రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఎంత నిజమో.. అధికారంలో ఉన్నప్పుడు అనుసరించే సూత్రాలు, ప్రతిపక్షంలోకి రాగానే మారిపోతాయనేది కూడా అంతే పచ్చి నిజం. రాష్ట్ర శాసనసభ సాక్షిగా ఇప్పుడు సరిగ్గా రకమైన రాజకీయ నాటకం ఆవిష్కృతమవుతోంది. నిన్నటి వరకు అధికారంలో ఉండి, అసెంబ్లీ నియమ నిబంధనలను కఠినతరం చేస్తూ, సభ నిర్వహణ పేరుతో విపక్షాల గొంతు నొక్కేశారని విమర్శలు ఎదుర్కొన్న భారత రాష్ట్ర సమితి (నాటి టీఆర్‌ఎస్) ఇప్పుడు అవే నిబంధనలను బేఖాతారు చేస్తూ రావడం విశేషం.‘అసెంబ్లీకి రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి’ అని సవాళ్లు విసిరిన అధికార కాంగ్రెస్ పార్టీ.. తీరా ప్రతిపక్ష నేతలు నిరసన తెలపడానికి రాగానే, శాసనసభ గేట్ల ముందే అడ్డుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా వ్యవహరిస్తున్న ఈ రెండు ప్రధాన పార్టీల తీరుపై ప్రజల్లో ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి.
రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్ అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసనలను అడ్డుకునేందుకు అనేక కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. సభా ప్రాంగణంలోకి ప్లకార్డులు, నిరసన పత్రాలు, బ్యానర్లు, ప్రత్యేక నిరసన దుస్తులు ధరించి రావడంపై ఆంక్షలు విధించింది. సభా సంప్రదాయాలు, సభాపతి విశేషాధికారాల పేరుతో నాటి విపక్షాలు కాంగ్రెస్, బీజేపీ సభ్యులను పలుమార్లు సస్పెండ్ చేయడమో, లేదా అసెంబ్లీ పరిసరాల్లోకి రాకుండా అడ్డుకోవడమో చేసింది. ‘అసెంబ్లీ అనేది చర్చల వేదిక. నిరసనల ప్రాంతం కాదు’ అని బీఆర్‌ఎస్ నేతలు నాడు సుద్దులు చెప్పారు. కాలం తారుమారైంది. విపక్ష పాత్రలోకి వచ్చిన బీఆర్‌ఎస్ నేతలకు తాము ప్రవేశపెట్టిన నిబంధనలు గుర్తున్నట్లు లేదు.
నల్ల టీ షర్టులతో రణరంగమైన అసెంబ్లీ గేటు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి అయినా, అది ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కె.తారకరామారావు, హరీష్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నల్ల చొక్కాలపై కాంగ్రెస్ వైఫల్యాల నినాదాలు రాసుకొని శాసనసభ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, నినాదాలతో కూడిన నల్ల దుస్తులు లేదా టీషర్టులు ధరించి సభలోకి వెళ్లడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని గేటు బయటే అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులకు, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తాము సభలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టడమేనంటూ రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నల్ల చొక్కా వేసుకుని పార్లమెంటులో నిరసన తెలిపితే లేని అభ్యంతరం, తమకు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ తర్వాత నేతల అరెస్టులు, తోపులాటలు, చొక్కాలు విప్పేసి ఆందోళనలు చేయడం తీవ్ర కలకలం రేపింది.
