వినాయక చవితి రాగానే దేశమంతటా ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది. వీధి వీధినా వెలిసే మండపాలు, మైకులలో మోగే భక్తిపాటలు, విద్యుత్ దీపాల కాంతులు అలరిస్తాయి. అయితే, ఈ హడావుడి, ఆడంబరాల వెనుక పండుగ అసలైన పరమార్థం మరుగున పడిపోతోందా? అనే ప్రశ్న తొలిచివేస్తోంది. కేవలం విగ్రహాల కొలతల పోటీలు, డీజేల హోరు, ఆడంబరాలకే ఉ త్సవాలను పరిమితం చేయకుండా, సామాజిక చైతన్యానికి, ప్రకృతి పరిరక్షణకు వేదికలుగా మార్చడమే నేటి అత్యంత ఆవశ్యకమైన మార్పు.
1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వినాయక ఉత్సవాలను ఇళ్ల నుంచి వీధుల్లోకి తీసుకువచ్చి ‘సార్వజనిక ఉత్సవాలు’గా మార్చడం వెనుక ఒక గొప్ప వ్యూహం ఉంది. నాటి బ్రిటిష్ పరిపాలనలో ప్రజలు గుమిగూడే అవకాశం లేకపోవడంతో, పండుగతో ప్రజలందరినీ ఒకే చోటకు చేర్చి జాతీయభావం, ఐక్యత, సామాజిక సంస్కరణల గురించి ప్రచారం చేశారు. కానీ నేడు ఉత్సవ మండపాలు ప్రదర్శనకు లేదా కేవలం వినోదానికి వేదికలుగా మారడం తిలక్ కన్న కలలకు విరుద్ధం.
పండుగ ఆధ్యాత్మిక మూలాలు ప్రకృతితో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నాయి. ‘మృత్తికయే పరబ్రహ్మం’ అనే భావనతో స్వచ్ఛమైన మట్టితో రూపాన్ని చేసి, నవరాత్రుల పూజ అనంతరం నీటిలో కరిగించడం సృష్టి, స్థితి, లయల సత్యానికి నిదర్శనం. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగులు వాడటం వల్ల మన జలవనరులు విషతుల్యమై జలచరాలు నశిస్తున్నాయి. ప్రకృతిని పూజించే వేడుకలోనే ప్రకృతికి హాని తలపెట్టడం ఎంతవరకు సమంజసం? ‘మట్టి వినాయకుడి’ని ప్రతిష్ఠించి, పూజించిన పత్రిని సహజ సిద్ధంగా నిమజ్జనం చేయడమే నిజమైన ఆధ్యాత్మిక ఆచరణ.
సృష్టి చక్రం ఎప్పుడూ ఈ మూడు దశల చుట్టూనే తిరుగుతుంటుంది. నిమజ్జన ప్రక్రియ ఈ మూడు దశలను స్పష్టంగా వివరిస్తుంది.
సృష్టి, స్థితి, లయల చక్రానికి భౌతిక నిదర్శనం
స్వచ్ఛమైన మట్టితో ఒక రూపాన్ని తీర్చిదిద్దడం. ఈ భూమి మీద జీవం (సృష్టి) ఆవిర్భావానికి సంకేతం. మట్టి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి, నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించడం(స్థితి). ఒక మనిషి లేదా జీవి భూమి మీద గడిపే సార్థక జీవితానికి ప్రతీక. పూజల అనంతరం ఆ మట్టి రూపాన్ని తిరిగి జలాల్లో కలపడం(లయ). మట్టి నుంచి పుట్టినది తిరిగి పంచభూతాలలో విలీనం అవ్వడం ప్రకృతి సహజ ధర్మం అని ఇది బోధిస్తుంది.
మన శరీరం పంచభూతాలతో (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) నిర్మితమైంది. మట్టి రూపంలో ఉన్న స్వామిని, జలంలో నిమజ్జనం చేయడం ద్వారా మన మూలాలు ఎక్కడున్నాయో మనం స్మరించుకుంటాం. పూజలో వాడే 21రకాల పత్రులు, పండ్లు అన్నీ ప్రకృతి ప్రసాదించినవే. దేవుడి రూపంలో మనం సాక్షాత్తూ ఆ ప్రకృతి మాతనే ఆరాధిస్తున్నాం.
