రాష్ట్రంలో నేరాల రేటు పెరిగిపోతోంది. కొన్ని రకాల నేరాల్లో తగ్గుదల కనిపిస్తుండగా.. మరికొన్ని రకాల  నేరాలు పెరిగి పోతున్నాయి. ఇటీవల జరిగిన అర్ధ వార్షిక నేర సమీక్ష సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత మూడేళ్లుగా  పెరుగుతున్న నేరాలను కట్టడి చేయడంలో  హోం శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నేరాల రేటు దారుణంగా నమోదవుతున్నట్టు జాతీయనేర గణాంకాలు, రాష్ట్ర పోలీసు నివేదికలు స్పష్టంచేస్తు న్నాయి. రాష్ట్ర పోలీస్ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జూలై 2023 – జూలై 2026 మధ్య నేరాల రేటు భారీగా నమోదైంది. జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు 2,65,377 నేరాలు నమోదుకాగా, జూలై 2024 నుంచి జూన్ 2025 వరకు 2,77,938 నేరాలు నమోదయ్యాయి. 2023తో పోల్చితే 2024 లో అధికంగా…అంటే.. 12,516 (4.73 శాతం) నేరాల పెరుగుదల నమోదైంది. జూలై 2025 – జూన్ 2026 మధ్యం 2,84,363 నేరాలు నమోదైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ సంవత్సర కాలంలో 6,425 (2.31 శాతం) నేరాల పెరుగుదల కనిపించింది. మూడేండ్లలో 7.15% నేరాలు పెరగడం ఆందోళనకరమైన స్థాయిగా చెబుతున్నారు విశ్లేషకులు. లక్ష జనాభాకు నమోదయ్యే సగటు నేరాల రేటు కూడా 481.58 నుంచి 491.59కు పెరిగింది. హోంమంత్రిత్వ శాఖను కూడా తమ అధీనంలో ఉంచుకొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరాల కట్టడిలో విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

46 శాతం మాదక ద్రవ్యాలు

రాష్ట్రంలో నార్కోటిక్ కేసుల పెరుగుదల పోలీసు శాఖకు అతిపెద్ద సవాలుగా మారింది. 2023-24లో 2,026గా ఉన్న మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కేసులు 2025-26 నాటికి 2,960కు చేరాయి. మూడేళ్ల ఇది 46.10 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు. లక్ష జనాభాకు డ్రగ్స్ నేరాల రేటు 3.68 నుంచి 5.12కు ఎగబాకింది. కమిషనరేట్ల వారీగా చూస్తే సైబరాబాద్‌లో 266 నుంచి 508కు కేసులు చేరి 90.98 శాతం పెరిగాయి. వరంగల్‌లో 142.31 శాతం పెరుగుదల నమోదైంది. జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 57 నుంచి 219కు కేసులు పెరిగి,. నేరాల రేటు 7.22 నుంచి 26.91కు చేరింది. నిజామాబాద్‌లో 62 నుంచి 123కు చేరింది., నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ డ్రగ్స్ కేసులు గణనీయంగా పెరిగాయి. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా వ్యవస్థను అడ్డుకోవాలని, ప్రత్యేక నిఘా పెంచాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు.

వెయ్యి శాతానికి వ్యవస్థీకృత నేరాలు

వ్యవస్థీకృత నేరాల పెరుగుదల అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం. ఇవి 25 నుంచి ఏకంగా 451కు చేరి, 1,704 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దీంతోపాటు ట్రాఫిక్ నేరాలు 29,130 నుంచి 31,891కు (9.48 శాతం) పెరిగాయి. సైబరాబాద్‌లో ట్రాఫిక్ కేసులు 2,882 నుంచి 3,677కు, మల్కాజిగిరిలో 3,213 నుంచి 3,673కు చేరాయి. హైదరాబాద్‌లో స్వల్ప తగ్గుదల కనిపించగా, వరంగల్‌లో 8.27 శాతం తగ్గింది. జిల్లాల్లో కొమురం భీం ఆసిఫాబాద్‌లోఈ తరహా నేరాలు ఏకంగా 154 నుంచి 1,115కు ( 624.03 శాతం) నమోదయ్యాయి. నిర్మల్‌లో 67.92 శాతం, నల్గొండలో 34.37 శాతం, ఆదిలాబాద్‌లో 28.30 శాతం పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్‌లలో మాత్రం తగ్గుదల నమోదైంది.

సైబర్, ఆర్థిక నేరాల్లో ఊరట

మొత్తం నేరాల సంఖ్య పెరిగినప్పటికీ సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. సైబర్ నేరాలు 25,373 నుంచి 22,000కు తగ్గి 13.29 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఆర్థిక నేరాలు 37,690 నుంచి 32,684కు తగ్గి 13.28 శాతం తగ్గుదల నమోదైంది. ఈ రెండు విభాగాల్లోనూ మూడేండ్ల కాలంలో స్థిరమైన తగ్గుదల కనిపించడాన్ని పోలీసు శాఖ సానుకూల పరిణామంగా భావిస్తోంది.

