సరిహద్దుల్లో శత్రువులను ఎదుర్కొనే యుద్ధ విమానాల కాక్‌పిట్ నుంచి దేశ రక్షణ వ్యూహాలను రచించే ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ వరకు… నేడు భారత మహిళా శక్తి సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్క రిస్తోంది. నిన్నటివరకు కేవలం కొన్ని విభాగాలకే పరిమితమైన మహిళలు, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుతో ‘పర్మనెంట్ కమిషన్’ హక్కును సాధిం చుకుంటూ పురుషులతో సమానంగా దేశ సేవలో భాగస్వాములవుతున్నారు. మహిళా అధికారులు కీలకమైన పీఠాలను అధిరోహిస్తున్నారు. తాజాగా ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సాధించిన చారిత్రాత్మక విజయంతో రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది.
ఒకప్పుడు అసాధ్యం అనుకున్న రక్షణ రంగ శిఖరాలను భారత మహిళలు సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ‘కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్’ పరీక్షలను దాటుకుంటూ వాయుసేనలో ఫైటర్ పైలట్లుగా దూసుకుపోతున్నారు. ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సెప్టెంబర్ 1, 2026న ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ బాధ్యతలను స్వీకరించడంతో ఐఏఎఫ్ చరిత్రలో అపూర్వ ఘట్టం నమోదైంది. భారత సాయుధ దళాలలో వైద్యేతర విభాగం నుండి టూ-స్టార్ ర్యాంక్ అయిన ‘ఎయిర్ వైస్ మార్షల్’ పదవిని సాధించిన తొలి మహిళా అధికారిగా శక్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు.
భారత రక్షణ రంగంలో వైద్య విభాగం కాకుండా, ఇతర విభాగాల నుండి ‘ఎయిర్ వైస్ మార్షల్’ హోదాను అందుకున్న మొట్టమొదటి మహిళ… శక్తి శర్మ. జూన్ 18, 1994న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విద్యా విభాగంలో ఆమె నియమితులయ్యారు. దీనికి ముందు ఆమె ఎయిర్ కమోడోర్ హోదాలో కపుర్తలాలోని సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. మున్ముందు వ•డు రక్షణ దళాల నుండి ఒక సైనిక్ స్కూల్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి కూడా ఆమెయే కావడం విశేషం. భారతీయ మహిళాశక్తికి, రక్షణ రంగంలో వారి ఎదుగుదలకు ఈ నియామకం ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.
ఆకాశంలో సగం అనే నానుడికి అద్దంపడుతూ భారత మిలిటరీలో మెడికల్ విభాగానికి చెందని ఒక మహిళా అధికారి టూ-స్టార్ ర్యాంక్ సాధించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శక్తి శర్మ, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని కూడా పొందారు. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల మొత్తంలో ఒక సైనిక్ స్కూల్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన మొట్టమొదటి మహిళా అధికారిగా కూడా ఆమె గుర్తింపు పొందారు.
మహిళలు ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనులు నేడు సుసాధ్యం చేస్తున్నారు. భారత రక్షణ రంగంలోని వ•డు దళాలలో (ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్) పురుషులతో సమానంగా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. భారత సాయుధ దళాల్లో అధికారిగా లేదా విధి నిర్వహణలో చేరడం అత్యంత కఠినమైన పక్రియ. యు.పీ.ఎస్.సి. నిర్వహించే ఎన్.డి.ఏ, సి.డి.ఎస్ లేదా ఎఎఫ్ సీఏటి వంటి కఠినమైన రాత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం మొదటి అడుగు. సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా 5 రోజుల పాటు జరిగే పక్రియలో అభ్యర్థి శారీరక, మానసిక కార్యకుశలత, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆర్మీ వైద్య పరీక్షలు అత్యంత ప్రమాణాలతో కూడుకుని ఉంటాయి. స్వల్ప ఆరోగ్య లోపాలు ఉన్నా తిరస్కరించే అవకాశం ఉంటుంది. అలాంటి ఎన్నోకఠిన సవాళ్లను అధిగమించి సైన్యంలో కీలకపదవిని లేదా స్థాయిని సాధించడం ద్వారా శక్తి శర్మ ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఆర్మీలో కీలక బాధ్యతలు వహించడమంటే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, దళాలను నడిపించే సామర్థ్యం వంటి ప్రత్యేకమైన నాయకత్వ ప్రతిభ కలిగి ఉండాలి. శిక్షణలో ప్రతిభ కనబరచడంతో పాటు బాధ్యతల్లో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, నిరంతర సాధన శక్తి శర్మను ఉన్నత స్థానానికి చేర్చాయి.
ప్రస్తుతం శక్తిశర్మ సాధించిన పదవిని నిర్వర్తించడం కూడా ఆషామాషీ విషయం కాదు. భారత వైమానిక దళంలో ఎయిర్ వైస్ మార్షల్ అనేది అత్యంత కీలకమైన టూ-స్టార్ ర్యాంక్. ఆర్మీలోని ‘మేజర్ జనరల్’, నేవీలోని ‘రియర్ అడ్మిరల్’ పదవులకు ఇది సమానం. ఈ స్థాయిలోని అధికారులు వైమానిక దళ వ్యూహాత్మక, నిర్వహణ, పరిపాలనా విభాగాను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి బాధ్యతలు ప్రధానంగా 3 విభాగాలుగా ఉంటాయి.
వ్యూహాత్మక, సైనిక బాధ్యతలు: ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసి) కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లోని ఎయిర్ కమాండ్లకు, అడ్వాన్స్‌డ్ హెడ్‌క్వార్టర్స్‌కు నాయకత్వం వహిస్తారు.
యుద్ధ వ్యూహాల అమలు: ఆయా ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఫైటర్ జెట్ల మోహరింపు, అత్యవసర సమయాల్లో వైమానిక దాడుల వ్యూహాలను పర్యవేక్షిస్తారు.
త్రివిధ దళాల సమన్వయం: ఆర్మీ, నేవీ అధికారు లతో కలిసి ఉమ్మడి సైనిక చర్యలు విజయవంతంగా జరిగేలా సమన్వయం చేసుకుంటారు.
ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో కీలక పదవులు: అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ : ఢిల్లీలోని ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఇంటిలిజెన్స్, ఆపరేషన్స్ లేదా ప్లానింగ్ వంటి ప్రత్యేక విభాగాలకు హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
విధాన రూపకల్పన: ఎయిర్ ఫోర్స్‌కు కావలసిన కొత్త సాంకేతికతలు, విద్యా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, వ్యూహాత్మక విధానాలను రూపొందిస్తారు.
శిక్షణ, విద్యా నిర్వహణ, శిక్షణా సంస్థల పర్యవేక్షణ: ఎయిర్ ఫోర్స్ అకాడమీలు, సైనిక పాఠశాలలు, డిఫెన్స్ విద్యా సంస్థల ప్రమాణాలను మెరుగుపరచడం.
సిబ్బంది నిర్వహణ: వేలాదిమంది సైనికులు, అధికారుల సంక్షేమం, క్రమశిక్షణ, వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని పర్యవేక్షించడం.
భారత సైన్యంలో చేరడమే ఒక పెద్ద సవాలు. అలాంటిది కీలక బాధ్యతలను చేపట్టడం అంటే సాధారణ విషయం కాదు. దీంతో సైన్యంలో చేరాలని కలలు కనే వేలాదిమంది యువతకు, ముఖ్యంగా మహిళలకు శక్తిశర్మ సాధించిన విజయం స్ఫూర్తినిస్తోంది.

జయశ్రీ ఆచంట
సీనియర్ జర్నలిస్ట్