విగ్రహాన్ని మాత్రమే కాదు, మనలోని అహంకారాన్ని, మోహాన్ని, అజ్ఞానాన్ని కూడా ఆ నీటిలో వదిలేసి రావడం నిమజ్జనం అంతరార్థం. దేహం శాశ్వతం కాదని, ఆత్మ మాత్రమే శాశ్వతమని ఇది గుర్తు చేస్తుంది. సృష్టి రహస్యాన్ని చాటిచెప్పే ఈ క్రతువులో ‘మట్టి వినాయకుడి’ పూజకే అసలైన ప్రాధాన్యం ఉంది. ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస’ లాంటి రసాయనాలతో చేసిన విగ్రహాలు వాడటం ప్రకృతి ధర్మానికి విరుద్ధం. మనం ప్రకృతికి హాని చేయకుండా, పర్యావరణ హితంగా జరుపుకున్నప్పుడే ఈ పండుగ పరమార్థం నెరవేరుతుంది.
‘మృత్తిక’ అంటే మట్టి. ఈ విశ్వానికి, సమస్త ప్రాణికోటికి మూలం, ముగింపు ఈ మృత్తికయే. ఉపనిషత్తులు, వేదాలు ప్రకటిస్తున్న అద్వైత సత్యాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని అత్యంత సులభంగా అర్థం చేసుకోవడానికి ‘మట్టి’ ఒక ఉత్కృష్టమైన ఉదాహరణ. ‘మృత్తికయే పరబ్రహ్మం’ అన్న భావన కేవలం భౌతికమైన మట్టిని పూజించడం కాదు. ఆ మట్టి వెనుక ఉన్న అనంతుడైన పరమాత్మను, సృష్టి రహ స్యాన్ని దర్శించడం.
ఛాందోగ్య ఉపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడైన శ్వేతకేతువునకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. ‘యథా సోమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాద్వాచాఝహణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యమ” ఒక్క మట్టి పిండం తత్వాన్ని తెలుసుకుంటే, మట్టితో చేసిన కుండలు, ప్రమిదలు, పాత్రలు వంటి సమస్త వస్తువుల తత్వం తెలిసినట్లే. రూపాలు, పేర్లు వేరైనా, వాటిలో ఉన్న ద్రవ్యం “మృత్తిక” ఒక్కటే.
ఈ జగత్తులో నామరూపాలు (కుండ, పాత్ర, విగ్రహం) అనేవి కేవలం తాత్కాలిక మార్పులు. కానీ వాటికి ఆధారమైన మట్టి మాత్రమే శాశ్వతమైన సత్యం. అలాగే, ఈ అనంతవిశ్వంలో కనిపించే చరాచర జగత్తంతా నామ రూపాల రూపంలో ఉన్న పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే ఉపాదాన కారణం (వస్తువుకు మూల ద్రవ్యం).
సృష్టి ఆవిర్భావంలో ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివి అనే పంచ భూతాలేర్పడ్డాయి. వీటిలో అన్నింటినీ తనలో ఇముడ్చుకుని, జీవ జాలానికి ఆధారమై నిలిచేది పృథివి లేదా మృత్తిక. మట్టిలో విత్తనం పడితే చెట్టవుతుంది. ఆ చెట్టు ఇచ్చే ఆహారంలలో జీవులు బతుకుతున్నాయి. మన శరీరం కూడా ఆహార రసాల ద్వారా మట్టి నుంచే తయారైంది (అన్నమయ కోశం). మనం తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి, మోసే భూమి` లక్ష్మీస్వరూపమని ఆరాధిస్తాం. జననం అనే మట్టి నుంచి మొదలై, మరణం అనే లయం వరకు జీవితం సాగుతుంది.
మన పూర్వికులు సృష్టి సత్యాన్ని నిత్య జీవితంలో గుర్తుచేసుకోవడానికి మృత్తికను పూజావిధానంలో భాగం చేశారు. మట్టి రూపం తాత్కాలికం, దానిలోని తత్వం అనంతం. యజ్ఞయాగాదులు, విశేష పూజలు చేసే ముందు స్వచ్ఛమైన మట్టిని తీసుకువచ్చి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. మృత్తిక మనకు నేర్పే పాఠం సమభావం – త్యాగం. కుండగా మారినా, భవనానికి ఇటుకగా మారినా, దేవుడి విగ్రహంగా మారినా, తిరిగి తొక్కిసలాడే నేలగా మారినా మట్టి తన స్వభావాన్ని కోల్పోదు. అహం కారాన్ని వీడి, నామరూపాల వెనుక ఉన్న ఏకత్వాన్ని దర్శించడమే ‘మృత్తికయే పరబ్రహ్మ’ అనే తత్వానికి నిజమైన అర్థం.