అసెంబ్లీకి రావాలంటూ సవాళ్లు…రాగానే అడ్డుగోడలు
మరోవైపు.. అధికార పక్షం వ్యవహరించిన తీరు కూడా ఆత్మరక్షణలో పడేసేలా మారింది. ‘ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి, సమాధానం చెప్పడానికి మేము సిద్ధం’ అని ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు ఇటీవల బీఆర్‌ఎస్‌కు బహిరంగ సవాళ్లు విసిరారు. తీరా ప్రజా సమస్యలపై, నెరవేరని హామీలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ గేటు వద్దకు వస్తే, సాంకేతిక, దుస్తుల నిబంధనల సాకుతో వారిని బయటే నిలిపివేయడం విమర్శలకు తావిచ్చింది. సవాళ్లు విసిరి, తీరా వచ్చిన తరువాత లోపలికి రాకుండా అడ్డుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నల్ల టీషర్టులు వేసుకుని వస్తే, సభ లోపల నియమ నిబంధనల ప్రకారం స్పీకర్ హెచ్చరించడమో లేక చర్యలు తీసుకోవడమో చేస్తారు. కానీ,తమను సభలో ప్రశ్నిస్తారనే భయంతోనే అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్దే పోలీసులను పెట్టి అడ్డుకుందని బీఆర్‌ఎస్ వర్గాలు విమర్శించే అవకాశం దొరికింది
బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ : నాడు-నేడు
ప్రతిపక్షాలు నిరసన తెలపడాన్ని సభా ధిక్కారంగా భావించింది అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం. విపక్షాలు ఏ చిన్న నిరసన తెలిపినా సస్పెన్షన్ వేటు వేసింది.ఇప్పుడు అదే పార్టీ ప్రతిపక్షంగా, నిబంధనలకు విరుద్ధంగా నల్ల టీషర్టులు, నినాదాల బోర్డులతో అసెంబ్లీ ముట్టడికి దిగింది. అలాగే, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అధికార పక్షం, విపక్షాల గొంతు నొక్కుతోందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని గగ్గోలు పెట్టింది. ఇప్పుడు రసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందంటూనే, పోలీసులను గేటు బయటే పెట్టి బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుని అరెస్టు చేయించింది.
శాసనసభ అనేది ప్రజల సమస్యలు చర్చించి పరిష్కారాలు వెతికే పవిత్ర దేవాలయం. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ద్వంద్వ వైఖరిని వీడాల్సిన అవసరం ఉంది. నియమ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాకూడదు. అలాగే అధికారం ఉన్నప్పుడు తాము ఖండించిన చర్యలనే ప్రతిపక్షానికి మారిన తరువాత అనుసరించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమంటున్నారు నిపుణులు. బీఆర్‌ఎస్ నల్ల టీషర్ట్ నిరసన, కాంగ్రెస్ అడ్డుకున్న తీరు రెండూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలాడటమేనని రాజకీయ విశ్లేషషకులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు, డిమాండ్లు, నిరసనల పేరుతో అసెంబ్లీ చర్చలను పక్కదారి పట్టించడం కంటే, సభలో ప్రజా సమస్యలపై లోతైన చర్చలు జరగడమే ప్రజా స్వామ్యానికి అసలైన మేలు చేస్తుందంటున్నారు.
చట్టసభల విలువలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సాగునీరు, మౌలిక వసతుల లేమి వంటి సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన వేదికలు, రాజకీయ నాయకుల వ్యక్తిగత కక్షసాధింపులకు, వీధి పోరాటాలకు వేదికలుగా మారుతున్నాయి. ప్రజాప్రతినిధులు సభలో ప్రవర్తిస్తున్న తీరు, వాడుతున్న భాషను సామాన్య పౌరుడు ఏవగించుకునే అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది.
