండాగా మార్చడం జాతీయవాదులకు నచ్చలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 24న నాటి రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటన చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమనను దేశ ఆధికారిక జాతీయ గీతంగా, వందేమాతరం తొలి రెండు చరణాలను జాతీయ గేయంగా గుర్తించారు. అంతేకాక, జాతీయ గీతంతో పాటు జాతీయ గేయమైన వందేమాతరానికి కూడా సమానమైన రాజ్య గౌరవం, హోదా ఉంటా యని స్పష్టంచేశారు. కాగా 1971లో తీసుకొచ్చిన జాతీయ గౌరవ నిరోధక చట్టం ప్రకారం జాతీయ పతాకాన్ని అవమానించడం, రాజ్యాంగాన్ని ధిక్క రించడం, జనగణమన ఆలాపనను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం, భంగం కలిగించడం శిక్షార్హమైన నేరాలుగా నిర్దేశించారు. కానీ వందే మాతరానికి అదే స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ నివ్వలేదు. తాజాగా మోదీ ప్రభుత్వం ఈ తప్పిదాన్ని సరిదిద్దింది. 1971 వాటి ‘ప్రినెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక’్ట పరిధిలోకి వందే మాతరంను కూడా చేర్చింది. నిజంగా ఇది ఒక సాధారణ చట్ట సవరణ మాత్రమే కాదు.. దేశ సమైక్యతను, అఖండతను, జాతీయ ప్రతీకల గౌరవాన్ని మరింత బలోపేతం చేసే అత్యున్నత చర్య.

క్రాంతిదేవ్ మిత్ర

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.