తీవ్ర నేరాల్లో 10.33% తగ్గుదల

గ్రేవ్ క్రైమ్‌గా పరిగణించే తీవ్ర నేరాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. 2024-25లో 7,019 కేసులు నమోదుకాగా, 2025-26లో 6,294కు తగ్గాయి. ఏడాది వ్యవధిలో ఇది 10.33 శాతం తగ్గుదలగా నమోద య్యింది. లక్ష జనాభాకు నేరాల రేటు 11.21 నుంచి 10.88కు దిగివచ్చింది. హైదరాబాద్‌లో 1,483 నుంచి 1,094కు తగ్గి 26.23 శాతం క్షీణత నమోదైంది. సైబరాబాద్‌లో 656 నుంచి 613కు, మల్కాజిగిరిలో 664 నుంచి 549కు తగ్గాయి. అయితే ములుగులో 44 నుంచి 88కు, నిర్మల్‌లో 66 నుంచి 102కు, ఆదిలాబాద్‌లో 96 నుంచి 140కు తీవ్ర నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న, గిరిజన జిల్లాల్లో పెరుగుతున్న ఈ ధోరణిపై ప్రత్యేక దృష్టి అవసరమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సాధారణ నేరాల్లో 7.28% పెరుగుదల

తీవ్ర నేరాలు తగ్గుతున్నా నాన్ గ్రేవ్‌గా చెప్పుకునే సాధారణ నేరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 2023-24లో 2,59,201గా ఉన్న కేసులు 2025-26లో 2,78,069కు చేరాయి. మూడేండ్లలో ఇది 7.28 శాతం పెరుగుదల. ఫ్యూచర్‌సిటీలో 23.70 శాతం, సైబరాబాద్‌లో 17.32 శాతం, మల్కాజి గిరిలో 13.53 శాతం పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం 2.77 శాతం తగ్గుదల కనిపించింది. జిల్లాల్లో కొమురం భీం ఆసిఫాబాద్‌లో 70.88 శాతం, ఆదిలాబాద్‌లో 60.71 శాతం పెరుగుదల నమోదవగా, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లోనూ సాధారణ నేరాలు పెరిగాయి.

మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు

అయితే, మహిళలు, చిన్నారులపై నేరాల్లో తగ్గుదల కనిపించింది. దీనిని కూడా ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.2024-25లో ఈ తరహా నేరాలు 31,593గా ఉండగా 2025-26లో 31,108కు తగ్గాయి. ఏడాదిలో 1.54 శాతం క్షీణత నమోదైనప్పటికీ, 2023-24తో పోలిస్తే ఇవి 3.81 శాతం ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లలో కేసులు తగ్గగా, ఫ్యూచర్‌సిటీలో 790 నుంచి 994కు పెరిగాయి. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నారాయణ పేట, ములుగు జిల్లాల్లో ఈ నేరాలు పెరిగినట్టు గణాంకాలు వెల్లడించాయి.

లోతైన విశ్లేషణతోనే కట్టడి:డీజీపీ

 నేరాల సమీక్షను కేవలం సంఖ్యలకే పరిమితం చేయకుండా, ప్రతి నేరం వెనుక కారణాలు, నేరస్థుల తీరు, దర్యాప్తు నాణ్యత, కేసుల పరిష్కారాన్ని లోతుగా విశ్లేషించాలని డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,నెలవారీ క్రైమ్ రివ్యూలకు ప్రాధాన్యం ఇవ్వాలని, యూనిట్ స్థాయిలో జవాబు దారీతనం, వేగవంతమైన నిర్ణయాలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. గతంలో 70 నుంచి 80 శాతంగా ఉన్న సీసీటీఎనఎస్ డేటా అప్‌డేట్ ఇప్పుడు 96 శాతానికి చేరడాన్ని ఆయన అభినందించారు. ఏఐ ఆధారిత పోలీసింగ్, సీసీటీఎనఎస్, టీజీ-కాప్, హాకఐ, ఈగల్, ఐసీజేఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల పనితీరుపైనా సమీక్షించారు. కొత్త నేర చట్టాల అమలు, ఫోరెన్సిక్ ల్యాబ్ పనితీరు, పోలీసు గృహ నిర్మాణ ప్రాజెక్టులు, లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం వంటి అంశాలపైనా చర్చించారు. యువ ఐపీఎస్ అధికారులు తమ యూనిట్లలో చేపట్టిన నూతన ఆవిష్కరణలను గురించి వివరించారు.

మొత్తంగా చూస్తే, తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కొంత ఊరటనిస్తున్నా.. మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనల్లో పెరుగుదల రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి కొత్త సవాళ్లు విసురుతోంది. అయితే, వీటికి టెక్నాలజీ సాయంతో కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని డీజీపీ సీవీ ఆనంద్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల, అన్ని ప్రాంతాల పోలీసు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సాంకేతికత వినియోగం, డేటా విశ్లేషణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో నేరాల కట్టడి సాధ్యమని స్పష్టం చేశారు.

సుజాత గోపగోని

సీనియర్ జర్నలిస్ట్, 6302164068

About Author

By editor