అర్థవంతమైన చర్చలు శూన్యం.. ఆరోపణలే లక్ష్యం
ఒకప్పుడు శాసనసభల్లో ప్రజాసమస్యలపై గంటల తరబడి సముచిత రీతిలో విశ్లేషణలు, వాదోపవాదాలు జరిగేవి. కానీ నేటి చట్టసభల్లో విధానపరమైన చర్చల స్థానాన్ని వ్యక్తిగత విమర్శలు ఆక్రమించాయి. అధికార పక్షం విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం, విపక్షాలు సభా సమయాన్ని నిరసనలు, హంగామాలతో వృథా చేయడం పరిపాటిగా మారింది.రూ.కోట్ల ప్రజా ధనంతో నిర్వహించే ఈ సమావేశాలు, నాయకుల రాజకీయ ప్రయోజనాల వేదికలుగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్పీకర్ స్థానాన్ని, సభా సంప్రదాయాలను అగౌర పరుస్తూ, పరుష పదజాలంతో దూషించుకోవడం, గేటు బయట ధర్ణాలు, తోపులాటలు, దుస్తులు విప్పి నిరసనలు వంటి చేష్టలు ప్రజాస్వామ్యానికే అవమానకరం. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే క్రమశిక్షణ విస్మరిస్తూ, వారు భావి తరాలకు ఇచ్చే సందేశం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
వీధి పోరాటాలు, ఆందోళనలు చేయడానికి వీధులు, ధర్నా చౌక్‌లు ఉన్నాయి. కానీ చట్టసభల్లోకి వచ్చి కనీస నియమావళిని పాటించకుండా రణరంగం సృష్టించడం దేనికి? సవాళ్లు విసరడం, తీరా సభకు వచ్చాక సాంకేతిక కారాణాల సాకుతో అడ్డుకోవడం లేదా సభలో మైకులు బంద్ చేసి పరస్పర దాడికి దిగడం చూస్తుంటే ‘ఈమాత్రం దానికి చట్టసభలు ఎందుకు?’ అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారం కంటే స్వపక్ష ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలున్నాయి.
చట్టసభలు కుస్తీ పోటీల కేంద్రాలు కావని, అవి ప్రజాస్వామ్య నిలయాలని అన్ని పార్టీల నాయకులు గ్రహించాల్సిన అవసరం ఉంది. నాయకులు తమ స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి సభా సాంప్రదాయాలను, ప్రజల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాల్సి ఉంది.
అంతకుముందు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు (సెప్టెంర్ 7) బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ కార్యకర్తలు బారికేడ్లను దాటుకుంటూ, పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద ఆందోళనకు దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతోపాటు పార్టీ నాయకులు, శ్రేణులు వ్యూహాత్మకంగా అసెంబ్లీ వద్దకు దశలవారీగా చేరుకుని, అసెంబ్లీ ప్రాంగణలోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించగా,పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రాంచందర్‌రావును పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తున్న క్రమంలో ఆ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో, మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. రాంచందర్‌రావు, పార్టీ సీనియర్ నాయకులు ఎన్వీ సుభాష్, మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రభాగౌడ్, గణేశ్‌కుందేతో పాటు పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు : బీజేపీ
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, 22-ఏ భూముల సమస్యలపై శాసనసభలో చర్చ జరగకుండా కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పార్టీలు కలసి నాటకాలు ఆడుతున్నాయని బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. ఒకరు నల్ల డ్రెస్, మరొకరు తెల్ల డ్రెస్ వేసుకుని తిట్టుకున్నట్లు నటించడం తప్ప, ప్రజాసమస్యలపై చర్చించడంలేద న్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని, 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో ముఖ్యమంత్రిని కలుస్తామని విజ్ఞప్తి చేసినా ఆయన స్పందించలేదని విమర్శించారు. విద్యార్థుల సంతకాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు సచివాలయం వద్దకు వెళ్లగా, గేటు దగ్గరే అడ్డుకున్నారని అన్నారు. తమ పార్టీ శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని రామచందర్ రావు నిలదీశారు. ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిల విడుదల కోసం తాము చేపట్టిన పోరాటం ఆగబోదని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ,రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ, ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానంలా వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ పార్టీ సభ్యులు సభ లోపల ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకోవడం.. సభ బయట ప్రజాసమస్యలపై గొంతెత్తుతున్న నాయకులను అరెస్టు చేయడం దారుణమనవి, ఇది ఇది ప్రజాస్వామ్య పాలన కాదని, పక్కా నియంతృత్వమని వాఖ్యానించారు.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068