నిమజ్జన ప్రక్రియ – వైజ్ఞానిక ఆలోచన
భాద్రపద మాసంలో జరుపుకునే మట్టి గణపతి పూజ, నిమజ్జన ప్రక్రియ కేవలం ఆచార వ్యవహారా లకే పరిమితం కాకుండా, లోతైన ఆధ్యాత్మిక వేదాంతాన్ని అద్భుతమైన వైజ్ఞానిక సూత్రాలను తనలో ఇముడ్చుకుంది. నిరాకారుడైన పర బ్రహ్మానికి ఆకారాన్ని ఇచ్చి ఆరాధించడం సాధనలో మొదటి మెట్టు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ‘ప్రాణప్రతిష్ఠ’ ద్వారా దైవత్వాన్ని ఆవాహన చేస్తాం. నవరాత్రులు పూజలందుకున్న స్వామిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ‘ఏ రూపానికైనా ముగింపు తప్పదు’ అనే సత్యాన్ని తెలుసుకుంటాం. రూపం నశించినా తత్వం శాశ్వతంగా ఉండి పోతుందని ఇది బోధిస్తుంది. నిమజ్జన సమయంలో “మమ” (నాది) అనే మమకారాన్ని, అహంకారాన్ని నీటిలో విడిచిపెట్టి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవడమే దీని నిజమైన అర్థం. వర్షాకాలంలో వచ్చే భాద్రపద మాసంలో ఈ పూజ జరుపుకోవడం వెనుక పూర్వికుల అద్భుతమైన వైజ్ఞానిక ఆలోచన ఉంది.
వర్షాకాలంలో చెరువులు, నదులు, కాలువల నిండా కొత్త నీరు చేరుతుంది. పూజ కోసం మట్టిని సేకరించే నెపంతో ఊరిలోని చెరువుల ఒడ్డులను, కాలువలను శుభ్రం చేసేవారు. ఈ ప్రక్రియ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. నిమజ్జనంతో పాటు మనం వేసే 21 రకాల పత్రి నీటిలోని హానికర బాక్టీరియాను చంపి, సహజమైన ఫిల్టర్‌లా పని చేస్తాయి. ఈ మూలికా పత్రాలతో పాటు పుట్టమట్టి లేదా స్వచ్ఛమైన మట్టి నీటిలో కలవడంవల్ల, నీటిలోని హానికర బాక్టీరియా నశించి నీరు శుద్ధి అవుతుంది. ప్రకృతి నుంచి లభించే మట్టి, మూలికలతో పూజించి, తిరిగి ఆ ప్రకృతికే సమర్పించడం ద్వారా జీవసమతుల్యత పరిరక్షిత మవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులను కాదని, సాంప్రదాయ ‘మట్టి గణపతి’ని పూజించినప్పుడే ఈ ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రహస్యాలు నెరవేరుతాయి.
మనం ఆచరించి చూపిస్తేనే పిల్లలు ప్రకృతిని ప్రేమించడం నేర్చుకుంటారు. ఆడంబరాల కంటే భక్తి, ప్రకృతి రక్షణే ముఖ్యమని భావితరాలకు మార్గదర్శకత్వం వహించినట్లవుతుంది. నేటి ఉత్సవ మండపాలు కేవలం భక్తి పాటలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను భుజానికెత్తుకోవాలి. నవరాత్రుల సందర్భంగా ఉచిత రక్తదానం, వైద్య పరీక్షల నిర్వహణ, విద్యా, ఉద్యోగ అవకాశాలపై చైతన్య కార్యక్రమాలు, ప్లాస్టిక్ నిషేధం, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఎంతో ఉపకరిస్తుంది.
భక్తి అనేది కేవలం పూజలతో ముగిసేది కాదు. అది తోటి జీవుల పట్ల, ప్రకృతి పట్ల చూపే కరుణలో ప్రతిబింబిస్తుంది. ఆడంబరాలను పక్కన పెట్టి, తిలక్ ఆశయాల బాటలో పర్యావరణ స్పృహతో ఐక్యంగా అడుగులు వేసినప్పుడే ‘ఉత్సవం నుంచి నిజమైన సామాజిక చైతన్యం’ సాధ్యమవుతుంది. అదే మనం ఆ విఘ్నేశ్వరునికి ఇచ్చే నిజమైన నీరాజనం!
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008577834